వాషింగ్టన్ : అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకొంటూ భారత్, చైనా నేటికీ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) కల్పించే ప్రయోజనాలను పొందుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇకపై తాను ఇలా జరగబోనివ్వనని హెచ్చరించారు. భారత దిగుమతులపై టారిఫ్‌లు పెంచేయడంతో.. భారత్ కూడా అంతే దీటుగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది. గతేడాది భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, జీఎస్‌పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా ఈ ఏడాది మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై గత నెల నుంచి టారిఫ్‌లను పెంచింది. అదే విధంగా చైనాతో కూడా ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచాయి.
ఈ నేపథ్యంలో పెన్సుల్వేనియాలో మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ...ఆసియాలో రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లను ఇకపై అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించకూడదని వ్యాఖ్యానించారు. ఈ సాకు చూపి చాలా ఏళ్లుగా ఈ రెండు దేశాలు వాణిజ్య సంస్థ నుంచి అనేక ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు డబ్ల్యూటీవోలోని లొసుగులు అడ్డుపెట్టుకుంటాయని, ఇకపై అలా చేస్తే యూఎస్ ట్రేడ్ రిప్రంజంటేటివ్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆసియా దేశాలతో పాటు టర్కీ కూడా డబ్ల్యూటీవో నిబంధనలను నీరుగార్చి ప్రయోజనాలు పొందుతోందని ఆరోపించారు. ‘ అన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలే. మేము మాత్రం అందుకు మినహాయింపే కదా. ఆ పేరు చెప్పుకొని వారంతా లాభం పొందుతున్నవారే. ఈ విషయంలో డబ్ల్యూటీవో మా వాదనను తప్పుబట్టదనే అనుకుంటున్నా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment