తన మామిడి తోటలో హిమాయత్‌తో ఆరిఫా
ముగ్గురు బిడ్డల తల్లి ఆరిఫా రఫీ.. సేంద్రియ మామిడి సేద్యంలో కష్టానికి తగిన లాభాల కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్న అరుదైన మహిళా రైతు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సేంద్రియ సేద్యం చేస్తూనే నేర్చుకుంటూ ఒక్కో అడుగూ ముందుకు నడిచిన రైతు ఆమె. రసాయనాలు వాడకుండా పండించడం విశేషం. దేశవిదేశాల్లో, ముఖ్యంగా అమెరికా మార్కెట్లలోకి నేరుగా అడుగుపెట్టగలగడం అంతకంటే విశేషం. విదేశాల్లోనూ డోర్ డెలివరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. తెలుగు నేల గర్వించదగిన మహిళా రైతు ఆరిఫా రఫీ! ఆమెకు, ఆమెకు వెన్నుదన్నుగా ఉన్న కుటుంబానికి పవిత్ర రంజాన్ మాసంలో ‘సాక్షి సాగుబడి’ సగర్వంగా సలాం చెబుతోంది!!
ఆరిఫా.. హైదరాబాద్ నగరంలోనే పుట్టి పెరిగిన మహిళ. ఎమ్మే చదివారు. వ్యవసాయ నేపథ్యం లేదు. అయితే, కర్నూలు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన రఫీని పెళ్లాడి, దుబాయ్‌లో కొన్నాళ్లున్న తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ముగ్గురు సంతానం. అబ్బాయి.. తర్వాత ఇద్దరు అమ్మాయిలు. పిల్లలను చూసుకోవడం కోసం బ్యాంక్ పీవో ఉద్యోగాన్ని ఏడాదికే వదిలేశారు. అటువంటి పరిస్థితుల్లో పదేళ్ల క్రితం సేంద్రియ మామిడి సాగు వైపు దృష్టి సారించారు. ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో 21 ఎకరాలు కొని మామిడి నాటారు. చేవెళ్ల దగ్గర 20 ఎకరాల్లో కూడా దశల వారీగా మామిడి నాటారు. మామిడి తోటల సాగు పనుల వద్ద నుంచి దేశవిదేశాల్లో ఆన్‌లైన్ మార్కెటింగ్ పనుల వరకు ఆరిఫాయే స్వయంగా చూసుకుంటున్నారు. ప్రైవేటు టెలికం కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్న తన భర్త రఫీ పూర్తి సహాయ సహకారాలతోనే తాను రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఏఆర్4 ఆర్గానిక్ మాంగో ఫామ్స్ సీఈవో ఆరిఫా ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..
‘‘నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం వల్ల వ్యవసాయం తెలియదు. మా మామగారు రైతు. మా వారికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండేది. చేవెళ్ల దగ్గర భూమి కొన్నారు. డెయిరీ పెడదామనుకున్నా.. కుదరలేదు. తర్వాత ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో భూమి తీసుకున్నాం. మన యూనివర్సిటీ సైంటిస్టులను కలిస్తే.. ఆ భూమి పనికిరాదు.. సేంద్రియ సేద్యం సాధ్యం కాదు. తోటలకు సరిపడా నత్రజనిని అందించలేరన్నారు. తమిళనాడు, కర్ణాటక వ్యవసాయ అధికారులను కలిశాం. సేంద్రియ మామిడి తోటలు పెట్టమన్నారు. కొంచెం ఖరీదైనా పంచగవ్య వాడితే మంచి ఫలితాలు వస్తాయని ప్రోత్సహించారు. జీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ వాడుతున్నాం. బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నాం. యాదగిరిగుట్ట, చేవెళ్లలో కలిపి 41 ఎకరాల్లో మొత్తం 22 రకాల మామిడి రకాలు వేశాం. ఏటా కొన్ని ఎకరాల్లో మొక్కలు పెట్టాం. బంగినపల్లి 30“30, హిమాయత్ 24“24, దసేరి 18“18 అడుగుల దూరంలో నాటాం. ఏడాదికి కొన్ని ఎకరాల్లో తోటలు పెడుతూ వచ్చాం. హిమాయత్ అంటే ఇష్టం. ఎక్కువ మొక్కలు అవే పెట్టాం. మల్లాపూర్ తోటలో కేసర్, దసేరి బాగా వస్తున్నాయి. గత ఏడాది 18–20 టన్నుల మామిడి పండ్ల దిగుమతి వచ్చింది. చేవెళ్ల తోటలు లేతవి కావడంతో ఎక్కువగా మల్లాపూర్ తోట నుంచే దిగుబడి వస్తోంది. వర్షాలు, పూత, పిందె.. ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది దిగుబడి 40–50% తగ్గింది. జూన్ తొలి వారం వరకు కోస్తాం. 10–12 టన్నులు రావచ్చు.
మాకు 7 వేలకు పైగా కస్టమర్ బేస్ ఉంది. 1,500 మంది యాక్టివ్ కొనుగోలుదారులున్నారు. ఎక్కువ మంది హైదరాబాదీయులే. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైవాసులూ ఉన్నారు. మా వెబ్‌సైట్‌లో బుక్ చేసుకున్న వారికి దేశవ్యాప్తంగా ఆరేళ్లుగా డోర్‌డెలివరీ చేస్తున్నాం. అదేవిధంగా సింగపూర్, దుబాయ్‌తోపాటు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వినియోగదారులకూ మూడేళ్లుగా నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నాం. పండును చూడకుండా, ముట్టుకోకుండానే ఆన్‌లైన్‌లోనే విక్రయించడంలో తొలుత కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే, పండ్ల నాణ్యత విషయంలో రాజీలేని ధోరణే మాపై వినియోగదారులకు విశ్వాసాన్ని పెంచింది. గత ఏడాది 8 షిప్‌మెంట్స్ వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటికి 3 వెళ్లాయి.. మరో రెండు ఉంటాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఉద్యోగం వద్దనుకున్నాను. కానీ, తోటలు పెట్టడం ప్రారంభించినప్పుడు ఇంతస్థాయిలో ఆన్‌లైన్ మార్కెటింగ్/ షిప్‌మెంట్స్ చేయగలమని ఊహించలేదు! రెండో అమ్మాయి స్కూలింగ్ ఇప్పుడే పూర్తయింది. బొప్పాయి, మునగ, సీతాఫలాల గురించి కూడా ఆలోచిద్దామనుకుంటున్నాను. మా సంపాదనలో 2.5% బాలికా విద్యకు ఖర్చుపెడుతున్నాం..’’ అంటున్న ఆరిఫా రఫీకి సలాములు!
(0-9-9-1-23 40-4-04 www.ar4mangoes.com)
అమెరికాకు ఎగుమతి అవుతున్న మాంగో బాక్సులు, పిల్లలు, భర్త రఫీతో ఆరిఫా
Comments
Please login to add a commentAdd a comment