
పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్షియస్ దాటితే డ్రాగన్‌కు ఇబ్బందే
కోలినైట్, నీమ్ సోప్, సీవీడ్ ఎక్స్‌ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్ కలిపి
పిచికారీ చేయాలంటున్న ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు
డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండ దెబ్బ(సన్ బర్న్) నుంచి కాపాడుకోవటం రైతులకు ఒక సవాలు వంటిదే. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటితే డ్రాగన్ ఫ్రూట్ చెట్లకు సన్ బర్న్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సమస్య వస్తుంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అనేక దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) సన్‌బర్న్ దెబ్బ నుంచి డ్రాగన్ పంటను కాపాడుకోవటానికి చేసిన సూచనలను తెలుసుకుందాం..
పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్షియస్ దాటితే రాత్రి–పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కూడా పెరుగుతుంది. ఇది కూడా చెట్టును బలహీనపరుస్తుంది. ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉండే డ్రాగన్ మొక్కల కాండాలు అధిక రేడియేషన్ వల్ల పత్రహరితాన్ని కోల్పోయి (బ్లీచ్‌డ్ అప్పియరెన్స్) తెల్లబోయి కాంతి హీనంగా కనిపిస్తాయి. అటువంటప్పుడు మొక్క పెరుగుదల మందగిస్తుంది.
ఆ దశలో గనక రక్షక చర్యలు తీసుకోకపోతే డ్రాగన్ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. మొక్క పశ్చిమ భాగంలోని డ్రాగన్ కాండాలకు సన్ బర్న్ నష్ట తీవ్రత 10% నుంచి 50% వరకు ఉంటుంది. కాండం కుళ్లు సోకుతుంది. ఇది విజృంభిస్తే ఏకంగా తోటలో మొక్కలన్నీటినీ రైతు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, సన్‌బర్న్ సమస్యను రైతులు సకాలంలో గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండల తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు.
పిచికారీ
ఎండ తీవ్రత వల్ల పత్ర రంధ్రాల్లో నుంచి నీటి తేమ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతుంటుంది. అటువంటప్పుడు మొక్కలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ ప్రక్రియను తగ్గించగలిగే యాంటీ–ట్రాన్స్‌పైరెంట్స్‌ను పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుంది. డ్రాగన్ తోటను సన్ బర్న్ నుంచి రక్షించుకోవటానికి కోలినైట్ (లీటరు నీటికి 50 గ్రాములు) + నీమ్ సోప్ (లీటరు నీటికి 4 గ్రాములు) తో పాటు సీవీడ్ ఎక్స్‌ట్రాక్ట్‌ను, హ్యూమిక్ యాసిడ్ (లీటరు నీటికి 4 ఎం.ఎల్.) కలిపి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పిచికారీ చేయాలని ఐఐహెచ్‌ఆర్ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. సన్ బర్న్ నష్ట తీవ్రతతో పాటు శిలీంధ్ర, బాక్టీరియా తెగుళ్ల బెడదను కూడా తగ్గిస్తుందని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలో పోల్‌కి 8–10 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా ఇస్తే ఎండ తీవ్రతను తట్టుకోవటానికి అవకాశం కలుగుతుందని
శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఎలుకలు కొరికేస్తున్నాయ్!
డ్రాగన్ ఫ్రూట్.. ఖరీదైనది, పోషకాలతో కూడినదే కాకుండా, దీన్ని సేంద్రియంగా సాగు చేయటం కూడా సులభం. గ్రామీణప్రాంతాలతో పాటు నగరాల పరిసరప్రాంతాల్లోనూ డ్రాగన్ ఫ్రూట్ తోటలు విస్తరిస్తున్నాయి. ఇంటిపంటలు, మిద్దె తోటల్లోనూ డ్రాగన్ సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ పంటకు ఎలుకల బెడద ఎదురవుతోందని కొల్లం (కేరళ) కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. కొల్లం జిల్లాలోని అనేకప్రాంతాల్లో డ్రాగన్‌కు ఎలుకల బెడద ఎదురవుతున్నట్లు సమాచారం రావటంతో కేవీకే భవనంపైనే ప్రయోగాత్మకంగా ఫైబర్ డ్రమ్ముల్లో డ్రాగన్ మొక్కల్ని పెంచారు. తెల్లవారుజామున 4–5 గంటల మధ్య ఎలుకలు డ్రాగన్ మొక్కల కాండం లోపలి గుజ్జును కొరికి తింటున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. శరీరం కన్నా తోక ఎక్కువ ΄÷డవున్న రకానికి చెందిన ఎలుకలు ఈ పని చేస్తున్నాయని గుర్తించారు. ఎలుకలు కొరికిన కాండం ద్వారా నీరు, పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దీంతో, పూత రాకపోవచ్చు. పూత వచ్చిన తర్వాత ఎలుకలు కొరికితే.. పూత, పిందెలు రాలిపోవచ్చు. అంతిమంగా, దిగుబడి తగ్గిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment