‘‘తనకొక శత్రువును సృష్టించుకోకుండా అమెరికా బతుకు తెల్లారదు. ఎవరా శత్రువు? అమెరికా తన సైనిక విస్తరణ కోసం, దేశంలో అత్యంత భారీ పరిశ్రమ అయిన సైనిక వ్యవ స్థను సాకడానికయ్యే వ్యయభారమే దాని అసలు శత్రువు’’. – డాక్టర్ పాల్‌క్రీగ్ రాబర్ట్స్, ప్రసిద్ధ అమెరికా పరిశోధకుడు, విశ్లేషకుడు
‘‘అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం (జూలై 4) సందర్భంగా మౌంట్ రష్‌మోర్‌లో జరిగిన సభలో ప్రెసిడెంట్ ట్రంప్ అవివేకమైన, ప్రజల ఐక్యతను చీలగొట్టే ప్రసంగానికి ఒడిగట్టారు. దేశంలో ‘వామపక్ష ఫాసిజం’ మళ్లీ తలెత్తుతోందనీ, దీన్ని అనుమతిస్తే అమెరికా విలువలను, చరిత్రనూ అది తుడిచిపెట్టేస్తుందని, ఆ పని కోసమే అది అరాచకాన్ని రెచ్చగొడుతూ దేశాన్ని నియంతృత్వ ధోరణుల వైపు నడిపిస్తోందని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇవన్నీ నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఆయన చేస్తున్న ఆరోపణలే. నేడు వామపక్ష ఫాసిజం మన చరిత్రను తుడిచిపెట్టి, అమెరికాకు గర్వ కారణమైన యోధాగ్రేసరులను అపహాస్యం చేస్తూ, మన చిన్నారుల భవి ష్యత్తును చిదిమేస్తూ, మన చారిత్రక నిర్మాణాలను కూలగొట్టడానికి ఉద్యమిస్తోందని ట్రంప్ అన్నారు’’ – వాషింగ్టన్ నుంచి అని కిరణ్ రిపోర్ట్. ‘హిందూ’ (5.7.2020)
డొనాల్డ్ ట్రంప్ ఉన్మాదపూరిత ‘పూనకపు’ ప్రకటనలకు ఇది ఆదీ కాదు, అంతమూ కాదు. ప్రపంచ వ్యాపితంగా తన సైనిక–పారిశ్రా మిక యుద్ధ వ్యవస్థ ఆధారంగా అమెరికా సాగిస్తూ వస్తున్న దురాక్ర మణ యుద్ధాలకూ, కోట్లాది ప్రజలపై సాగించిన దమనకాండకు, అసంఖ్యాకమైన హత్యలకూ లెక్కలేదు, ఈ క్షణం దాకా ఆటవిడుపూ లేదు. అయినా సరే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో, ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య, ఆసియా దేశాల మధ్య సరికొత్తగా తంపులుపెట్టి, తమాషా చూడాలని అమెరికా ఉవ్విళ్లూరు తోంది.
ఇందుకు తొలి బాణంగా ముందు అమెరికా ప్రజల ముందు ‘సోషలిజం’ లేదా ‘వామపక్ష ఫాసిజం’ పేరిట ఒక బూచీని గత సంవ త్సరన్నర కాలంగా ప్రదర్శిస్తూ స్థానిక ప్రజల్ని అమెరికా పాలకులు బెదిరిస్తున్నారు. ఆ ‘బూచీ’ చాటుననే ఆసియా, ఆఫ్రికా, ఆసియా– పసిఫిక్ ప్రాంత స్వతంత్ర దేశాల్ని కూడా అమెరికా సామ్రాజ్య పాల కులు బెదిరిస్తున్నారు. ఈ తాజా బెదిరింపులలో ఒకటి–పాత వలస సామ్రాజ్యవాద పాలకుల సామ్రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా ఆసియా దేశాల సరిహద్దుల్ని నామరూపాలు లేకుండా చెరిపేస్తూ రావటం.
సరికొత్త విస్తరణవాదం వైపుగా అమెరికా
ఈ చారిత్రక అవశేషంలో భాగంగానే ఆసియా, ఆఫ్రికా స్వతంత్ర దేశాల మధ్య ఏర్పడిన తగాదాలు అపరిష్కృతంగానే ఉండిపోవడం అనేది.. సరికొత్త ప్రపంచ సామ్రాజ్య శక్తిగా సైనిక బలంతో ఎదిగిన అమెరికా విస్తరణవాదానికి మరొక అవకాశంగా మారింది. భారత్–చైనాల మధ్యనే కాదు.. సింహళం, సిక్కిం, నేపాల్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల మధ్య, లాటిన్ అమెరికా దేశాల మధ్య ‘యుద్ధ కాండ’ నడపకుండా అమెరికన్ సామ్రాజ్యవాదానికి దాని సైనిక– పారిశ్రామిక వ్యవస్థకూ ఉనికి లేదని గమనించాలి. ఈ అమె రికా ‘ఉనికివాదమే’ ఇతర దేశాల స్వతంత్ర ప్రతిపత్తి ఉసురుతీస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదం సిద్ధాంతం– ‘దేశాలు, వాటి సంపద నా సొంత ఆస్తి, వాటి అస్తిత్వం నా అస్తిత్వానికి చేటు, కనుక సకల దేశాలను శాసించే జన్మహక్కు ఒక్క అమెరికాకే ఉంది’ ఇదీ వరస!
ఈ కారణం చేతనే ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వలసగా బతికిన అమెరికా ఆ వలస బానిస బతుకు నుంచి తిరుగుబాట్ల ద్వారా స్వతంత్ర దేశంగా ఉనికిని చాటుకున్నా, అబ్రహాం లింకన్ దక్షిణాదిలో తెల్లవాడి బానిసత్వం నుంచి నల్లవాడి విమోచన కోసం ఉద్య మించి వేరుపడే దాకా జాతుల స్వాతంత్య్రానికి విలువ లేకుండా పోయింది. కానీ, ఇప్పటికీ అమెరికా తన గత చరిత్రను మరచిపోయి నలుపు– తెలుపు వర్ణవివక్షా చదరంగపు ఆటలోనే మగ్గిపోతోంది. ఈ ఛాయ లన్నింటినీ అమెరికా నయా సామ్రాజ్య పాలకులు పుణికి పుచ్చుకొని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల ప్రజలను పీడిస్తూనే ఉన్నారు, ప్రపంచబ్యాంకు, దాని అనుబంధ పెట్టుబడి, రుణ సంస్థ లను శాసిస్తూ ఈ ఖండాల ప్రజలను, సంపదను దోచుకుతింటు న్నారు. తిరగబడుతున్న ప్రజలపైన అమెరికా పాలకులు తమ సైనిక పారిశ్రామిక వ్యవస్థ ద్వారా హింసాకాండకు ఒడిగడుతున్నారు.
అందుకే సుప్రసిద్ధ అమెరికా మీడియా పరిశోధనా సంస్థలలో ఒకటైన ‘‘సాకర్‌ధార’’.. ఇటీవల అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయి డ్‌ను హత్య చేసిన అమెరికన్ పోలీసుల చర్యను, పై వివిధ నగరాలలో వచ్చిన ప్రజా వెల్లువను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్య గమనించదగింది. ‘కొందరు ఈ వెల్లువను చూసి విప్లవం అనుకుంటున్నారు. కానీ అది సరైన వర్ణన కాదు, ఎందుకంటే, విప్లవం అనేది కేవలం అధికారంలో ఉన్న వ్యక్తుల్ని మార్చేది కాదు, పాలనా వ్యవస్థనే మౌలికంగా, మూల ముట్టుగా మార్చేసే నూతన వ్యవస్థ ప్రతిష్టాపనగా ఉండేది. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది అన్యాయంపై తిరుగుబాటు మాత్రమే, అయితే అది అమెరికాలో నేటి సామాజిక వ్యవస్థ పతనావస్థకు తొలి దశగా మాత్రమే చూడాలి’ (సాకర్ ధార: రివ్యూ) ఈ దృష్ట్యా చూసిన ప్పుడు నేడు ప్రపంచవ్యాపితంగా పతనదశలో ప్రవేశించినా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా అమెరికా సామ్రాజ్యవాద దురాక్ర మణ వ్యూహాలు ఆగలేదు.
చైనాను కబళించడమే అసలు లక్ష్యం
రాజకీయ, ఆర్థిక సామ్రాజ్య విస్తరణలు ప్రపంచ యుద్ధాలకు దారి తీయటం మనకు తెలుసు! బహుశా ఈ దృష్ట్యానే అమెరికా సుప్రసిద్ధ మాజీ దౌత్యాధికారి మార్క్ బ్రెజెన్సీ్క ఇలా అని ఉంటాడు. ‘అమె రికాలోని రాజకీయ, సైనిక, బడా వర్తక వ్యాపార వర్గాలు చైనాను కబ ళించాలని ఎదురుచూస్తున్నాయి’ అన్నాడు! ఈ విషయంలో అమెరికా పాలకవర్గాలయిన రిపబ్లికన్‌లకు, డెమోక్రాట్స్‌కు తేడా లేదు, దొందు దొందే! అందుకే అమెరికా అఖిల కార్మిక ఫెడరేషన్ ఈ రెండు పార్టీలను కలిపి ‘డెమోపబ్లికన్స్’ అని (డెమోక్రాట్స్–రిపబ్లి కన్స్) ఏనాడో నామకరణం చేసింది! కనుకనే మొన్న జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్య సందర్భంగా యావత్తు అమెరికాలో ప్రజలు వినిపిం చిన సామాజిక నినాదం ఒకటే. ఈ నకిలీ ప్రజాస్వామ్యంలో ఇక ‘మాకు శ్వాస ఆడటం లేదు. గాలి పీల్చుకోలేకపోతున్నాం’ అని వారు నినదించవలసి వచ్చింది. నేడు ఆ ‘శ్వాసకోశవ్యాధి’ మొత్తం ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకే చుట్టుకుంది. ‘హౌడీ మోదీ’ అని ట్రంప్ అన్నా, ‘నమస్తే ట్రంప్’ అని మనం అన్నా ఆసియాలో అమె రికా దురాక్రమణ విస్తరణ మాత్రం ఆగబోవడం లేదని గుర్తించాలి!
అమెరికాలో ఇవాళే కాదు, రేపు ఎవరు ప్రెసిడెంట్‌గా ఎన్నికైనా నిరంతరం ‘యుద్ధ నినాదమే అమెరికా విధానం’గా ఉంటుందన్న ప్రసిద్ధ అమెరికా పరిశోధక విశ్లేషకుడు డాక్టర్ పాల్ క్రీగ్ రాబర్ట్స్ మాట అక్షర సత్యం. అంతేగాదు, అమెరికా యుద్ధ వ్యూహాన్ని, కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా వివిధ దేశాల్లో టెర్రరిస్టు గుంపులను పెంచడం కూడా అమెరికా విధానమే. ప్రపంచంలోని 120 దేశాలలో గత వందేళ్ళలోనూ అమెరికా చర్యల్ని పూసగుచ్చి వివరిస్తూ అమెరికా చారిత్రకుడు నిక్ టర్సీ ‘అమెరికా యుద్ధ రహస్యాలు’ (సీక్రెట్ హిస్టరీ ఆఫ్ యూఎస్‌ఎస్‌ఆర్) గ్రంథంలో వివరించాడు. అఫ్గానిస్తాన్, ఇరాక్ దేశాలను ఆక్రమించడంతో సహా మొత్తం 120 దేశాలలో అమెరికా పాలకులు సృష్టించిన దురాక్రమణలను, యుద్ధాలను పేరుపేరునా నిక్ టర్సీ పేర్కొన్నాడు. వీటన్నింటిలోనూ స్పెషల్ ఆపరేషన్స్ పేరిట రహస్య సర్వీసులను అమెరికా విస్తరించింది.
ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో రెక్కలు విప్పుకుంటున్న ఫాసిజం
ట్రంప్ అధికారంలోకి వచ్చిన (2017) తొలి సంవత్సరంలోనే 149 దేశాలలో 70,000 మంది సైనికులలో ప్రత్యేక దళాల్ని విస్తరించాడు. ప్రెసిడెంట్ ఒబామా హయాంలో రహస్యంగా ‘సీల్’ సైనిక బృందాల్ని పంపి అమెరికానే పెంచిన బిన్‌లాడన్‌ను హతమార్చింది. ఇలా పశ్చి మాసియా, ఆఫ్రికాలతో జోక్యం చేసుకొని చొరబడి వేలాదిమంది పౌరుల్ని అమెరికా తన పొట్టన పెట్టుకుంది! అపాచీ యుద్ధ విమా నాల్ని మన పాలకులకు 2019 అక్టోబర్‌లో అమెరికా పంపించింది. ఇరాక్‌లో సెక్యులర్ అధినేత సద్దాం హుస్సేన్‌ను హత మార్చింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ ఆసియా, ఆఫ్రికా సైనిక స్థావరాలైనా సరే.. అమెరికా సామ్రాజ్యవాద పాలకులకు విహార కేంద్రాలుగా మారాయి. అంతర్జాతీయ సూత్రాలు, నియమాలు, అంతర్జాతీయ న్యాయస్థానా లను ఉల్లంఘించే స్వేచ్ఛను నిరంకుశంగా అమెరికా సామ్రాజ్య పాలకులు నేటికీ యధేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఇస్లామిక్ నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాదీని, అతని కుటుంబాన్ని హతమార్చిందీ అమెరికాయే. నిన్నగాక మొన్ననే, ఇరాన్ ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్న సర్వసేనాధిపతి సులేమాన్‌ను రహస్యంగా హతమార్చిందీ అమెరికాయే.
ఒక్కమాటలో ఇలా బల్గేరియానుంచి రుమేనియా దాకా, బుర్కి నాఫాసో నుంచి సోమాలియా దాకా, చిలీ నుంచి గ్వాటిమాలా వరకు, ఫిలిప్పైన్స్ నుంచి దక్షిణ కొరియా దాకా స్థానిక తైనాతీ పాలకులకు అమెరికా ‘గొడుగులు’ పట్టి కూర్చుని ఉంది. ఇలా ప్రపంచంలోని 72 శాతం దేశాలలో (141 దేశాలు) అమెరికా ప్రత్యేక దళాలు పని చేస్తున్నాయి. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో చైనాను కవ్విస్తూ అమెరికా తిష్టవేస్తోంది. ఇలా ఒక వైపున అమెరికాలో ట్రంప్ మాటల్లో ‘వామపక్ష ఫాసిజం’ విస్తరిస్తుండగా, ఇటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఫాసిజం జడలు విప్పు కుంటుంది.
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment