
వాషింగ్టన్: తమ దిగుమతులపై 34 శాతం టారిఫ్ విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వారు తప్పు చేశారంటూనే దాన్ని చైనా అమలు చేయలేదన్నారు. ఇంకా చైనా భయపడిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో చైనా విధించిన టారిఫ్ ల పై స్పందించారు ట్రంప్
ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూఎస్ వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు చైనా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత చైనా ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనా వస్తువులపై అదనంగా 34 శాతం సుంకాలను అమెరికా విధించిన నేపథ్యంలో.. చైనా కూడా ప్రతీకార చర్యల్లో భాగంగా అంతే శాతాన్ని అమెరికా వస్తువులపై విధిస్తున్నట్లు ప్రకటించింది.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల్గిన దేశాల మధ్య టారిఫ్ వార్..!
చైనా నుంచి దిగుమతులపై అదనంగా విధించిన అదే 34 శాతం పన్నును ప్రస్తుతం చైనా.. తిరిగి అమెరికాపై సుంకాలుగా ప్రకటించడంతో ఇది చర్చకు దారి తీసింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కల్గిన ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణానికి దారితీసినట్లయ్యింది. అమెరికా, చైనాలు ఎవరికి వారే వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది టారిఫ్ లకే పరిమితం అవుతుందా.. లేక విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందా అనేది ప్రజల్లో తలెత్తున్న ప్రశ్న. అమెరికా విధిస్తున్న సుంకాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.