వాషింగ్టన్: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇదొక దురదృష్టకరమైన పరిస్థితి అని, ఇరు దేశాల మధ్య తలెత్తిన విభేదాలు తొలగిపోయేందుకు తమ వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా భారత్‌ను బెదిరించే స్థితిలో ఉందని భావించడం లేదని, భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా గొప్పగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. అదే విధంగా తూర్పు లదాఖ్‌లో నెలకొన్న ఘర్షణల విషయం గురించి ఇరు దేశాలతో మాట్లాడుతున్నామని, మధ్యవర్తిత్వానికై సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.(చదవండి: పోస్టల్ ఓట్లకు భారీ డిమాండ్)
ఈ సందర్భంగా ట్రంప్.. ఇండో- అమెరికన్ల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ‘‘ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు. బాగా పనిచేస్తున్నారు. మనకు ఇండియా నుంచి, ప్రధాని మోదీ నుంచి మద్దతు ఉంది. నాకు తెలిసి భారత మూలాలున్న ప్రజలు ట్రంప్‌కే ఓటు వేస్తారని భావిస్తున్నా. నేను ఇండియాకు వెళ్లి వచ్చాను. అక్కడి ప్రజలు ఎంతో మంచివాళ్లు. ఓ గొప్ప వ్యక్తి వాళ్లకు నాయకుడిగా ఉన్నాడు’’ అని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. మరోవైపు.. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ట్రంప్ మరోసారి చైనాపై విమర్శలు గుప్పించారు. చైనా వైరస్ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా 188 దేశాలు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూస్తూనే ఉన్నామంటూ డ్రాగన్ దేశంపై మండిపడ్డారు. (చదవండి: దురాక్రమణ దుస్సాహసం)
Comments
Please login to add a commentAdd a comment