GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా? | Devinder Sharma Write on Genetically Modified Mustard in India | Sakshi

GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా?

Jan 5 2023 4:22 PM | Updated on Jan 5 2023 4:29 PM

Devinder Sharma Write on Genetically Modified Mustard in India - Sakshi

జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది.

ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు కనుక్కోవడంతోనే సైన్స్‌ ప్రస్థానం మొదలవు తుందని మా సైన్స్‌ టీచర్‌ చెబుతూండేది. ఇంకోలా చెప్పాలంటే... సైన్స్‌ ఎల్లప్పుడూ ప్రశ్నలకు సిద్ధంగా ఉంటుందీ అనాలి! దీనివల్ల సాంఘిక, ఆర్థిక ఆందోళనలకు తావిచ్చే, పర్యావరణ విధ్వంసానికి దారితీసే అపోహలను తొలగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై వ్యాఖ్యానం చేయవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కారణంగా సత్యాన్వేషణ తాలూకూ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రదర్శించే సాక్ష్యాలు కూడా నమ్మదగ్గవిగా ఉండవు. విషయం ఏమిటంటే... జన్యుమార్పిడి పంటలపై ఎప్పుడు చర్చ మొదలైనా, సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లాలని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూంటారు. తద్వారా శాస్త్రీయ సమాచారం, వాదం, ప్రజా విచారణలన్నీ పక్కకు తొలగిపోయేలా చేస్తూంటారు.

దేశంలోకి మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటీ కాటన్‌ను 2001లో వాణిజ్యస్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో జరిగిన జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ (జీఈఏసీ) సమావేశాల్లో పాల్గొన్న వారిలో నేనూ ఉన్నాను. జన్యుమార్పిడి పంటల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ఈ జీఈఏసీ సభ్యులతోపాటు, ‘జెనిటిక్‌ మ్యానిపులేషన్‌ అండ్‌ ద మానిటరింగ్‌ కమిటీ’కి సంబంధించిన పర్యవేక్షణ బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. బీటీ పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసిన మహికో – మోన్‌శాంటో సభ్యులు, కొంతమంది పౌర సమాజపు ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. రెండు నెలలు ఆలస్యంగా నాటినా ఆ ఏడాది పత్తి పంట దిగుబడి యాభై శాతం ఎక్కువైనట్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోందని సమావేశంలో ప్రస్తావించారు. బీటీ కాటన్‌ కారణంగానే ఇలా జరిగిందనడంతో ఆశ్చర్యం వేసింది నాకు.

ఆ సమాచారం తప్పనీ, అశాస్త్రీయమైందనీ, దాన్ని ఏదైనా పరిశోధన సంస్థతో నిర్ధారించాలనీ నేను పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, అప్పటి ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ను కోరాను. సాధారణ పరిస్థితుల్లో ఎదిగేందుకు ఐదు నెలల సమయం తీసుకునే పంటలో రెండు నెలలు ఆలస్యంగా విత్తినా అధిక దిగుబడి సాధించడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ పరి శోధనల్లో విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైన అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంశంలో ఒక ప్రైవేట్‌ కంపెనీకి మినహాయింపు ఇస్తే, భవిష్యత్తులో యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కూడా విత్తిన సమయం గురించి పట్టించుకోవద్దని చెప్పే అవకాశం ఏర్పడుతుంది. జీఈఏసీ ఛైర్మన్‌కు నేను వేసిన ప్రశ్న ఏమిటంటే– రెండు నెలలు ఆలస్యంగా విత్తినా దిగుబడి పెరగడ మంటే... అది రైతులకు చాలా ప్రయోజనకరమైంది కాబట్టి, రైతులందరూ రెండు నెలలు ఆలస్యంగా విత్తుకోవాలని ఎందుకు సలహా ఇవ్వకూడదూ? అని!

ఈ సమావేశం పూర్తయిన తరువాత సాయంకాలం ఐసీఏఆర్‌ ఉన్నతాధికారి ఒకరు నాతో మాట్లాడుతూ, బీటీ విత్తనాల ట్రయల్స్‌ ఇంకో ఏడాది చేయాల్సిందిగా మహికో–మోన్‌శాంటో కంపెనీని కోరినట్లు తెలిపారు. అవసరమైనంత మేర అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు మోన్‌శాంటో చెప్పినా జన్యుమార్పిడి పంటల అనుమతిని ఒక ఏడాది ఆలస్యం చేయగలిగామన్నమాట. ఆ సమావేశంలో ప్రశ్నలేవీ వేయకుండా ‘సాక్ష్యాల’ ఆధారంగా అనుమతులిచ్చి ఉంటే ఏడాది ముందుగానే జన్యుమార్పిడి పంటలు దేశంలోకి వచ్చేసి ఉండేవి. 

బీటీ వంకాయపై నిషేధం
దేశంలోకి బీటీ వంకాయ అనుమతిని నిరాకరిస్తూ 2010లో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఒక ప్రకటన చేశారు. ‘డెసిషన్‌ ఆన్‌ కమర్షియలైజేషన్‌ ఆఫ్‌ బీటీ బ్రింజాల్‌(బీటీ వంకాయ వాణిజ్యీకరణ మీద నిర్ణయం)’ పేరుతో అప్పట్లో 19 పేజీల డాక్యుమెంట్‌ ఒకటి విడుదలైంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా నా అంచనా ప్రకారం ప్రతి వృక్ష శాస్త్రవేత్తా కచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్‌ అది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలతో, ఏడు దఫాలుగా ప్రజలతో సంప్రదింపుల తరువాత జైరామ్‌ రమేశ్‌ ఆ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. జన్యుమార్పిడీ టెక్నాలజీపై రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశం మొత్తమ్మీద వంకాయ పండించే ప్రాంతాల్లో సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. జాగరూకత, ముందస్తు జాగ్రత్త, సిద్ధాంతాల ఆధారంగా జైరామ్‌ రమేశ్‌ ఒక నిర్ణయం తీసుకుంటూ... ఏ కొత్త టెక్నాలజీ అయినా ఆయా సముదాయాల సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. 

మీడియాలో ఒక వర్గం జన్యుమార్పిడి పంటలపై బహిరంగ విచారణను తోసిపుచ్చింది. అంతా బూటకం అని కొట్టి పారేసింది కూడా. అయితే ప్రజలు లేవనెత్తిన కీలకమైన అభ్యంతరాలను మంత్రి గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఆనందం కలిగించింది. అంతేకాదు... జన్యుమార్పిడి విత్తన సంస్థల అధ్యయనాల నియమాలు, సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ఫలితాలన్నింటినీ ప్రస్తావిస్తూ డాక్యుమెంట్‌ను రూపొందించడమూ ప్రశంసనీయమైన అంశం.

జాగరూకతతోనే ముందుకు
వాస్తవ పరిస్థితులకూ, కొందరు సేకరించే సాక్ష్యాలకూ మధ్య ఉన్న అంతరం సైన్స్‌ ఆధారిత పద్ధతుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. శాస్త్రపరమైన విచారణను పరిమితం చేయడం మార్కెట్‌ పోకడల్లో ఒకటి. వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లు సైన్స్‌ను తొక్కేసేందుకూ ప్రయత్నిస్తూంటాయి. జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. ఈ డీఎంహెచ్‌–11 జన్యుమార్పిడి ఆవాల పంట దిగుబడి సామర్థ్యం ఎంతన్నది ఐసీఏఆర్‌కూ తెలియక ముందే పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. దేశ వంటనూనె దిగుమతులను ఈ సరికొత్త ఆవాల ద్వారా తగ్గించుకోవచ్చు అన్న భావనను కలిగిస్తున్నారు. అయితే దీని దిగుబడి చాలా తక్కువ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదెంత తప్పుడు భావనో అర్థమైపోతుంది. 

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... జీఎం ఆవాల పరీక్షలకు అన్ని ప్రోటోకాల్స్‌ను ఢిల్లీ యూనివర్సిటీ స్వయంగా సిద్ధం చేసింది. విద్యార్థినే ప్రశ్నాపత్రం తయారు చేయమని అడగటం లాంటిది ఇది. అంతేకాదు... హెర్బిసైడ్ల(గడ్డిమందుల)ను తట్టుకునే ఆవాల వెరైటీ బీటీ వంకాయ మాదిరిగా కనీస పరీక్షలను కూడా ఎదుర్కోలేదు. జీఎం ఆవాల పరీక్షల్లో ఆరోగ్య నిపుణులు ఎవరూ లేకపోవడం, తేనెటీగలపై జీఎం ఆవాల ప్రభావం ఏమిటన్నది పరిశీలించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపాలు. ఇన్ని లోపాల మధ్య జీఈఏసీ విత్తనాల వృద్ధికి ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదు. 

సైన్స్‌ అంటే సత్యాన్ని వెతకడం. ఇటాలియన్‌–బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ మైకెలా మాసిమీ 2017లో లండన్‌ రాయల్‌ సొసైటీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో అచ్చంగా ఈ వ్యాఖ్యే చేశారు. ‘‘ప్రజలకు సైన్స్‌ విలువను అర్థమయ్యేలా చేయడం మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. కచ్చితత్వం, సాక్ష్యాలు, సిద్ధాంతాలపై విశ్వాసం, కచ్చితమైన పద్ధతులను అవలంబించడం వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించాలి’’! (క్లిక్‌ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!)


- దేవీందర్‌ శర్మ 
ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement