రాష్ట్రంలో కేంద్ర పథకాలకు బీజేపీ ముద్ర
• ఐసీఏఆర్ ఏర్పాటుకు
• కేంద్రానికి రాష్ట్ర బీజేపీ వినతి
సాక్షి, హైదరాబాద్: మరో రెండున్నరేళ్లలో అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ ముద్రపై బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. గత రెండున్నరేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రానికి వేలాది కోట్ల సహాయం అందినా అది లెక్కలోకి రాకుండా పోయిందనే ఆందోళనకు గురవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, ఇళ్లు, ఇలా వివిధ రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున సహాయం అందినా అది తన గొప్పగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం, అధికారపార్టీ ప్రచారం చేసుకుంటున్నదనే అభిప్రాయంతో పార్టీ ముఖ్య నాయకులున్నారు.
ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రానికి ఆయా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద ఇచ్చే నిధులపై కేంద్రం ముఖ్యంగా బీజేపీ ఇస్తున్నదనే ముద్ర ఉండేలా చూడాలని పార్టీ జాతీయ నాయకత్వానికి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. రెండురోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఇవి చర్చకు వచ్చాయి. కాగా, రాష్ర్టంలో వ్యవసాయాభివృద్ధికి, కొత్త వంగడాలపై పరిశోధన తదితర అం శాలకు దోహదపడేలా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని బీజేపీ కోరనుంది.