Mango cultivation
-
పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
ఈ వేసవిలో ఎల్‌నినో పుణ్యాన సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది.47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7–8 గంటల వరకు శగలు కక్కుతూ ఉంది. దీన్నే ‘రిఫ్లెక్టెడ్ రేడియేషన్’ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండటం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి.పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47–48 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్ బర్న్‌తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పీవీ రావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణంగా ఎండను రక్షణకు కొన్ని పంటలపై 50% సూర్యరశ్మిని ఆపే గ్రీన్ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. అయితే, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వల్ల 80% ఎండను ఆపే గ్రీన్ షేడ్నెట్లు వేసుకోవాల్సి వస్తోందని డా.పివి రావు అన్నారు.సన్‌బర్న్‌కు గురైన మామిడి కాయసూర్యకాంతి తీవ్రత..పంటలపై ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందన్నది ఉష్ణోగ్రతతో పాటు సూర్యకాంతి తీవ్రత (లైట్ ఇంటెన్సిటీ)పై కూడా ఆధారపడి ఉంటుందని డా. రావు వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో చదరపు మీటరుకు 20,000 – 25,000 కిలో లక్స్ వరకు సూర్యకాంతి ఉంటుంది. వేసవిలో సాధారణంగా ఇది 80,000 కిలో లక్స్‌కు పెరుగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఇది విపరీతంగా పెరిగి, ఏకంగా 1,20,000 కిలో లక్స్‌కు చేరటం పండ్ల తోటలకు, కూరగాయల పంటలకు ముప్పుగా మారిందని డాక్టర్ పి వి రావు తెలిపారు.ఫొటో ఆక్సిడేషన్ వల్ల ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ సజావుగా జరగటం లేదు. లేత ఆకుల్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ చిట్లి పోవటం వల్ల ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగుకు మారి ఎండిపోతున్నాయన్నారు.తారస్థాయికి చేరిన యువి రేడియేషన్..అతినీలలోహిత కిరణాల (యువి) రేడియేషన్ సూచిక సాధారణంగా 3–4 వరకు ఉంటుంది. వేసవిలో ఈ సూచిక 8–9 వరకు పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఇది 12కు పెరగటంతో సూర్యరశ్మిని పంటలు, తోటలు తట్టుకోలేకుండా ఉన్నాయని డా. పి వి రావు వివరించారు. మామిడి, జామ తదితర కాయలు ఎండ పడిన చోట ఎర్రగా మారి దెబ్బతింటున్నాయి. వెనుక వైపు పచ్చిగానే ఉంటూ ఎండ సోకిన దగ్గర రంగు మారుతుండటంతో పండ్లు నాణ్యతను కోల్పోతున్నాయి. అల్ఫాన్సో, పచ్చడి రకాల మామిడి కాయలు బాగా రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.సన్‌బర్న్‌కు గురైన జామ కాయ, - సన్‌బర్న్‌కు గురైన డ్రాగన్ పంట పోషకాలు, హార్మోన్ అసమతుల్యత..వేసవిలో టొమాటో, మిర్చి వంటి కూరగాయ పంటల మొక్కలు నాటుకునేటప్పుడు వీటికి ఉత్తర, దక్షిణ వైపున నీడనిచ్చే మొక్కలను వేసుకుంటే ఎండ బారి నుంచి కొంత మేరకు కాపాడుకోవచ్చు. ఉదాహరణకు.. టొమాటో మొక్కలు ఉత్తర దక్షిణాల్లో మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలు వత్తుకోవాలి. వడగాలుల నుంచి పంటలను రక్షించుకోవటానికి పొలం సరిహద్దుల్లో విండ్ బ్రేకర్‌గా పనికొచ్చే ఎత్తయిన చెట్లు పెంచుకోవాలి. ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారి తోటలు ఉపశమనం పొందుతాయి.దాదాపు మరో నెల రోజులు మండే ఎండలు కొనసాగే పరిస్థితి ఉండటంతో తోటలకు చాలినంతగా నీటి తడులు ఇవ్వటంతో పాటు, చెట్లపైన కూడా సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయాలి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ నేల నుంచి వేర్ల ద్వారా పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గుతుందని, అందుకు తగినట్లు నీరు, పోషకాలు సైతం అందిస్తే తోటలకు ఉపశమనం కలుగుతుందని డాక్టర్ పివి రావు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కాలంలో పంటలు పోషకాలను నేల నుంచి తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. జింక్ లోపం ఏర్పడుతుంది. హోర్మోన్లను కూడా చెట్లు, మొక్కలు తయారు చేసుకోలేవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.ఎండ తీవ్రతకు రెస్పిరేషన్ రేటు ఎక్కువ అవటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం మొక్క/చెట్టు నిర్వహణకే సరిపోతాయి. పెరుగుదల లోపిస్తుంది. అదనపు పిండిపదార్థం అందుబాటులో వుండక పూలకు, కాయలకు పోషకాలను అందించలేని సంక్షోభ స్థితి నెలకొంటుంది. అందువల్ల పూలు, కాయలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అతి వేడి వత్తిడి ఎదుర్కొంటున్న మామిడి తోటలపై జింక్, ΄్లానోఫిక్స్, బోరాన్‌లను సాయంత్రం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. టొమాటో, మిరప, వంగ తదితర కూరగాయ మొక్కలపైన నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్‌ను 5 లీటర్ల నీటికి 1.5 నుంచి 2 ఎం.ఎల్. మోతాదులో కలిపి పిచికారీ చేయాలని డా. రావు తెలిపారు.అల్ఫాన్సో, పచ్చడి కాయలు 80% రాలిపోతున్నాయి..ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అల్ఫాన్సో, దేశీ పచ్చడి రకాల చిన్న కాయలు రాలిపోతున్నాయి. ఆర్గానిక్ మామిడి తోటల్లో గతంలో 10–20% రాలే కాయలు ఈ సీజన్లో 70–80% రాలిపోతున్నాయి. ఇతర రకాల్లో కూడా జనవరిలో వచ్చిన ఆఖరి పూత ద్వారా వచ్చిన చిన్న కాయలు ఎక్కువగా ఎండదెబ్బకు రాలిపోతున్నాయి. ఎండలు ముదిరే నాటికి నిమ్మకాయ సైజు ఉన్న కాయలకు ్రపోబ్లం లేదు.సన్‌బర్న్ సమస్య వల్ల కాయలు ఒకవైపు అకాలంగా రంగుమారిపోతుంటే, వెనుక వైపు మాత్రం పచ్చిగానే ఉంటున్నాయి. బంగనిపల్లి పూత రాలిపోవటంతో ఈ ఏడాది 20% కూడా కాయ మిగల్లేదు. దశేరి కాపు మాత్రం అన్నిచోట్లా బాగుంది. మామిడి చెట్లకు రోజూ నీరు స్ప్రే చేస్తున్నాం. చెట్ల కింద మల్చింగ్ చేసి నీటి తేమ ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. ఇదిలాఉంటే, మధ్య్రపాచ్య దేశాల్లో యుద్ధం వల్ల నౌకల్లో వెళ్లే సరుకు విమానాల ద్వారా ఎగుమతి అవుతోంది. దీనికితోడు, దుబాయ్‌లో భారీ వరదల వల్ల అమెరికా తదితర దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి ఈ ఏడాది బాగా దెబ్బతింది.గత 15 రోజుల్లో 350 ఎమిరేట్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఖతర్ తదితర దేశాల విమానాలు ధరలు పెంచేశాయి. అమెరికాకు కిలో మామిడి రవాణా చార్జీ రూ. 180 నుంచి 600కు పెరిగిపోయింది. అమెరికాలో 4 కిలోల మామిడి పండ్ల బాక్స్ గతంలో 40 డాలర్లకు అమ్మేవాళం. ఇప్పుడు 60–70 డాలర్లకు అమ్మాల్సివస్తోంది. దీంతో అమెరికాకు మామిడి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.– రఫీ (98480 02221), సేంద్రియ మామిడి రైతు, ఎగుమతిదారు, ఏఆర్4మ్యాంగోస్, హైదరాబాద్యు.వి. రేడియేషన్ పండ్లను దెబ్బతీస్తోంది!అతి నీలలోహిత వికిరణాల (యు.వి. రేడియేషన్) తీవ్రత బాగా పెరిగిపోయి మామిడి, జామ పండ్లు ఎండదెబ్బకు గురవుతున్నాయి. యు.వి. రేడియేషన్ ఏప్రిల్ ఆఖరి, మే మొదటి వారాల్లో తీవ్రస్థాయికి చేరింది. యు.వి. ఇండెక్స్ ఇప్పుడు 12–13కి పెరిగిపోయింది. మామిడి, జామ వంటి పండ్ల తోటల్లో కాయలపై ఎండ మచ్చలు ఏర్పడుతూ పండ్ల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టొమాటోలు వంటి కూరగాయలపై కూడా ఈ ఎండ మచ్చలు సమస్యగా మారాయి.ఎండ తగిలిన వైపు పండినట్లు రంగు మారుతుంది. వెనుకవైపు పచ్చిగానే ఉంటుంది. నాణ్యత కోల్పోయిన ఈ కాయలను కొయ్యలేక, చెట్లకు ఉంచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధిక వేడికి అనేక పోషకాలు అందక కొన్ని కాయలు రాలిపోతున్నాయి. యు.వి. రేడియేషన్ ఉద్యాన తోటల రైతులను ఈ ఏడాది చాలా నష్టపరుస్తోంది. నత్రజని కోసం ఫిష్ అమినో యాసిడ్ లేదా పంచగవ్యలను ద్రవజీవామృతంతో కలిపి చల్లాలి. బోరాన్ కోసం జిల్లేడు+ఉమ్మెత్త కషాయం, పోటాష్ కోసం అరటి పండ్ల (తొక్కలతో కలిపి తయారు చేసిన) కషాయాన్ని పిచికారీ చేయాలి. – ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం.నీరు, పోషకాలు పిచికారీ చేయాలి..విపరీత ఉష్ణోగ్రతలకు తోడైన వడగాడ్పులకు కూరగాయ తోటలు, పండ్ల తోటల్లో లేత ఆకులు మాడిపోతున్నాయి. ఉష్ణోగ్రత, అతినీలలోహిత వికిరణాలతో పాటు సూర్యరశ్మి తీవ్రత చాలా పెరిగిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయటం ద్వారా పంటలకు రక్షించుకోవచ్చు. వారం, పది రోజులకోసారి ఇంటిపంటలపై నానో యూరియా/ వర్మీవాష్ / జీవామృతం / ఆవు మూత్రంను ఒకటికి పది (1:10) పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకొని, అతి వేడి వత్తిడి నుంచి తోటలకు ఉపశమనం కలిగించాలి.– డాక్టర్ పి.వి. రావు (94901 92672), రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్.సేంద్రియ సేద్యం, వ్యాపార నైపుణ్యాలపై 6 రోజుల శిక్షణా శిబిరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులను సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పటంతో పాటు.. సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార అవకాశాలను సృష్టించటంలో నిపుణులైన ఫెసిలిటేటర్‌గా మారడానికి నైపుణ్యం, విజ్ఞానాభివృద్ధి శిక్షణా కోర్సును నిర్వహించనుంది కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ. 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో విశేష కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు సారథ్యంలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో సకల వసతులతో కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ అంతర్జాతీయ స్థాయి వసతులతో ఇటీవలే ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధనలు చేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయం, వ్యాపారం తదితర అంశాలపైప్రామాణికమైన శిక్షణ ఇవ్వటమే ఈ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ స్కిల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల తోడ్పాటుతో మే 22 నుంచి 27 వరకు తెలుగులో నిర్వహించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. రామాజంనేయులు తెలిపారు. గుగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థులు విధిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి. 30–35 మందికి మాత్రమే అవకాశం. ఇతర వివరాలకు.. 85002 83300.ఇవి చదవండి: Women of My Billion: కలిసి నడిచే గొంతులు -
వ్యవసాయంతో ఎంతో సంతృప్తిగా ఉన్నానంటున్న రైతు
-
మామిడి కాయలపై మచ్చలు ఏర్పడడంతో తగ్గిన నాణ్యత
-
కర్నూలు రైతుల దయనీయ స్థితి..!
-
విదేశాల్లో ఏపీ మామిడికి విపరీతమైన క్రేజ్..!
-
మామిడి సాగు విధానం, మామిడి రకాలు
-
తీపి మామిడి పండ్ల తక్కువ ధరలో..!
-
తక్కువ ధరకు మామిడి రైతులు ఇబ్బందులు..!
-
మ్యాంగో మ్యాన్
ఒకే మామిడి చెట్టుకు 300 కాయలు కాస్తాయి. అయితే ఆ కాయలు ఒక్కోటి ఒక్కో రకం. ఒక కొమ్మకు రసాలైతే ఒక కొమ్మకు తోతాపురి.. ఇలా ప్రపంచంలో ఏ చెట్టూ కాయదు. దీనిని సాధ్యం చేసి ‘మ్యాంగో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు లక్నోకు చెందిన కలీముల్లా ఖాన్. జీవితం మొత్తాన్ని మామిడి సాగుకు అంకితం చేసిన కలీముల్లా మామిడి తోట ఒక దర్శనీయ స్థలం. ‘ప్రపంచంలో మామిడి పండు అంత అందమైన పండు మరొకటి లేదు’ అంటారు కలీముల్లా ఖాన్. ఆయనికిప్పుడు 80 దాటాయి. లక్నో నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మలిహామాద్లో ఆయన మామిడి ఉద్యానవనం ఉంది. ‘ఇది ప్రపంచ మామిడి చెట్లకు కాలేజీ లాంటిది. ఎవరైనా మామిడి పండ్ల గురించి ఇక్కడ చదవాల్సిందే’ అంటాడాయన. మలిహాబాద్ ఉత్తరప్రదేశ్‌లో మామిడితోటలకు ప్రసిద్ధి. కలీముల్లా కుటుంబం కూడా మామిడి తోటల పెంపకంలో తాత తండ్రుల కాలం నుంచి ఉంది. ‘నేను సెవెన్త్ ఫెయిల్ అయ్యాను. మా ఊళ్లో పిల్లల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు రానీయరు తల్లిదండ్రులు. అలా పెరిగాను. కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి మామిడి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్ల వయసులో అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాను. కాని ఆ రోజు నుంచి భారీ వర్షం. దేవునికి ఇష్టం లేదనుకున్నాను. ఆ మొక్క బతకలేదు. కాని అంటు కట్టే విధానంతో కొత్త కొత్త మామిడి రకాలు సృష్టించాలన్న నా పిచ్చి పోలేదు. 1970లో నా పెళ్లయ్యింది. అప్పుడే ఈ మామిడి తోటలో ప్రయోగాలు మొదలెట్టాను’ అంటాడాయన. ఒకేచెట్టుకు 315 రకాలు ఒకేచెట్టు కొమ్మలకు రకరకాల పండ్ల అంటు కడుతూ చెట్టును విస్తరించడమే కాదు, దాని ప్రతికొమ్మకూ కొత్తరకం కాయలను సృష్టించాడు కలీముల్లా. ‘ఇన్ని రకాల కాయలు ఒకే చెట్టుకు కాసినప్పుడు మనుషులందరూ ఒకేరీతిన ఎందుకు కలిసి ఉండకూడదు’ అని ప్రశ్నిస్తాడాయన. ‘నేను సృష్టించిన ఒకరకం కాలాపహాడ్ పండును జుర్రుకుంటే మూడు రకాల రుచులు వస్తుంది’ అంటాడాయన. కొన్ని రకాల అంటు మామిళ్లకు కలీముల్లా ‘అమితాబ్, ‘సచిన్’, ‘నమో’ అనే పేర్లు పెట్టాడు. కరోనాలో సేవచేసి మరణించిన డాక్టర్లకు నివాళిగా ఒక మామిడిరకాన్ని సృష్టించి ‘డాక్టర్’వెరైటీ అని నామకరణం చేశాడు. కలీముల్లాకు 2008లో పద్మశ్రీ వచ్చింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నాకు 400 అవార్డులు ఉద్యానవన విభాగంలో వచ్చాయి. చాలా వాటిని మా పిల్లలు వెళ్లి తీసుకొస్తుంటారు అంటాడాయన. ‘నాకు మన దేశం అంటే ప్రేమ. అమెరికా నుంచి చాలామంది వచ్చి నా విధానాలు తెలుసుకుని వెళ్లారు. మన దేశం వాళ్లే నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడం లేదని అనిపిస్తోంది. నా జ్ఞానాన్ని నా వాళ్లకు పంచాలనే నా తపన అని భావోద్వేగంతో అంటాడు కలీముల్లా. ‘మా తోటకు రండి. మామిడి తినిపోండి’ అని సదా ఆహ్వానిస్తుంటాడాయన. -
‘చిగు’రిస్తున్న ఆశలు!
సాక్షి రాయచోటి: మామిడి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. తొలి విడతలో వచ్చిన పూతకు కాయలు కనిపిస్తుండగా.. ప్రస్తుతం రెండో విడతలో కూడా పూత కనిపిస్తుండడంపై ఆశలు కొత్తగా చిగురిస్తున్నాయి. ఎక్కడ చూసినా పూత, పిందెతో చెట్లు కనిపిస్తుండడం.. గతేడాది కంటే ఈసారి ధర కూడా బాగానే ఉండే అవకాశాలు ఉండడంతో కొత్త ఆశలు మొలకెత్తాయి. అన్నమయ్య జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్ల వరకు మామిడి తోటలు సాగులో ఉన్నాయి. అందులో సరాసరిన 20 వేల హెక్టార్లలో పెద్ద చెట్లు (కాయలు కాచే) ఉండవచ్చని ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ఒకవైపు కాయలు.. మరోవైపు పూత అన్నమయ్య జిల్లాలో మామిడి పంటకు సంబంధించి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పంట విస్తారంగా సాగులో ఉంది. ముందుగా రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన కాయలు మార్కెట్‌కు వస్తాయి. తర్వాత మిగతా ప్రాంతాల్లోని కాయలు కూడా అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పిందెలతో కూడిన కాయలు కనిపిస్తుండగా మరోవైపు పూత కూడా ఇప్పుడే విరివిగా కనిపిస్తోంది. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో శీతాకాలంలో పూత విపరీతంగా వచ్చినప్పటికీ శీతల ప్రభావానికి కొంతమేర ముసురుకుంది. అయితే మంచుకు తట్టుకుని నిలబడిన తోటల్లో ప్రస్తుతం కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే వరుసలో రెండవ విడతగా పూత కూడా విస్తారంగా రావడంతో ఈసారి కూడా భారీగా మామిడి కాయలు అన్నమయ్య జిల్లా నుంచి మార్కెట్‌కు రానున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు మార్కెట్లో కాయలు మామిడి పంటకు సంబంధించి కాయలు మార్చి నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. మనకు తొలుత కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్చి నెలలో ఇక్కడి మార్కెట్లకు కాయలు రానున్నాయి. తర్వాత రైల్వేకోడూరుతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తనుంది. ఏప్రిల్ నెలనుంచి జూన్ వరకు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో పలు మండలాల నుంచి భారీగా మామిడి కాయలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూర, బేనీషా, నీలం, ఇమామ్ పసంద్, లాల్ బహార్, ఖాదర్, చెరుకు రసం, మల్లిక, సువర్ణ రేఖ, దసేరి, మల్గూబా తదితర రకాల కాయలను సాగు చేశారు. మార్చి రెండవ వారం నుంచి జూన్ నెలాఖరు వరకు కాయలు ఇక్కడి మార్కెట్లలో కళకళలాడనున్నాయి. రెండుమార్లు పూత మామిడి పంటకు సంబంధించి ప్రస్తుతం పూత విరివిగా కనిపిస్తోంది. గత నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన పూతకు లేలేత కాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వచ్చిన పూత కూడా నిలబడింది. దిగుబడి కూడా ఈసారి అనుకున్న మేర ఆశాజనకంగా ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో మామిడి పంట సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 37 వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా...సరాసరిన 20 వేల హెక్టార్లలో కాయలు కాసే చెట్లు ఉన్నాయి. ఈసారి దిగుబడి కూడా బాగా వస్తుందని అంచనా వేస్తున్నాం. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
మామిడిలో సస్యరక్షణకు హోమియో మందులు
మామిడి పూత, పిందె దశలో సస్యరక్షణకు హోమియో మందులు ఎంతగానో ఉపయోగపడతాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు, రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. ► మామిడి చెట్లకు పూత సరిగ్గా రావాలంటే ZINCUMET-30, MAGPHOS-30, BORAN / BORAX-30 ఆౖఖఅగీ30 మందులను వారం రోజుల వ్యవధిలో 3 సార్లు చొప్పున.. ఒకదాని వెంట మరొకటి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అట్లనే పూత బలంగా రావటం కోసం PULSATILLA-30 ను కూడా పిచికారీ చేసుకోవాలి. ► దోమ నుంచి పూతను, పిందెను కాపాడుకోవడానికి COCCINELLA SEPTE - 30 పిచికారీ చేసుకోవాలి. ► రేగు కాయల పరిమాణంలోకి వచ్చిన మామిడి కాయలు రాలిపోతుంటే BOVISTA -30 పొటెన్సీలో పిచికారీ చేసుకోవాలి. మంచు ఎక్కువగా పడుతుంటే పూత, పిందెను రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► మంగుతో కాయ నల్లగా మారుతూ ఉంటే, ముడ్డుపుచ్చు (ఆంత్రాక్నోస్)ను నివారించుకోవడానికి ALYSIC ACID-30 CARBOVEG-30 పిచికారీ చేసుకోవాలి. ► కొమ్మెండు తెగులు నుంచి రక్షించుకోవడానికి CUPRUM SULPH-30 పిచికారీ చేసుకోవాలి. ► పాత తోటల్లో మామిడి ఆకులపైన బుడిపెలు (మాల్ ఫార్మేషన్) వస్తే కొమ్మలను కత్తిరించి, దూరంగా తీసుకెళ్లి తగులబెట్టాలి. ఇది అంటు వ్యాధి. అరికట్టకపోతే దిగుబడిపై కూడా ప్రభావితం చూపిస్తుంది. TUJA-200 ను వారంలో 3 సార్లు పిచికారీ చేసుకుంటే పోతుంది. ► కాయ పెరుగుదల మొదటి దశలోAMONIUMPHOS-30 పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కాయ పెరుగుతున్న దశలో UPHALA-30ను పిచికారీ చేసుకోవచ్చు. ఇది అమేయ కృషి వికాస కేంద్రం రూ΄పొం దించిన మందు. బయట మందుల షాపులో దొరకదు. త్రిబుల్19కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ► మామిడి రైతులకు మరో ముఖ్య సూచన ఏమిటంటే.. 15 రోజులకోసారి నీటి తడులతో పాటు ఎకరానికి 800 నుంచి 1,000 లీటర్ల వరకు గోకృపామృతం పారించుకుంటే.. కాయ పరిమాణం బాగుంటుంది, కాయ రాలకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడొచ్చు. www.youtube.com/@ameyakrishivikasakendram5143 -
మామిడి రైతులకు కాసుల పంట
సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది చిత్తూరు జిల్లా మామిడి రైతుల పంట పండింది. తోతాపురి, బేనీషా, మల్లిక, అల్ఫాన్సా తదితర రకాలకు గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. చిత్తూరు జిల్లాలోని రైతులు అధిక శాతం.. మామిడి పంటను సాగు చేస్తున్నారు. సకాలంలో చెట్లకు పూత వచ్చి మంచి దిగుబడి వస్తే అన్ని రకాల కాయలు కలిసి దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల నెల రోజులు ఆలస్యంగా చెట్లకు పూత వచ్చింది. దీంతో కోత ఆలస్యమై.. దిగుబడిపై ప్రభావం పడింది. దీనికితోడు మే, జూన్ నెలల్లో కురిసిన వర్షాలు కూడా పంటను దెబ్బతీశాయి. పక్వానికి రాక ముందే కొంత మేర కాయలు నేలపాలయ్యాయి. జిల్లాలో 68,479 హెక్టార్లలో వివిధ రకాల మామిడి సాగు చేయగా.. 4,49,042 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు సీజనుకు ముందే కాయలను మార్కెట్లకు తరలించారు. ప్రారంభంలో ధర లేకపోయినా అయినకాడికి అమ్మేసుకున్నారు. మిగిలిన రైతులకు నెల రోజులుగా కాసుల వర్షం కురుస్తోంది. దిగుబడి తక్కువ వచ్చిందని బాధలో ఉన్న వారు.. ఇప్పుడు రికార్డు ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు రావడంతో.. కాయలు నాణ్యంగా ఉండటంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావటంతో ధరలు అమాంతం పెరిగాయి. తోతాపురి, అల్ఫాన్సా రకాలకు టన్నుకు రూ.90 వేలు ధర పలికింది. ఇక మల్లిక రకానికి ఏకంగా రూ.1.2 లక్షల ధర పలికింది. వచ్చే ఏడాది కూడా మంచి ధర రావాలంటే ప్రతి రైతు పచ్చిరొట్ట తప్పనిసరిగా సాగు చేయాలి. – మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఈస్థాయి ధర ఎప్పుడూ చూడలేదు.. గత 50 ఏళ్లలో ఈస్థాయి ధరలు ఎప్పుడూ రాలేదు. భవిష్యత్‌లో కూడా వస్తుందో.. రాదో చెప్పలేం. పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. ఎకరాకు 10 టన్నులు రావాల్సింది. వర్షాల వల్ల ఈసారి మూడు, నాలుగు టన్నులే వచ్చాయి. దీంతో బాధలో ఉన్న మాకు.. రికార్డు ధరలు రావడం చాలా సంతోషంగా ఉంది. – రవీంద్రనాథ్, పాలమాకులపల్లె, బంగారుపాళెం మండలం -
గాలివానకు దెబ్బతిన్న మామిడి
గుర్రంకొండ: మండలంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలకు పలు గ్రామాల్లో మామిడి పంట దెబ్బతినింది. గుర్రంకొండ–వాల్మీకిపురం మార్గంలో రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు కూలిపోయి రోడ్డుపై పడ్డాయి. మామిడితోటల్లో కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు భారీగా నష్టపోయారు. -
మామిడికి మంచి రోజులు
కరోనా కారణంగా గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన మామిడి రైతులకు మంచి రోజులొచ్చాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మార్కెట్లో మామిడికి డిమాండ్ పెరిగి రెట్టింపు ధర పలుకుతోంది. ఈ సారి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కడప: మామిడి పంటకు మంచికాలం కనిపిస్తోంది. కళ్లెదుటే డిమాండుతోపాటు ధరలూ బాగుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధర మరింత పెరుగుతూ జూన్ వరకు కొనసాగితే మామిడి రైతును రాజుగా అభివర్ణించవచ్చు. గత ఏడాది చివరిలో వర్షాలు విపరీతంగా పడడంతో ఎక్కడికక్కడ మామిడి పొలాలన్నీ నీటితో తడిసిపోయాయి. పొలంలో తేమశాతం అధికంగా ఉండడంతో ఎక్కువగా చిగుర్లు రావడం..పూత తగ్గడంతో అనుకున్న మేర కాపు రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కాయలకు డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడి కాయలు వస్తున్నాయి. ఈనెల 10 నుంచి కాయలు బయటి మార్కెట్లోకి వస్తుండగా.. జూన్ చివరి నాటి వరకు మామిడి కాయలు కనిపించనున్నాయి. అన్నమయ్య జిల్లాలో మామిడి పంటను పెద్ద ఎత్తున సాగు చేయడంతోపాటు అనేక రకాల మామిడి కాయలను దిగుబడి తీస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో అనేక రకాలు జిల్లాలో అనేక రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రధానంగా వీరబల్లి బేనీషా, తోతాపురి, అంటుమామిడి, నీలం, మల్లిక, అల్ఫన్స్, బంగినపల్లి, హిమామ్‌పసంద్ లాంటి రకాలను పండిస్తున్నారు. పంటలు పండించే రైతులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ధరలు పలికే మామిడి వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వీరబల్లి బేనీషాకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ప్రతి సీజన్లోనూ ఇక్కడి సరుకును వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌కు సంబంధించి ఇబ్బందులు పడకుండా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులు గ్రూపులుగా ఏర్పడి కొనుగోలు కేంద్రం ఒకచోట ఏర్పాటు చేసుకుంటే దానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ఆశాజనకంగా మామిడి ధరలు అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లె తదితర ప్రాంతాలతోపాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ మామిడి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 36 వేల హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బంగినపల్లి మామిడికి సంబంధించి టన్ను «ధర రూ. 90 వేల నుంచి లక్ష వరకు పలుకుతోంది. గతేడాది కూడా రూ. 75 వేల పైచిలుకు ధర కనిపించింది. అయితే ప్రస్తుతం ప్రారంభంలోనే టన్ను రూ. లక్ష వరకు ఉండడంతో రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంటు మామిడి, తోతాపురికి సంబంధించి టన్ను రూ. 30–35 వేల మధ్య పలుకుతోంది. ఇతర రాష్ట్రాలకు అన్నమయ్య మామిడి అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన అంటు మామిడి కాయలను చిత్తూరులోని జ్యూస్ ఫ్యాక్టరీతోపాటు బెంగళూరుకు కూడా తరలిస్తున్నారు. అంతేకాకుండా బంగినపల్లి మామిడి గుజరాత్, మహరాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అయితే సాధారణంగా హెక్టారు మామిడి తోటకు సంబంధించి ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి కేవలం టన్ను నుంచి 1.5 టన్ను మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో డిమాండు కూడా ఎక్కువగా ఉంది. నా పేరు అయూబ్‌ఖాన్. మాది మండల కేంద్రమైన చిన్నమండెం. మాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. అందులో ప్రస్తుతం దిగుబడి రావడంతో మార్కెట్‌కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం టన్ను ధర బాగానే పలుకుతోంది. రైతులకు ఉద్యానశాఖ తోడ్పాటు జిల్లాలో మామిడి పంట అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉండడంతో ధర కూడా బాగానే ఉంది. రైతులు గ్రూపుగా ఉండి అమ్ముకునేందుకు ఒకచోట ఏర్పాటు చేసుకునే షెల్టర్‌కు కూడా ఉద్యానశాఖ తోడ్పాటు అందిస్తోంది. – మూలి రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, రాయచోటి -
నూజివీడు.. మామిడి తోడు
నూజివీడు: ఫలాలకు రాజు.. మామిడి. మధుర మామిడి రసాలను రుచి చూడకుండా ఎవరూ ఉండరు. అలాంటి మామిడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పేర్గాంచింది మాత్రం నూజివీడు. ఇక్కడ లభ్యమయ్యే బంగినపల్లి, చిన్నరసాలు, మామిడి రసాలంటే ఇష్టపడని వారు ఉండరు. అంతగా నూజివీడు మామిడికి ప్రసిద్ధి. కలెక్టర్ (తోతాపురం) రకం కూడా సాగవుతోంది. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని నున్న మామిడి మార్కెట్‌తో పాటు హైదరాబా ద్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని చెన్నై, ముంబై, ఢిల్లీ, బరోడా, ఇండోర్, నాగపూర్, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతోంది. అలాగే మలేసియా, సింగపూర్‌లకే కాకుండా పశ్చిమ ఆసియా దేశాలకు సైతం మామిడి ఎగుమతవుతున్నాయి. పురాతన కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడిని రైతులు సాగుచేస్తున్నారు. మామిడి సహజంగా బెట్ట పంట కావడంతో ఒక ఏడాది కాపు ఎక్కువ వస్తే, తరువాత ఏడాది తక్కువ వస్తుంది. జిల్లాలో 52 వేల ఎకరాల్లో.. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అలాగే చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం మండలాల్లో కలిపి దాదాపు 12 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు ప్రాంతం ఏలూరు జిల్లాలోకి రావడంతో మామిడి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగినట్లయింది. మామిడి పూర్తిగా వాతావరణాధారిత పంట కావడంతో మామిడి రైతులకు తీపి చేదులు సర్వసాధారణంగా మారింది. మామిడి అభివృద్ధి కోసం రైతులకు సకాలంలో సలహాలు సూచనలు అందించేందుకు నూజివీడులో మామిడి పరిశోధన స్థానం సైతం ఉంది. తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన స్థానం పనిచేస్తుంది. ఇందులో ము గ్గురు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలాగే నూజివీడులోనే మ్యాంగో హబ్ సైతం ఉంది. దీనిలో మామిడికాయలను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తారు. రైతులకు సరైన సలహాలు, సూచనలను సకాలంలో అందించడంతో పాటు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడితే మామిడి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఎండు తెగులుతో దెబ్బతిన్న మామిడి తోటను ప్రకృతి సేద్యంతో రక్షించాడిలా..!
ప్రకృతి సేద్య పితామహుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య పాఠాలతో స్ఫూర్తి పొంది, రసాయన మందుల వాడకానికి పూర్తిగా స్వస్తి పలికి, గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మామిడి రైతు మూల్పురి నాగవల్లేశ్వరరావు కృషి చక్కని ఫలితాన్నిస్తోంది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలోని తమ కుటుంబానికి చెందిన 100 ఎకరాల్లోని మామిడి, పామాయిల్‌తో పాటు అరటి తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీక్షగా చేస్తున్న ప్రకృతి సేద్యంతో పచ్చగా అలరారుతున్న మామిడి తోటలను స్వయంగా చూసి, వివరాలు తెలుసుకునేందుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు టి. విజయకుమార్ తదితర అధికారులతో కూడిన బృందం రైతు నాగవల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించటం విశేషం. నరికేద్దాం అనుకున్న తోట తిప్పుకుంది నాలుగేళ్ల క్రితం ఈయనకున్న 10 ఎకరాల మామిడి తోటలోని చెట్లకు కొమ్మ ఎండు తెగులు ఆశించింది. తోటలో 35 ఏళ్ల వయస్సున్న కలెక్టర్ (తోతాపురి) రకం చెట్లు 165 ఉండగా, అందులో 90 చెట్లు వరకు కొమ్మల చివరి నుంచి ఎండుపోవడాన్ని రైతు గమనించారు. పరిసర ప్రాంతాల్లో అప్పటికే 200 ఎకరాల్లో మామిడి తోటలు ఎండుతెగులు కారణంగా తీసేశారు. దీంతో తాము కూడా దెబ్బతిన్న చెట్లన్నీ నరికేసి వేరే పంట వేసుకోవాలనుకున్నారు నాగవల్లేశ్వరరావు. అదే సమయంలో పాలేకర్ ప్రకృతి సేద్యం వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! అప్పటికే రైతుకు 30 ఆవులుండటంతో జీవామృతం, ఘన జీవామృతం, పశువుల ఎరువు, వేప పిండి, కొబ్బరి చెక్క తదితర వాటిని ఎండు తెగులు సోకిన మామిడి తోటకు ఉపయోగిస్తున్నారు. నాగవల్లేశ్వరరావు తన తోటలో ప్రతి మామిడి చెట్టుకు ఏడాదికి రెండు సార్లు (తొలకరి, పూత దశ) 30–40 కిలోల ఘనజీవామృతం వేస్తున్నారు. డిసెంబర్–జనవరి మధ్య చెట్టుకు 8 లీటర్ల చొప్పున 6 సార్లు ఇస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండానే తెగులు తగ్గిపోయి చెట్లు బాగున్నాయి. రెండేళ్లలో పూర్తిగా కోలుకొని పుంజుకున్నాయి. వర్షాకాలంలో ఎలా ఉంటాయో, మండు వేసవిలో కూడా అదే విధంగా పచ్చగా ఉంటున్నాయి. పర్యావరణానికి హాని చేయని సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూతాపోన్నతిని తగ్గించేందుకు కృషి చేస్తామని గ్లాస్కో వాతావరణ శిఖరాగ్ర సదస్సులో 45 దేశాల ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయి. వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా విధానాలు మార్చుకుంటామని 26 దేశాలు విస్పష్టంగా సరికొత్త వాగ్దానాలు చేశాయి. ఈ దేశాల్లో భారత్ సహా కొలంబియా, వియత్నాం, జర్మనీ, ఘన, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇందుకు సహకరిస్తామని 95 కంపెనీలు కూడా ప్రకటించడం విశేషం. ప్రతి ఏటా కాపు ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాయకపోవడం మామిడి తోటల ప్రధాన లక్షణం. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటంతో ప్రతి ఏటా కాపు వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా దాదాపు 100 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. కాయలు కూడా ఎంతో నాణ్యతతో ఉంటున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేయక ముందు మామిడి తోట ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాసేది కాదు. అంతేగాకుండా కోతలు పూర్తయిన తరువాత చెట్లన్నీ చేవ కోల్పోయిన వాటిలాగా తయారయ్యేవి. దీంతో వాటికి పెద్ద మొత్తంలో రసాయన ఎరువులు వేయాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తరువాత వర్షాకాలంలో ఎలా ఉండేవో, వేసవిలో కూడా అంతే పచ్చగా ఉంటున్నాయి. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా. ఎండు తెగులు మటుమాయం ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు ఉంది. రెండేళ్లలో ఒక్క రసాయన పురుగు మందు పిచికారీ చేయకుండానే ఎండుతెగులు మటుమాయమైంది. మామిడి చెట్ల జీవిత కాలం సైతం పెరుగుతుంది. భూమిలో సారం కూడా పెరిగింది. మామిడిలో చేసిన ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు రావడంతో మా అన్నదమ్ములకున్న వంద ఎకరాల్లోని పామాయిల్, అరటితో పాటు ఇతర పంటల్లో సైతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతూ ఆచరిస్తే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. రెండు ఆవులుంటే ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. – మూల్పూరి నాగవల్లేశ్వరరావు (నాని– 94916 99369), మామిడి రైతు, కొర్లగుంట, ముసునూరు మం., కృష్ణా జిల్లా. ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిదాయకం వేపను ఆశిస్తున్న డైబ్యాక్ డిసీజ్‌కు.. మామిడిలో ఎండు పుల్ల తెగులుకు సంబంధం లేదు. నీరు నిల్వ ఉండటం, ఇన్ఫెక్షన్కు గురవ్వటం వల్ల మామిడి తోటలకు ఈ సమస్య వస్తోంది. శ్రద్ధగా చర్యలు తీసుకుంటే మామిడి తోటలకు ముప్పు ఉండదు. నాగవల్లేశ్వరరావు చాలా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటను రక్షించుకోవటం రైతాంగానికి స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రైతులు మామిడికి పూత మొదలైన దగ్గర నుంచి పిందె ఏర్పడే వరకు దాదాపు 6 నుంచి 10 సార్లు రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కాయలో రసాయన మందుల అవశేషాలుండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి పనికిరావడం లేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. ఈ కాయలను తిన్న ప్రజలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రకృతి సేద్యం చేసినట్లయితే కాయల నాణ్యత బాగుండటంతోపాటు రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులను ప్రకృతి సేద్యం సాగు వైపు దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటున్నాం. – చొప్పర శ్రీనివాసులు (79950 86773), ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, నూజివీడు. సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు, చీడపీడల నియంత్రణపై రైతులు, వృత్తి నిపుణుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని (కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ) జాతీయ పంటమొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ‘సేంద్రియ సేద్యంలో సస్యరక్షణపై సర్టిఫికెట్ కోర్సు’ను ప్రారంభించింది. గ్రామీణ యువతకు సేంద్రియ వ్యవసాయంలో నైపుణ్యాలను పెంపొందిండం, గ్రామస్థాయిలో రైతులను పెద్ద సంఖ్యలో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇప్పించేందుకు మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం, సేంద్రియ రైతులు, సేంద్రియ ఉత్పత్తుల విక్రేతల్లో సేంద్రియ సర్టిఫికేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఆర్ధిక విషయాల విశ్లేషణలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యమని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. డైరెక్టర్ జనరల్ డా. సాగర్ హనుమాన్ సింగ్ తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 6 నుంచి 91 రోజుల పాటు మూడు విడతలుగా సర్టిఫికెట్ కోర్సు తరగతులను నిర్వహిస్తారు. మొదటి 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో రెసిడెన్షియల్ కార్యక్రమంలో సేంద్రియ సేద్యంలో ప్రాధమిక అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. తర్వాత 60 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మక ప్రాజెక్టు ద్వారా సేంద్రియ పంటలు సాగు చేయిస్తూ శిక్షణ ఇస్తారు. చివరి 10 రోజులు ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో సింహావలోకనం, తుది శిక్షణ వచ్చే ఏడాది మార్చి 23 వరకు వుంటుంది. 25 మందికి ప్రవేశం. ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి తర్వాత వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఫీజు రూ. 6 వేలు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. ఆవరణలో వసతి ఉచితం. భోజన ఖర్చులను అభ్యర్థులే భరించాలి. మీరట్‌లోని ఐఐఎఫ్‌ఎస్‌ఆర్, ఘజియాబాద్‌లోని ఎన్సిఓఎఫ్, మేనేజ్ తదితర జాతీయ సంస్థల నుంచి వచ్చే నిపుణులు శిక్షణ ఇస్తారు. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మట్‌లో దరఖాస్తును పూర్తి చేసి ఈ అడ్రస్‌కు మెయిల్ చెయ్యాలి.. dirphmniphm-ap@nic.in ఇతర వివరాలకు.. కోర్సు కోఆర్డినేటర్ డా. శ్రీలత – 90103 27879, అసోసియేట్ కోర్సు కోఆర్డినేటర్ డా. దామోదరాచారి – 95426 38020. అనంతపురం జిల్లాలో 14, 15 తేదీల్లో డా. ఖాదర్ సభలు ‘సిరిధాన్య సాగు – రైతు బాగు’ సిరీస్‌లో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీల్లో ప్రముఖ స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే పలు సభల్లో ప్రసంగించనున్నారు. ప్రవేశం ఉచితం. 14వ (ఆదివారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా నల్లమాడలోని ఆర్.డి.టి. కార్యాలయంలో మహిళాభివృద్ధి సొసైటీ నిర్వహణలో ‘కంపెనీ వ్యవసాయానికి స్వస్తి–సహకార వ్యవసాయానికి పంక్తి’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94408 00632. 14వ (ఆదివారం) తేదీ సా. 5 గం.కు అనంతపురం లలిత కళా పరిషత్‌లో అనంత నగరాభివృద్ధి వేదిక, అనంత ఆదరణ ఎఫ్.పి.ఓ. ఆధ్వర్యంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 94405 21709. 15వ (సోమవారం) తేదీ ఉ. 10 గం.కు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 91001 02809.15వ (సోమవారం) సా. 4 గం.కు అనంతపురం రాయల్ నగర్‌లోని ఈడిగ భవనంలో ‘సెర’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యలలో ‘ఈత వనం సాగు – గీత కార్మికుడి బాగు’ అనే అంశంపై అవగాహన సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 92464 77103. అందరూ ఆహ్వానితులే. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
విరగపూసిన మామిడి!
సాక్షి, అమరావతి: మధుర ఫలం మామిడి సీజన్ మొదలైంది. వచ్చే నెల నుంచి మార్కెట్లోకి రాబోతుంది. గతేడాది మార్కెట్‌కు వచ్చే సమయంలోనే కరోనా దెబ్బతీసింది. విదేశాలకు పూర్తి స్థాయిలో విమానాలు తిరగనందున ఆశించిన స్థాయిలో ఎగుమతుల్లేక రైతులు ఇబ్బందిపడ్డారు. ఈసారి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే రికార్డు స్థాయిలో దిగుబడులు రావడమే కాదు.. ఎగుమతులు కూడా అదే స్థాయిలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకూల పరిస్థితులు.. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో మామిడి దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2014–15లో 3,27,308 హెక్టార్లలో సాగైన మామిడి 2020–21లో 3,76,494 హెక్టార్లకు చేరింది. దిగుబడుల విషయానికొస్తే 2014–15లో హెక్టారుకు 8.56 టన్నుల చొప్పున 28,03,663 ఎంటీల దిగుబడులు రాగా.. 2019–20లో హెక్టారుకు 12.45 టన్నుల చొప్పున 46,88,097 మెట్రిక్ టన్నుల మేరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది విస్తీర్ణంలో మార్పు లేకున్నప్పటికీ మంచివర్షాలు కురియడం, వాతావరణం అనుకూలించడంతో హెక్టారుకు 15 టన్నుల చొప్పున 56.47 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 1,12,314 హెక్టార్లు, అత్యల్పంగా గుంటూరులో 701 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. రాష్ట్రంలో పండే మామిడి రకాల్లో బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపురి, చిన్నరసాలకు దేశీయంగానేగాక.. విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. గతేడాది లాక్డౌన్ దెబ్బకు టన్నుకు రూ.30 వేలు పలికిన మామిడి ఈసారి రూ.లక్ష వరకు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. మార్చి నెలాఖరులోగా బయ్యర్లు, సెల్లర్ల మీట్ అగ్రికల్చర్, ప్రాసెస్ ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ(ఏపీఈడీఏ) ఏర్పాటు చేసిన పోర్టల్‌లో రైతుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఏ రకం మామిడి సాగు చేస్తున్నారు.. ఏ సమయానికి ఎంత దిగుబడి వచ్చే వీలుందో వివరాలను రైతులు అప్లోడ్ చేస్తున్నారు. ఇదే పోర్టల్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు కూడా రిజిస్టరై ఉన్నారు. మరోవైపు బయ్యర్లు, సెల్లర్ల మీట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 9న విజయవాడ, మార్చి 26న తిరుపతిలో ఈ మీట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. యూరప్ దేశాలే లక్ష్యంగా గతేడాది కేవలం నాలుగు దేశాలకు మాత్రమే అతికష్టమ్మీద కొద్దిగా ఎగుమతి చేయగలిగారు. అదే సమయంలో దేశీయంగా వివిధ రాష్ట్రాలకు మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయడంతో గతేడాది మామిడి రైతులు గట్టెక్కగలిగారు. అయితే ఈ ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, దక్షిణకొరియా, యూకే, హాంకాంగ్, చైనా, దుబాయ్, సౌదీ తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా యూరప్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సత్ఫలితాలనిస్తున్న వైఎస్సార్ తోటబడులు మామిడి దిగుబడిని పెంచేదిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ తోటబడులు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. పురుగు మందుల అవశేషాల్లేకుండా ‘ఎక్స్పోర్ట్ క్వాలిటీ’ మామిడిని ఉత్పత్తి చేసేందుకు పాటించాల్సిన పద్ధతులపై తోటబడుల ద్వారా రైతులకు శిక్షణనిస్తున్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్స్ ద్వారా నిర్వహిస్తోన్న ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా మంచి ఫలితాలనిస్తోంది. ఎగుమతులకు ప్రామాణికమైన ‘ఫైటో శానిటరీ సర్టిఫికెట్’ జారీకోసం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈసారి మంచి దిగుబడులు గతేడాదితో పోల్చుకుంటే ఈసారి మంచి దిగుబడులొస్తాయని ఆశిస్తున్నాం. అక్కడక్కడా తేనేమంచు పురుగు ప్రభావం ఉన్నప్పటికీ దిగుబడులకు ఢోకా ఉండదు. ఆర్బీకేలు వేదికగా నిర్వహిస్తోన్న వైఎస్సార్ తోటబడుల ద్వారా క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తుండడం వల్ల మంచి ఫలితాలొస్తున్నాయి. – కె.బాలాజీనాయక్, అదనపు డైరెక్టర్, ఉద్యానవన శాఖ -
7న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై శిక్షణ
మామిడి సాగులో వివిధ దశల్లో ప్రకృతి వ్యవసాయదారులు పాటించాల్సిన మెలకువలపై గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7(శనివారం)న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కృష్ణాజిల్లా నూజివీడులోని ఛత్రపతి సదన్‌లో సదస్సు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. రాజేష్ – 91779 88422 9న నాచుగుంట గోశాలలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప.గో. జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని గోపాలకృష్ణ గోశాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఈ నెల 9 (సోమవారం) ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు రైతులకు శిక్షణ ఇస్తారు. కొత్త పద్ధతులను అవలంబించే రైతులు అనుభవాలను పంచుకుంటారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. జగదీష్ – 78934 56163. 8న ‘చిరు’తిళ్ల తయారీపై ఉచిత శిక్షణ గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ శిక్షణా కేంద్రంలో ఈ నెల 8(ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు జొన్నలు, అరికలు, కొర్రలతో మురుకులు/జంతికలు, బూందీ, నువ్వు లడ్డూలు, వేరుశనగ చిక్కీ తదితర చిరుతిళ్ల తయారీపై ఉచిత శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255. -
తుప్పుకిక ఓటమి తప్పదు...
మామిడి ఆకులను ఎందుకు వాడతారు? గుమ్మానికి తోరణంగా వాడొచ్చు.. యాగాలు, హోమాలు చేస్తూంటే ప్రోక్షణకు పనికొస్తుంది. అంతకుమించి దానివల్ల ఇంకేం ఉపయోగం అంటున్నారా? మీ ఆలోచనలకు కళ్లెం వేయండి. ఎందుకంటే.. ఇకపై ఈ మామిడాకులు ఏటా లక్షల కోట్లు ఆదా చేస్తాయి మరి! ఎలాగంటే.. ఇనుమును అలాగే వదిలిస్తే ఏమవుతుంది? కొంత కాలానికి తుప్పు పడుతుంది. సముద్రంలో ఎప్పుడూ ఉండే పెద్ద పెద్ద నౌకలు మరింత వేగంగా తుప్పుపడతాయి. ఈ తుప్పు వదిలించుకునేందుకు అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఏకంగా.. రెండున్నర లక్షల కోట్ల డాలర్లు! అయితే మామిడాకుల నుంచి తీసిన ఓ పదార్థం ఇనుముకు తుప్పు అసలే పట్టనివ్వదని తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ పదార్థాన్ని వాడటం ద్వారా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న కృత్రిమ రంగుల వాడకాన్ని నిలిపివేయవచ్చని అంచనా. మామిడాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, తుప్పు తట్టుకునే పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయని.. అందుకే తాము వీటిపై పరిశోధనలు ప్రారంభించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నిషాంత్ కె.గోపాలన్ తెలిపారు. ఎథనాల్ సాయంతో ఎండిపోయిన మామిడాకుల నుంచి పాలీఫినాల్స్ వంటి రసాయనాలను తొలుత వేరు చేశామని చెప్పారు. వేర్వేరు సాంద్రతలతో ఈ రసాయనాలను పరిశీలించగా ఇనుము లాంటి లోహాలతో బంధం ఏర్పరచుకున్న పాలీఫినాల్స్ తుప్పును సమర్థంగా అడ్డుకుంటుందని వివరించారు. గరిష్టమైన నిరోధకత కలిగిన పదార్థపు పూత పూసిన ఇనుమును ఉప్పునీటిలో ఉంచి పరీక్షించినప్పుడు తుప్పు పట్టడం 99 శాతం తగ్గిందని చెప్పారు. ఈ పదార్థంపై మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు చేయాల్సి ఉందని గోపాలన్ చెప్పారు. మార్కెట్లో తుప్పును నిరోధించే రసాయనాలు ఎన్నో ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కు వని.. పైగా వాటితో మానవ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంద న్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు తాము మొక్కల రసాయనాలను అన్వేషించామని చెప్పారు. మామిడాకులతో పాటు ఈత/ఖర్జూరపు గింజలు, అల్లం నుంచి వేరు చేసిన రసాయనాలు కూడా తుప్పును తట్టుకోగలవని తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రైతన్నలకు భరోసా.. శీతల గిడ్డంగుల హామీ
ముని నాయుడుది చిత్తూరు జిల్లా నగరి. మామిడి రైతు. తోతాపురి రకాన్ని పండిస్తారు. దిగుబడి బాగా వచ్చింది. అయితే, ధర మరీ తగ్గిపోయింది. ధర వచ్చే వరకు పంటను అమ్మకుండా ఉందామంటే శీతల గిడ్డంగి లేదు. కాబట్టి చెప్పిన ధరకు అమ్ముకోక తప్పని దుస్థితి రైతులది. ఆ జిల్లాలో ఎక్కువగా పండే తోతాపురి మామిడి రకం జ్యూస్‌కి పనికి వస్తుంది. మార్కెట్లో ధర లేదన్న సాకుతో రైతుల నుంచి చౌకగా కొనడం ప్రారంభించాయి పల్ప్ కంపెనీలు. పెద్ద కంపెనీలకు సరుకు నిల్వ చేసే శీతల గిడ్డంగుల సౌకర్యం ఉంటుంది. రైతులకు ఈ సదుపాయం లేకపోవడాన్ని ఆసరా చేసుకుని కంపెనీలు దోపిడికి పాల్పడుతున్నాయి.. ఇలా ఒకటి, రెండు పంటల విషయంలోనే కాదు. కూరగాయల మొదలు వివిధ రకాల ఉద్యాన పంటల మార్కెటింగ్ పరిస్థితీ ఇదే. టమాటా బయటి మార్కెట్లో కిలో రూ. 15 – 20 అమ్ముతున్నా రైతులకు మాత్రం కిలోకి ఒకటి రెండు రూపాయలు కూడా దక్కడం లేదు. ఉల్లి రైతులదీ అదే పరిస్థితి. రైతులు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించే తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం. అదే ప్రభుత్వమే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తేనో, రైతులే సొంతంగా కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తేనో అన్నదాతలు దుర్భర స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. ఆహార శుద్ధి రంగంలో అగ్రగామిగా ఉండాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించాలి. అప్పుడే రైతన్నలకు గిట్టుబాటు లభిస్తుంది. మార్కెట్లో జరిగే దోపిడీని అరికట్టడానికి వీలవుతుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూరాలంటే రైతులకు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగి సౌకర్యం ఉండాలి. ఎప్పుడు ధర వస్తే అప్పటిదాకా నిల్వ చేసే పరిస్థితి ఉంటే రైతులకు మేలు జరుగుతుంది. పరిశోధనా కేంద్రాలు సరే... దేశంలో అత్యధిక ఆహార ఉత్పత్తి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆహార శుద్ధి పరిశ్రమలకు అనువైన ముడిపదార్థాలు పెద్ద ఎత్తున దొరికే రాష్ట్రాలలో ఏపీ ఒకటి. రాష్ట్రంలో 5 వ్యవసాయానుకూల జోన్లు, 58 వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పెద్దఎత్తున జరుగుతున్న పట్టణీకరణ, రోజురోజుకు మారుతున్న జీవన స్థితిగతుల నేపథ్యంలో ఆహార శుద్ధి రంగం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీనికితోడు 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇన్ని వనరులు ఉన్నా రైతులు మాత్రం ఏటా కొన్ని కోట్ల రూపాయల ఉత్పత్తులను నేల పాలు చేయాల్సి వస్తోంది. పరిశోధన ఫలితాలు రైతులకు చేరకపోవడం, ఆహార శుద్ధి పరిశ్రమలు లేకపోవడం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు లేకపోవడమే ప్రధాన కారణం. ఇవే ఉంటే.. రైతులకు అదనపు ఆదాయం కోసం వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు చెడిపోకుండా తాజాగా వినియోగించుకోవచ్చు. ధర లేని పరిస్థితులలో రైతులు తమ ఉత్పత్తులను వీటిల్లో నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఆహార శుద్ధి పరిశ్రమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం కోసం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఇవి ఉపయోగపడతాయి. ప్రకటనలు సరే.. ఫుడ్ పార్కులు ఏవీ? ప్రతి జిల్లాకు ఫుడ్ పార్క్‌లు, ఆహార శుద్ధి రంగ పరిశ్రమలు, శీతల గిడ్డంగులంటూ చంద్రబాబు పాట పాడడం మొదలు పెట్టి ఐదేళ్లు దాటింది. అదిగో సమీకృత ఫుడ్ పార్క్... ఇదిగో మెగా ఫుడ్ పార్క్... అల్లదిగో అల్ట్రా మెగా ఫుడ్ పార్క్... అంటూ ఊదరగొడుతున్నారే తప్ప ఆచరణ మాత్రం అందనంత దూరంలో ఉంది. ఒకటీ రెండు వచ్చినా సామాన్యులకు వాటిల్లో స్థానం లేకుండా పోయింది. ఇక కోల్డ్‌స్టోరేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న కోల్డ్ స్టోరేజీల సంఖ్య 456కి మించలేదు. వీటిల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో మాత్రమే 176 ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో వీటి సంఖ్య 47 దాటలేదంటే మిగతా చోట్ల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం 85 లక్షల మందికి పైగా రైతులు ఉంటే– వీటిని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య నాలుగైదు లక్షలకు మించడం లేదు. నిల్వ సౌకర్యం లేక కూరగాయలు, పూలు, పండ్లు, మత్స్య సంపద వృథా అవుతోంది. జగన్ హామీ ఇలా... ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ప్రకటించారు. వాటిల్లో ఒకటి వైఎస్సార్ రైతు భరోసా. ఈ పథకంలో భాగంగా కోల్డ్‌స్టోరేజీ ప్లాంట్లు, గిడ్డంగులు, నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటివన్నీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు నిర్మించుకునే వెసులు బాటు కల్పిస్తానని వాగ్దానం చేశారు. రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటయితే రైతులు వలస పోవాల్సిన దుస్థితి ఉండదు. మామిడి, టమాటా, ఉల్లి వంటి పచ్చి సరకును రోడ్ల పాల్జేసి ట్రాక్టర్లతో తొక్కించాల్సిన అవసరం రాదు. శీతల గిడ్డంగులు వస్తే ధర లేనప్పుడు ఉద్యాన ఉత్పత్తుల్ని రైతులు నిల్వ చేసుకుని సరైన ధరకు అమ్ముకునే వెసులు బాటు ఉంటుంది. – ఆకుల అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
నవార వరి భేష్!
రసాయనిక వ్యవసాయం నష్టదాయకమని తెలుసుకున్న రామాల మాధవరెడ్డి, సుభాషిణి రైతు దంపతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మామిడి, వరి సాగు ప్రారంభించి సంతృప్తికరమైన దిగుబడి పొందుతున్నారు. ఈ సీజన్లో మధుమేహరోగులకు ఉపయోగపడే దేశవాళీ నవార రకం ధాన్యం సాగు చేశారు. కందుకూరు మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన రామాల మాధవరెడ్డి. కౌలుకు ఎకరా పొలం తీసుకొని వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది రబీలో శ్రీవరి పద్దతిలో ఎన్‌ఎల్‌ఆర్–33972 రకం వరిని పూర్తి సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేశారు. ఎకరానికి 30 బస్తాలు దిగుబడి సాధించారు. తర్వాత తనకున్న మూడెకరాలలో మామిడి తోటలో సేంద్రియ ఎరువులను వాడటం ప్రారంభించారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులను పూర్తిగా నిలిపివేసి ప్రకృతి వ్యవసాయం వైపే మొగ్గుచూపాడు. మామిడి తోటలో వ్యవసాయం చేస్తున్న సమయంలో మామిడి పిందెలను పరిశీలించేందుకు మామిడి చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తు మామిడి చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోయాడు. దీంతో మాధవరెడ్డికి నడుము, కాలు ప్రమాదానికి గురై పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. ఆ దశలో మాధవరెడ్డి భార్య సుభాషిణి, కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవసాయంపై దృష్టి సారించటం విశేషం. ఒంగోలులో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటి దగ్గర నుంచే కాలేజ్‌కి వెళ్లి వస్తూ వ్యవసాయ పనుల్లో తల్లికి చేదోడుగా ఉంటున్నారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ధనుంజయ త్రిపురాంతకం నుంచి రెండు కిలోల దేశవాళీ నవార రకం వరి విత్తనాలు తెచ్చి ఇచ్చారు. వ్యవసాయాధికారులు, ప్రకృతి వ్యవసాయ నిపుణుల సూచనల ప్రకారం బీజామృతంతో «విత్తన శుద్ధి చేసి, జీవామృతం, ఘన జీవామృతం వాడారు. తెగుళ్ల నివారణకు పుల్లని మజ్జిగ, వావిలాకు కషాయం, ఇంగువ ద్రావణం వాడారు. శ్రీవరి పద్ధతిలో మొక్కకు మొక్కకు 25“25 సెంటీమీటర్ల దూరంలో నాటారు. గింజ గట్టి పడడానికి ఏడు రకాల పప్పు ధాన్యాలతో తయారు చేసుకున్న టానిక్‌ను వాడారు. మూడున్నర నెలల పంటకాలంలో 14 ఆరుతడులు ఇచ్చి, ఇటీవలే నూర్పిడి చేశారు. ఇలా రెండు కిలోల విత్తనాలను ఎకరంలో సాగు చేసి రూ. 12,150 ఖర్చుతో వెయ్యి కేజీల నవార ధాన్యం దిగుబడి సాధించారు. నవారి రకం వరి వడ్లు నలుపు రంగులో బియ్యం బ్రౌన్ రంగులో ఉంటాయి. ఈ బియ్యం డయోబెటిక్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వాడతారు. మార్కెట్లో ఈ బియ్యానికి గిరాకీ ఉంది. 75 కేజీల బస్తా రూ. 3,500లకు విక్రయిస్తానని రైతు మాధవరెడ్డి చెప్తున్నారు. బియ్యం తిన్నవారు రసాయనిక మందులతో పండించిన బియ్యం తినలేరని ఆయన అంటున్నారు. నవార రకం వరిని సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు విత్తనాలు ఉచితంగా ఇస్తానని మాధవరెడ్డి తెలిపారు. – విజయ్, కందుకూరు రూరల్, ప్రకాశం జిల్లా రైతు మాధవరెడ్డి, నవార రకం బియ్యం -
కందకాలతో తోట పచ్చన
పుస్కూరు రఘుకుమార్, పీతా రవివర్మ అనే ఇద్దరు మిత్రులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాల, ఆగిర్యాల గ్రామాల పరిధిలో 50 ఎకరాలలో మామిడి తోటను పదేళ్లుగా సాగు చేస్తున్నారు. వర్షాలు అంతంతమాత్రంగా కురవడం, కురిసిన వర్షం కూడా భూగర్భంలోకి ఇంకే మార్గం లేకపోవడం వల్ల భూగర్భ జలమట్టం మరీ తగ్గిపోయింది. దీంతో తోటలో 5 బోర్లు ఉన్నప్పటికీ ఏ బోరూ సరిగ్గా నీరు పోయకపోవడం సమస్యగా మారింది. పదేళ్ల తోటను కాపాడుకోవడానికి వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించుకోవడమే ఉత్తమ పరిష్కార మార్గమని భావించిన రఘు, రవి.. గత ఏడాది తొలుత ఫాం పాండ్ తవ్వించుకున్నారు. ఆ క్రమంలోనే పొలంలో కందకాలు తవ్వడం మంచిదని తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలను సంప్రదించారు. వీరి కోరిక మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి దామోదర్‌రెడ్డి గత ఏడాది మే నెలలో స్వయంగా వచ్చి తోటలో భూమి స్థితిగతులను పరిశీలించి, వాలుకు అడ్డంగా మీటరు లోతున, మీటరు వెడల్పున, 20 మీటర్ల పొడవున కందకాలు తవ్వించారు. అదే వరుసలో 5 మీటర్లు ఖాళీ వదిలి మరో 20 మీటర్ల చొప్పున కందకాలు తవ్వించామని రవివర్మ తెలిపారు. కందకాలు తవ్విన తర్వాత కురిసిన వర్షాలకు రెండు సార్లు కందకాలు నీటితో నిండాయి. వర్షపు నీరంతా బయటకు కొట్టుకుపోకుండా పూర్తిగా భూమి లోపలికి ఇంకింది. ఈ కందకాల పుణ్యానే తమ మామిడి తోట పెరుగుదల, కాపు ఈ ఏడాది బాగుందని.. ఇంత మండు వేసవిలో కూడా పచ్చగా ఉందని రవివర్మ సంతృప్తిగా చెప్పారు. ఆ ప్రాంతంలో ఇతర తోటల్లో బోర్లు ఈ ఏడాది ఆగి ఆగి పోస్తుంటే.. తమ తోటలో బోర్లు మాత్రమే పుష్కలంగా పోస్తున్నాయన్నారు. రెండు బోర్లలో రెండున్నర ఇంచుల నీరు, మూడు బోర్లలో ఒకటిన్నర ఇంచుల బోర్లు కంటిన్యూగా పోస్తుండటానికి కారణం నిస్సంకోచంగా కందకాలేనని రవి వర్మ అన్నారు. రైతులు కందకాలు తవ్వుకుని పంటలను కాపాడుకోవచ్చని రఘు, రవివర్మ (80089 66677) ల అనుభవాలు చాటిచెబుతున్నాయి. పుస్కూరు రఘుకుమార్ -
దేశవిదేశాల్లో డోర్ డెలివరీ!
ముగ్గురు బిడ్డల తల్లి ఆరిఫా రఫీ.. సేంద్రియ మామిడి సేద్యంలో కష్టానికి తగిన లాభాల కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్న అరుదైన మహిళా రైతు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సేంద్రియ సేద్యం చేస్తూనే నేర్చుకుంటూ ఒక్కో అడుగూ ముందుకు నడిచిన రైతు ఆమె. రసాయనాలు వాడకుండా పండించడం విశేషం. దేశవిదేశాల్లో, ముఖ్యంగా అమెరికా మార్కెట్లలోకి నేరుగా అడుగుపెట్టగలగడం అంతకంటే విశేషం. విదేశాల్లోనూ డోర్ డెలివరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. తెలుగు నేల గర్వించదగిన మహిళా రైతు ఆరిఫా రఫీ! ఆమెకు, ఆమెకు వెన్నుదన్నుగా ఉన్న కుటుంబానికి పవిత్ర రంజాన్ మాసంలో ‘సాక్షి సాగుబడి’ సగర్వంగా సలాం చెబుతోంది!! ఆరిఫా.. హైదరాబాద్ నగరంలోనే పుట్టి పెరిగిన మహిళ. ఎమ్మే చదివారు. వ్యవసాయ నేపథ్యం లేదు. అయితే, కర్నూలు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన రఫీని పెళ్లాడి, దుబాయ్‌లో కొన్నాళ్లున్న తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ముగ్గురు సంతానం. అబ్బాయి.. తర్వాత ఇద్దరు అమ్మాయిలు. పిల్లలను చూసుకోవడం కోసం బ్యాంక్ పీవో ఉద్యోగాన్ని ఏడాదికే వదిలేశారు. అటువంటి పరిస్థితుల్లో పదేళ్ల క్రితం సేంద్రియ మామిడి సాగు వైపు దృష్టి సారించారు. ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో 21 ఎకరాలు కొని మామిడి నాటారు. చేవెళ్ల దగ్గర 20 ఎకరాల్లో కూడా దశల వారీగా మామిడి నాటారు. మామిడి తోటల సాగు పనుల వద్ద నుంచి దేశవిదేశాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ పనుల వరకు ఆరిఫాయే స్వయంగా చూసుకుంటున్నారు. ప్రైవేటు టెలికం కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్న తన భర్త రఫీ పూర్తి సహాయ సహకారాలతోనే తాను రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఏఆర్4 ఆర్గానిక్ మాంగో ఫామ్స్ సీఈవో ఆరిఫా ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘‘నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం వల్ల వ్యవసాయం తెలియదు. మా మామగారు రైతు. మా వారికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండేది. చేవెళ్ల దగ్గర భూమి కొన్నారు. డెయిరీ పెడదామనుకున్నా.. కుదరలేదు. తర్వాత ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో భూమి తీసుకున్నాం. మన యూనివర్సిటీ సైంటిస్టులను కలిస్తే.. ఆ భూమి పనికిరాదు.. సేంద్రియ సేద్యం సాధ్యం కాదు. తోటలకు సరిపడా నత్రజనిని అందించలేరన్నారు. తమిళనాడు, కర్ణాటక వ్యవసాయ అధికారులను కలిశాం. సేంద్రియ మామిడి తోటలు పెట్టమన్నారు. కొంచెం ఖరీదైనా పంచగవ్య వాడితే మంచి ఫలితాలు వస్తాయని ప్రోత్సహించారు. జీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ వాడుతున్నాం. బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నాం. యాదగిరిగుట్ట, చేవెళ్లలో కలిపి 41 ఎకరాల్లో మొత్తం 22 రకాల మామిడి రకాలు వేశాం. ఏటా కొన్ని ఎకరాల్లో మొక్కలు పెట్టాం. బంగినపల్లి 30“30, హిమాయత్ 24“24, దసేరి 18“18 అడుగుల దూరంలో నాటాం. ఏడాదికి కొన్ని ఎకరాల్లో తోటలు పెడుతూ వచ్చాం. హిమాయత్ అంటే ఇష్టం. ఎక్కువ మొక్కలు అవే పెట్టాం. మల్లాపూర్ తోటలో కేసర్, దసేరి బాగా వస్తున్నాయి. గత ఏడాది 18–20 టన్నుల మామిడి పండ్ల దిగుమతి వచ్చింది. చేవెళ్ల తోటలు లేతవి కావడంతో ఎక్కువగా మల్లాపూర్ తోట నుంచే దిగుబడి వస్తోంది. వర్షాలు, పూత, పిందె.. ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది దిగుబడి 40–50% తగ్గింది. జూన్ తొలి వారం వరకు కోస్తాం. 10–12 టన్నులు రావచ్చు. మాకు 7 వేలకు పైగా కస్టమర్ బేస్ ఉంది. 1,500 మంది యాక్టివ్ కొనుగోలుదారులున్నారు. ఎక్కువ మంది హైదరాబాదీయులే. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైవాసులూ ఉన్నారు. మా వెబ్సైట్లో బుక్ చేసుకున్న వారికి దేశవ్యాప్తంగా ఆరేళ్లుగా డోర్‌డెలివరీ చేస్తున్నాం. అదేవిధంగా సింగపూర్, దుబాయ్‌తోపాటు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వినియోగదారులకూ మూడేళ్లుగా నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నాం. పండును చూడకుండా, ముట్టుకోకుండానే ఆన్లైన్లోనే విక్రయించడంలో తొలుత కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే, పండ్ల నాణ్యత విషయంలో రాజీలేని ధోరణే మాపై వినియోగదారులకు విశ్వాసాన్ని పెంచింది. గత ఏడాది 8 షిప్‌మెంట్స్ వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటికి 3 వెళ్లాయి.. మరో రెండు ఉంటాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఉద్యోగం వద్దనుకున్నాను. కానీ, తోటలు పెట్టడం ప్రారంభించినప్పుడు ఇంతస్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్/ షిప్‌మెంట్స్ చేయగలమని ఊహించలేదు! రెండో అమ్మాయి స్కూలింగ్ ఇప్పుడే పూర్తయింది. బొప్పాయి, మునగ, సీతాఫలాల గురించి కూడా ఆలోచిద్దామనుకుంటున్నాను. మా సంపాదనలో 2.5% బాలికా విద్యకు ఖర్చుపెడుతున్నాం..’’ అంటున్న ఆరిఫా రఫీకి సలాములు! (0-9-9-1-23 40-4-04 www.ar4mangoes.com) అమెరికాకు ఎగుమతి అవుతున్న మాంగో బాక్సులు, పిల్లలు, భర్త రఫీతో ఆరిఫా -
కందకాలతో కరువు నుంచి రక్షణ!
♦ ‘సాక్షి’ స్ఫూర్తితో గత ఏడాది కందకాలు తవ్వించా.. ♦ కందకాలు నిండేలా వర్షం పడింది ఒక్కసారే ♦ 30 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి కరువు వచ్చింది ♦ అయినా, కందకాల వల్లే మా తోట పచ్చగా నిలబడింది.. ♦ సీనియర్ ఉద్యాన రైతు మల్లికార్జునరావు పండ్ల తోటల సాగులో వై.కె.డి. మల్లికార్జునరావుకు 30 ఏళ్ల అనుభవం ఉంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెద్దివేడు గ్రామంలో 50 ఎకరాల్లో మామిడి, జామ, ఉసిరి, సపోట తోటలతోపాటు 2 ఎకరాల్లో మలబారు వేపను సాగు చేస్తున్నారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న దశలో చేనుకిందే చెరువు పేరిట ‘సాక్షి’ మీడియా గ్రూప్, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన కందకాల ఉద్యమంతో స్ఫూర్తి పొందారు. వేదిక నేతలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డిలను సంప్రదించి, స్వయంగా తీసుకెళ్లి తోటను చూపించారు. వారి సూచనల మేరకు తోటలోని సుమారు 20 ఎకరాలలో అక్కడక్కడా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున 25 మీటర్ల పొడవున వాలుకు అడ్డంగా గత ఏడాది సెప్టెంబర్‌లో కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన పది రోజుల్లో పెద్ద వర్షం కురిసింది. పొలంలో పారిన నీరు కందకాల్లోకి నిండుగా చేరి, భూమిలోకి ఇంకాయి. అయితే, ఆ తర్వాత గత ఏడాదంతా వర్షం లేదు. మళ్లీ 2016 మే 8వ తేదీ రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసే వరకు.. చుక్క వాన పడలేదు. తమ తోటలో ఉన్న 5 బోర్లలో 3 బోర్లు ఎండిపోయాయని మల్లికార్జునరావు తెలిపారు. రెండు బోర్లూ కలిపి రెండించుల నీరు పోస్తున్నాయన్నారు. 500 అడుగుల లోతు తవ్విన బోర్లు ఎండిపోయినా.. మామిడి తోటలో కందకాలకు దగ్గరగా ఉన్న 200 అడుగుల బోరు కొంచెంగానైనా నీరు పోస్తుండడం విశేషం అన్నారాయన. గత ఏడాది మేలుకొని కందకాలు తవ్వడం వల్లనే తన తోటలో చెట్లు పచ్చగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మామిడికి అధిక ఉష్ణోగ్రత దెబ్బ మల్లికార్జునరావుతోటలో మామిడి దిగుబడి ఈ ఏడాది 20% మేరకే వచ్చింది. గత డిసెంబర్లో వచ్చిన పూత నిలబడిందని, జనవరి ఆఖరులో పూత బాగా వచ్చిందని, ఆ పూత అధిక ఉష్ణోగ్రత వల్ల రాలిపోయిందని తెలిపారు. గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన అంటున్నారు. వాతావరణ మార్పుల దుష్ర్పభావం వల్లనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారిందన్నారు. కందకాలు తవ్వుకోవడం ద్వారా వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారానే కరువును ఎదుర్కోవడం సాధ్యపడుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. కందకాలు.. జీవామృతం.. కరువును తట్టుకోవాలంటే.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడంతోపాటు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం తప్ప మరో మార్గం లేదని మల్లికార్జునరావు అంటున్నారు. ఆయన గత ఐదేళ్లుగా పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి వాడుతున్నారు. మామిడి తోటకు రెండేళ్లుగా జీవామృతాన్ని నెలకోసారి పిచికారీ చేస్తున్నారు. 15 రోజులకోసారి డ్రిప్పర్కు లీటరు చొప్పున జీవామృతం చెట్ల వద్ద పోస్తున్నారు. ఈ ఏడాది ఘన జీవామృతం తయారు చేయించి నిల్వ చేశారు. వర్షాలు పడినప్పుడు డ్రిప్పర్ల కింద పెడతామన్నారు. 12 x 12 దూరంలో మామిడి సాగు మేలు మల్లికార్జునరావు తన మామిడి తోటలో 12x12, 26x26, 20x20 దూరాల్లో మామిడి మొక్కలు పాతికేళ్ల నాడు నాటారు. వీటిలో 12ఁ12 దూరంలో నాటిన మామిడి తోట మంచి దిగుబడులనిస్తున్నదని ఆయన అంటున్నారు. చెట్లు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల గాలులకు కాయ రాలకుండా ఉంటుందన్నారు. ప్రతి ఏటా పంట పూర్తవగానే ప్రూనింగ్ చేస్తున్నారు. 25 ఏళ్లు గడిచిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో 3 అడుగుల ఎత్తున కొమ్మలు నరికించారు. దీన్నే డీహెడింగ్ అంటున్నారు. ఈ తోటలో వచ్చే ఏడాదికి పూర్తిస్థాయి దిగుబడి మళ్లీ ప్రారంభమవుతుందని, మరో పాతికేళ్లు ఢోకా ఉండదని ఆయన ధీమాగా ఉన్నారు. ప్రతి ఏటా వర్షాలు ప్రారంభం కాగానే బొబ్బర, ఉలవ, జనుము వంటి పచ్చి రొట్ట ఎరువులను విధిగా చల్లి, 45 రోజులకు భూమిలో కలియదున్నడం వల్ల భూమి సారవంతంగా ఉన్నదన్నారు. జీవామృతం వాడిన తర్వాత కాయ బలంగా ఊరుతోందని ఆయన తన అనుభవంగా చెబుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: పోల్కంపల్లి నాగరాజు, సాక్షి ఫొటోగ్రాఫర్ కందకాల వల్లనే తోట పచ్చగా ఉంది..! ‘సాక్షి’ అందించిన స్ఫూర్తితో గత ఏడాది 20 ఎకరాల్లో మాత్రమే కందకాలు తవ్వించాను. ఒకటే వర్షం పడింది. అయినా, రెండు బోర్లు ఎండిపోకుండా ఉండడానికి, తోట పచ్చగా ఉండడానికి ఈ కందకాలు ఉపయోగపడ్డాయనుకుంటున్నాను. ఈ ఏడాది మంచి వర్షాలు పడే సూచనలున్నాయి. మా తోట అంతటా పూర్తి స్థాయిలో కందకాలు తవ్వించాలనుకుంటున్నాను. కందకాలు తవ్వుకోవడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడమే కరువును ఎదుర్కోవడానికి మేలైన మార్గమని నమ్ముతున్నాను. పొలంలో కురిసిన ఒక్క చినుకును కూడా బయటకుపోకుండా కందకాలు తవ్వుకోమని పాలేకర్ కూడా చెప్పారు. - వై.కె.డి. మల్లికార్జునరావు (94904 64498), పెద్దివేడు, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా -
రిటైర్డ్ ఎంఈవో ఫలసాయం
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులవినియోగానికి స్వస్తి సేంద్రియ సేద్యంతో మెరుగైన దిగుబడి నేడు మల్యాల మండలం ఓబులాపూర్‌లో మామిడి సాగుపై రైతులకు శిక్షణ జిల్లా రైతులు వేలాది ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలను సాగు చేస్తున్నారు. మామిడి సాగుపై సరైన అవగాహన లేక వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. రైతులకు మెలకువలు నేర్పించి మేలైన దిగుబడులు సాధించేలా తోడ్పాటునందించాల్సిన ఉద్యానవన అధికారులు కనిపించకుండా పోతున్నారు. మామిడిలో తెగుళ్ల నివారణ కోసం, అధిక ఫలసాయం కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులనే నమ్ముకుని నష్టపోతున్నారు. కొక్కు అశోక్‌కుమార్ సైతం మొదట్లో అందరిలాగే ముందుకు సాగాడు. శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. మామిడిలో అధిక దిగుబడి సాధించడంపై పలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యూడు. ఈ ఏడాది పైసా ఖర్చు లేకుండా ఏకంగా ఎనిమిది లక్షల ఆదాయం ఆర్జించబోతున్నట్టు ధీమాగా చెబుతున్నాడు. నాడు ఎంఈవోగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది.. నేడు మామిడి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. -జగిత్యాల వ్యవసాయంలో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులపై పెట్టే పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రాక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. హరితవిప్లవం తర్వాత అధిక దిగుబడి అంటూ సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేసి రసాయనాల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో భూములు నిస్సారమై దిగుబడులు గణనీయంగా తగ్గారు. రసాయనాల ప్రభావంతో భూమిలో రైతులకు మేలు చేసే పురుగులు కూడా కనుమరుగవుతున్నారు. జగిత్యాల పట్టణం పోచమ్మవాడకు చెందిన కొక్కు అశోక్‌కుమార్ అనే రిటైర్డ్ ఎంఈవో వినూత్న ప్రణాళికతో పెట్టుబడి లేని సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నాడు. తోటి రైతుల కోసం ఆదివారం తన తోటలో ఒక్కరోజు శిక్షణ ఇస్తుండడం విశేషం. ఎనిమిది ఎకరాల్లో మామిడి అశోక్‌కుమార్ మల్యాల మండలం ఓబులాపూర్ శివారులో ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత భూమిని చదును చేయించి మామిడి మొక్కలు నాటాడు. మొదట్లో అందరిలాగే బస్తాలకు బస్తాలు రసాయన ఎరువులు వేయడం, నాలుగైదుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం, ఐదారుసార్లు మామిడివేర్లు తేలేటట్టు ట్రాక్టర్‌తో దున్నించడం చేశాడు. దీంతో భూమి కొనుగోలుకు అరుున ఖర్చు కంటే మామిడితోట నిర్వహణపై పెట్టే ఖర్చు మూడింతలు ఎక్కువగా ఉండేది. ఇలా నాలుగైదు ఏళ్లు రసాయన మందులు విపరీతంగా పిచికారీ చేస్తుండటంతో మామిడితోటలో దిగుబడి పెరిగే బదులు కొమ్మతొలుచు పురుగు, ఆకుమచ్చ ఏర్పడం మొదలైంది. పలు రకాల తెగుళ్లు, రోగాలు వచ్చి మామిడిని నష్టం చేస్తుండేవి. హైదరాబాద్‌లో శిక్షణ హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) మామిడి రైతులకు శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లి నాలుగైదు నెలలపాటు శిక్షణ పొందాడు. విద్యాధికుడు కావడంతో ప్రకృతిని ఎలా కాపాడాలి? ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పంటలకు మేలు చేసే పురుగులు ఎలా కనుమరగవుతున్నారుు? అనే విషయాలతోపాటు జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి? వాటిని ఎలా వాడాలి? అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మొదలైన మిత్ర పురుగుల పెంపకం శిక్షణ తర్వాత ఎన్ఐపీహెచ్ఎం శాస్త్రవేత్తలు ఉచితంగా రెడ్‌విడ్ బగ్స్, బ్రేకాన్స్, ట్రైకోగ్రామా, ట్రైకోకాడ్స్ వంటి మిత్రపురుగులను ఒక్కో జత అందించారు. దీంతో ఈ పురుగులను లార్వా దశ నుంచి ఎగిరే దశ వరకు ఇంటి దగ్గర పెంచుతున్నాడు. ఇవి కొద్ది రోజుల్లోనే ఒక్కో పురుగు తన జాతి లక్షణాన్ని బట్టి 400-500 గుడ్లు పెడుతుంటాయి. ఇలా ఏడాదిలోనే మిలియన్, ట్రిలియన్ మిత్ర పురుగులను తయారు చేసి, మామిడితోటలో వ దులుతుంటాడు. ఈయన మామిడితోటకు వెళితే పురుగుమందుల వాసనకు బదులు మంచి సువాసన వెదజల్లే మిత్ర పురుగులు కనువిందు చేస్తూ, స్వాగతం పలుకుతుంటాయి. ప్రతీ కొమ్మ మీద సాలేపురుగులు వంటివి కనిపిస్తాయి. ఏడాదికి ఒకమారు మాత్రమే మామిడి తోటను దున్నిస్తాడు. భూమి బలోపేతం కోసం మరిన్ని చర్యలు భూమిని సారవంతం చేసేందుకు సుభాష్ పాలేకర్ విధానంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మరింత ఆధునికతను జోడించాడు. చిక్కుడు, పెసర, కంది, మినుములు, ఉలువలు, జనుము, జీలుగ వంటివి సేకరించి, వర్షాలు కురియగానే మామిడితోటలో చల్లుతాడు. ఒక లీటర్ ఆవుమూత్రం, ఆవుపేడతో తయారు చేసిన జీవామృతంలో, 100 గ్రాముల టైకో డెర్మా శిలింధ్రంతోపాటు 100 గ్రాముల సుడోమోనాస్ బ్యాక్టీరియాతో లీటర్ ద్రావణం తయారవుతుంది. దీంట్లో విత్తనాలను మూడు రోజులు నానబెట్టి, తర్వాత ఆరబెట్టాలి. విత్తనాలు చల్లుతున్నాడు. ఇలా రెండేళ్లుగా చేస్తున్నాడు. పంటకు వచ్చిన తర్వాత వాటి నుంచి విత్తనాలను మరో పంటకు సేకరించి, మొక్కలను అలాగే వదిలేస్తాడు. ఈ మొక్కలు మిత్ర పురుగులకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు భూమికి మల్చింగ్గా పనిచేస్తాయి. వర్మి కంపోస్టు, వర్మివాష్ మామిడి చెట్లకు వర్మి కంపోస్టు, వర్మి వాష్‌ను ఉపయోగిస్తారు. ఒక లారీ పేడ తెప్పించి దాంతో వర్మి కంపోస్టు తయారు చేస్తాడు. ఇందుకోసం రెండు షెడ్లు నిర్మించుకున్నాడు. ఇందులో తయారైన వర్మికంపోస్టును మొక్కలకు పోస్తాడు. ఓ డ్రమ్ములో ఇసుక, కంకరరాళ్లు, వర్మి కంపోస్టు పోసి, అందులో ఆవు మూత్రం పోసి వర్మి వాష్ తయారు చేస్తుంటాడు. దీనిని లీటర్ల కొద్ది చెట్లకు అందిస్తుంటాడు. వీటి తయారీలో ఎక్కడ కూడా నీటిని ఉపయోగించడు. ఆవును కొనుగోలు చేసి, దాని ద్వారా వచ్చే మూత్రాన్ని సేకరించి అన్ని పదార్థాల్లో ఉపయోగిస్తాడు. ఆవు మూత్రం నేరుగా ఓ తొట్టెలోకి వెళ్లేలా షెడ్డు నిర్మించాడు. జీవామృతం తయారీలో బెల్లంకు బదులు రాలిన మామిడి కాయలను ఓ తోట్టిలో వేసి నెలల తరబడి మాగబెట్టి వాడుతుంటాడు. రెండేళ్లుగా ఇలాంటి పద్ధతులు పాటించడంతో గతేడాది రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు లేకపోగా... ఈ విధానంలో దిగుబడి పెరిగే అవకాశముండడంతో దాదాపు రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ రాదని ఘంటాపథంగా చెపుతుండటం విశేషం. రైతులకు శిక్షణ ఇచ్చే స్థాయికి.. హైదరాబాద్‌లోని ఎన్ఐపీహెచ్ఎంలో జరిగే కార్యక్రమాల్లో తోటి రైతులకు ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌లో శిక్షణ పొందిన జగిత్యాల మండలం లక్ష్మీపూర్, మల్యాల మండలం లంబాడిపల్లె, ఓగులాపూర్, మేడిపల్లి మండలం మాచాపూర్, సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, నాగునూర్ గ్రామాలకు చెందిన రైతులతోపాటు, ఆసక్తి ఉన్న ఇతర రైతులకు ఓబులాపూర్‌లోని తన తోటలో ఒక్క రోజు ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం రైతు కోక్కు అశోక్‌కుమార్‌ను 98661 92761లో సంప్రదించవచ్చు.