సాగుబడి: పండ్లతోట రక్షణకై..
పండ్ల తోటలు, కూరగాయ తోటలకు ముప్పుగా మారిన ప్రచండమైన ఎండ
అధిక ఉష్ణోగ్రతలతో పాటు తార స్థాయికి చేరిన లైట్ ఇంటెన్సిటీ, యు.వి. రేడియేషన్
మామిడి, జామ కాయలు పక్వానికి రాక ముందే ఎర్రగా మారి రాలిపోవటం లేదా నాణ్యత కోల్పోతున్నాయని వాపోతున్న రైతులు
రోజూ సాయంత్రం నీటిని, వారానికోసారి పోషకాలను చల్లమంటున్న ‘ఆంగ్రూ’ మాజీ డీన్ డా. పి.వి. రావు
ఈ వేసవిలో ఎల్‌నినో పుణ్యాన సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది.
47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7–8 గంటల వరకు శగలు కక్కుతూ ఉంది. దీన్నే ‘రిఫ్లెక్టెడ్ రేడియేషన్’ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండటం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి.
పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47–48 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్ బర్న్‌తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పీవీ రావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.
సాధారణంగా ఎండను రక్షణకు కొన్ని పంటలపై 50% సూర్యరశ్మిని ఆపే గ్రీన్ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. అయితే, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వల్ల 80% ఎండను ఆపే గ్రీన్ షేడ్‌నెట్‌లు వేసుకోవాల్సి వస్తోందని డా.పివి రావు అన్నారు.
సన్‌బర్న్‌కు గురైన మామిడి కాయ
సూర్యకాంతి తీవ్రత..
పంటలపై ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందన్నది ఉష్ణోగ్రతతో పాటు సూర్యకాంతి తీవ్రత (లైట్ ఇంటెన్సిటీ)పై కూడా ఆధారపడి ఉంటుందని డా. రావు వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో చదరపు మీటరుకు 20,000 – 25,000 కిలో లక్స్ వరకు సూర్యకాంతి ఉంటుంది. వేసవిలో సాధారణంగా ఇది 80,000 కిలో లక్స్‌కు పెరుగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఇది విపరీతంగా పెరిగి, ఏకంగా 1,20,000 కిలో లక్స్‌కు చేరటం పండ్ల తోటలకు, కూరగాయల పంటలకు ముప్పుగా మారిందని డాక్టర్ పి వి రావు తెలిపారు.
ఫొటో ఆక్సిడేషన్ వల్ల ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ సజావుగా జరగటం లేదు. లేత ఆకుల్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ చిట్లి పోవటం వల్ల ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగుకు మారి ఎండిపోతున్నాయన్నారు.
తారస్థాయికి చేరిన యువి రేడియేషన్..
అతినీలలోహిత కిరణాల (యువి) రేడియేషన్ సూచిక సాధారణంగా 3–4 వరకు ఉంటుంది. వేసవిలో ఈ సూచిక 8–9 వరకు పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఇది 12కు పెరగటంతో సూర్యరశ్మిని పంటలు, తోటలు తట్టుకోలేకుండా ఉన్నాయని డా. పి వి రావు వివరించారు. మామిడి, జామ తదితర కాయలు ఎండ పడిన చోట ఎర్రగా మారి దెబ్బతింటున్నాయి. వెనుక వైపు పచ్చిగానే ఉంటూ ఎండ సోకిన దగ్గర రంగు మారుతుండటంతో పండ్లు నాణ్యతను కోల్పోతున్నాయి. అల్ఫాన్సో, పచ్చడి రకాల మామిడి కాయలు బాగా రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
సన్‌బర్న్‌కు గురైన జామ కాయ, - సన్‌బర్న్‌కు గురైన డ్రాగన్ పంట
పోషకాలు, హార్మోన్ అసమతుల్యత..
వేసవిలో టొమాటో, మిర్చి వంటి కూరగాయ పంటల మొక్కలు నాటుకునేటప్పుడు వీటికి ఉత్తర, దక్షిణ వైపున నీడనిచ్చే మొక్కలను వేసుకుంటే ఎండ బారి నుంచి కొంత మేరకు కాపాడుకోవచ్చు. ఉదాహరణకు.. టొమాటో మొక్కలు ఉత్తర దక్షిణాల్లో మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలు వత్తుకోవాలి. వడగాలుల నుంచి పంటలను రక్షించుకోవటానికి పొలం సరిహద్దుల్లో విండ్ బ్రేకర్‌గా పనికొచ్చే ఎత్తయిన చెట్లు పెంచుకోవాలి. ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారి తోటలు ఉపశమనం పొందుతాయి.
దాదాపు మరో నెల రోజులు మండే ఎండలు కొనసాగే పరిస్థితి ఉండటంతో తోటలకు చాలినంతగా నీటి తడులు ఇవ్వటంతో పాటు, చెట్లపైన కూడా సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయాలి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ నేల నుంచి వేర్ల ద్వారా పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గుతుందని, అందుకు తగినట్లు నీరు, పోషకాలు సైతం అందిస్తే తోటలకు ఉపశమనం కలుగుతుందని డాక్టర్ పివి రావు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కాలంలో పంటలు పోషకాలను నేల నుంచి తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. జింక్ లోపం ఏర్పడుతుంది. హోర్మోన్లను కూడా చెట్లు, మొక్కలు తయారు చేసుకోలేవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.
ఎండ తీవ్రతకు రెస్పిరేషన్ రేటు ఎక్కువ అవటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం మొక్క/చెట్టు నిర్వహణకే సరిపోతాయి. పెరుగుదల లోపిస్తుంది. అదనపు పిండిపదార్థం అందుబాటులో వుండక పూలకు, కాయలకు పోషకాలను అందించలేని సంక్షోభ స్థితి నెలకొంటుంది. అందువల్ల పూలు, కాయలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది.
అతి వేడి వత్తిడి ఎదుర్కొంటున్న మామిడి తోటలపై జింక్, ΄్లానోఫిక్స్, బోరాన్‌లను సాయంత్రం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. టొమాటో, మిరప, వంగ తదితర కూరగాయ మొక్కలపైన నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్‌ను 5 లీటర్ల నీటికి 1.5 నుంచి 2 ఎం.ఎల్. మోతాదులో కలిపి పిచికారీ చేయాలని డా. రావు తెలిపారు.
అల్ఫాన్సో, పచ్చడి కాయలు 80% రాలిపోతున్నాయి..
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అల్ఫాన్సో, దేశీ పచ్చడి రకాల చిన్న కాయలు రాలిపోతున్నాయి. ఆర్గానిక్ మామిడి తోటల్లో గతంలో 10–20% రాలే కాయలు ఈ సీజన్‌లో 70–80% రాలిపోతున్నాయి. ఇతర రకాల్లో కూడా జనవరిలో వచ్చిన ఆఖరి పూత ద్వారా వచ్చిన చిన్న కాయలు ఎక్కువగా ఎండదెబ్బకు రాలిపోతున్నాయి. ఎండలు ముదిరే నాటికి నిమ్మకాయ సైజు ఉన్న కాయలకు ్రపోబ్లం లేదు.
సన్‌బర్న్ సమస్య వల్ల కాయలు ఒకవైపు అకాలంగా రంగుమారిపోతుంటే, వెనుక వైపు మాత్రం పచ్చిగానే ఉంటున్నాయి. బంగనిపల్లి పూత రాలిపోవటంతో ఈ ఏడాది 20% కూడా కాయ మిగల్లేదు. దశేరి కాపు మాత్రం అన్నిచోట్లా బాగుంది. మామిడి చెట్లకు రోజూ నీరు స్ప్రే చేస్తున్నాం. చెట్ల కింద మల్చింగ్ చేసి నీటి తేమ ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. ఇదిలాఉంటే, మధ్య్రపాచ్య దేశాల్లో యుద్ధం వల్ల నౌకల్లో వెళ్లే సరుకు విమానాల ద్వారా ఎగుమతి అవుతోంది. దీనికితోడు, దుబాయ్‌లో భారీ వరదల వల్ల అమెరికా తదితర దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి ఈ ఏడాది బాగా దెబ్బతింది.
గత 15 రోజుల్లో 350 ఎమిరేట్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఖతర్ తదితర దేశాల విమానాలు ధరలు పెంచేశాయి. అమెరికాకు కిలో మామిడి రవాణా చార్జీ రూ. 180 నుంచి 600కు పెరిగిపోయింది. అమెరికాలో 4 కిలోల మామిడి పండ్ల బాక్స్ గతంలో 40 డాలర్లకు అమ్మేవాళం. ఇప్పుడు 60–70 డాలర్లకు అమ్మాల్సివస్తోంది. దీంతో అమెరికాకు మామిడి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.
– రఫీ (98480 02221), సేంద్రియ మామిడి రైతు, ఎగుమతిదారు, ఏఆర్4మ్యాంగోస్, హైదరాబాద్
యు.వి. రేడియేషన్ పండ్లను దెబ్బతీస్తోంది!
అతి నీలలోహిత వికిరణాల (యు.వి. రేడియేషన్) తీవ్రత బాగా పెరిగిపోయి మామిడి, జామ పండ్లు ఎండదెబ్బకు గురవుతున్నాయి. యు.వి. రేడియేషన్ ఏప్రిల్ ఆఖరి, మే మొదటి వారాల్లో తీవ్రస్థాయికి చేరింది. యు.వి. ఇండెక్స్ ఇప్పుడు 12–13కి పెరిగిపోయింది. మామిడి, జామ వంటి పండ్ల తోటల్లో కాయలపై ఎండ మచ్చలు ఏర్పడుతూ పండ్ల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టొమాటోలు వంటి కూరగాయలపై కూడా ఈ ఎండ మచ్చలు సమస్యగా మారాయి.
ఎండ తగిలిన వైపు పండినట్లు రంగు మారుతుంది. వెనుకవైపు పచ్చిగానే ఉంటుంది. నాణ్యత కోల్పోయిన ఈ కాయలను కొయ్యలేక, చెట్లకు ఉంచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధిక వేడికి అనేక పోషకాలు అందక కొన్ని కాయలు రాలిపోతున్నాయి. యు.వి. రేడియేషన్ ఉద్యాన తోటల రైతులను ఈ ఏడాది చాలా నష్టపరుస్తోంది. నత్రజని కోసం ఫిష్ అమినో యాసిడ్ లేదా పంచగవ్యలను ద్రవజీవామృతంతో కలిపి చల్లాలి. బోరాన్ కోసం జిల్లేడు+ఉమ్మెత్త కషాయం, పోటాష్ కోసం అరటి పండ్ల (తొక్కలతో కలిపి తయారు చేసిన) కషాయాన్ని పిచికారీ చేయాలి. – ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం.
నీరు, పోషకాలు పిచికారీ చేయాలి..
విపరీత ఉష్ణోగ్రతలకు తోడైన వడగాడ్పులకు కూరగాయ తోటలు, పండ్ల తోటల్లో లేత ఆకులు మాడిపోతున్నాయి. ఉష్ణోగ్రత, అతినీలలోహిత వికిరణాలతో పాటు సూర్యరశ్మి తీవ్రత చాలా పెరిగిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయటం ద్వారా పంటలకు రక్షించుకోవచ్చు. వారం, పది రోజులకోసారి ఇంటిపంటలపై నానో యూరియా/ వర్మీవాష్ / జీవామృతం / ఆవు మూత్రంను ఒకటికి పది (1:10) పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకొని, అతి వేడి వత్తిడి నుంచి తోటలకు ఉపశమనం కలిగించాలి.
– డాక్టర్ పి.వి. రావు (94901 92672), రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్.
సేంద్రియ సేద్యం, వ్యాపార నైపుణ్యాలపై 6 రోజుల శిక్షణా శిబిరం..
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులను సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పటంతో పాటు.. సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార అవకాశాలను సృష్టించటంలో నిపుణులైన ఫెసిలిటేటర్‌గా మారడానికి నైపుణ్యం, విజ్ఞానాభివృద్ధి శిక్షణా కోర్సును నిర్వహించనుంది కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ. 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో విశేష కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు సారథ్యంలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో సకల వసతులతో కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ అంతర్జాతీయ స్థాయి వసతులతో ఇటీవలే ప్రారంభమైంది.
సేంద్రియ వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధనలు చేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయం, వ్యాపారం తదితర అంశాలపైప్రామాణికమైన శిక్షణ ఇవ్వటమే ఈ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ స్కిల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల తోడ్పాటుతో మే 22 నుంచి 27 వరకు తెలుగులో నిర్వహించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. రామాజంనేయులు తెలిపారు. గుగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థులు విధిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి. 30–35 మందికి మాత్రమే అవకాశం. ఇతర వివరాలకు.. 85002 83300.
ఇవి చదవండి: Women of My Billion: కలిసి నడిచే గొంతులు
Comments
Please login to add a commentAdd a comment