
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రధాని నరేంద్రమోదీని మెచ్చుకున్నారు. వాషింగ్టన్- భారతదేశం మధ్య సుంకాల చర్చలపై ఆయన సానుకూల వైఖరి ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తి అని సుంకాల విషయంలో ఇరుదేశాల మధ్య పరస్పర సమన్వయం ఉంటుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్ ఆ మర్నాడే భారత్ సుంకాలపై స్పందించారు. ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా వచ్చారని, తమ మధ్య మంచి స్నేహం ఉన్నదన్నారు. అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) చాలా తెలివైన వ్యక్తి అని, తామ సుంకాల విషయంలో చర్చలు జరిపామని, ఇది అమెరికా, భారత్‌లకు మంచి చేస్తుందన్నారు. అమెరికాలోకి దిగుమతి చేసుకున్న వాహనాలపై ట్రంప్ సర్కారు 25 శాతం సుంకాన్ని విధిస్తూ ఒక ప్రకటన చేసింది. ఇది ఏప్రిల్ 2 నుండి అమలులోకి రానుంది.
భారతదేశం విధించే అధిక సుంకాలను హైలైట్ చేసిన ట్రంప్ తాము కూడా త్వరలో పరస్పర సుంకాలను విధిస్తామని, వారు మా నుంచి వసూలు చేస్తే, మేము వారి నుంచి వసూలు చేస్తామన్నారు. భారత్, చైనాలు లేదా అక్కడి కంపెనీల విషయంలో తాము న్యాయంగా ఉండాలనుకుంటున్నామని, పరస్పర అంగీకారంలో సుంకాల విధింపు ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీని సందర్శించి ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు తమ నూతన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ‘మిషన్ 500’గా నిర్ణయించారు. 2030 నాటికి ఇరు దేశాల వస్తు, సేవల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్థారించారు.
ఇది కూడా చదవండి: నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు