లక్నో : 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మైభీ చౌకీదార్’ ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ నాయకులంతా ట్విటర్ అకౌంట్‌లో తమ పేరుకు ముందు చౌకీదార్ అని తగిలించుకుంటున్నారు. అయితే తాను పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోనందుకే పార్టీ తనకు టిక్కెట్ నిరాకరించిందని బీజేపీ ఎంపీ అన్షుల్ వర్మ ఆరోపించారు.
బుదవారం బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన అన్షుల్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ట్విటర్‌లో నా పేరుకు ముందు ‘చౌకీదార్’ అని తగిలించుకోలేదు. అదికాక ఈ మధ్య పార్టీ చేస్తోన్న కొన్ని పనులను వ్యతిరేకించాను. ఆలయ ప్రాంగణంలో బీజేపీ నాయకులు మద్యం సరఫరా చేయడాన్ని తప్పు పట్టాను. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడాను. అందువల్లే నాకు టికెట్ ఇవ్వలేదు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. దీని గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సైతం లేఖ రాశాను. కానీ ఆయన స్పందించలేద’ని అన్షుల్ వర్మ తెలిపారు.
అంతేకాక బీజేపీలో నిరంకుశత్వం రాజ్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను ఎస్పీలోకి ఎలాంటి షరతులు లేకుండా చేరానని అన్షుల్ తెలిపారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి విజయం సాధిస్తుందని అన్షుల్ ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో అన్షుల్ వర్మ హర్దోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం బీజేపీ ఈ టికెట్‌ను జై ప్రకాశ్ రావత్‌కు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment