బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు దిశగా పయనిస్తున్నారు. విజయానికి కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్న ఆయన.. అమెరికా చరిత్రలోనే అత్యధిక ఓట్లు సంపాదించిన అధ్యక్ష అభ్యర్థిగా అగ్ర స్థానంలో నిలిచారు. మరోవైపు.. కేవలం 214 ఓట్లు సాధించిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జార్జియాలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అడ్డుకోవటానికి న్యాయపోరాటానికి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో, ఎన్నికల ఫలితంపై ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా, విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించింది. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాతో విభేదాలు ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య సమిష్టి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయని వెల్లడించింది. (చదవండి: ‘విక్టరీ.. విక్టరీ.. నాకు ఈ ఒక్కమాటే వినిపిస్తోంది’)
ఈ మేరకు చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ లీ యూచెంగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల ఫలితంపై ఇంకా స్పష్టత రాలేదు. చైనా- అమెరికా మధ్య ఉన్న సంబంధాలపై మేం పూర్తి స్పష్టతతో ఉన్నాం. విభేదాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేస్తూ, పరస్పర సహకారంతో ముందుకు సాగే అవకాశం ఉంది. ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం ఆశించిన స్థాయిలో ద్వైపాక్షిక బంధాల్లో సుస్థిరత నెలకొంటుందని భావిస్తున్నాం’’అని పేర్కొన్నారు. కాగా చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ట్రంప్, అమెరికా ఎన్నికల్లో డ్రాగన్ దేశం జోక్యం చేసుకుంటోందని, బైడెన్ అధికారంలోకి వస్తే అగ్రరాజ్యంపై చైనా కమ్యూనిస్టు పార్టీ పెత్తనం చెలాయించే అవకాశం ఉందంటూ ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
అదే విధంగా గత కొన్ని నెలలుగా దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్ సముద్రంలో చైనా ఆధిపత్యానికి గండికొట్టే విధంగా ట్రంప్ పాలనా యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో ట్రంప్ ఓటమి దిశగా పయనిస్తున్న వేళ చైనా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ వీడి, బైడెన్ అధ్యక్ష పీఠం అధిరోహిస్తే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment