రిటైర్డ్ ఎంఈవో ఫలసాయం | training Mango farmers | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ ఎంఈవో ఫలసాయం

Published Sun, Oct 25 2015 1:56 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

training Mango farmers

రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులవినియోగానికి స్వస్తి
సేంద్రియ సేద్యంతో మెరుగైన దిగుబడి
నేడు మల్యాల మండలం ఓబులాపూర్‌లో
మామిడి సాగుపై రైతులకు శిక్షణ


జిల్లా రైతులు వేలాది ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలను సాగు చేస్తున్నారు. మామిడి సాగుపై సరైన అవగాహన లేక వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. రైతులకు మెలకువలు నేర్పించి మేలైన దిగుబడులు సాధించేలా తోడ్పాటునందించాల్సిన ఉద్యానవన అధికారులు కనిపించకుండా పోతున్నారు. మామిడిలో తెగుళ్ల నివారణ కోసం, అధిక ఫలసాయం కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులనే నమ్ముకుని నష్టపోతున్నారు. కొక్కు అశోక్‌కుమార్ సైతం మొదట్లో అందరిలాగే ముందుకు సాగాడు. శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. మామిడిలో అధిక దిగుబడి సాధించడంపై పలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యూడు. ఈ ఏడాది పైసా ఖర్చు లేకుండా ఏకంగా ఎనిమిది లక్షల ఆదాయం ఆర్జించబోతున్నట్టు ధీమాగా చెబుతున్నాడు. నాడు ఎంఈవోగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది.. నేడు మామిడి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు.
 -జగిత్యాల

 వ్యవసాయంలో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులపై పెట్టే పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రాక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. హరితవిప్లవం తర్వాత అధిక దిగుబడి అంటూ సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేసి రసాయనాల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో భూములు నిస్సారమై దిగుబడులు గణనీయంగా తగ్గారు. రసాయనాల ప్రభావంతో భూమిలో రైతులకు మేలు చేసే పురుగులు కూడా కనుమరుగవుతున్నారు. జగిత్యాల పట్టణం పోచమ్మవాడకు చెందిన కొక్కు అశోక్‌కుమార్ అనే రిటైర్డ్ ఎంఈవో వినూత్న ప్రణాళికతో పెట్టుబడి లేని సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నాడు. తోటి రైతుల కోసం ఆదివారం తన తోటలో ఒక్కరోజు శిక్షణ ఇస్తుండడం విశేషం.


 ఎనిమిది ఎకరాల్లో మామిడి
 అశోక్‌కుమార్ మల్యాల మండలం ఓబులాపూర్ శివారులో ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత భూమిని చదును చేయించి మామిడి మొక్కలు నాటాడు. మొదట్లో అందరిలాగే బస్తాలకు బస్తాలు రసాయన ఎరువులు వేయడం, నాలుగైదుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం, ఐదారుసార్లు మామిడివేర్లు తేలేటట్టు ట్రాక్టర్‌తో దున్నించడం చేశాడు. దీంతో భూమి కొనుగోలుకు అరుున ఖర్చు కంటే మామిడితోట నిర్వహణపై పెట్టే ఖర్చు మూడింతలు ఎక్కువగా ఉండేది. ఇలా నాలుగైదు ఏళ్లు రసాయన మందులు విపరీతంగా పిచికారీ చేస్తుండటంతో మామిడితోటలో దిగుబడి పెరిగే బదులు కొమ్మతొలుచు పురుగు, ఆకుమచ్చ ఏర్పడం మొదలైంది. పలు రకాల తెగుళ్లు, రోగాలు వచ్చి మామిడిని నష్టం చేస్తుండేవి.


 హైదరాబాద్‌లో శిక్షణ
 హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) మామిడి రైతులకు శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లి నాలుగైదు నెలలపాటు శిక్షణ పొందాడు. విద్యాధికుడు కావడంతో ప్రకృతిని ఎలా కాపాడాలి? ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పంటలకు మేలు చేసే పురుగులు ఎలా కనుమరగవుతున్నారుు? అనే విషయాలతోపాటు జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి? వాటిని ఎలా వాడాలి? అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు.


 మొదలైన మిత్ర పురుగుల పెంపకం
 శిక్షణ తర్వాత ఎన్‌ఐపీహెచ్‌ఎం శాస్త్రవేత్తలు ఉచితంగా రెడ్‌విడ్ బగ్స్, బ్రేకాన్స్, ట్రైకోగ్రామా, ట్రైకోకాడ్స్ వంటి మిత్రపురుగులను ఒక్కో జత అందించారు. దీంతో ఈ పురుగులను లార్వా దశ నుంచి ఎగిరే దశ వరకు ఇంటి దగ్గర పెంచుతున్నాడు. ఇవి కొద్ది రోజుల్లోనే ఒక్కో పురుగు తన జాతి లక్షణాన్ని బట్టి 400-500 గుడ్లు పెడుతుంటాయి. ఇలా ఏడాదిలోనే మిలియన్, ట్రిలియన్ మిత్ర పురుగులను తయారు చేసి, మామిడితోటలో వ దులుతుంటాడు. ఈయన మామిడితోటకు వెళితే పురుగుమందుల వాసనకు బదులు మంచి సువాసన వెదజల్లే మిత్ర పురుగులు కనువిందు చేస్తూ, స్వాగతం పలుకుతుంటాయి. ప్రతీ కొమ్మ మీద సాలేపురుగులు వంటివి కనిపిస్తాయి. ఏడాదికి ఒకమారు మాత్రమే మామిడి తోటను దున్నిస్తాడు.


 భూమి బలోపేతం కోసం మరిన్ని చర్యలు
 భూమిని సారవంతం చేసేందుకు సుభాష్ పాలేకర్ విధానంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మరింత ఆధునికతను జోడించాడు. చిక్కుడు, పెసర, కంది, మినుములు, ఉలువలు, జనుము, జీలుగ వంటివి సేకరించి, వర్షాలు కురియగానే మామిడితోటలో చల్లుతాడు. ఒక లీటర్ ఆవుమూత్రం, ఆవుపేడతో తయారు చేసిన జీవామృతంలో, 100 గ్రాముల టైకో డెర్మా శిలింధ్రంతోపాటు 100 గ్రాముల సుడోమోనాస్ బ్యాక్టీరియాతో లీటర్ ద్రావణం తయారవుతుంది. దీంట్లో విత్తనాలను మూడు రోజులు నానబెట్టి, తర్వాత ఆరబెట్టాలి. విత్తనాలు చల్లుతున్నాడు. ఇలా రెండేళ్లుగా చేస్తున్నాడు. పంటకు వచ్చిన తర్వాత వాటి నుంచి విత్తనాలను మరో పంటకు సేకరించి, మొక్కలను అలాగే వదిలేస్తాడు. ఈ మొక్కలు మిత్ర పురుగులకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు భూమికి మల్చింగ్‌గా పనిచేస్తాయి.


 వర్మి కంపోస్టు, వర్మివాష్
 మామిడి చెట్లకు వర్మి కంపోస్టు, వర్మి వాష్‌ను ఉపయోగిస్తారు. ఒక లారీ పేడ తెప్పించి దాంతో వర్మి కంపోస్టు తయారు చేస్తాడు. ఇందుకోసం రెండు షెడ్లు నిర్మించుకున్నాడు. ఇందులో తయారైన వర్మికంపోస్టును మొక్కలకు పోస్తాడు. ఓ డ్రమ్ములో ఇసుక, కంకరరాళ్లు, వర్మి కంపోస్టు పోసి, అందులో ఆవు మూత్రం పోసి వర్మి వాష్ తయారు చేస్తుంటాడు. దీనిని లీటర్ల కొద్ది చెట్లకు అందిస్తుంటాడు. వీటి తయారీలో ఎక్కడ కూడా నీటిని ఉపయోగించడు. ఆవును కొనుగోలు చేసి, దాని ద్వారా వచ్చే మూత్రాన్ని సేకరించి అన్ని పదార్థాల్లో ఉపయోగిస్తాడు. ఆవు మూత్రం నేరుగా ఓ తొట్టెలోకి వెళ్లేలా షెడ్డు నిర్మించాడు. జీవామృతం తయారీలో బెల్లంకు బదులు రాలిన మామిడి కాయలను ఓ తోట్టిలో వేసి నెలల తరబడి మాగబెట్టి వాడుతుంటాడు. రెండేళ్లుగా ఇలాంటి పద్ధతులు పాటించడంతో గతేడాది రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు లేకపోగా... ఈ విధానంలో దిగుబడి పెరిగే అవకాశముండడంతో దాదాపు రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ రాదని ఘంటాపథంగా చెపుతుండటం విశేషం.


 రైతులకు శిక్షణ ఇచ్చే స్థాయికి..
 హైదరాబాద్‌లోని ఎన్‌ఐపీహెచ్‌ఎంలో జరిగే కార్యక్రమాల్లో తోటి రైతులకు ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌లో శిక్షణ పొందిన జగిత్యాల మండలం లక్ష్మీపూర్, మల్యాల మండలం లంబాడిపల్లె, ఓగులాపూర్, మేడిపల్లి మండలం మాచాపూర్, సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, నాగునూర్ గ్రామాలకు చెందిన రైతులతోపాటు, ఆసక్తి ఉన్న ఇతర రైతులకు ఓబులాపూర్‌లోని తన తోటలో ఒక్క రోజు ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం రైతు కోక్కు అశోక్‌కుమార్‌ను 98661 92761లో సంప్రదించవచ్చు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement