Biomedical
-
వ్యర్థాలతో అనర్థాలు.. చెత్తలోకి కాలం చెల్లిన మందులు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన మందులు.. ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి. వీటిని సక్రమంగా నిర్వీర్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. చాలామంది రిటెయిలర్లు ఎక్స్పెయిర్ అయిన మందుల్ని చెత్తలో వేస్తున్నారు. మందుల షాపులతో పాటు ఇళ్లల్లోంచి కూడా రకరకాల మాత్రలు, సిరప్లు, ఆయింట్మెంట్లు మునిసిపాలిటీ చెత్త డబ్బాలు లేదా మురుగు కాలువల్లో పడేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి వెలువడే ఫ్లూయిడ్స్‌ను.. ఎలాంటి సీవరేజీ ట్రీట్మెంట్ చేయకుండానే డ్రైనేజీలోకి వదులుతున్నారు. 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సిన మందులు డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతే అనేక దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. వాతావరణం, జలాలు కలుషితమవడంతో అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. హెపటైటిస్ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. మందులు కుళ్లిపోతే వచ్చే సమస్యలు యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోవడం వల్ల ఆ వ్యర్థాల నుంచి కొత్తరకం బ్యాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బ్యాక్టీరియా వల్ల కొత్తరకం జబ్బులు సోకుతున్నాయి. సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా ఈ జబ్బులు పూర్తిగా తగ్గడంలేదు. మందులు చెత్త కుప్పల్లో కుళ్లిపోవడం వల్ల వాయుకాలుష్యం తీవ్రమవుతోంది. గాలి ద్వారా వ్యాప్తిచెందే జబ్బుల ప్రభావం పెరుగుతోంది. భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి. ఈ నీటిని తాగడం వల్ల మనుషులతోపాటు జంతువులకు కూడా మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్–బి వంటి జబ్బులు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో రంగుల డబ్బాలు కాలం చెల్లిన మందులే కాదు.. ఆస్పత్రుల్లో ఉత్పన్నమయ్యే వివిధ రకాల బయో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలున్నాయి. వీటిని సేకరించడానికి కూడా ప్రత్యేక రంగులను నిర్ణయించారు. ఆయా వ్యర్థాలను నిర్దేశించిన రంగు ఉన్న డబ్బాల్లోనే వేయాలి. హ్యూమన్ అనాటమిక్ వేస్ట్: రోగినుంచి వచ్చిన బాడీ ఫ్లూయిడ్స్, డ్రెస్సింగ్ వేస్ట్, బ్యాగ్‌లు, రక్తంతో ఉన్న వేస్ట్, ఎక్స్‌పెయిరీ మందులు వంటివి. వీటిని పసుపు రంగు డబ్బాల్లో మాత్రమే వేయాలి. అనంతరం వీటిని అత్యధిక ఉష్ణోగ్రతలో నిర్వీర్యం చేయాలి. కంటామినేటెడ్ వేస్ట్: రోగి శరీరంలో అమర్చి ఆ తర్వాత పడేయాల్సిన ట్యూబ్‌లు, యూరినల్ బ్యాగ్స్, సిరంజిలు, నీడిల్స్ వంటివి. వీటిని ఎరుపురంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా మైక్రోవేవింగ్ హైడ్రోక్లావింగ్ పద్ధతుల్లోనే నిర్వీర్యం చేయాలి. ఇందులో కొన్ని రీసైక్లింగ్ చేసినవి రోడ్డు నిర్మాణంలో వాడతారు. వీటిని లైసెన్సు ఉన్న కాంట్రాక్టరుకే ఇచ్చి రీ సైక్లింగ్ చేయాలి. పదునైన పరికరాలు: నీడిల్స్, సిరంజిలు, నీడిల్ కట్టర్లు, బర్నర్లు, బ్లేడ్లు ఇలా ఏవైనా విషపూరితమైనవి, పదునైనవి. వీటిని లీకేజీలేని తెలుపు రంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా డ్రైహీట్ స్టెరిలైజేషన్ పద్ధతిలో కాల్చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి గుర్తింపు ఉన్న సంస్థ ద్వారా నిర్వీర్యం చేయాలి. గ్లాస్‌వేర్ వేస్ట్: విషపూరిత గాజు వస్తువులు, మందుల వయెల్స్, మెడిసిన్ వయెల్స్ వంటివి. వీటిని నీలం రంగు డబ్బాలో మాత్రమే సేకరించాలి. వీటిని తిరిగి ఉపయోగించాలంటే డిటర్జంట్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయాలి. బయో వ్యర్థాల నిర్వీర్యానికి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ►బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్ ఉండాలి. ►ఏ ఆస్పత్రిలో ఎంత బయో వ్యర్థాలు సేకరించిందీ కాంట్రాక్ట్ సంస్థ విధిగా వెబ్సైట్లో ఉంచాలి. ►వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. ►వారికి గ్లౌజులు, ఎన్–95 మాస్కులు ఉండేలా చూసుకోవాలి. ►ఆయా వ్యర్థాలను తీసుకెళ్లే సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పర్యవేక్షణ ఉండాలి ►వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి. ►సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి. కొత్త పాలసీ తీసుకొస్తాం ఎక్స్‌పెయిరీ మందులు చెత్తడబ్బాల్లోకి వెళ్లకుండా ఖచ్చితమైన నిర్వీర్య ప్రక్రియ చేపట్టేలా కొత్త పాలసీ తీసుకొస్తాం. దీనిపై వివిధ మాన్యుఫాక్చరింగ్, హోల్‌సేల్, రీటెయిలర్లతో మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం. – రవిశంకర్‌నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
ప్రభుత్వాస్పత్రులకు బయో మెడికల్ ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్ఇంజనీర్లను నియమించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కొత్త పోస్టుల మంజూరుపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంజీఎం సహా పెద్దాస్పత్రులకు ఒక్కో బయో మెడికల్ ఇంజనీర్ ఉండేలా చూడాలని భావిస్తోంది. రెండు జిల్లాలకు కలిపి ఒక అధికారిని నియమించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో భర్తీ చేసే అవకాశముంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అనుమతి రాగానే భర్తీ చేస్తామని ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30 వేల రకాల పరికరాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో థర్మామీటర్ మొదలుకొని ఎక్స్‌రే, ఈసీజీ, సీటీ స్కాన్, 2డీ ఎకో, టీఎంటీ, అల్ట్రా సౌండ్ మెషీన్, ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థ వంటివి అనేకం ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూల నిర్వహణ ఎంతో కీలకమైనవి. చిన్నా పెద్దా కలుపుకొని దాదాపు 30 వేల రకాల వైద్య పరికరాలు ఉంటాయి. రూ.వందల కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తే, చిన్న మరమ్మతు కారణంగా వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినా, వారు వచ్చి బాగుచేసే సరికి రోజులు గడుస్తున్నాయి. కొన్నిసార్లు నెలలు గడిచినా మరమ్మతులకు నోచుకోవట్లేదు. కొన్ని పరికరాలు తుక్కుగా మారుతున్నాయి. ఆయా మెషీన్లకు సంబంధించి పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగులకు సక్రమంగా వైద్యం అందట్లేదు. అల్ట్రా సౌండ్ లేదనో, 2డీ ఎకో లేదనో చెప్పి రోగులను పైస్థాయి ఆస్పత్రులకు పంపుతున్నారు. మరమ్మతుల ఆలస్యానికి చెక్.. రాష్ట్ర మౌలిక సేవలు, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. వైద్య పరికరాల నాణ్యతను పరీక్షించడం, వాటిని మరమ్మతుల్లో కీలకపాత్ర పోషించే బయో మెడికల్ ఇంజినీర్లు ముగ్గురే ఉన్నారు. వైద్య పరికరాలు చెడిపోతే కంపెనీ టెక్నీషియన్లు వచ్చి బాగు చేస్తారు. పరికరాల నిర్వహణకు సంబంధించి నిర్ణీత సమయం గడిచాక కంపెనీలకు వాటి మరమ్మతుతో సంబంధం ఉండదు. అలాంటి పరికరాలను థర్డ్ పార్టీకి చెందిన టెక్నీషియన్లు వచ్చి మరమ్మతు చేయాలి. అవి పాడైనట్లు బయో మెడికల్ ఇంజినీర్లు గుర్తించాలి. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో రోజుల తరబడి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో బయో మెడికల్ ఇంజినీర్లను నియమిస్తే తక్షణమే గుర్తించి కంపెనీ టెక్నీషియన్లను పిలిపిస్తారు. తద్వారా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఆలస్యానికి చెక్ పడనుంది. పైస్థాయి ఆస్పత్రులకు పంపుతున్నారు. మరమ్మతుల ఆలస్యానికి చెక్..: రాష్ట్ర మౌలిక సేవలు, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. వైద్య పరికరాల నాణ్యత పరీక్షించడం, మరమ్మతుల్లో కీలక పాత్ర పోషించే బయో మెడికల్ ఇంజనీర్లు ముగ్గురే ఉన్నారు. వైద్య పరికరాలు పాడైతే కంపెనీ టెక్నీషియన్లు వచ్చి బాగు చేస్తారు. పరికరాల నిర్వహణకు సంబంధించి నిర్ణీత సమయం గడిచాక కంపెనీలకు వాటి మరమ్మతుతో సంబంధం ఉండ దు. వాటిని థర్డ్ పార్టీ టెక్నీషియన్లు మరమ్మతు చేయాలి. అవి పాడైనట్లు బయో మెడికల్ ఇంజనీర్లు గుర్తించాలి. వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉండటంతో రోజుల తరబడి ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో బయో మెడికల్ ఇంజనీర్లను నియమిస్తే తక్షణమే గుర్తించి కంపెనీ టెక్నీషియన్లను పిలిపిస్తారు. తద్వారా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఆలస్యానికి చెక్ పడనుంది. -
కోవిడ్ బయో మెడికల్ వ్యర్థాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా పకడ్బందీ చర్యలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టి నిలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు దాదాపు రెండు టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు పోగవుతున్నాయి. వీటిని రాష్ట్రంలోని 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్ల ద్వారా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నారు. గత మార్చి 19 నుంచి ఇప్పటివరకు 281.8 టన్నుల వేస్టేజ్‌ను సేకరించి, నిర్వీర్యం చేసినట్లు పీసీబీ అధికారులు వెల్లడించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సందర్భంగా పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్–19 బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను పీసీబీ సిద్ధం చేస్తోంది. అన్ని రకాల కాలుష్య సమస్యలనూ అధిగమించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను కాల్చి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భారీగా జరిమానాలను విధించే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. (కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి రూ.25 లక్షలు) -
దేశవిదేశాల్లో డోర్ డెలివరీ!
ముగ్గురు బిడ్డల తల్లి ఆరిఫా రఫీ.. సేంద్రియ మామిడి సేద్యంలో కష్టానికి తగిన లాభాల కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్న అరుదైన మహిళా రైతు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సేంద్రియ సేద్యం చేస్తూనే నేర్చుకుంటూ ఒక్కో అడుగూ ముందుకు నడిచిన రైతు ఆమె. రసాయనాలు వాడకుండా పండించడం విశేషం. దేశవిదేశాల్లో, ముఖ్యంగా అమెరికా మార్కెట్లలోకి నేరుగా అడుగుపెట్టగలగడం అంతకంటే విశేషం. విదేశాల్లోనూ డోర్ డెలివరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. తెలుగు నేల గర్వించదగిన మహిళా రైతు ఆరిఫా రఫీ! ఆమెకు, ఆమెకు వెన్నుదన్నుగా ఉన్న కుటుంబానికి పవిత్ర రంజాన్ మాసంలో ‘సాక్షి సాగుబడి’ సగర్వంగా సలాం చెబుతోంది!! ఆరిఫా.. హైదరాబాద్ నగరంలోనే పుట్టి పెరిగిన మహిళ. ఎమ్మే చదివారు. వ్యవసాయ నేపథ్యం లేదు. అయితే, కర్నూలు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన రఫీని పెళ్లాడి, దుబాయ్‌లో కొన్నాళ్లున్న తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ముగ్గురు సంతానం. అబ్బాయి.. తర్వాత ఇద్దరు అమ్మాయిలు. పిల్లలను చూసుకోవడం కోసం బ్యాంక్ పీవో ఉద్యోగాన్ని ఏడాదికే వదిలేశారు. అటువంటి పరిస్థితుల్లో పదేళ్ల క్రితం సేంద్రియ మామిడి సాగు వైపు దృష్టి సారించారు. ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో 21 ఎకరాలు కొని మామిడి నాటారు. చేవెళ్ల దగ్గర 20 ఎకరాల్లో కూడా దశల వారీగా మామిడి నాటారు. మామిడి తోటల సాగు పనుల వద్ద నుంచి దేశవిదేశాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ పనుల వరకు ఆరిఫాయే స్వయంగా చూసుకుంటున్నారు. ప్రైవేటు టెలికం కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్న తన భర్త రఫీ పూర్తి సహాయ సహకారాలతోనే తాను రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఏఆర్4 ఆర్గానిక్ మాంగో ఫామ్స్ సీఈవో ఆరిఫా ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘‘నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం వల్ల వ్యవసాయం తెలియదు. మా మామగారు రైతు. మా వారికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండేది. చేవెళ్ల దగ్గర భూమి కొన్నారు. డెయిరీ పెడదామనుకున్నా.. కుదరలేదు. తర్వాత ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో భూమి తీసుకున్నాం. మన యూనివర్సిటీ సైంటిస్టులను కలిస్తే.. ఆ భూమి పనికిరాదు.. సేంద్రియ సేద్యం సాధ్యం కాదు. తోటలకు సరిపడా నత్రజనిని అందించలేరన్నారు. తమిళనాడు, కర్ణాటక వ్యవసాయ అధికారులను కలిశాం. సేంద్రియ మామిడి తోటలు పెట్టమన్నారు. కొంచెం ఖరీదైనా పంచగవ్య వాడితే మంచి ఫలితాలు వస్తాయని ప్రోత్సహించారు. జీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ వాడుతున్నాం. బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నాం. యాదగిరిగుట్ట, చేవెళ్లలో కలిపి 41 ఎకరాల్లో మొత్తం 22 రకాల మామిడి రకాలు వేశాం. ఏటా కొన్ని ఎకరాల్లో మొక్కలు పెట్టాం. బంగినపల్లి 30“30, హిమాయత్ 24“24, దసేరి 18“18 అడుగుల దూరంలో నాటాం. ఏడాదికి కొన్ని ఎకరాల్లో తోటలు పెడుతూ వచ్చాం. హిమాయత్ అంటే ఇష్టం. ఎక్కువ మొక్కలు అవే పెట్టాం. మల్లాపూర్ తోటలో కేసర్, దసేరి బాగా వస్తున్నాయి. గత ఏడాది 18–20 టన్నుల మామిడి పండ్ల దిగుమతి వచ్చింది. చేవెళ్ల తోటలు లేతవి కావడంతో ఎక్కువగా మల్లాపూర్ తోట నుంచే దిగుబడి వస్తోంది. వర్షాలు, పూత, పిందె.. ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది దిగుబడి 40–50% తగ్గింది. జూన్ తొలి వారం వరకు కోస్తాం. 10–12 టన్నులు రావచ్చు. మాకు 7 వేలకు పైగా కస్టమర్ బేస్ ఉంది. 1,500 మంది యాక్టివ్ కొనుగోలుదారులున్నారు. ఎక్కువ మంది హైదరాబాదీయులే. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైవాసులూ ఉన్నారు. మా వెబ్సైట్లో బుక్ చేసుకున్న వారికి దేశవ్యాప్తంగా ఆరేళ్లుగా డోర్‌డెలివరీ చేస్తున్నాం. అదేవిధంగా సింగపూర్, దుబాయ్‌తోపాటు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వినియోగదారులకూ మూడేళ్లుగా నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నాం. పండును చూడకుండా, ముట్టుకోకుండానే ఆన్లైన్లోనే విక్రయించడంలో తొలుత కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే, పండ్ల నాణ్యత విషయంలో రాజీలేని ధోరణే మాపై వినియోగదారులకు విశ్వాసాన్ని పెంచింది. గత ఏడాది 8 షిప్‌మెంట్స్ వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటికి 3 వెళ్లాయి.. మరో రెండు ఉంటాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఉద్యోగం వద్దనుకున్నాను. కానీ, తోటలు పెట్టడం ప్రారంభించినప్పుడు ఇంతస్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్/ షిప్‌మెంట్స్ చేయగలమని ఊహించలేదు! రెండో అమ్మాయి స్కూలింగ్ ఇప్పుడే పూర్తయింది. బొప్పాయి, మునగ, సీతాఫలాల గురించి కూడా ఆలోచిద్దామనుకుంటున్నాను. మా సంపాదనలో 2.5% బాలికా విద్యకు ఖర్చుపెడుతున్నాం..’’ అంటున్న ఆరిఫా రఫీకి సలాములు! (0-9-9-1-23 40-4-04 www.ar4mangoes.com) అమెరికాకు ఎగుమతి అవుతున్న మాంగో బాక్సులు, పిల్లలు, భర్త రఫీతో ఆరిఫా -
ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహనకు షార్ట్‌ఫిల్మ్‌లు!
సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్, బయోమెడికల్ తదితర వ్యర్థాలపై లఘు చిత్రాల (షార్ట్‌ఫిల్మ్స్) ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వినాయకచవితి, దీపావళి పండుగల సందర్భంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు మట్టి గణపతుల వినియోగం, బాణాసంచా వాడకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తోంది. ప్లాస్లిక్, ఇతర వ్యర్థాలపై కూడా షార్ట్‌ఫిల్మŠస్, మీడియా, తదితర రూపాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. వ్యర్థాలకు సంబంధించి కేంద్రం రూపొందించిన నిబంధనలను కూడా లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయనుంది. ప్లాస్టిక్ ‘బ్యాగుల’ ఉత్పత్తిపై నియంత్రణ.. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను 50 మైక్రాన్లకు తగ్గకుండా ఉండేలా ప్రమాణాలను పాటించేలా తయారీ దశలోనే నియంత్రణ ఉండేలా చూడాలని నిర్ణయించింది. కిందిస్థాయిలో దీని అమలు పర్యవేక్షణను స్థానిక సంస్థలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న క్యారీబ్యాగులు వస్తున్నట్లు సైతంఅధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 కామన్ బయో–మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ (సీబీఎండబ్ల్యూటీఎఫ్) పనిచేస్తుండగా, బయోమెడికల్ వేస్ట్‌ను తరలించే వాహనాలకు జీపీఎస్ ద్వారా అనుసంధానించి ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలోనూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ–వేస్ట్ సేకరణ, ధ్వంసం చేసే కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగవుతుండటంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. -
నగరంలో బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్
రూ. 338.58 కోట్లతో జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు సాక్షి, న్యూఢిల్లీ: వైద్య పరిశోధనలకు ఉపయోగపడే జంతువుల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా 'నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్'ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య పరిశోధన విభాగం పంపిన ఈ ప్రతిపాదనకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధనల మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో రూ. 338.58 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 2018-19 నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పే ఈ తరహా కేంద్రం దేశంలోనే మొదటిది. ఈ పరిశోధన కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీనోమ్ వ్యాలీలో 102.69 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించింది. 'కొత్తవలస-కోరాపుట్ డబ్లింగ్'కు ఆమోదం: కొత్తవలస-కోరాపుట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల ప్రతిపాదనలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 189.278 కి.మీ. పొడవైన ఈ మార్గంలో రూ. 2977.64 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ పనులు చేపడ్తారు. దీనివల్ల ఆయా ప్రాంతాల మధ్య సరుకు రవాణా సులభతరమవడంతో పాటు రైల్వే ఆదాయం పెరుగుతుంది. ఈ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తవుతాయని సీసీఈఏ పేర్కొంది.