అభిప్రాయం
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్, ‘తాను 2025 జనవరి 20న అధికారం చేపట్టిన వెంటనే అమెరికాతో వాణిజ్యం చేస్తున్న మూడు అగ్రభాగ దేశాలైన చైనా, కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలను విధిస్తానని’ చెప్పారు. చైనాపై ఇప్పటి వరకూ ఉన్న 60 శాతం సుంకాలతో పాటుగా అదనంగా 10 శాతం, కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలను విధిస్తానని ప్రకటించారు. అమెరికా సరిహద్దు వెంబడి అక్రమ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనీ, అనధికార వలసదారుల ప్రవేశానికి ప్రతిస్పందనగా తాజా చర్యలు తీసుకోబోతున్నాననీ నవంబరు 26 నాడు ప్రకటించారాయన.
తాజాగా నవంబరు 30న ఏకంగా బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలను విధిస్తానని ప్రపంచం విస్తుపోయేలా ప్రకటించారు. ‘బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ దేశాలు) డాలరుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ కరెన్సీకి కృషి చేస్తే... బ్రిక్స్ దేశాలు అద్భుతమైన, శక్తిమంతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య సంబంధాలకు వీడ్కోలు చెప్పాలి. డాలరును వ్యతిరేకించననే నిబద్ధత ఈ దేశాల నుంచి మా కవసరం’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.
2023లో ప్రపంచ దేశాలతో మొత్తం 773 బిలియన్ల (77,300 కోట్ల డాలర్లు) వాణిజ్య లోటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ జబ్బుపడి ఉంది. కేవలం బ్రిక్స్ దేశాలతోనే 43,350 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును అమెరికా కల్గి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనాతో 279 బిలియన్లు (27,900 కోట్ల డాలర్లు), మెక్సికోతో 15,200 కోట్ల డాలర్లు, చిన్న దేశమైన వియత్నాంతో 10,400 కోట్ల డాలర్ల వాణిజ్యలోటును కలిగి తన కృత్రిమ డాలరు మారకపు విలువతో పబ్బం గడుపుకుంటోంది.
బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతులను నిషేధిస్తే... ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే తయారీ వస్తువులను వర్తమాన దేశాలకు, యూరప్‌కు మళ్లించే అవకాశాలుంటాయి. అమెరికాలోని వస్తు ఉత్పత్తి రంగం వెనుకబడి ఉంది. స్వదేశీ డిమాండును ఇప్పుడున్న అమెరికాలోని పరిశ్రమలు తీర్చలేవు. అందువల్ల వస్తు ధరలు విపరీతంగా పెరగవచ్చు. బ్రిక్స్ దేశాలు కొత్త మార్కెట్లను వెతుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశకు మరలవచ్చు. డాలరు ఏకఛత్రాధిపత్యం కోసం అమెరికా తీసుకొంటున్న చర్యలకు ప్రత్యామ్యాయంగా ఇప్పటికే 3 దశాబ్దాల నుండి యూరో కరెన్సీని ఐరోపా యూనియన్ ప్రవేశపెట్టింది. చైనా, రష్యాలు పరస్పరం తమ కరెన్సీలతోనే వాణిజ్యం చేసుకొంటున్నాయి.
2వ ప్రపంచ యుద్ధంలో నష్టపోని అమెరికా ఆయుధ అమ్మకాలతో విపరీతమైన బంగారు నిల్వలను పోగు చేసుకొంది. 1944 జులై నుంచి ‘బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్’ అనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థను ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 44 దేశాల మద్దతుతో డాలరును అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా ఏర్పాటు చేసుకొని 1971 వరకూ బంగారం ఆధారిత డాలరుగా కొనసాగించింది. వాస్తవానికి తన వద్దనున్న బంగారు నిల్వలకు పొంతన లేకుండా డాలరు నోట్లను ముద్రించుకొంటూ ఆధిపత్యం చలాయించింది. ప్రస్తుతం అమెరికా వద్ద 8,133.46 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఈ నిల్వలను అమ్మితే వచ్చే 69,100కోట్ల డాలర్లతో అమెరికా సుమారు 36 లక్షలకోట్ల రుణాలను ఎలా తీరుస్తుంది?
1971 మేలో జర్మనీ డాలరుతో తెగతెంపులు చేసుకొని బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ నుంచి బయటపడిన 3 నెలల్లోనే అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధి సాధించింది. డాలరుతో పోల్చుకొంటే జర్మన్ మార్కు 7.5 శాతం వృద్ధి రేటు సాధించింది. వెనువెంటనే ప్రపంచ దేశాలన్నీ డాలరు విలువను బంగారం విలువతో సరిపెట్టమని డిమాండు చేశాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు జర్మన్ బాటలో పయినించటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అమెరికా బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ ఆధిపత్యాన్ని కోల్పోయింది. 1971లో (ప్రెసిడెంట్ నిక్సన్ షాక్‌గా పిలవబడే) బంగారు నిల్వతో డాలరు విలువను రద్దు చేసుకొని నేటి ‘డాలర్ ఫియట్ ఫ్లోటింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ట్రంప్ విధిస్తానన్న వాణిజ్య ఆంక్షలతో బ్రిక్స్ కరెన్సీ ఏర్పడి... రానున్న కాలంలో డాలర్, యూరోలతో పోటీపడినా ఆశ్చర్యపోనవసరంలేదు. అదీగాక రష్యా, చైనా, భారత్ దేశాలు వాణిజ్యపరంగా ఐక్యమైతే ప్రపంచ దిశనే మార్చే అవకాశం ఉంది. ఒకప్పటి ప్రపంచాన్ని తమ కరెన్సీలతో ఆధిపత్యం చలాయించిన దేశాలన్నీ ఇప్పుడు అత్యంత బలహీనమైన ఆర్థికదేశాలుగా మిగిలాయి. అమెరికా కూడా ఈ తరహా దేశంగా మిగులుతుందని ట్రంప్ భయం. పరిస్థితులును పసిగట్టిన ట్రంప్ వాణిజ్య సుంకాలతో ఈ కృత్రిమ డాలరు విలువను నిలబెట్టాలని
అనుకుంటున్నారు.
- బుడ్డిగ జమిందార్
కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment