ICAR
-
తెగుళ్లు.. వైరస్లు ఇట్టే పసిగట్టొచ్చు
ఏపీ స్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం జాతీయ పురుగు–తెగుళ్ల నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచి్చంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సహకారంతో డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజ్ (డీపీపీక్యూఎస్), జాతీయ సమీకృత తెగుళ్ల నిర్వహణ కేంద్రాలు (ఎన్‌సీఐపీఎం) అభివృద్ధి చేసిన నేషనల్ ఫెస్టి సర్వలెన్స్ సిస్టమ్ (ఎన్పీఎస్ఎస్)ను జాతీయ స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. – సాక్షి, అమరావతిఎలా పనిచేస్తుందంటేగూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్పీఎస్ఎస్.డీఏఎస్.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రెండు రకాల మాడ్యూల్స్‌లో సేవలందుతాయి. తొలుత పెస్ట్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్ కింద రైతులు తమ పంటలకు సోకిన చీడపీడలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేస్తే అవసరమైన సలహాలు, సూచనలు క్షణాల్లో ఫోన్లో ప్రత్యక్షమవుతాయి. రెండోది పెస్ట్ సర్వలెన్స్ మాడ్యూల్ కింద ప్రతి జిల్లాలో స్మార్ట్ ఫోన్ వాడే 10 మంది ఆదర్శ రైతులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. పెస్ట్ సర్వలెన్స్‌లో భాగంగా క్వాలిటీ సర్వలెన్స్ కింద సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ (సీఐపీఎంసీ) సహకారంతో వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులు, కేవీకే, యూనివర్సిటీ శాస్త్రవేత్తలకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఏ పంటలో ఏ తెగులు ఉధృతంగా వ్యాపిస్తుందో రియల్ టైమ్‌లో గుర్తించి, తగిన సలహాలు, సూచనలను రైతులకు చేరవేస్తారు. దీనిని జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించేందుకు అవకాశం కల్పించారు.రైతులకు నేరుగా యాప్ సేవలు క్వాలిటేటివ్ సర్వలెన్స్ కింద రైతులకు ఎలాంటి యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేకుండా యాప్‌ను వినియోగించుకునేలా శిక్షణ ఇస్తారు. క్షేత్రాలకు వెళ్లి ఫొటో అప్లోడ్ చేసి, వైరస్ ఉధృతి తీవ్రతను తెలియజేస్తే ఏఐ ఆధారితంగా జాతీయ స్థాయిలో 61, ఏపీలో 15 ప్రధాన పంటలు సాగు చేసే రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తారు. ఏదైనా పంటకు ఓ ప్రాంతంలో పెద్దఎత్తున వైరస్ సోకినట్టుగా గుర్తిస్తే వెంటనే సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తారు. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలతో అధ్యయనం చేసి సామూహికంగా చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం, భవిష్యత్‌లో ఈ తెగుళ్లు, వైరస్‌లను తట్టుకునే నూతన వంగడాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన పరిశోధనలు చేసేందుకు చేయూతనిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా సేవలందించేందుకు 60 మంది ఆదర్శ రైతులు, 52 మంది అధికారులను ఎంపిక చేశారు. వీరికి త్వరలో పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఐసీసీ కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు క్రాప్లైట్ సిస్టమ్ (సీఎల్సీ) యాప్‌ను ఎన్పీఎస్ఎస్ యాప్‌తో అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఐసీసీ ద్వారా సస్యరక్షణ చర్యలు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ (ఐసీసీ) ద్వారా గడచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే తరహా సేవలందించింది. పంటల వారీగా రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి పంటలకు సోకే తెగుళ్లు, చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సంబంధిత శాస్త్రవేత్తల ద్వారా అవసరమైన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఐసీసీ ద్వారా ఇప్పటికీ అందుతున్నాయి. తెగుళ్లు, వైరస్ల తీవ్రతను బట్టి వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందాలను రంగంలోకి దింపి అధ్యయనం చేయడం.. ఆర్బీకేల ద్వారా సామూహిక సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇలా ఐదేళ్లుగా ఐసీసీ కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు సర్వత్రా ప్రశంసలందుకుంటున్నాయి. -
వరిలోనే గోనె సంచుల్లో కూరగాయల సాగు!
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయంఅధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడిహెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా 30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చుఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడిసార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్పుర్లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.పదేళ్ల పరిశోధన2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.గోనె సంచుల్లో సాగు ఎలా?ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్‌తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.హెక్టారుకు 3 వేల మడులు95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. – డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),బారక్‌పుర్, పశ్చిమ బెంగాల్. -
మంచి వ్యవసాయం పద్ధతులే మేలు!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పురుగుమందులను తగుమాత్రంగా వినియోగిచడంతో పాటు పోషక విలువలతో కూడిన అధిక పంట దిగుబడులు తీసేందుకు మంచి వ్యవసాయ పద్ధతుల (గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్- జిఎపి)ను అనుసరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అనుగుణమైన కొత్త సాంకేతికతలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సస్యరక్షణ, జీవభద్రత) డాక్టర్ ఎస్.సి. దూబే పిలుపునిచ్చారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్ఎయు ఆడిటోరియంలో ‘సస్యరక్షణ యాజమాన్యంలో నవ్యత, సుస్థిరత’ అనే అంశంపై నాలుగు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో డా. దూబే గౌరవ అతిథిగా పాల్గొన్నారు. భారతీయ సస్యరక్షణ శాస్త్రవేత్తల సంఘం (పిపిఎఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ఈ సమావేశంలో డా. దూబే ప్రసంగిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు, తెగుళ్ల తీరుతెన్నుల్లో కూడా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పురుగుమందుల వాడకాన్ని కనిష్టస్థాయికి తగ్గించే సరికొత్త సాంకేతికతలపై పరిశోధనలు చేపట్టాలన్నారు. నాణ్యమైన పరిశోధనా పత్రాల ద్వారా శాస్త్రవేత్తలు వ్యవసాయాభివృద్ధికి దోహదం చేయాలన్నారు. పాలకులు విధానాల రూపుకల్పనకు నేరుగా ఉపయోగపడేలా స్పష్టమైన సిఫారసులు అందించే శాస్త్రవేత్తల సదస్సుల వల్ల ప్రయోజనం చేకూరుతుందని డా. దూబే సూచించారు. జ్యోతిప్రజ్వలనం చేస్తున్న పిజెటిఎస్ఎయు ఉపకులపతి ఎం. రఘునందనరావు. చిత్రంలో ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి డా. ఆర్. శారద జయలక్ష్మి దేవి తదితరులు. ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ కులపతి, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. రఘునందనరావు ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణలు, సాంకేతికతలు ఏవైనా ఆహార భద్రత విషయంలో రాజీలేని రీతిలో ఉండాలన్నారు. భూసార క్షీణత, నీటికాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కొనేలా ప్రెసిసెషన్ అగ్రికల్చర్ పద్ధతులపై పరిశోధనలు చేపట్టాలని రఘునందనరావు శాస్త్రవేత్తలను కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీ దేవి ప్రసంగిస్తూ వాతావరణ మార్పులకు తోడు రసాయనిక ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల పంటలతోపాటు మానవులు, పర్యావరణ ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందన్నారు. సస్యరక్షణలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే పద్ధతులు, సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవగాహన కొరవడటంతో 50% రైతులు నకిలీ పురుగుమందులను కొనుగోలు చేసి నష్టపోతున్నారని, అధికారులు చట్టబద్ధంగా నకిలీలను అరికట్టడంలో తాత్సారం చేస్తున్నారని ధనూక అగ్రిటెక్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.జి. అగర్వాల్ అన్నారు. ఇంకా ఈ సదస్సులో జాతీయ జీవవైవిధ్య బోర్డు చైర్మన్ డా. అచలేంద్ర రెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టరబి. శరత్‌బాబు, శ్రీబయోటెక్ ఈస్థటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో డా. కెఆర్కె రెడ్డి, పిజెటిఎస్ఎయు మాజీ కులపతి డా. ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. పలువురు శాస్త్రవేత్తలకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. (చదవండి: సహకార స్వర్ణయుగం రానుందా?!) -
వేప తెగులు స్వల్పకాలికమే
సాక్షి, సాగుబడి డెస్క్ :వాతావరణంలో, వర్షపాతంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులే వేప చెట్లకు శాపంగా మారినా, దీని వల్ల వేప కాయల ఉత్పత్తికి విఘాతం కలగటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రాథమిక అధ్యయనంలో నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేప చెట్ల చిగుర్లు మాడిపోతుండటం, మరికొన్ని చోట్ల చెట్లు నిలువునా ఎండిపోతుండటం గత కొన్నేళ్లుగా రివాజుగా మారిన విషయం తెలిసిందే. టీ మస్కిటో పురుగు (టిఎంబి) సోకటం వల్ల కొన్ని నెలల పాటు (మే–సెప్టెంబర్) వేప చెట్ల కొమ్మలు ఎండిపోతూ.. తిరిగి వాటికవే తిప్పుకుంటున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన తర్వాత తగ్గిపోయే సమస్యేనని, దీని వల్ల వేప కాయల దిగుబడికి పెద్దగా నష్టం లేదని ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసీఏఆర్– కేంద్రీయ ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ (సిఎఎఫ్‌ఆర్‌ఐ–కాఫ్రి) సంచాలకులు డా. ఎ. అరుణాచలం వెల్లడించారు. అయితే, క్రిమిసంహారక స్వభావం కలిగిన వేపను టిఎంబి గతమెన్నడూ లేనంతగా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆశిస్తోందన్న అంశంపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. గాలిలో అధిక తేమ వల్లనే పురుగు ఉధృతి ఆగ్రోఫారెస్ట్రీపై జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి సాగుబడి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మే నుంచి అకాల వర్షాలు, వర్షపాతంలో అసాధారణ మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల్లో గాలిలో తేమ అధికంగా ఉండటం మూలంగా ట్రీ మస్కిటో పురుగు ఉధృతి పెరుగుతోందన్నారు. తెలంగాణలో కూడా కనిపించడం విచిత్రమే సముద్ర తీర రాష్ట్రాల్లో ఇది ప్రధాన సమస్యగా ఎదురవుతున్నదని, కానీ తెలంగాణలో కూడా ఇది తీవ్రంగా కనిపిస్తుండటం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన. 96 దేశాల్లో వేప చెట్లు పెరుగుతున్నాయని, అయితే, టీ మస్కిటో పురుగు సోకుతున్నట్లు చైనా తప్ప మరే దేశమూ వెల్లడించలేదన్నారు. గాలి ద్వారానే టిఎంబి విస్తరిస్తోందని, ఒక ప్రదేశంలో దగ్గర దగ్గరగా ఉన్న చెట్లకు ఎక్కువగా సోకుతోందని, ఇది మనుషులకు హానికరం కాదని డా. అరుణాచలం అన్నారు. ఇలా అరికట్టవచ్చు పొటాషియం లోపించిన నేలల్లో పెరుగుతున్న వేప చెట్లకు టీఎంబీ ఎక్కువగా సోకుతున్నట్లు కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. పొటాషియం పుష్కలంగాఉన్న నేలల్లో చెట్లకు పెద్దగా సోకలేదు. పశువుల ఎరువులో ట్రైకోడెర్మా విరిడి కలిపి వేపచెట్లకు వేస్తే కొమ్మెండు సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చని డా. అరుణాచలం వివరించారు. -
సుస్థిర వ్యవసాయంతోనే ఆహార భద్రత
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రానున్న సంవత్సరాల్లో భారత్‌లో ఆహార సంక్షోభం తలెత్తనుందా? దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధ్యం కావడం లేదా? కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సుస్థిర వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నాయా? అలా వెళ్తున్న రాష్ట్రాలు ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయా? సుస్థిర వ్యవసాయానికి మొత్తం 51 సూచికలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనం తర్వాత సుస్థిర వ్యవసాయం సాధించలేని పక్షంలో ఆహార భద్రత కష్టమేనని అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐకార్) అభిప్రాయపడుతోంది. ‘కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చర్ సస్టైనబులిటీ’పేరిట దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానా లను ఐకార్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రేమ్‌చంద్, కిరణ్‌కుమార్‌లు పరిశీలించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఐకార్ ఈ అభిప్రాయానికి వచ్చింది. వ్యవసాయ విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ సుస్థిరతకు సవాళ్లు ‘వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, తీవ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, భూసారం తగ్గిపోవడం వ్యవసాయ సుస్థిరతకు పెనుసవాలుగా మారుతోంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఆ జనాభాకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత సాగు రంగంపై ఉంది. కొన్ని రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. వ్యవసాయ సుస్థిరత సూచీలకు వచ్చేస రికి వెనుకబడుతున్నాయి..’అని ఐసీఏఆర్ వెల్లడించింది. పంజాబ్, హరియాణ సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ.. వ్యవసాయ సుస్థిరత సూచీని పరిశీలించినప్పుడు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. భారత వ్యవసాయ రంగం సుస్థిరత కోణంలో ఉన్నత స్థానంలో లేదని ఓ మోస్తరు సుస్థిరతతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వాలుసహకరించాలి.. ‘సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూచికలైన అతి తక్కువ నీరు,రసాయనాలు, ఎరువులు,విద్యుత్ వినియోగిస్తూ, భూసారం తగ్గకుండా పంటలు పండించే రైతాంగానికి ప్రభుత్వాలు సరైన సమయంలో సాయం అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్‌లో ఆహార భద్రతకు ఇబ్బందులు రావు. ప్రస్తుతం మిజోరం, కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్ మాత్రమేసుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులుఎదుర్కొనే రాజస్తాన్ సుస్థిరవ్యవసాయంలో చివరలో ఉంది..’ అని ఐకార్ నివేదిక తెలిపింది. సుస్థిర వ్యవసాయానికి 51 సూచికలు సుస్థిర వ్యవసాయాభివృద్ధికి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఐకార్ వెల్లడించింది. సారవంతమైన నేలలు, నీటి వనరులు, జీవ వైవిధ్యం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమతుల్యత తదితర సూచికలు ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, హరియాణాతోపాటు వరి పండించే జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు ఐకార్ వివరించింది. ఇక్కడ వ్యవసాయ విధానాల్లో మార్పులు అత్యావశ్యమని హెచ్చరించింది. పంటల మార్పిడి, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంట రుణాలు, నీటి వనరుల కల్పన తదితరాలతో సుస్థిర వ్యవసాయం సాధ్యమంది. అధిక ఇన్పుట్ సబ్సిడీల నుంచి పద్ధతి ప్రకారం రైతులకు లబ్ధి చేకూరే విధానాలు రావాల్సి ఉందని తెలిపింది. భూములు సారవంతంగా లేని చోట రసాయన ఎరువుల వాడకం పెరుగుతోందని, దీనివల్ల భూమిలో ఆర్గానిక్ కార్బన్ తగ్గుదల చోటు చేసుకుంటోందని వివరించింది. దేశంలో ఓ మాదిరి సుస్థిరతే.. సుస్థిర వ్యవసాయంలో 0 నుంచి 1ని ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో సరాసరిన 0.50 నమోదు అవుతోందని, ఇది ఓ మాదిరి సుస్థిరత మాత్రమేనని ఐసీఏఆర్ తేల్చింది. 0ను అధ్వానంగా పేర్కొంటే, 1ని అత్యుత్తమంగా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలు జాతీయ సగటును మించి ఉన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో భూ గర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, భూగర్భ జలాలు 40 సెంటీమీటర్ల మేరకు వేగంగా పడిపోయాయని ఐకార్ పేర్కొంది. ఇక పర్యావరణ సుస్థిరతలో కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరాఖండ్‌లు మెరుగైన పనితీరును కనపరుస్తున్నట్లు తెలిపింది. ఇందులో అస్సాం, మణిపూర్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ అధ్వానంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చాలా తక్కువ పరిమాణంలో ఉందని, గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. వాణిజ్య పంటలున్నా ఏపీ భేష్ సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం అభినందనీయం. మిజోరం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు తక్కువగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తున్నా.. రసాయన ఎరువులు, నీరు తక్కువ వినియోగం, భూసారాన్ని పెంపొందించేలా చేయడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించింది. సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులను ఆదుకుంటే దేశ ఆహార భద్రతకు వచ్చే ముప్పేమీ ఉండదు. -
ఐసీఏఆర్‌తో అమెజాన్ ఒప్పందం.. ప్రయోజనాలివే!
న్యూఢిల్లీ: కిసాన్ స్టోర్‌లో నమోదు చేసుకున్న రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడంలోనూ, అధిక దిగుబడులు.. ఆదాయం పొందడంలో తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. పుణేలోని ఐసీఏఆర్–కృషి విజ్ఞాన్ కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఊతంతో తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించినట్లు అమెజాన్ తెలిపింది. ఐసీఏఆర్ డిప్యూటీ జనరల్ యూఎస్ గౌతమ్, అమెజాన్ ఫ్రెష్ సప్లై చెయిన్..కిసాన్ విభాగం ప్రోడక్ట్ లీడర్ సిద్ధార్థ్ టాటా ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఐసీఏఆర్ అభివృద్ధి చేసే అధునాతన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరువ చేసేందుకు ఇరు సంస్థలు కృషి చేస్తాయి. అలాగే, రైతులు తమ ఆదాయాలను పెంచుకునేందుకు ఉపయోగపడే మెరుగైన సాగు విధానాలను కిసాన్ వికాస్ కేంద్రాల్లో (కేవీకే) ప్రదర్శిస్తాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు కావాల్సిన శిక్షణ, సహాయాన్ని అమెజాన్ అందిస్తుంది. తద్వారా రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానిస్తుంది. 2021 సెప్టెంబర్‌లో అమెజాన్ తమ ప్లాట్ఫామ్లో ’కిసాన్ స్టోర్’ సెక్షన్‌ను ప్రారంభించింది. ఇందులో షాపింగ్ ద్వారా వ్యవసాయానికి అవసరమైన ముడి వనరులను రైతులు ఇంటి దగ్గరే అందుకోవచ్చు. -
రైతులకు అండగా వ్యవసాయ పరిశోధనలు
రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): వ్యవసాయ పరిశోధనలు రైతులకు అండగా నిలుస్తున్నాయని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐసీఏఆర్) శాస్త్రవేత్త డాక్టర్ కె.క్రాంతి అన్నారు. పంటల్లో నెమటోడ్స్(నులిపురుగులు) నివారణపై పరిశోధనలు చేస్తున్న ఆమె.. ఆలిండియా కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రంపచోడవరం మండలం పెదపాడులో డాక్టర్ వైఎస్సార్ హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్–కొవ్వూరు నిర్వహించిన ‘ఉద్యాన పంటలను ఆశించే నులిపురుగుల నివారణ అవగాహన’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాల్లో మినహా మిగతా అన్ని చోట్లా నెమటోడ్స్‌పై పరిశోధన సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 1977 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో సర్వే చేసి హాట్స్పాట్లను గుర్తించి.. వాటి నివారణకు కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు పంటలను పట్టిపీడిస్తున్న నెమటోడ్స్ నివారణకు 200 రకాల విధానాలను ఆవిష్కరించినట్లు వెల్లడించారు. నెమటోడ్స్‌తో భారీగా నష్టం.. నెమటోడ్స్ మొక్కల వేర్లపై బుడిపెలుగా వస్తాయని.. ఇవి మొక్క పై భాగానికి నీరు వెళ్లకుండా అడ్డుకుంటాయని వివరించారు. దీంతో మొక్కలు ఎండిపోతాయని తెలిపారు. ఉద్యాన పంటల్లో రూట్ నెమటోడ్స్ ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పాలీహౌస్, షెడ్ నెట్లలో పెంచే కూరగాయ పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతోందని చెప్పారు. పంజాబ్, హరియాణా, జమ్మూ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో రైతులు రూ.కోట్లు నష్టపోయారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో నెమటోడ్స్ వల్ల 90 శాతం పంట నష్టం జరుగుతుండగా.. ఏపీ, తెలంగాణలో నష్టం 10 శాతంగా ఉందని చెప్పారు. వీటిని నివారించాలంటే.. ఉత్తర భారతదేశంలో అయితే మే, జూన్ నెలల్లో, దక్షిణ భారతదేశంలో ఏప్రిల్, మే నెలల్లో పాలీహౌస్‌లలో కొద్దిగా తడి ఉండేలా 25 మైక్రాన్ మందం కలిగిన పాలిథిన్ కవర్లు పరచాలని సూచించారు. రెండు కేజీల బయో ఏజెంట్, పది గ్రాముల ఎఫ్ఐఎం పిచికారీ చేసి పాలీహౌస్ను మూసివేయాలన్నారు. క్రాప్‌కు ముందు రెండు నెలలపాటు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పంట మారి్పడి, కూరగాయల పంట మధ్యలో పూల మొక్కలు నాటడం ద్వారా కూడా వీటిని అడ్డుకోవచ్చన్నారు. -
GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా?
ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు కనుక్కోవడంతోనే సైన్స్ ప్రస్థానం మొదలవు తుందని మా సైన్స్ టీచర్ చెబుతూండేది. ఇంకోలా చెప్పాలంటే... సైన్స్ ఎల్లప్పుడూ ప్రశ్నలకు సిద్ధంగా ఉంటుందీ అనాలి! దీనివల్ల సాంఘిక, ఆర్థిక ఆందోళనలకు తావిచ్చే, పర్యావరణ విధ్వంసానికి దారితీసే అపోహలను తొలగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై వ్యాఖ్యానం చేయవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కారణంగా సత్యాన్వేషణ తాలూకూ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రదర్శించే సాక్ష్యాలు కూడా నమ్మదగ్గవిగా ఉండవు. విషయం ఏమిటంటే... జన్యుమార్పిడి పంటలపై ఎప్పుడు చర్చ మొదలైనా, సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లాలని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూంటారు. తద్వారా శాస్త్రీయ సమాచారం, వాదం, ప్రజా విచారణలన్నీ పక్కకు తొలగిపోయేలా చేస్తూంటారు. దేశంలోకి మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటీ కాటన్‌ను 2001లో వాణిజ్యస్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో జరిగిన జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సమావేశాల్లో పాల్గొన్న వారిలో నేనూ ఉన్నాను. జన్యుమార్పిడి పంటల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ఈ జీఈఏసీ సభ్యులతోపాటు, ‘జెనిటిక్ మ్యానిపులేషన్ అండ్ ద మానిటరింగ్ కమిటీ’కి సంబంధించిన పర్యవేక్షణ బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. బీటీ పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసిన మహికో – మోన్శాంటో సభ్యులు, కొంతమంది పౌర సమాజపు ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. రెండు నెలలు ఆలస్యంగా నాటినా ఆ ఏడాది పత్తి పంట దిగుబడి యాభై శాతం ఎక్కువైనట్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోందని సమావేశంలో ప్రస్తావించారు. బీటీ కాటన్ కారణంగానే ఇలా జరిగిందనడంతో ఆశ్చర్యం వేసింది నాకు. ఆ సమాచారం తప్పనీ, అశాస్త్రీయమైందనీ, దాన్ని ఏదైనా పరిశోధన సంస్థతో నిర్ధారించాలనీ నేను పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, అప్పటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్‌ను కోరాను. సాధారణ పరిస్థితుల్లో ఎదిగేందుకు ఐదు నెలల సమయం తీసుకునే పంటలో రెండు నెలలు ఆలస్యంగా విత్తినా అధిక దిగుబడి సాధించడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ పరి శోధనల్లో విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైన అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి మినహాయింపు ఇస్తే, భవిష్యత్తులో యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కూడా విత్తిన సమయం గురించి పట్టించుకోవద్దని చెప్పే అవకాశం ఏర్పడుతుంది. జీఈఏసీ ఛైర్మన్‌కు నేను వేసిన ప్రశ్న ఏమిటంటే– రెండు నెలలు ఆలస్యంగా విత్తినా దిగుబడి పెరగడ మంటే... అది రైతులకు చాలా ప్రయోజనకరమైంది కాబట్టి, రైతులందరూ రెండు నెలలు ఆలస్యంగా విత్తుకోవాలని ఎందుకు సలహా ఇవ్వకూడదూ? అని! ఈ సమావేశం పూర్తయిన తరువాత సాయంకాలం ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు నాతో మాట్లాడుతూ, బీటీ విత్తనాల ట్రయల్స్ ఇంకో ఏడాది చేయాల్సిందిగా మహికో–మోన్శాంటో కంపెనీని కోరినట్లు తెలిపారు. అవసరమైనంత మేర అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు మోన్శాంటో చెప్పినా జన్యుమార్పిడి పంటల అనుమతిని ఒక ఏడాది ఆలస్యం చేయగలిగామన్నమాట. ఆ సమావేశంలో ప్రశ్నలేవీ వేయకుండా ‘సాక్ష్యాల’ ఆధారంగా అనుమతులిచ్చి ఉంటే ఏడాది ముందుగానే జన్యుమార్పిడి పంటలు దేశంలోకి వచ్చేసి ఉండేవి. బీటీ వంకాయపై నిషేధం దేశంలోకి బీటీ వంకాయ అనుమతిని నిరాకరిస్తూ 2010లో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటన చేశారు. ‘డెసిషన్ ఆన్ కమర్షియలైజేషన్ ఆఫ్ బీటీ బ్రింజాల్(బీటీ వంకాయ వాణిజ్యీకరణ మీద నిర్ణయం)’ పేరుతో అప్పట్లో 19 పేజీల డాక్యుమెంట్ ఒకటి విడుదలైంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా నా అంచనా ప్రకారం ప్రతి వృక్ష శాస్త్రవేత్తా కచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్ అది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలతో, ఏడు దఫాలుగా ప్రజలతో సంప్రదింపుల తరువాత జైరామ్ రమేశ్ ఆ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. జన్యుమార్పిడీ టెక్నాలజీపై రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశం మొత్తమ్మీద వంకాయ పండించే ప్రాంతాల్లో సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. జాగరూకత, ముందస్తు జాగ్రత్త, సిద్ధాంతాల ఆధారంగా జైరామ్ రమేశ్ ఒక నిర్ణయం తీసుకుంటూ... ఏ కొత్త టెక్నాలజీ అయినా ఆయా సముదాయాల సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మీడియాలో ఒక వర్గం జన్యుమార్పిడి పంటలపై బహిరంగ విచారణను తోసిపుచ్చింది. అంతా బూటకం అని కొట్టి పారేసింది కూడా. అయితే ప్రజలు లేవనెత్తిన కీలకమైన అభ్యంతరాలను మంత్రి గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఆనందం కలిగించింది. అంతేకాదు... జన్యుమార్పిడి విత్తన సంస్థల అధ్యయనాల నియమాలు, సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ఫలితాలన్నింటినీ ప్రస్తావిస్తూ డాక్యుమెంట్‌ను రూపొందించడమూ ప్రశంసనీయమైన అంశం. జాగరూకతతోనే ముందుకు వాస్తవ పరిస్థితులకూ, కొందరు సేకరించే సాక్ష్యాలకూ మధ్య ఉన్న అంతరం సైన్స్ ఆధారిత పద్ధతుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. శాస్త్రపరమైన విచారణను పరిమితం చేయడం మార్కెట్ పోకడల్లో ఒకటి. వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లు సైన్స్‌ను తొక్కేసేందుకూ ప్రయత్నిస్తూంటాయి. జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. ఈ డీఎంహెచ్–11 జన్యుమార్పిడి ఆవాల పంట దిగుబడి సామర్థ్యం ఎంతన్నది ఐసీఏఆర్‌కూ తెలియక ముందే పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. దేశ వంటనూనె దిగుమతులను ఈ సరికొత్త ఆవాల ద్వారా తగ్గించుకోవచ్చు అన్న భావనను కలిగిస్తున్నారు. అయితే దీని దిగుబడి చాలా తక్కువ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదెంత తప్పుడు భావనో అర్థమైపోతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... జీఎం ఆవాల పరీక్షలకు అన్ని ప్రోటోకాల్స్‌ను ఢిల్లీ యూనివర్సిటీ స్వయంగా సిద్ధం చేసింది. విద్యార్థినే ప్రశ్నాపత్రం తయారు చేయమని అడగటం లాంటిది ఇది. అంతేకాదు... హెర్బిసైడ్ల(గడ్డిమందుల)ను తట్టుకునే ఆవాల వెరైటీ బీటీ వంకాయ మాదిరిగా కనీస పరీక్షలను కూడా ఎదుర్కోలేదు. జీఎం ఆవాల పరీక్షల్లో ఆరోగ్య నిపుణులు ఎవరూ లేకపోవడం, తేనెటీగలపై జీఎం ఆవాల ప్రభావం ఏమిటన్నది పరిశీలించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపాలు. ఇన్ని లోపాల మధ్య జీఈఏసీ విత్తనాల వృద్ధికి ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదు. సైన్స్ అంటే సత్యాన్ని వెతకడం. ఇటాలియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ మైకెలా మాసిమీ 2017లో లండన్ రాయల్ సొసైటీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో అచ్చంగా ఈ వ్యాఖ్యే చేశారు. ‘‘ప్రజలకు సైన్స్ విలువను అర్థమయ్యేలా చేయడం మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. కచ్చితత్వం, సాక్ష్యాలు, సిద్ధాంతాలపై విశ్వాసం, కచ్చితమైన పద్ధతులను అవలంబించడం వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించాలి’’! (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఆరు నుంచి ముప్పైకి.. వర్సిటీ ప్రతిష్ట కిందకి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యలో ఒక వెలు గు వెలిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కసారిగా తన ప్రభను కోల్పోయింది. భారతీయ వ్యవసాయ పరి శోధన సంస్థ (ఐకార్) కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో కిందిస్థాయికి పడిపోయింది. గతంలో ఆరో ర్యాంకు సాధించగా, 2020 సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన జాబితాలో 30వ స్థానానికి పడిపోయింది. వాస్తవంగా ఈసారి తొలి ఒకట్రెండు స్థానాల్లో ఉంటామని కొందరు భావించినట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంత ఘోరంగా పరిస్థితి మారడంపై చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పేరు ఏపీకి వెళ్లగా, తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో కొత్త గా ఏర్పడింది. అంటే రాష్ట్రంతోపాటు గత వ్యవసా య విశ్వవిద్యాలయం విడిపోయిందని అనుకోవచ్చు. కొత్త వర్సిటీలో అనేక సంస్కరణలు చేశామని, కొత్త వంగడాలు, పరిశోధనలు, రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టామని అధికారులు చెప్పేవారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగిందని అనేవారు. అందుకే వర్సిటీకి ఆరో ర్యాంకు వచ్చిందని చెప్పేవారు. తమకు తక్కువ ర్యాంకు ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదని, కారణాలు తెలుసుకునేందుకు ఐకార్‌కు లేఖ రాసినట్లు వర్సిటీకి చెందిన ఓ కీలకాధికారి చెప్పారు. తమ పరిశోధన పత్రాలు కొన్ని ప్రముఖ జర్నల్స్‌ల్లో అనుకున్న స్థాయిలో ప్రచురితం కాకపోవడం ఒక కారణమన్నారు. ర్యాంకింగ్‌లో విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, పరిశోధనలు, కొత్త వంగడాలు, జాతీయ–అంతర్జాతీయ స్థాయి లో ఒప్పందాలు, ఇతర వర్సిటీల కంటే ప్రత్యేకంగా చేపట్టే కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఫిర్యాదుల వల్లనే... వర్సిటీ ర్యాంకు 30వ స్థానానికి పడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆరో ర్యాంకు సాధించినప్పుడు కొన్ని ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మన వర్సిటీపై ఐకార్‌కు ఫిర్యాదులు చేశాయని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన కొన్ని వారసత్వాలను కూడా కొత్త వర్సిటీ చెప్పుకుంటోందన్న విమర్శలు అందులో ఉన్నట్లు సమాచారం. అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాల్లో చదివి ఈ వర్సిటీలో అధ్యాపక వృత్తి చేపట్టిన వారి విషయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్జీ రంగా వర్సిటీ ఏపీకి వెళ్లిపోగా, అప్పుడు చదివిన వారు ఇప్పుడు వేరే రాష్ట్రం కిందకు వెళ్లడంతో దాన్ని అనుకూలంగా వాడుకున్నారన్న ఫిర్యాదు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ర్యాంకు ఖరారులో ఈసారి ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించారని అందుకే ర్యాంకు దిగువకు పడిపోయిందని ఒక వర్సిటీ అధికారి వ్యాఖ్యానించారు. -
Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లల్లో 38% మందిలో పౌష్టికాహార లోపం వల్ల పెరుగుదల లోపించింది. 59% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లోనూ పౌష్టికాహార లోపం తీవ్రంగానే ఉంది. రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా వీరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే చిరుతిళ్ల కన్నా మార్కెట్లో దొరికే ఆరోగ్యపరంగా నష్టదాయకమైన(జంక్) చిరుతిళ్లనే పిల్లలు.. ఆ మాటకొస్తే పెద్దలూ అంతే. జంక్ ఫుడ్‌కు చక్కని ప్రత్యామ్నాయం చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్లే అనటంలో సందేహం లేదు. ‘పౌష్టిక ధాన్యాలు’ (న్యూట్రి–సీరియల్స్)గా ప్రభుత్వం గుర్తించిన చిరుధాన్యాలలో ఖనిజ లవణాలు, బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ అనుబంధ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఐఐఎంఆర్ దేశంలోనే తొలి ‘న్యూట్రిహబ్’ను నెలకొల్పింది. చిరుధాన్యాలతో రుచికరమైన వందలాది వంటకాలు, చిరుతిళ్లను అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేయటంపై ‘న్యూట్రిహబ్’ ఔత్సాహిక స్టార్టప్ సంస్థలకు శిక్షణతోపాటు సాంకేతికత విజ్ఞానాన్ని, ఆర్థిక తోడ్పాటును సైతం అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. విలాస్ ఎ తొనపి తెలిపారు. న్యూట్రిహబ్ ద్వారా ఇప్పటికి మిల్లెట్స్‌తో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించటంపై 175 స్టార్టప్ సంస్థలకు మార్గదర్శనం చేసినట్లు న్యూట్రిహబ్ సీఈవో, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. దయాకర్‌రావు చెప్పారు. వినూత్న ఉత్పత్తులతో ముందుకొచ్చి మార్కెట్లో దూసుకెళ్తున్న స్టార్టప్‌లలో కొన్నిటికి మహిళలే సారధులుగా ఉన్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఇటీవల ఐఐఎంఆర్ నిర్వహించిన న్యూట్రి–సీరియల్స్ భాగస్వాముల జాతీయ మెగా సమ్మేళనంలో అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలైన మిల్లెట్ మహిళల విజయగాథలు.. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నెల రోజులు తింటే తేడా తెలుస్తుంది! వరి, గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒక భోజనం చేస్తూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు (స్నాక్స్) తింటే జీవన శైలి జబ్బులతో బాధపడేవారు నెల రోజుల్లో ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు అని హైదరాబాద్ నివాసి అయిన డాక్టర్మందరపు సౌమ్య అంటున్నారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన ఆమె 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుధాన్య చిరుతిళ్ల ఫార్ములేషన్లకు రూపకల్పన చేశారు. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్‌తో ప్రొటీన్ బార్, బ్రేక్‌ఫాస్ట్ బార్, ఇమ్యుటినిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించారు. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నామని డా. సౌమ్య తెలిపారు. రూ. 1.41 కోట్ల పెట్టుబడి పెట్టారు. చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..! పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మూడో ఏడాదిలో రూ. 1.27 కోట్ల నికర లాభాన్ని ఆర్జించారు. ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా స్టార్టప్ అవార్డును అందుకున్నారు. సిఎఫ్టిఆర్ఐ నుంచి తొలి బెస్ట్ స్టార్టప్ అవార్డును, ఇక్రిశాట్ నుంచి స్మార్ట్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ అవార్డుతో పాటు ఐఎస్బి–యాక్షన్ ఫర్ ఇండియా బెస్ట్ సోషల్ ఎంటర్ప్రైజ్ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ టీ–హబ్‌లో ఎం.ఎస్.ఎం.ఈ. అసోసియేట్ గ్రోత్ సెక్రెటరీగా ఎంపికైన డా. సౌమ్య ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలదే భవిష్యత్తు అంటున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డా.సౌమ్య. (79895 86619). https://millennova.com/ మహిళలకోసం ప్రత్యేక ఆహారోత్పత్తులు బెంగళూరుకు చెందిన రుచిక భువాల్క వృత్తి రీత్యా సోషల్ టీచర్. కుటుంబం కోసం వరి, గోధుమలు లేని ఆరోగ్యదాయకమైన ఆహారం తయారు చేసే క్రమంలో ఆమె చిరుధాన్యాలపై దృష్టి సారించారు. చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకోవటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడంలో ప్రజలకు దోహపడాలన్న తపనతో ‘అర్బన్ మాంక్’ పేరిట స్టార్టప్‌ను నాలుగేళ్ల క్రితం నెలకొల్పారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో చిరుధాన్యాల బియ్యం, పిండితోపాటు ఇడ్లీ /దోసెల పిండి, బిస్కెట్లు వంటి రోజువారీ అవసరమయ్యే 40 ఉత్పత్తులను అందిస్తూ పట్టణ ప్రాంత గృహిణుల మనసు చూరగొనటంలో రుచిక విజయం సాధించారు. సేంద్రియ చిరుధాన్యాలతో 30–60 ఏళ్ల మధ్య మహిళల కోసం ప్రత్యేక ఆహారోత్పత్తులను అందిస్తూ మిల్లెట్ అమ్మగా ప్రసిద్ధి పొందారు. 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కామర్స్ సైట్స్ ద్వారా విక్రయిస్తూ రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిన రుచిక.. ఐఐఎంఆర్ నుంచి బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టప్ అవార్డును అందుకున్నారు. https://milletamma.com/ చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! ఆరోగ్యకరమైన చిరుతిళ్లు పౌష్టిక విలువలు లేని జంక్ స్నాక్స్ నుంచి పిల్లలను రక్షించుకోవడం కోసం చిరుధాన్యాలతో చిరుతిళ్లను తయారు చేయటం ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన డి.మాధవి, బి. దివ్యజ్యోతి. ప్రగతినగర్‌లోని ఎలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో చిరుధాన్యాలతో రెడీ టు ఈట్ చిరుతిళ్ల ఉత్పత్తి కోసం చిరు పరిశ్రమను స్థాపించారు. రాగి కుకీస్, జోవార్ ఫ్లేక్స్ తయారీ కోసం ఐఐఎంఆర్ నుంచి టెక్నాలజీ తీసుకున్నారు. రాగి చోకో బాల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి చిరుధాన్యాలను నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రూ. 1.04 కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మూడేళ్లలో 80% తిరిగి రాబట్టుకోగలిగారు. 9 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2017లోనే ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును మాధవి, దివ్యజ్యోతి స్వీకరించారు. తాజాగా ఐఐఎంఆర్ కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు. https://rigdamfoods.com/ చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. మిల్లెట్ మీల్ బాక్స్ హైదరాబాద్‌కు చెందిన వేముల అరుణ ఐదేళ్ల క్రితం శిక్షణ పొంది జొన్న లడ్డు, ఇడ్లీ, దోసెలు వంటి వంటకాలను విక్రయించడం ప్రారంభించారు. వివిధ సంస్థల్లో మధ్యాహ్న భోజనం (మీల్ బాక్స్) అందిస్తున్నారు. ప్రస్తుతానికి 8 రకాల చిరుధాన్య వంటకాలను అందిస్తున్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో మరికొన్ని ఉత్పత్తులను జోడించబోతున్నామని అరుణ తెలిపారు. స్విగ్గి, జొమాటో తదితర ఆన్లైన్ పార్టనర్స్ ద్వారా రుచికరమైన చిరుధాన్య వంటకాలను కోరిందే తడవుగా ప్రజల ముంగిటకు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షల పెట్టుబడితో అరుణ చిరుధాన్యాల వంటశాలను ప్రారంభించారు. ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. రూ. 2.8 లక్షల ఆదాయం గడించారు. తాజాగా ఐఐఎంఆర్ నుంచి కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు అరుణ. vemulaaruna81@gmail.com చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! 6న వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై ఈనెల 6 (శనివారం)న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతి పేట దగ్గర తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ రైతు శాస్త్రవేత్త గుడివాడ నాగరత్నం నాయుడుతోపాటు తాండూరు రైతు నారాయణ, నాగర్‌కర్నూలు రైతు రాజు రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. 95538 25532. 7న బొప్పాయి, మునగ, అరటి సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా శిబిరంలో ఈ నెల 7 (ఆదివారం)న బొప్పాయి, మునగ, అరటి సాగుపై నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666. 60% రైతులు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సాగయ్యే విస్తీర్ణంలో 55% వర్షాధార ప్రాంతాల్లోనే ఉంది. భూతాపోన్నతి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న రైతులు వీరు. అయితే, దేశ వ్యవసాయ బడ్జెట్లో 10% మాత్రమే ఈ ప్రాంతాలపై ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఫసల్ బీమా యోజన ఒక్కటే మెట్ట రైతును రక్షించలేదు. పంటల జీవవైవిధ్యం పెంపొందించాలి. – డాక్టర్ సబ్యసాచి దాస్, రీవైటలైజింగ్ రెయిన్‌ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
సాగు సమస్యలకు సాంకేతిక పరిష్కారం
న్యూఢిల్లీ: సాగు రంగంలో సమస్యలను సాంకేతికతతో అధిగమించేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన వంగడాలు ప్రధాని మంగళవారం ఆవిష్కరించారు. రాయ్‌పూర్‌లో నిర్మించిన జాతీయ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించారు. నాలుగు యూనివర్సిటీలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులిచ్చారు. ‘సైంటిస్టులు 1300 రకాలకు పైగా విత్తన వెరైటీలను అభివృద్ధి చేశారు. ఈ రోజు మరో 35 వెరైటీలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వంగడాలు వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్లను పరిష్కారిస్తాయి’ అని మోదీ అన్నారు. రైతులు ఎదుర్కొనే భిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకాలను సైంటిస్టులు రూపొందించారు. కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను, వివిధ రకాల వ్యాధులను తట్టుకునే విధంగా వీటిని అభివృద్ధి చేశారని ప్రధాని చెప్పారు. అధిక పోషక విలువలున్న వరి, గోదుమ, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంట రకాలు కొత్తగా రూపొందించినవాటిలో ఉన్నాయి. దేశ రైతాంగంలో 86 శాతం మంది సన్నకారు రైతులేనని, వారి ఆదాయాన్ని పెంచడంపై ప్రధాని ఎల్లప్పుడూ శ్రద్ధ పెడుతుంటారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ చెప్పారు. సాగు రంగానికే కాకుండా మొత్తం పర్యావరణానికి వాతావరణ మార్పు(శీతోష్ణస్థితి మార్పు) అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలన్నారు. దీనివల్ల సాగు, అనుబంధరంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి 5 మోదీ ఆవిష్కరించిన కొత్త వంగడాల్లో ఐదు హైదరాబాద్‌లోని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్‌లో అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌కే చెందిన సీసీఎంబీ, పీజేటీఎస్ఏయూ ఈ వంగడాల అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. పంటకాలంతో పాటు నీటి అవసరం తక్కువగా ఉండే ‘డీఆర్ఆర్ ధన్ 57’, మధ్యమస్థాయి పలుచటి గింజ కలిగి, అగ్గితెగులును, ఉప్పునీటిని తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 58’, పొడవుతోపాటు పలుచటి గింజలు కలిగి అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 59’, ఫాస్పరస్ తక్కువగా ఉన్న నేలల్లోనూ పండగల, అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 60’... అగ్గితెగులు, బ్లాస్ట్ రోగాన్ని తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 62’ వంగడాలను ప్రధాని మంగళవారం కొన్ని ఇతర వంగడాలతో కలిపి విడుదల చేశారు. -
అగ్రి కోర్సులతో అందలం.. కొలువులకు కొదవేలేదు
ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్.. సంక్షిప్తంగా ఐసీఏఆర్! ఐకార్గా సుపరిచితం. ఇది జాతీయ స్థాయిలో అగ్రికల్చర్, అనుబంధ కోర్సుల బోధనలో.. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్! ఈ సంస్థ పరిధిలోని యూనివర్సిటీలు, కళాశాలలు అందించే అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం! వీటిల్లో చేరేందుకు మార్గం..ఐసీఏఆర్–ఏఐఈఈఏ!! నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రతి ఏటా నిర్వహించే.. ఐసీఏఆర్–ఏఐఈఈఏకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఐసీఏఆర్–ఏఐఈఈఏ–2021 వివరాలు, కోర్సులు, ప్రవేశ పరీక్ష విధానం, అర్హతలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం... అగ్రికల్చరల్ కోర్సులు. వీటికి ఎవర్ గ్రీన్ కోర్సు లుగా పేరు. ఎందుకంటే.. వ్యవసాయ ప్రధానమైన భారత్‌లో అగ్రి కోర్సులు పూర్తి చేసిన వారికి కొలువులకు కొదవలేదు. అందుకే జాతీయ స్థాయిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. ఐసీఏఆర్–ఏఐఈఈఏ(ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్)కు ఎంతో పోటీ నెలకొంది. మరోవైపు రాష్ట్ర స్థాయిలో టీఎస్ ఎంసెట్(బైపీసీ)/ఏపీ ఈఏపీసెట్(బైపీసీ)లో ర్యాం కు సాధించి..అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది! 74 అగ్రి యూనివర్సిటీలు ఐకార్ పరిధిలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సి టీలు ఉన్నాయి. వీటిల్లో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ యూనివర్సిటీలు; 4 ఐకార్ డీమ్డ్ యూనివర్సిటీలు(ఐఏఆర్ఐ, ఐవీ ఆర్ఐ, ఎన్డీఆర్ఐ, సీఐఎఫ్ఈ); మూడు సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు(సీఏయూ ఇంఫాల్, డాక్టర్ ఆర్పీసీయూ, పుసా, ఆర్ఎల్బీ సీఏయూ, ఝాన్సీ); 4 సెంట్రల్ యూనివర్సిటీలు (బీహెచ్ యూ, ఏఎంయూ, విశ్వభారతి, నాగాలాండ్ యూనివర్సిటీ) ఉన్నాయి. ఆల్ ఇండియా కోటా ఐసీఏఆర్–ఏఐఈఈఏ ద్వారా ఐసీఏఆర్ అనుబంధ ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో వ్యవసాయ విద్య కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా ప్రవేశాలు లభిస్తాయి. అంటే.. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధిస్తే.. విద్యార్థులు జాతీయ స్థాయిలోని అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ఆల్ ఇండియా కోటా సీట్లకు పోటీ పడొచ్చు. అదే విధంగా రాష్ట్ర స్థాయి వ్యవసాయ యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ప్రవేశ విధానాలు అనుసరిస్తున్నాయి. మూడు స్థాయిల కోర్సులు ఐసీఏఆర్–ఏఐఈఈఏ ద్వారా వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో మూడు స్థాయిల్లో ఆల్ ఇండియా కోటా ప్రవేశాలు జరుగుతాయి. ఒక్కోస్థాయి కోర్సుకు నిర్దిష్ట శాతంతో ఆల్ ఇండియా కోటాను నిర్ణయించారు. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(యూజీ):వ్యవసాయ, అను బంధ కోర్సుల్లో జాతీయ స్థాయిలోని వర్సి టీల్లో ఆల్ ఇండియా కోటా పేరుతో 15 శాతం సీట్లను ఐసీఏఆర్–ఏఐఈఈఏ (యూజీ) ఎంట్ర న్స్లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఈ విధానంలో సీట్లు పొందిన విద్యా ర్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సైన్స్ సబ్జెక్ట్స్ పేరుతో నెలకు రూ.మూడు వేల ఉపకార వేతనం కూడా అందుతుంది. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీజీ): ఈ ఎంట్రన్స్ ద్వా రా దేశంలోని అన్ని అగ్రికల్చర్ యూనివర్సి టీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వ్యవసాయ కోర్సుల్లో.. 25 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఎంట్రన్స్‌లో టాప్–600(మొదటి ఆరు వందల మంది) జాబితాలో నిలిచి.. ఐకార్ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి ఐసీఏఆర్–పీజీ స్కాలర్షిప్ పేరిట నెలకు రూ.12,460 చొప్పున రెండేళ్ల పాటు ఉపకార వేతనం లభిస్తుంది. ఆరు వందలకు పైగా ర్యాం కు సాధించిన విద్యార్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్(పీజీ) పేరిట నెలకు రూ.5వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీహెచ్డీ):ఐసీఏఆర్ అను బంధ సంస్థల్లో ఆల్ ఇండియా కోటాలో.. పీహెచ్డీ(డాక్టోరల్) ప్రోగ్రామ్‌లలో 25 శాతం సీట్ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ పేరుతో ఫెలోషిప్ అందిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేలు చొప్పున జేఆర్ఎఫ్ను, మూడో ఏడాది ఎస్ఆర్ఎఫ్ పేరుతో నెలకు రూ.35 వేలను ఫెలోషిప్‌గా అందిస్తారు. దీనికి అదనంగా ప్రతి ఏటా రూ.పది వేలు చొప్పున కాంటింజెంట్ గ్రాంట్‌ను కూడా ఇస్తారు. మూడింటికీ.. వేర్వేరు పరీక్షలు ఐసీఏఆర్–ఏఐఈఈఏ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు మూడింటికీ వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తారు. బ్యాచిలర్ స్థాయి కోర్సులు ఐసీఏఆర్–ఏఐఈఈఏ యూజీ ద్వారా ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో 11 కోర్సుల్లో ప్రవేశం లభి స్తుంది. అవి.. బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్; బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్; బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, బీఎస్సీ(ఆనర్స్) ఫారెస్ట్రీ; కమ్యూనిటీ సైన్స్; ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్; బీఎస్సీ(ఆనర్స్) సెరి కల్చర్; బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ. ► అర్హత: కోర్సులను అనుసరించి 10+2/ ఇంట ర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 31.08.2021 నాటికి 16ఏళ్లు నిండి ఉండాలి. ► పరీక్ష 150 ప్రశ్నలు–600 మార్కులకు నిర్వహి స్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రతి సరైన సమాధానానికి 4మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ► ఇంటర్మీడియెట్ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌ల ఆధారంగా ఈ మూడు విభాగాల సబ్జెక్ట్‌లు ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఈ మూడు విభాగాల నుంచే ప్రశ్నలు అడుగుతారు. పీజీ కోర్సులు ఇవే ప్రస్తుతం పీజీ స్థాయిలో.. ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, ఫిజికల్ సైన్స్, యానిమల్ బయో టెక్నాలజీ, అగ్రి–బిజినెస్ మేనేజ్మెంట్, స్టాటిస్టికల్ సైన్స్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ సివి కల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వాటర్ సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఆగ్రోనమీ, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, హోంసైన్స్, సోషల్ సైన్స్ తదితర విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ► అర్హత: 10+6 విధానంలో బీఎస్సీ అగ్రి కల్చర్/10+2+5 లేదా 10+2+5 1/2 విధానంలో(బీవీఎస్సీ అండ్ ఏహెచ్)/డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీజీ) పరీక్ష: ఐసీఏఆర్ పీజీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది. పీహెచ్డీ పరీక్ష విధానం ► క్రాప్‌సైన్స్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యాని మల్ సైన్స్–1, డెయిరీసైన్స్, డెయిరీ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, హోంసైన్స్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, అగ్రి కల్చరల్ ఎకానమీ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫిషరీ సైన్స్ సబ్జెక్ట్‌లలో మొత్తం 73 విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. ► అర్హత: అభ్యర్థులు పీహెచ్‌డీలో ఎంపిక చేసుకు న్న విభాగానికి సంబంధించి పీజీ స్థాయిలో ఆ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ► ఐసీఏఆర్–జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) పరీక్ష మొత్తం 120 ప్రశ్నలకుగాను 480 మార్కు లకు జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది. సీట్ల కేటాయింపు మూడు స్థాయిల కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఆయా ఎంట్రన్స్‌ల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి.. ఆన్లైన్లో సీట్ల కేటాయింపు చేస్తారు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో 2,865 సీట్లు, పీజీ స్థాయిలో 3,219 సీట్లు, పీహెచ్డీ స్థాయిలో 1,377 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ► ఐసీఏఆర్–ఏఐఈఈఏ 2021 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ► ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో.. యూజీ, పీజీ, పీహెచ్డీ స్థాయి అగ్రి కోర్సులు ► ఆల్ ఇండియా కోటాలో ఐసీఏఆర్ అనుబంధ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్స్ ఐసీఏఆర్–ఏఐఈఈఏ(యూజీ) ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021. ► దరఖాస్తుల సవరణ: ఆగస్ట్ 23–ఆగస్ట్ 26. ► పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 7, 8, 13. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://icar.nta.ac.in ఐసీఏఆర్–ఏఐఈఈఏ(పీజీ),(పీహెచ్డీ) ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► దరఖాస్తుల సవరణ: ఆగస్ట్ 23–ఆగస్ట్ 26 ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17,2021 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్. ► వివరాలకు వెబ్సైట్: https://icar.nta.ac.in ఐసీఏఆర్–ఏఐఈఈఏ.. ముఖ్యాంశాలు ► ఐసీఏఆర్ అనుబంధ ఇన్స్టిట్యూట్లలో ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ. ► ప్రస్తుతం జాతీయ స్థాయిలో 74 యూనివర్సిటీలు, నాలుగు ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, మూడు సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, నాలుగు సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు. ► ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా అగ్రి యూనివర్సిటీస్ల్లో అడ్మిషన్స్. ► కోర్సులు పూర్తి చేసుకున్నాక ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో అవకాశాలు. ► కోర్సు చదివే సమయంలో స్కాలర్షిప్ సదుపాయం లభిస్తుంది. డిమాండ్ పెరుగుతోంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయ విద్యను అభ్యసించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వ్యవసాయ పంటల అమ్మకాలు, మార్కెటింగ్, రవాణా, సేవ లు, నిల్వ, గిడ్డంగులు మొదలైన వాటిల్లో ఉద్యో గాలు లభిస్తున్నాయి. వ్యవసాయశాఖలోనూ అవకాశాలు దక్కించుకోవచ్చు. అగ్రికల్చ ర్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ప్లాంటేషన్స్, ఫెర్టిలైజర్ కంపెనీలు, అగ్రికల్చరల్ మెషినరీలు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్, ఫుడ్ ప్రాసె సింగ్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. వీటితోపాటు ఎఫ్‌సీఐ, నాబార్డ్‌తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూరల్ బ్యాంకింగ్ విభాగా ల్లోనూ ఆఫీసర్లు, మేనేజర్లుగా కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. పీహెచ్డీ పూర్తి చేస్తే.. ఐసీఏఆర్, ఐఏఆర్ఐ వంటి అగ్రికల్చర్ రీసెర్చ్ కేంద్రా లతోపాటు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని రీసెర్చ్ కేంద్రాల్లో సైంటిస్ట్ హోదాలో స్థిరపడొచ్చు. -
సమీకృత సేద్యం.. సంతోషం!
ప్రకృతి వ్యవసాయ పితామహుడు డా. సుభాష్ పాలేకర్ శిక్షణ అందించిన స్ఫూర్తితో రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి.. ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న బండారు వెంకటేశ్వర్లు, పుష్పలత దంపతుల కృషి చక్కని ఫలితాలనిస్తోంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెంలోని తమ 12 ఎకరాల సొంత భూమిలో సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐసీఏఆర్ అందించే జాతీయ స్థాయి హల్దార్ సేంద్రియ రైతు పురస్కారానికి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. నల్గొండలో, తూ.గో. జిల్లా సర్పవరంలో పాలేకర్ శిక్షణా శిబిరాలకు హాజరై 2014లో రెండు నాటు ఆవులను కొనుక్కొని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయనకు కుమారుడు, కుమార్తె ప్రైవేటు ఉద్యోగులు. దంపతులు ఇద్దరే సాధ్యమైనంత వరకు వ్యవసాయ పనులు చేసుకుంటారు. అవసరమైతేనే కూలీలను పిలుస్తారు. వరి, వేరుశనగ వంటి పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు.. మొత్తం 14 రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఫామ్ పాండ్‌లో చేపల సాగుతో సమీకృత ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు. గడ్డిపల్లి కేవీకె శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆదర్శ సేద్యం చేస్తున్నారు. భూసారాన్ని పెంచేందుకు పశువుల ఎరువు, ఘనజీవామృతం, వేప పిండి, కొబ్బరి చెక్క, కానుగ చెక్క, జీవామృతం, వేస్ట్ డీకంపోజర్తోపాటు జీవన ఎరువులను సైతం వాడుతున్నారు. పంటల మార్పిడితోపాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇంగువ ద్రావణం, వేప గింజల కషాయం, వంటి వాటితోనే సేద్యం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. వైరస్ లేని బొప్పాయి సాగు వెంకటేశ్వర్లు గత మూడేళ్లుగా బొప్పాయి సాగు విస్తీర్నం పెంచుకొని కరోనా నేపథ్యంలో మంచి ఆదాయం గడించడం విశేషం. బొప్పాయిలో కలుపుతీతకు పవర్ వీడర్‌ను స్వయంగా ఉపయోగిస్తున్నారు. 8.5 ఎకరాల్లో బొప్పాయి కాసులు కురిపిస్తుంటే ఎకరంలో నిమ్మ తోటపై రూపాయి కూడా రావటం లేదన్నారు. ఎకరాకు 33 బస్తాల ధాన్యం దిగుబడి వరి సాగులో డ్రమ్ సీడర్‌తో వరి సాగు చేస్తున్నారు. వానాకాలంలో సాంబ మసూరి వరిలో ఎకరాకు 33 బస్తాల దిగుబడి సాధిస్తూ క్వింటా బియ్యం రూ. 5,500 చొప్పున తన ఇంటి దగ్గరే అమ్ముతున్నారు. ఆ పొలంలో శీతాకాలంలో పుచ్చ సాగు చేస్తున్నారు. అరటి, నేరేడు, మామిడి, ఉసిరి, సపోట, ఇంకా పలు రకాల పండ్ల చెట్లనూ పెంచుతున్నారు. అన్ని ఖర్చులూ పోను 12 ఎకరాల్లో ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం మిగులుతున్నదని వెంకటేశ్వర్లు సంతోషంగా చెప్పారు. 50 శాతం ప్రభుత్వ రాయితీపై ఫాం పాండ్‌ను నిర్మించి డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో నీటిని నిల్వ చేసుకొని, ఉద్యానవన పంటలను సాగు చేసుకుంటూ దానిలో చేపలను పెంచుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఖర్చులు పోను రూ.50 వేలు మిగిలాయని వెంకటేశ్వర్లు చెబుతున్నారు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా నిలువు పందిళ్లు మేలు! తీగజాతి కూరగాయల సాగుకు రాతి స్తంభాలతో శాశ్వత ప్రాతిపదికన పందిళ్లు వేసే కన్నా.. వెదురు బొంగులు, ప్లాస్టిక్ తాళ్లు, పురికొసలతో కూడిన తాత్కాలిక నిలువు పందిళ్లు వేసుకోవటం రైతులకు ఎంతో మేలని హల్దార్ సేంద్రియ రైతు జాతీయ పురస్కారం అందుకున్న బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. నిలువు పందిళ్లకు ఎకరానికి రూ. 50 వేల లోపు ఖర్చవుతుంది. శాశ్వత పందిళ్లు వేసుకోవడానికి ఇంకా అధిక పెట్టుబడి అవసరం. నిలువు పందిళ్లను పంట అయిపోగానే తీసేసి పక్కన పెట్టుకొని, మళ్లీ సులువుగా వేసుకోవచ్చు. ఆ స్థలంలో పంట మార్పిడికి కూడా ఇవి అనుకూలం. శాశ్వత పందిరి వేసుకుంటే.. ఆ స్థలంలో ప్రతిసారీ కూరగాయ పంటలే వేసుకోవాలి, పంట మార్పిడికి అవకాశాలు తక్కువ. పిచాకారీలకు, కూరగాయల కోతకు నిలువు పందిళ్లే మేలు. నిలువు పందిళ్లలో పంటలకు గాలి, వెలుతురు బాగా తగులుతుంది. దిగుబడీ బాగుంటుంది. వీటిలో పాముల బెడద కూడా తక్కువ. సేంద్రియ మార్కెట్లు నెలకొల్పాలి అప్పటి కలెక్టర్ ముక్తేశ్వరరావు ప్రోత్సాహంతో పాలేకర్ శిక్షణ పొందాను. పుస్తకాలు చదివి అవగాహన పెంచుకున్నాను. సీనియర్ రైతుల స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయంలోకి మారాను. తొలి రెండేళ్లు కష్టనష్టాలు చవిచూసి, మానేద్దామనుకున్నా. మా పొలానికి వచ్చి చూసిన అప్పటి కలెక్టర్ సురేంద్రమోహన్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో కొనసాగించాను. గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు, అధికారుల తోడ్పాటుతో ఇప్పుడు నిలదొక్కుకున్నాను. నా భార్య, నేను పగలంతా పొలం పనులు చేసుకుంటాం. మరీ అవసరమైతేనే కూలీలను పిలుస్తాం. రెండేళ్లుగా పండించినవన్నీ తోట దగ్గరే ఏదో ఒక ధరకు అమ్మేస్తున్నా. నికరాదాయం బాగానే ఉంది. ప్రభుత్వమే ప్రత్యేక సేంద్రియ మార్కెట్లు నెలకొల్పి, ప్రచారం కల్పించి ప్రజల్లో చైతన్యం తేవాలి. రసాయన ఎరువులకు ఇస్తున్న రాయితీ మాదిరిగానే వేప పిండి తదితర వాటికి కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తేనే ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తుంది. – బండారు వెంకటేశ్వర్లు (77027 10588), ఐసీఏఆర్ హల్దార్ సేంద్రియ రైతు జాతీయ అవార్డు గ్రహీత, నరసింహుల గూడెం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇస్తున్నాం బండారు వెంకటేశ్వర్లు దంపతులు రోజంతా పొలం పని చేస్తారు. కరోనా కాలంలో బొప్పాయికి వచ్చిన గిరాకీ వల్ల వారి కష్టానికి తగిన ఆదాయం వచ్చింది. మా కేవీకేలో రైతులకు సేంద్రియ సేద్యంలో పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నాం. జీవన ఎరువులు, వర్మీకంపోస్టు, అజొల్లా వంటి ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు ఇస్తున్నాం. సేంద్రియ రైతులకు మార్కెటింగే సమస్య. ప్రభుత్వమే తీర్చాలి. సబ్సిడీపై ఆవులు, జీవన ఎరువులు ఇవ్వాలి. – డా. లవకుమార్ (98490 63796), సమన్వకర్త, శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కేవీకే, గడ్డిపల్లి, సూర్యాపేట జిల్లా బండారు వెంకటేశ్వర్లు 2014 నుంచి తన సొంత భూమి 12 ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తూ సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకపోవటం వల్ల మొదటి ఏడాది నుంచీ ఖర్చులు బాగా తగ్గాయి. అయితే, దిగుబడులు మొదటి ఏడాది బాగా తగ్గాయి. క్రమంగా పెరిగి మూడేళ్లకు దిగుబడి మంచి స్థాయికి పెరిగింది. గత ఐదేళ్లలో ఖర్చులు పోను నికరాదాయం గణనీయంగా పెరిగింది. 2016–17లో రూ. 7,57,238 నికరాదాయం పొందగా 2020–21 నాటికి ఇది రూ. 13,98,738కు పెరగటం విశేషం. -
రాష్ట్రాలకే అవకాశం ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర నిర్ణయించే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన 91వ కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) పాలకమండలి సమావేశానికి హాజరై ఆయన ప్రసంగించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెండింతలు చేయాలంటే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయంలో మార్పులుంటాయని, అందువల్ల రాష్ట్రాలకే కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం ఇవ్వాలని కోరారు. ఆరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అనుకూల చర్యల ద్వారా ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది గతేడాదికన్నా 40.8% పెరుగుదలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి 130 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుందని వివరించారు. -
రైతు సృజనకు ప్రోత్సాహం
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ ఆదాయం పెరుగుదలకు సృజనాత్మక ఆవిష్కరణలు చేస్తున్న రైతులే కీలకమని భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర స్పష్టం చేశారు. ఈ కారణంగానే తాము ఐసీఏఆర్ తరఫున రైతుల సృజనాత్మక పరిశోధనలకు ఒక వేదిక కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. బెంగళూరులో జరుగుతున్న 107వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో త్రిలోచన్ మహాపాత్ర సోమవారం ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు కానున్న ప్రత్యేక కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో రైతుల కోసం వేదిక, సమావేశం, చర్చలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రంతోనే సాధ్యం.. సైన్స్ ఆధారంగానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయని మహాపాత్ర తెలిపారు. మూడేళ్ల క్రితం వరకూ దేశంలో ఏడాదికి రూ.పది వేల కోట్లతో పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకునేవారని, టెక్నాలజీ ఆధారిత ప్రణాళిక ద్వారా గత మూడేళ్లలో పప్పు ధాన్యాల దిగుబడిని 6 నుంచి 9 మిలియన్ టన్నులకు పెంచడంతో దిగుమతులు నిలిచిపోయాయని అన్నారు. తద్వారా విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయగలిగామని తెలిపారు. భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడ్డ 55 శాతం జనాభాలో సుమారు 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, వీరి ఆదాయాన్ని పెంచేందుకు సమీకృత వ్యవసాయమే మేలైన మార్గమని సూచించారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. -
ఇంటింటా పౌష్టికాహార ‘పుట్ట’!
మన దేశంలో ప్రజలు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. ఈ లోపాన్ని భర్తీ చేయగలిగినవి పుట్టగొడుగులు. వీటిలోని పోషక విలువలు, ఔషధగుణాల గురించి తెలిసినప్పటికీ.. ప్రజలకు అందుబాటులోకి తేవడం అంతగా సాధ్యపడటం లేదు. పుట్టగొడుగులు పట్టణాలు, నగరాల్లో కూడా అరుదుగానే అందుబాటులో ఉంటున్నాయి. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి పోషకాల గనులైన పుట్టగొడుగులు ఇప్పటికీ అందని ద్రాక్షల్లాగే మిగిలిపోయాయి. వీటి పెంపకానికి నైపుణ్యం అవసరం. విత్తన లభ్యత కూడా పెద్ద సవాలుగా ఉంది. అయితే, పుట్టగొడుగులను ఎక్కడో పెంచి తీసుకువచ్చి దుకాణాల్లో ప్రజలకు అమ్మేదానికి బదులు.. ‘పుట్టగొడుగులను అందించే సంచి’ని అమ్మటం ఉత్తమమైన పని అని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనాసంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందుకోసం వారు ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్ సాంకేతికతకు రూపకల్పన చేశారు. ఒక్కో బ్యాగ్‌తో 300 గ్రా. పుట్టగొడుగులు కిలో బరువుండే బ్యాగ్‌ను తెచ్చుకొని ఇంట్లో ఎండ తగలని, గాలి పారాడే చోట వేలాడదీసి ఉంచితే.. ఐదు లేక 6 రోజుల్లో 200–300 గ్రాముల పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. ఈ బ్యాగ్‌ను బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో ముందుగా బుక్ చేసుకున్న వారికి లాభాపేక్ష లేకుండా రూ. 20లకే విక్రయిస్తోంది. అయితే, దీన్ని తయారు చేసే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అంతకన్నా ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుంది. ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్‌ను ఉత్పత్తి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వారికి బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలకు సాంకేతికతను అందించడంతోపాటు, ఏడాదిలో 3 దఫాలు శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకానికి వరిగడ్డితో బ్యాగ్‌ల తయారీపై శిక్షణ పొందుతున్న మహిళలు బ్యాగ్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకోదలచిన వారు ఐఐహెచ్ఆర్ రూపొందించిన మల్టీఫ్యూయల్ బాయిలర్, స్టెరిలైజేషన్ యూనిట్, మోటారుతో నడిచే చాఫ్ కట్టర్లను రూ. 5–6 లక్షల ఖర్చుతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3–4 గదుల షెడ్/భవనంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పాన్‌ను ఐఐహెచ్ఆర్ లేదా మరెక్కడి నుంచైనా తెచ్చుకొని బ్యాగ్‌లను ఉత్పత్తి చేసుకొని వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ఈ యూనిట్ ద్వారా రోజుకు కిలో బరువైన బ్యాగ్‌లు 100 వరకు (2 కిలోల బ్యాగులైతే 50 వరకు) ఉత్పత్తి చేయొచ్చు. బ్యాగ్‌లలో పుట్టగొడుగులు పెంచుతున్న గృహిణులు స్పాన్ ఉత్పత్తి కీలకం పుట్టగొడుగుల పెంపకంలో స్పాన్ (విత్తనం) లభ్యత కీలకాంశం. అయితే, పుట్టగొడుగుల స్పాన్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే రూ. 20 లక్షల పెట్టుబడితోపాటు 1500 చదరపు అడుగుల పక్కా భవనంలో వసతి అవసరమవుతుంది. స్పాన్ ఉత్పత్తి సాంకేతికతను ఐఐహెచ్ఆర్ అందిస్తోంది. శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ కాలం 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది. ప్రభుత్వ శాఖలు కోరితే రాష్ట్రాల్లోనూ శిక్షణ ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్‌లను, పుట్టగొడుగుల స్పాన్ ఉత్పత్తి సాంకేతికతలపై ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు వివిధ రాష్ట్రాలకు వచ్చి కూడా శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ/ఉద్యాన శాఖల కోరిక మేరకు కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటి శిక్షణా తరగతులు జరిగాయి. కర్ణాటక ప్రభుత్వం 5 చోట్ల పుట్టగొడుగుల స్పాన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రజలకు బ్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. చలికాలంలో ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణం మిల్కీ మష్రూమ్స్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర సమాచారం కోసం ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు సంప్రదించాల్సిన చిరునామా: అధిపతి, విస్తరణ–సాంఘిక శాస్త్రాల విభాగం, ఐసిఎఆర్–ఐఐహెచ్ఆర్, హెసరఘట్ట, బెంగళూరు – 560089. Email: Venkattakumar.R@icar.gov.in http://www.iihr.res.in/ 5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు పుట్టగొడుగులను అందించే ఈ రెడీ మేడ్ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు సులభంగా ఐదారు రోజుల్లో తాజా పుట్టగొడుగులను కళ్లముందే పెంచుకోవచ్చు. పాలిథిన్ క్యారీ బ్యాగ్‌లో శుద్ధి చేసిన వరి గడ్డి ముక్కలతోపాటు పుట్టగొడుగుల విత్తనం చల్లి, మూతి కట్టేస్తారు. ఈ బ్యాగును వినియోగదారుడు కొని తెచ్చి ఇంట్లో ఒక మూలన పెట్టుకొని, దానికి అక్కడక్కడా చిన్న బెజ్జాలు చేస్తే చాలు. ఆ బెజ్జాల్లో నుంచి పుట్టగొడుగులు మొలుస్తాయి. వాటిపై నీటి తుంపరలను రోజుకోసారి పిచికారీ చేస్తుంటే చాలు. బ్యాగ్‌పై పుట్టగొడుగులు పెరగడానికి వీలుగా చిన్న బెజ్జం చేస్తున్న దృశ్యం కేవలం 5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు వంటకు సిద్ధమవుతాయి. ఇలా ఎవరికి వారు ఇంట్లోనే పెద్ద హైరానా ఏమీ లేకుండా సునాయాసంగా పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. మరీ ముదిరిపోక ముందే కోసుకుంటే చాలు. ఈ పని చేయడానికి నైపుణ్యం ఏమీ అవసరం లేదు. చదువు లేని గృహిణులు కూడా సులభంగా ఈ పద్ధతిలో పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుకోగలుగుతారు. తాజా పుట్టగొడుగులను కూర వండుకోవచ్చు లేదా ఎండబెట్టి పొడి (ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు) చేసి రోజువారీగా ఆహార పదార్థాల్లో కలిపి వాడుకుంటూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్యాగ్‌పై మొలిచిన పుట్టగొడుగులపై నీటి పిచికారీ పోషక గనులు.. ఔషధ గుణాలు! పుట్టగొడుగులు కూడా మొక్కల్లాంటివే. మొక్కల్లో మాదిరిగా క్లోరోఫిల్ ఉండదు కాబట్టి తెల్లగా ఉంటాయి. పోషకాల గని వంటివి పుట్టగొడుగులు. ప్రొటీన్లు, బి విటమిన్లు ఉన్నాయి. విటమిన్ డిని కలిగి ఉండే ఏకైక శాకాహారం పుట్టగొడుగులు మాత్రమే. వీటిల్లోని ఐరన్ ఆహారంగా తీసుకున్న వారికి ఇట్టే వంటపడుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి టైప్ –2 మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా తినవచ్చు. సోడియం అతి తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగి ఉండి కొలెస్ట్రాల్ అసలు లేని కారణంగా పుట్టగొడుగులు హృద్రోగులకు అద్భుత ఆహారం. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపకరిస్తాయి. పుట్టగొడుగులు శాకాహారులకు అద్భుతపోషకాల వనరు మాత్రమే కాదు, మాంసాహారం వాడకాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి రుచికరమైన సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని ఐ.ఐ.హెచ్.ఆర్.లోని మష్రూమ్ లాబ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. మీరా పాండే తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ పుట్టగొడుగులు ఇప్పటికీ భారతీయ ప్రజల రోజువారీ ఆహారంలో భాగం కాలేకపోతున్నాయి. అందుకోసమే ఇంటింటా పుట్టగొడుగులు పెంచుకునే సులభమార్గాన్ని తాము రూపొందించినట్లు డా. మీరా పాండే ‘సాక్షి’తో అన్నారు. డా. మీరా పాండే – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లావాసి
సాక్షి, హైదరాబాద్: జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నిర్వహించిన నేషనల్ పీహెచ్డీ పుడ్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షలో సిద్దిపేట్ జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్కు చెందిన అచ్చిన పోషాద్రి (34) మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో పాటు జాతీయ డైరీ పరిశోధన సంస్థ నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్షలోనూ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పోషాద్రి జాతీయ పరీక్షలకు సిద్ధమవుతూ రెండు ప్రవేశ పరీక్షల్లోనూ దేశంలోనే ర్యాంకు సాధించారు. ర్యాంకుల రారాజు పోషాద్రి... 2007లో ఐకార్ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షలో కూడా పోషాద్రి మొదటి ర్యాంకు సాధించాడు. 2013లో ఐకార్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. దేశంలో ఫుడ్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పదేళ్లుగా వివిధ పరిశోధనలు చేశారు. పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్స్‌లోనూ ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు 25 రీసెర్చ్ పేపర్స్, 2 పుస్తకాలు రాశారు. పోషాద్రి రాసిన హ్యాండ్ బుక్ ఫర్ పుడ్ టెక్నాలజీ పుస్తకం ఫుడ్ టెక్నాలజీ రంగంలో దేశంలోనే ఎక్కువగా విక్రయం జరిగింది. ఫుడ్ సైంటిస్ట్‌గా 15 కొత్తరకమైన ఆహార పదార్థాలను తయారుచేశాడు. గతంలో ఇక్రిశాట్లో శాస్త్రవేత్తగా పనిచేసినప్పుడు అక్కడ ఆహార పరిశోధన ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చిరు ధాన్యాలు, జొన్నల నుంచి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న పోషాద్రి, గిరిజన ప్రాంతాలలో సుమారు 10 బహుళార్ధక ప్రయోజనాలున్న చిన్న సైజు మిల్లులు నెలకొల్పి గిరిజన కుటుంబాలకు నాణ్యమైన పోషక విలువలు గల ఆహార పదార్థాలను వారు పండించే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేసుకునే విధంగా తోడ్పాటు అందిస్తున్నారు. రాష్ట్రంలోని రైతులు, ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్టార్టప్స్ నెలకొల్పానుకునేవారికి పోషాద్రి సాంకేతిక సలహాలు ఇస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పేరుమోసిన ఆహార సంస్థలైన నెస్లే, ఐటీసీ, ఎంటీఆర్ పుడ్స్, బాంబినో, బ్రిటానియా, ఓలం వంటి ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. -
పాలేకర్ ప్రకృతి సేద్యంపై అధ్యయన కమిటీ
సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతి(దీన్ని మొదట్లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే వారు) ని అనుసరించడం వల్ల ఒనగూడుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్ర అధ్యయనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పాలేకర్ నేర్పిన పద్ధతిలో అనేక రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. ఎస్. భాస్కర్ ఇటీవల నియమించారు. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన ఈ కమిటీకి ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. వి. ప్రవీణ్‌రావు సారధ్యంవహిస్తారు. ఈ ఉన్నత స్థాయి జాతీయ కమిటీలో ఐ.సి.ఎ.ఆర్. డీడీజీ డా. ఎస్. భాస్కర్‌తోపాటు మోదీపురంలోని భారతీయ వ్యవసాయ వ్యవస్థల పరిశోధనా సంస్థ సంచాలకులు డా. ఎ. ఎస్. పన్వర్, జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం సిక్కిం సంయుక్త సంచాలకులు డా. ఆర్. కె. అవస్థె, కోయంబత్తూర్‌లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సుస్థిర సేంద్రియ వ్యవసాయ విభాగం అధిపతి ప్రొ. ఇ. సోమసుందరం, ఉదయ్‌పూర్‌లోని ఎం.పి.ఎ.ఎ.టి. సేంద్రియ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ డా. ఎస్.కె. శర్మ, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా సేంద్రియ వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ డా. సి.ఎస్. యూలఖ్, అపెడా (ఘజియాబాద్) మాజీ సంచాలకుడు డా. ఎ. కె. యాదవ్, కేంద్ర వ్యవసాయ– సహకార– రైతుల సంక్షేమ శాఖ సంయుక్త కారదర్శి, నీతి ఆయోగ్ వ్యవసాయ సలహాదారు సభ్యులుగా ఉంటారు. భారతీయ సాగు వ్యవస్థల పరిశోధనా సంస్థ (మోదిపురం) ముఖ్య శాస్త్రవేత్త డా. ఎన్. రవిశంకర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇదీ కమిటీ అధ్యయన పరిధి.. 1 ఎస్.పి.ఎన్.ఎఫ్. (ఇంతకుముందు జడ్.బి.ఎన్.ఎఫ్. అనేవారు)పై వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అనుబంధ సంస్థల్లో, సేంద్రియ వ్యవసాయంపై అఖిలభారత నెట్వర్క్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన పరిశోధనా ఫలితాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఎస్.పి.ఎన్.ఎఫ్.పై భవిష్యత్తులో నిర్వహించే పరిశోధన వ్యూహాలలో చేర్చదగిన అంశాలపై సిఫారసులు చేస్తుంది. 2 సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) సాగు పద్ధతి బలాలు, బలహీనతలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలు, రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఫలితాలను అంచనా వేసేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది. 3 ఎస్.పి.ఎన్.ఎఫ్.ను దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తెస్తే భారత దేశంలో భూమి ఆరోగ్యం, ఉత్పాదకత, ఆహార ఉత్పత్తి, జీవనభృతులు, వ్యవసాయ రంగ సుస్థిరత తదితర అంశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నదీ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. 4 శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో ఎస్.పి.ఎన్.ఎఫ్. పద్ధతులను సమ్మిళితం చేయడానికి కమిటీ తగిన సూచనలు చేస్తుంది. ఈ కమిటీకి కాలపరిమితి లేదు. -
ఆనకట్టల భద్రతకు ఆమోదం
న్యూఢిల్లీ: డ్యాములు, నీటి రిజర్వాయర్ల రక్షణ కోసం ఉద్దేశించిన ఆనకట్టల భద్రత బిల్లు – 2018కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఆనకట్టల భద్రతకు పాటించాల్సిన విధానాలపై పరిశోధనలు జరిపి సిఫారసులు చేసేందుకు జాతీయ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో ఆనకట్టల భద్రతా ప్రమాణాలపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు, నిబంధనలను అమలు చేసేందుకు జాతీయ ఆనకట్టల రక్షణ సంస్థ (ఎన్డీఎస్ఏ)ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో పొందుపరిచామన్నారు. ఆనకట్టల రక్షణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకే రకమైన భద్రతా విధానాలను పాటించేందుకు కూడా బిల్లు తోడ్పడుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ ఇతర నిర్ణయాలు ► ఉన్నత వ్యవసాయ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2020 వరకు మొత్తంగా 2,225.46 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఏన్ఏఏఆర్ఎం), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుమెన్ ఇన్ అగ్రికల్చర్ (సీఐడబ్ల్యూఏ) తదితర సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. ► ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు – 2013ను వెనక్కు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. బిల్లులోని ప్రతిపాదిత మార్పులను విశ్వవిద్యాలయ పాలక మండలితో చర్చించి తుది నిర్ణయానికి రావాలన్న కారణంతో ఈ బిల్లును ఉపసంహరించుకోనున్నారు. ► కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) ఉప వర్గీకరణ అంశంపై పరిశీలన జరుపుతున్న కమిటీకి మంత్రివర్గం ఈ ఏడాది జూలై వరకు పొడిగింపునిచ్చింది. ►ఈశాన్య మండలికి అధ్యక్షుడిగా ఇకపై కేంద్ర హోం మంత్రి ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఈశాన్య మండలికి అధ్యక్షుడిగా ఉంటుండగా, ఇకపై ఆ శాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ►ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వద్ద హోటల్‌ను నిర్మించేందుకు 3.7 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు సంస్థకు 99 ఏళ్ల పాటు అద్దెకివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ►వైద్య, ఆరోగ్య రంగాల్లో పరిశోధన కోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)తో ఫ్రాన్స్‌లోని ఐఎన్ఎస్ఈఆర్ఎం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మంత్రివర్గం చర్చించింది. -
రాష్ట్రంలో కేంద్ర పథకాలకు బీజేపీ ముద్ర
• ఐసీఏఆర్ ఏర్పాటుకు • కేంద్రానికి రాష్ట్ర బీజేపీ వినతి సాక్షి, హైదరాబాద్: మరో రెండున్నరేళ్లలో అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ ముద్రపై బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. గత రెండున్నరేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి వేలాది కోట్ల సహాయం అందినా అది లెక్కలోకి రాకుండా పోయిందనే ఆందోళనకు గురవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, ఇళ్లు, ఇలా వివిధ రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున సహాయం అందినా అది తన గొప్పగానే టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారపార్టీ ప్రచారం చేసుకుంటున్నదనే అభిప్రాయంతో పార్టీ ముఖ్య నాయకులున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రానికి ఆయా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద ఇచ్చే నిధులపై కేంద్రం ముఖ్యంగా బీజేపీ ఇస్తున్నదనే ముద్ర ఉండేలా చూడాలని పార్టీ జాతీయ నాయకత్వానికి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. రెండురోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఇవి చర్చకు వచ్చాయి. కాగా, రాష్ర్టంలో వ్యవసాయాభివృద్ధికి, కొత్త వంగడాలపై పరిశోధన తదితర అం శాలకు దోహదపడేలా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని బీజేపీ కోరనుంది. -
పారిశ్రామికవేత్తలుగా ఎదగండి
తాడేపల్లిగూడెం : ఉద్యాన కోర్సులు పూర్తిచేసిన అనంతరం ఉద్యోగాల కోసం వెతుకులాడకుండా పరిశ్రమలు స్థాపించే దిశగా విద్యార్థులు ఆలోచన చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ( ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్రో సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మహాపాత్రో మాట్లాడుతూ ఉద్యాన రైతులు ఉద్యాన విభాగం నుంచి చాలా ఆశిస్తున్నారని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు ఎలా సాధించాలో వారికి చెప్పాలని అన్నారు. ఉద్యాన పంటల సాగులో యంత్రాల వినియోగం పెరిగిందని, జన్యుపరమైన రూపాంతరాలు అనేకం వచ్చాయని చెప్పారు. రైతులు ఉద్యాన పంటలను విస్తారంగా పండించడంతో పాటు మార్కెటింగ్, ఎగుమతులు చేయడం, మార్కెట్ బాగా లేనప్పుడు నిల్వ చేసుకోవడానికి వీలుగా ఐసీఏఆర్ నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నామన్నారు. ఉద్యాన డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రదానం చేశారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ బీఎంసీ రెడ్డి వర్సిటీ ప్రగతిని వివరించారు. -
త్వరలో వెటర్నరీ వర్సిటీకి ఐకార్ గుర్తింపు!
నేటి నుంచి ఐకార్ బృందం తనిఖీలు సాక్షి, హైదరాబాద్: పీవీ నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఐకార్ ఉన్నత స్థాయి బృందం బుధవారం హైదరాబాద్ రానుంది. వర్సిటీతో పాటు దాని పరిధిలోని పశు వైద్య కళాశాలలకు వెళ్లి మౌలిక సదుపాయాలపై తనిఖీలు చేయనుంది. వర్సిటీ పరిధిలో పశు విద్య, మౌలిక సదుపాయాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే ఐకార్ గుర్తింపు లభిస్తుంది. ఈ మేరకు అధికారులు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిసింది. ఈ బృందంలో బెనారస్ విశ్వవిద్యాలయానికి చెందిన డీన్ డాక్టర్ రమాదేవి సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఈ నెల 18 వరకు పర్యటించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు. -
కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు
హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రతాప్ గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యాన శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషి చేయడం వల్ల ఉద్యాన వర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు ఇస్తూ లేఖ పంపిందన్నారు. వర్సిటీలో ప్రస్తుతం వంద సీట్లు ఉండగా 2016-17 సంవత్సరానికి అదనంగా 50 సీట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఉద్యానవర్సిటీలో ఈ సంవత్సరానికి ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు 150 బీఎస్సీ హార్టికల్చర్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ ఆఫీసర్లు (హెచోఓ), హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(హెచ్‌ఈవో) ఉద్యోగాలు కల్పించేందుకు సానుకూలంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మెదక్ జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ 'ఐకార్'కు డీల్ కుదిరిందట
ముంబై : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థలు బీఎమ్ డబ్ల్యూ, డైమ్లెర్ లు సరికొత్త ఎలక్ట్రిక్ కారు రూపొందించడానికి యాపిల్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సహకార ఒప్పందానికి యాపిల్ నుంచి ఆమోదం లభించిందట. ఈ డీల్ తో టెక్నాలజీ దిగ్గజం యాపిల్, ప్రముఖ కార్ల కంపెనీ లు సంయుక్తంగా మార్కెట్లోకి వినూత్నమైన ఎలక్ట్రిక్ 'ఐకార్'ను తీసుకురానున్నాయని పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై స్పందించడానికి యాపిల్, బీఎమ్ డబ్ల్యూయూ, డైమ్లెర్ సంస్థలు తిరస్కరించాయి. ఓ జర్మన్ డైలీ గతేడాది బీఎమ్ డబ్ల్యూతో, ఇటీవల డైమ్లెర్ తో మాట్లాడిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. యాపిల్ ఎప్పటినుంచో మంచి నైపుణ్యాలు కలిగిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ కోసం చూస్తుందని, ముఖ్యంగా జర్మనీ సంస్థల వైపు గూగుల్ కన్నేసిందని రిపోర్టు చెబుతోంది. గూగుల్ కు పోటీగా యాపిల్ ఎప్పటినుంచో సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను తయారుచేయాలని సన్నాహాలు చేస్తోంది. గూగుల్, యాపిల్ సంస్థలే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని టెక్నాలజీ దిగ్గజాలు కూడా కార్ల తయారీ సంస్థలతో కలిసి ఇంటర్నెట్ కనెక్షన్ కార్లు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో పాల్గొంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇటీవలే సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ 'ఆటోపైలెట్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరోవైపు కెనడియన్-ఆస్ట్రేయన్ సంస్థ మాగ్న కూడా యాపిల్ తో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. -
మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు
మెదక్, ఆదిలాబాద్, ఖమ్మంలో ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించి, వాటిపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మూడు జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేం ద్రం నిర్ణయించింది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నిర్ణయించింది. ఒక్కో కేంద్రానికి ఐకార్ రూ.8 కోట్ల వరకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఆ జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను ఎక్కడ నెలకొల్పాలన్న విషయంపై ఐదుగురు సభ్యుల ఐకార్ ప్రతి నిధి బృందం రాష్ర్టంలో పర్యటిస్తుంది. కృషి విజ్ఞాన కేంద్రాలను ఎక్కడెక్కడ నెలకొల్పాలనే విషయంపై రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల అధికారులు ఎవరికివారు ప్రాంతాలను ప్రతిపాదిస్తున్నారు. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలించాక ఐకార్ బృందం తుది నిర్ణ యం తీసుకుంటుంది. మంగళవారం ఐకార్ బృందం అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని పరిశీ లిస్తుంది. బృందంతో పాటు రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రతాప్, ఇతర అధికారులుంటారు. అనంతరం ఐకార్ బృందం మెదక్ జిల్లా సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిల్లోనూ పర్యటిస్తుంది. శాస్త్రవేత్తల పోస్టుల భర్తీ... కృషి విజ్ఞాన కేంద్రాలను మూడు జిల్లాల్లో ఏర్పాటు చేశాక ఒక్కో కేంద్రంలో దాదాపు ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తల పోస్టులతో పాటు ఇతర పోస్టులూ భర్తీ చేసే అవకాశముంది. ఐకార్ నుంచి ఆమోదం లభించాక రాష్ట్ర ప్రభుత్వం ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనుంది.