వరి పొలాల్లో అంతరపంటలుగా గోనె సంచుల్లో కూరగాయల సాగుకు అవకాశం
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో
పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయం
అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి
హెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా
30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చు
ఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడి
సార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్‌పుర్‌లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.
పదేళ్ల పరిశోధన
2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్‌ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.
గోనె సంచుల్లో సాగు ఎలా?
ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్‌తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.
హెక్టారుకు 3 వేల మడులు
95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు.
నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది.
– డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త,
సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),
బారక్‌పుర్, పశ్చిమ బెంగాల్.
Comments
Please login to add a commentAdd a comment