
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ ఆదాయం పెరుగుదలకు సృజనాత్మక ఆవిష్కరణలు చేస్తున్న రైతులే కీలకమని భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర స్పష్టం చేశారు. ఈ కారణంగానే తాము ఐసీఏఆర్ తరఫున రైతుల సృజనాత్మక పరిశోధనలకు ఒక వేదిక కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బెంగళూరులో జరుగుతున్న 107వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో త్రిలోచన్ మహాపాత్ర సోమవారం ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు కానున్న ప్రత్యేక కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో రైతుల కోసం వేదిక, సమావేశం, చర్చలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు.
శాస్త్రంతోనే సాధ్యం..
సైన్స్ ఆధారంగానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయని మహాపాత్ర తెలిపారు. మూడేళ్ల క్రితం వరకూ దేశంలో ఏడాదికి రూ.పది వేల కోట్లతో పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకునేవారని, టెక్నాలజీ ఆధారిత ప్రణాళిక ద్వారా గత మూడేళ్లలో పప్పు ధాన్యాల దిగుబడిని 6 నుంచి 9 మిలియన్ టన్నులకు పెంచడంతో దిగుమతులు నిలిచిపోయాయని అన్నారు. తద్వారా విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయగలిగామని తెలిపారు. భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడ్డ 55 శాతం జనాభాలో సుమారు 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, వీరి ఆదాయాన్ని పెంచేందుకు సమీకృత వ్యవసాయమే మేలైన మార్గమని సూచించారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.