వాషింగ్టన్: అమెరికా కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలను ఎంపిక చేసుకుంటే వాటిపై పన్నుల మోత మోగుతుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ చైనాలో వెలుగు చూసి అక్కడి పరిశ్రమలన్నీ మూతపడడం.. ఆ దేశ సరఫరా వ్యవస్థపై ఆధారపడిన దేశాలు ఇబ్బందులు పడడం తెలిసిందే. దీంతో పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా, తయారీలో కొంత వరకు భారత్ వంటి ప్రత్యామ్నాయ దేశాలకు తరలించాలని అమెరికాతోపాటు ఇతర దేశాల కంపెనీలు యోచిస్తున్నాయి.
ముఖ్యంగా యాపిల్ తన తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలనుకుంటున్నట్టు న్యూయార్క్‌పోస్ట్ కథనం పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్ స్వదేశానికే రావాలంటూ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నులు అనేవి తయారీ కేంద్రాలను అమెరికాకు తరలించే కంపెనీలకు ప్రోత్సాహకమని ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి తెలివి తక్కువ సరఫరా వ్యవస్థ ప్రపంచమంతటా భిన్న ప్రదేశాల్లో ఉంది. ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే మొత్తం వ్యవస్థ గందరగోళంలో పడుతుంది. కనుక ఈ సరఫరా వ్యవస్థ మొత్తం అమెరికాలోనే ఉండాలి. ఈ పని చేయడానికి మాకు కంపెనీలు ఉన్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment