విరగపూసిన మామిడి! | This year mango yields are likely to increase massively in AP | Sakshi
Sakshi News home page

విరగపూసిన మామిడి!

Published Mon, Feb 15 2021 3:54 AM | Last Updated on Mon, Feb 15 2021 3:54 AM

This year mango yields are likely to increase massively in AP - Sakshi

సాక్షి, అమరావతి: మధుర ఫలం మామిడి సీజన్‌ మొదలైంది. వచ్చే నెల నుంచి మార్కెట్‌లోకి రాబోతుంది. గతేడాది మార్కెట్‌కు వచ్చే సమయంలోనే కరోనా దెబ్బతీసింది. విదేశాలకు పూర్తి స్థాయిలో విమానాలు తిరగనందున ఆశించిన స్థాయిలో ఎగుమతుల్లేక రైతులు ఇబ్బందిపడ్డారు. ఈసారి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే రికార్డు స్థాయిలో దిగుబడులు రావడమే కాదు.. ఎగుమతులు కూడా అదే స్థాయిలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

అనుకూల పరిస్థితులు..
గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో మామిడి దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2014–15లో 3,27,308 హెక్టార్లలో సాగైన మామిడి 2020–21లో 3,76,494 హెక్టార్లకు చేరింది. దిగుబడుల విషయానికొస్తే 2014–15లో హెక్టారుకు 8.56 టన్నుల చొప్పున 28,03,663 ఎంటీల దిగుబడులు రాగా.. 2019–20లో హెక్టారుకు 12.45 టన్నుల చొప్పున 46,88,097 మెట్రిక్‌ టన్నుల మేరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది విస్తీర్ణంలో మార్పు లేకున్నప్పటికీ మంచివర్షాలు కురియడం, వాతావరణం అనుకూలించడంతో హెక్టారుకు 15 టన్నుల చొప్పున 56.47 లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 1,12,314 హెక్టార్లు, అత్యల్పంగా గుంటూరులో 701 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. రాష్ట్రంలో పండే మామిడి రకాల్లో బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపురి, చిన్నరసాలకు దేశీయంగానేగాక.. విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. గతేడాది లాక్‌డౌన్‌ దెబ్బకు టన్నుకు రూ.30 వేలు పలికిన మామిడి ఈసారి రూ.లక్ష వరకు పలకవచ్చని అంచనా వేస్తున్నారు.
 
మార్చి నెలాఖరులోగా బయ్యర్లు, సెల్లర్ల మీట్‌
అగ్రికల్చర్, ప్రాసెస్‌ ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏపీఈడీఏ) ఏర్పాటు చేసిన పోర్టల్‌లో రైతుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో ఏ రకం మామిడి సాగు చేస్తున్నారు.. ఏ సమయానికి ఎంత దిగుబడి వచ్చే వీలుందో వివరాలను రైతులు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇదే పోర్టల్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు కూడా రిజిస్టరై ఉన్నారు. మరోవైపు బయ్యర్లు, సెల్లర్ల మీట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 9న విజయవాడ, మార్చి 26న తిరుపతిలో ఈ మీట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

యూరప్‌ దేశాలే లక్ష్యంగా
గతేడాది కేవలం నాలుగు దేశాలకు మాత్రమే అతికష్టమ్మీద కొద్దిగా ఎగుమతి చేయగలిగారు. అదే సమయంలో దేశీయంగా వివిధ రాష్ట్రాలకు మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయడంతో గతేడాది మామిడి రైతులు గట్టెక్కగలిగారు. అయితే ఈ ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, దక్షిణకొరియా, యూకే, హాంకాంగ్, చైనా, దుబాయ్, సౌదీ తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా యూరప్‌ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఎగుమతులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సత్ఫలితాలనిస్తున్న వైఎస్సార్‌ తోటబడులు
మామిడి దిగుబడిని పెంచేదిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకేలు) కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌ తోటబడులు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. పురుగు మందుల అవశేషాల్లేకుండా ‘ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ’ మామిడిని ఉత్పత్తి చేసేందుకు పాటించాల్సిన పద్ధతులపై తోటబడుల ద్వారా రైతులకు శిక్షణనిస్తున్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్స్‌ ద్వారా నిర్వహిస్తోన్న ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కూడా మంచి ఫలితాలనిస్తోంది. ఎగుమతులకు ప్రామాణికమైన ‘ఫైటో శానిటరీ సర్టిఫికెట్‌’ జారీకోసం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈసారి మంచి దిగుబడులు
గతేడాదితో పోల్చుకుంటే ఈసారి మంచి దిగుబడులొస్తాయని ఆశిస్తున్నాం. అక్కడక్కడా తేనేమంచు పురుగు ప్రభావం ఉన్నప్పటికీ దిగుబడులకు ఢోకా ఉండదు. ఆర్‌బీకేలు వేదికగా నిర్వహిస్తోన్న వైఎస్సార్‌ తోటబడుల ద్వారా క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తుండడం వల్ల మంచి ఫలితాలొస్తున్నాయి.
– కె.బాలాజీనాయక్, అదనపు డైరెక్టర్, ఉద్యానవన శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement