Mustard
-
చిట్టివేగానీ. పోషకాల్లో మహాగట్టివి : ఏంటవి!
చూడ్డానికి చిట్టివే కానీ పోషకాల్లో గట్టివి! ముట్టుకుంటేనే జర్రు జారిపోయేలా ఉన్నా శరీరానికి మంచి పట్టునిస్తాయి. అవే ఆవాలు. ఆవాలు రుచికి మంచి పోషక, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.పురాతన కాలంనుంచి వీటికి ప్రాధాన్యత ఎక్కువే. ఆవాలు లేని పోపును అస్సలు ఊహించలేం. ఇక పచ్చళ్లలో, ఆవకాయల్లో ఆవాలు పాత్ర ఇంతా అంతాకాదు. చాలా రకాల కూరలు ఆవపిండితో కలిపి వండుతారు. ఆవాలు-లాభాలుఆవాల్లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉబ్బరం , అజీర్ణంతో బాధపడేవారు భోజనంలో ఆవపిండిని చేర్చుకోవచ్చు. పొటాషియం, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.దగ్గు, జలుబు వంటి సమస్యలుకు ఉపశమనం లభిస్తుంది.ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి కొవ్వులు పెరుగుతాయి. ఆవపిండిలో సెలీనియం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఉబ్బసం లేదా శ్వాసకోశ సమస్యలకు, శ్వాసకోశంలో మంట నివారణకు ఉపయోగపడుతుంది. ఆవాల్లోని రిచ్ న్యూట్రియెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని బలంగా చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, కె, సిలు.. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.ఆవపిండిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. అలాగే ఇందులోని సల్ఫర్ మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచిది. సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి కేన్సర్‌కు చెక్ చెప్పే గుణాలు కూడా ఆవాల్లో ఉన్నాయి. ఆవనూనె కూడా చాలా రకాల ఔషధ ప్రయోజనాలకోసం వాడతారు. ఆవాల నూనెను పూయడం వల్ల గాయాలు వేగంగా నయం అవుతాయి.ఆహారంలో ఎలా చేర్చుకోవాలిఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనెను కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు. -
ఆవాలతో ప్రయోజనాలు: చిన్నగా ఉన్నాయి కదాని లైట్ తీసుకోవద్దు!
షుగర్ లేదా మధుమేహం(Diabetes) ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు కారణంగా రోజు రోజుకు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాగే లక్షలాదిమంది ప్రీడయాబెటిస్తో జీవిస్తున్నారు. అయితే రోజూ వ్యాయామంతోపాటు కొన్ని ఆహార జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాల వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మన వంట ఇంట్లో సులువుగా లభించే ఆవాలతో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఆవాలు చూడ్డానికి చిన్నవిగా ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మాత్రం చాలా శక్తివంతమైనవి. మన ఆహారంలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ పోపు దినుసుగా వాడటంతోపాటు, మన ఆహారంలో భాగమైన ఆవకాయ లాంటి పచ్చళ్ళలో ఆవ పిండిని బాగా వాడతాము. కొన్ని ప్రాంతాలో ఆవకూర, ఆవనూనెను కూడా బాగా బాడతారు.ఆవాలు ఆరోగ్య ప్రయోజనాలుపుష్కలంగాపోషకాలు: ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వివిధ పోషకాలకు ఆవాలు మంచి మూలం.ఆవపిండిలో గ్లూకోసినోలేట్స్, మైరోసినేస్ వంటి సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఆవపిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఆవాలు లేదా ఆవాల నూనెతో శరీరంలో మంట తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆవలోని సెలీనియం ఎముకలకు బలాన్నిస్తుంది.జుట్టు, దంతాలను బలోపేతం చేయడానికి కూడా ఆవాలు సహాయపడతాయి. ఆవాలులో కార్బోహైడ్రేట్లు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అలాగే ఆవాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.గతంలో జరిగిన అధ్యయనం ప్రకారం ఆవాల వినియోగం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ,వారి కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ముగ్గురికి గ్లూకోజ్ స్థాయిలు 46శాతం తగ్గాయి. కొలెస్ట్రాల్ స్థాయి సగటున 10శాతం తగ్గింది. చిగుళ్ళు, ఎముకలు, దంతాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి ఈ గింజలు. చర్మానికి కాంతినిస్తాయి. పైల్స్ నొప్పి నివారణలో కూడా ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది.ఆహారంలో ఎలా చేర్చుకోవాలిఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనె కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు. -
అలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆవాలను తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
వంటలు మరింత రుచిగా రావడం కోసం పోపు పెట్టడం తెలుగువారికి అలవాటు. ఈ పోపులో ఎక్కువగా వినియోగించే వాటిల్లో ఆవాలు ఒకటి. ఆవాలు ఆహార పదార్థాలకు రుచిని ఇవ్వడమే శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలామందికి వీటిని తినడమే తప్ప వీటివల్ల కలిగే లాభాలు ఏంటో తెలియదు. ఆవాలను తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోపులో వేసే దినుసులలో ఎవరైనా సరే ముందుగా చెప్పేది ఆవాలనే. ఈ ఆవాల వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంది. వాటిలో గాయాలు తొందరగా మానడం ముందుగా చెప్పుకోవచ్చు. ఈ గాయాలు తగిలిన చోట ప్రతిరోజు ఆవాల పొడిని అప్లై చేయడం వల్ల తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో దంతాల సమస్యలు వస్తున్నాయి. తరచు దంతాల నొప్పితో బాధపడేవారు ఆవాలను నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా దంతాల నొప్పి నుంచి సులభంగా లభిస్తుంది. ఆవాలు శ్వాస కోసం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో, ఒక టీ స్పూన్ ఆవాలను కలుపుకొని తీసుకోవడం వల్ల సులభంగా శ్వాస కోసం వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా ప్రభావంతంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కీళ్ల నొప్పుల కారణంగా నడవలేకపోతున్నవారు ఒక టీ స్పూన్ ఆవాలు నూనె ఓ చిన్న గిన్నెలో తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం వేసి పేస్టులా తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆవపిండితో తయారు చేసిన ఆహారాన్ని రోజూ తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. -
GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా?
ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు కనుక్కోవడంతోనే సైన్స్ ప్రస్థానం మొదలవు తుందని మా సైన్స్ టీచర్ చెబుతూండేది. ఇంకోలా చెప్పాలంటే... సైన్స్ ఎల్లప్పుడూ ప్రశ్నలకు సిద్ధంగా ఉంటుందీ అనాలి! దీనివల్ల సాంఘిక, ఆర్థిక ఆందోళనలకు తావిచ్చే, పర్యావరణ విధ్వంసానికి దారితీసే అపోహలను తొలగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై వ్యాఖ్యానం చేయవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కారణంగా సత్యాన్వేషణ తాలూకూ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రదర్శించే సాక్ష్యాలు కూడా నమ్మదగ్గవిగా ఉండవు. విషయం ఏమిటంటే... జన్యుమార్పిడి పంటలపై ఎప్పుడు చర్చ మొదలైనా, సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లాలని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూంటారు. తద్వారా శాస్త్రీయ సమాచారం, వాదం, ప్రజా విచారణలన్నీ పక్కకు తొలగిపోయేలా చేస్తూంటారు. దేశంలోకి మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటీ కాటన్‌ను 2001లో వాణిజ్యస్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో జరిగిన జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సమావేశాల్లో పాల్గొన్న వారిలో నేనూ ఉన్నాను. జన్యుమార్పిడి పంటల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ఈ జీఈఏసీ సభ్యులతోపాటు, ‘జెనిటిక్ మ్యానిపులేషన్ అండ్ ద మానిటరింగ్ కమిటీ’కి సంబంధించిన పర్యవేక్షణ బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. బీటీ పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసిన మహికో – మోన్శాంటో సభ్యులు, కొంతమంది పౌర సమాజపు ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. రెండు నెలలు ఆలస్యంగా నాటినా ఆ ఏడాది పత్తి పంట దిగుబడి యాభై శాతం ఎక్కువైనట్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోందని సమావేశంలో ప్రస్తావించారు. బీటీ కాటన్ కారణంగానే ఇలా జరిగిందనడంతో ఆశ్చర్యం వేసింది నాకు. ఆ సమాచారం తప్పనీ, అశాస్త్రీయమైందనీ, దాన్ని ఏదైనా పరిశోధన సంస్థతో నిర్ధారించాలనీ నేను పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, అప్పటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్‌ను కోరాను. సాధారణ పరిస్థితుల్లో ఎదిగేందుకు ఐదు నెలల సమయం తీసుకునే పంటలో రెండు నెలలు ఆలస్యంగా విత్తినా అధిక దిగుబడి సాధించడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ పరి శోధనల్లో విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైన అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి మినహాయింపు ఇస్తే, భవిష్యత్తులో యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కూడా విత్తిన సమయం గురించి పట్టించుకోవద్దని చెప్పే అవకాశం ఏర్పడుతుంది. జీఈఏసీ ఛైర్మన్‌కు నేను వేసిన ప్రశ్న ఏమిటంటే– రెండు నెలలు ఆలస్యంగా విత్తినా దిగుబడి పెరగడ మంటే... అది రైతులకు చాలా ప్రయోజనకరమైంది కాబట్టి, రైతులందరూ రెండు నెలలు ఆలస్యంగా విత్తుకోవాలని ఎందుకు సలహా ఇవ్వకూడదూ? అని! ఈ సమావేశం పూర్తయిన తరువాత సాయంకాలం ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు నాతో మాట్లాడుతూ, బీటీ విత్తనాల ట్రయల్స్ ఇంకో ఏడాది చేయాల్సిందిగా మహికో–మోన్శాంటో కంపెనీని కోరినట్లు తెలిపారు. అవసరమైనంత మేర అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు మోన్శాంటో చెప్పినా జన్యుమార్పిడి పంటల అనుమతిని ఒక ఏడాది ఆలస్యం చేయగలిగామన్నమాట. ఆ సమావేశంలో ప్రశ్నలేవీ వేయకుండా ‘సాక్ష్యాల’ ఆధారంగా అనుమతులిచ్చి ఉంటే ఏడాది ముందుగానే జన్యుమార్పిడి పంటలు దేశంలోకి వచ్చేసి ఉండేవి. బీటీ వంకాయపై నిషేధం దేశంలోకి బీటీ వంకాయ అనుమతిని నిరాకరిస్తూ 2010లో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటన చేశారు. ‘డెసిషన్ ఆన్ కమర్షియలైజేషన్ ఆఫ్ బీటీ బ్రింజాల్(బీటీ వంకాయ వాణిజ్యీకరణ మీద నిర్ణయం)’ పేరుతో అప్పట్లో 19 పేజీల డాక్యుమెంట్ ఒకటి విడుదలైంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా నా అంచనా ప్రకారం ప్రతి వృక్ష శాస్త్రవేత్తా కచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్ అది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలతో, ఏడు దఫాలుగా ప్రజలతో సంప్రదింపుల తరువాత జైరామ్ రమేశ్ ఆ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. జన్యుమార్పిడీ టెక్నాలజీపై రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశం మొత్తమ్మీద వంకాయ పండించే ప్రాంతాల్లో సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. జాగరూకత, ముందస్తు జాగ్రత్త, సిద్ధాంతాల ఆధారంగా జైరామ్ రమేశ్ ఒక నిర్ణయం తీసుకుంటూ... ఏ కొత్త టెక్నాలజీ అయినా ఆయా సముదాయాల సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మీడియాలో ఒక వర్గం జన్యుమార్పిడి పంటలపై బహిరంగ విచారణను తోసిపుచ్చింది. అంతా బూటకం అని కొట్టి పారేసింది కూడా. అయితే ప్రజలు లేవనెత్తిన కీలకమైన అభ్యంతరాలను మంత్రి గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఆనందం కలిగించింది. అంతేకాదు... జన్యుమార్పిడి విత్తన సంస్థల అధ్యయనాల నియమాలు, సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ఫలితాలన్నింటినీ ప్రస్తావిస్తూ డాక్యుమెంట్‌ను రూపొందించడమూ ప్రశంసనీయమైన అంశం. జాగరూకతతోనే ముందుకు వాస్తవ పరిస్థితులకూ, కొందరు సేకరించే సాక్ష్యాలకూ మధ్య ఉన్న అంతరం సైన్స్ ఆధారిత పద్ధతుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. శాస్త్రపరమైన విచారణను పరిమితం చేయడం మార్కెట్ పోకడల్లో ఒకటి. వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లు సైన్స్‌ను తొక్కేసేందుకూ ప్రయత్నిస్తూంటాయి. జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. ఈ డీఎంహెచ్–11 జన్యుమార్పిడి ఆవాల పంట దిగుబడి సామర్థ్యం ఎంతన్నది ఐసీఏఆర్‌కూ తెలియక ముందే పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. దేశ వంటనూనె దిగుమతులను ఈ సరికొత్త ఆవాల ద్వారా తగ్గించుకోవచ్చు అన్న భావనను కలిగిస్తున్నారు. అయితే దీని దిగుబడి చాలా తక్కువ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదెంత తప్పుడు భావనో అర్థమైపోతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... జీఎం ఆవాల పరీక్షలకు అన్ని ప్రోటోకాల్స్‌ను ఢిల్లీ యూనివర్సిటీ స్వయంగా సిద్ధం చేసింది. విద్యార్థినే ప్రశ్నాపత్రం తయారు చేయమని అడగటం లాంటిది ఇది. అంతేకాదు... హెర్బిసైడ్ల(గడ్డిమందుల)ను తట్టుకునే ఆవాల వెరైటీ బీటీ వంకాయ మాదిరిగా కనీస పరీక్షలను కూడా ఎదుర్కోలేదు. జీఎం ఆవాల పరీక్షల్లో ఆరోగ్య నిపుణులు ఎవరూ లేకపోవడం, తేనెటీగలపై జీఎం ఆవాల ప్రభావం ఏమిటన్నది పరిశీలించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపాలు. ఇన్ని లోపాల మధ్య జీఈఏసీ విత్తనాల వృద్ధికి ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదు. సైన్స్ అంటే సత్యాన్ని వెతకడం. ఇటాలియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ మైకెలా మాసిమీ 2017లో లండన్ రాయల్ సొసైటీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో అచ్చంగా ఈ వ్యాఖ్యే చేశారు. ‘‘ప్రజలకు సైన్స్ విలువను అర్థమయ్యేలా చేయడం మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. కచ్చితత్వం, సాక్ష్యాలు, సిద్ధాంతాలపై విశ్వాసం, కచ్చితమైన పద్ధతులను అవలంబించడం వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించాలి’’! (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఆ ఆవాల వెనుక బలమైన కారణం ఉందా? కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి చేసిన(జీఎం) ఆవాలను (హైబ్రిడ్ డీఎంహెచ్–11) మార్కెట్లో విడుదల చేయడం వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో జన్యుమార్పిడి విత్తనాలపై నిషేధం విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపెయిన్’ అనే ఎన్జీవో దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. జన్యుమార్పిడి విత్తనాల గురించి మన దేశంలో రైతులకు పెద్దగా అవగాహన లేదని గుర్తుచేసింది. ఇలాంటి విత్తనాలతో నష్టాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. జన్యుమార్పిడి పంటలను సామాజిక కార్యకర్తలు, కొందరు నిపుణులు సిద్ధాంతపరమైన కారణాలతో వ్యతిరేకిస్తున్నారని, శాస్త్రీయ, హేతుబద్ధతతో కూడిన కారణాలతో కాదని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. డీఎంహెచ్–11 ఆవాలను సెంటర్ ఫర్ జెనెటిక్ మ్యానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్∙అభివృద్ధి చేసింది. -
జీఎం ఆవాల విడుదలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: జన్యుమార్పిడి(జీఎం) ఆవాల విడుదలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జీఎం ఆవాల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. హక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు గురువారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈలోగా ఎలాంటి ముందస్తు చర్య తీసుకోరాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి తెలిపింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు వీలుగా జీఎం ఆవాలను విడుదల చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అరుణా రోడ్రిగ్స్ తన పిటిషన్లో సవాల్ చేశారు. -
పాలిచ్చే తల్లులు తినాల్సినవి..!
-
నవకాయ పచ్చళ్లు
ఒక దారిన మామిడికాయలు డేగిశాలో కొలువుదీరతాయి. మరో మార్గాన ఆవాలు పిండిగా మారి గిన్నెలోకి చేరతాయి. ఇంకో దారిలో పల్లీలో, నువ్వులో నూనె రూపంలో జాడీలోకి జారిపోతాయి. మిరపకాయలూ కారంలా మారి ఆ డేగిశాలోకే వచ్చి తీరతాయి. సముద్రం నుంచి పండిన ఉప్పు పంట కూడా అదే డేగిశాలోకి వచ్చి చేరాక... ఆ ఫ్రెండ్షిప్పుతో ఏర్పడిన కలయికతన ఎర్రదనపు అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఆ సాన్నిహిత్య పరిమళాలను ముక్కుకు అందజేస్తుంది. వాటన్నింటి స్నేహపు రుచి మన నాలుకకూ విందు చేస్తుంది. పసందైన ఆ రుచిని మీరూ అనేక రకాలుగా ఆస్వాదించడం కోసమే నీళ్లూ, బెల్లం, చిట్టి, ఎండు ఆవకాయలూ, గుజ్జు మెంతీ, నూనె, తీపి మాగాయలూ ఇలాంటి దివ్య నవ్య నవ ఆవకాయల స్పెషల్ మీకోసం... మెంతి ఆవకాయ కావలసినవి: మామిడికాయలు – 12; మెంతి పిండి – 400 గ్రా. (వేయించి పొడి చేసుకోవాలి); కారం – అర కేజీ; ఉప్పు – 400 గ్రా.; నువ్వుల నూనె – 2 కిలోలు; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడి కాయలను గుత్తి వంకాయ మాదిరిగా (టెంక తీయకూడదు) తరగాలి ∙ఒక పాత్రలో మెంతి పిండి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి తడిపొడిగా ఉండేలా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడికాయలలో స్టఫ్ చేయాలి ∙ఇలా అన్ని కాయలలోనూ స్టఫ్ చేసి, జాడీలో పెట్టి, మూత ఉంచి మూడురోజుల పాటు కదపకుండా ఉంచాలి ∙నాలుగో రోజు మామిడికాయలను బయటకు తీసి, స్టఫ్ చేసిన మిశ్రమాన్ని వేరు చేయాలి ∙గుత్తిలా ఉన్న మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి (ఎండినందువల్ల తరగటం కొద్దిగా కష్టమే) ∙కాయలను, మిశ్రమాన్ని వేరువేరుగా రెండు రోజుల పాటు ఎండబెట్టాలి ∙మూడో రోజు మరోమారు పైకి కిందకి కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఈ నూనెను మెంతి ఆవకాయ మీద పోసి బాగా కలపాలి ∙మూడు రోజుల తరవాత తింటే రుచిగా ఉంటుంది ∙ఇందులో ఆవపిండి ఉండదు కనుక శరీరానికి వేడి చేయదు. అవసరమనుకుంటే తరవాత కలుపుకోవచ్చు. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయలు – 25; ఆవపిండి – కేజీ; మిరప కారం – కేజీ; ఉప్పు – అర కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; బెల్లం – అర కేజీ; చింతపండు – అర కేజీ; నూనె – 2 కేజీలు; మెంతులు – 100 గ్రా. తయారీ: ∙చింతపండును ఒక రోజు ఎండబెట్టాలి ∙బెల్లాన్ని సన్నగా తరిగి ఒక రోజు ఎండబెట్టాలి ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ∙ఆవకాయకు అనుకూలంగా ముక్కలు చేయాలి ∙కాయలలోని జీడిని, పొరలాంటి దానిని వేరు చేయాలి ∙ఒక పాత్రలో ఆవపిండి, మిరప కారం, ఉప్పు వేసి కలపాలి ∙తగినంత నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దికొద్దిగా మామిడి కాయ ముక్కలు జత చేస్తూ బాగా కలిపి, జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల తరవాత మొత్తం ఊరగాయను తిరగతీసి, పై నుంచి కిందకి బాగా కలపాలి ∙బెల్లం, చింతపండు జతచేసి మరోమారు బాగా కలిపి, నూనె పోసి కలపాలి ∙జాడీలోకి తీసుకుని రెండు రోజుల తరవాత అన్నంలో తింటే రుచిగా ఉంటుంది ∙ఈ ఆవకాయను పిల్లలు ఇష్టంగా తింటారు. గుజ్జు మెంతి కాయ కావలసినవి: మామిడి కాయలు – 6 (కొద్దిగా తియ్యటివైతే పచ్చడి రుచిగా ఉంటుంది); మెంతిపిండి – పావు కేజీ; ఉప్పు – 200.; మిరప కారం – 250 గ్రా.; నూనె – పావు కేజీ; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి ∙తొక్క తీసేయాలి ∙మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి గుజ్జులా చేసి గట్టిగా పిండి ఊట వేరు చేయాలి ∙గుజ్జును, ఊటను విడివిడిగా ఎండలో సుమారు మూడు గంటలపాటు ఎండబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి తీసి, చల్లారాక పొడి చేయాలి ∙ఒక పాత్రలో మెంతి పిండి, ఉప్పు, మిరప కారం వేసి కలపాలి ∙మామిడికాయ గుజ్జు, రసం జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక కొద్దిగా ఇంగువ వేసి వేయించి దింపేయాలి ∙చల్లారాక గుజ్జు మెంతికాయలో వేసి బాగా కలిపి, గాలి చొరని జాడీలో నిల్వ చేసుకోవాలి ∙రెండు రోజుల తరవాత వేడి వేడి అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. నూనె మాగాయ కావలసినవి: మామిడికాయలు – 12; ఉప్పు – 400 గ్రా.; కారం – 1/2 కేజీ; మెంతి పిండి – 100 గ్రాములు (మెంతులు వేయించి పొడి చేయాలి); ఆవపిండి – 100 గ్రా. (వేయించి పొడి చేయాలి); నువ్వుల నూనె – అర కేజీ; ఇంగువ – అర టీ స్పూను తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి పోయేవరకు పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి ∙పై తొక్కు పూర్తిగా తీసేయాలి ∙సన్నగా, పల్చగా ముక్కలు తరగాలి ∙ముక్కలను ఒక వస్త్రం మీద పోసి, ఎండలో ఒకరోజు ఎండబెట్టి తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కాచాలి ∙ఒక పెద్దపాత్రలో ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవపొడి వేసి బాగా కలపాలి ∙మామిడి కాయ ముక్కలు జత చేసి బాగా కలపాలి ∙రెండు రోజుల తరవాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎండు ఆవకాయ లేదా పచ్చ ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 12; పచ్చ మిరప కాయల కారం – పావు కేజీ (వీటిని గొల్లప్రోలు మిరపకాయలు అంటారు. పసుపు రంగులో, కొద్దిగా కారంగా ఉంటాయి); ఉప్పు – 150 గ్రా.; ఆవ పిండి– పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; నూనె – ఒక కిలో; మెంతులు – 50 గ్రా. తయారీ: ∙ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరబోయాలి ∙కాయలను నిలువుగా నాలుగు చెక్కలుగా తరగాలి (విడిపోకూడదు) ∙ఒక పాత్రలో మిరప కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలియబెట్టాలి ∙కొద్దిగా నూనె తయారుచేసి తడిపొడిగా ఉండేలా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడి కాయలలో స్టఫ్ చేయాలి ∙ఇలా అన్ని కాయలు తయారుచేసుకుని, మూడు రోజుల పాటు గాలి చొరని జాడీలో ఉంచి మూత పెట్టేయాలి ∙నాలుగో రోజు మామిడికాయలను బయటకు తీసి, కాయలను, ఆవ పిండి మిశ్రమాన్ని వేరు చేసి, కాయలను, ఆవ పిండిని విడివిడిగా రెండు రోజులు ఎండబెట్టాలి ∙మూడో రోజు మామిడికాయలను, ఆవ పిండి మిశ్రమాన్ని కలిపేయాలి ∙ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, నూనె పోయాలి ∙పైకి కిందకి బాగా కలిపి గాలిచొరని జాడీలోకి తీసుకోవాలి ∙వేడి వేడి ఆవకాయ అన్నంలో మామిడి పండు నంచుకుని తింటే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. మెంతి మాగాయ కావలసినవి: మామిడికాయలు – 12; మిరప కారం – 250 గ్రా.; మెంతి పిండి – 150 గ్రా.; ఉప్పు – 200 గ్రా.పోపు కోసం... నువ్వుల నూనె – అర కేజీ; ఆవాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3 (ముక్కలు చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – తగినంత. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి ∙మామిడి కాయల తొక్కు తీసేయాలి ∙మామిడి కాయలను సన్నగా తురమాలి ∙సుమారు రెండు గంటలపాటు ఎండబెట్టాలి ∙ఒక పాత్రలో మామిడికాయ తురుము, మిరప కారం, మెంతి పొడి, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి గంట సేపు వదిలేయాలి ∙మూత తీసి అన్నీ బాగా కలిసేలా మరోమారు కలిపి, కచ్చపచ్చాగా వచ్చేలా మిక్సీలో తిప్పాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగా ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙ఆవాలు చిటపటలాడుతుండగా ఇంగువ, కరివేపాకు వేసి కలపాలి ∙మిక్సీ పట్టిన మిశ్రమాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాల పాటు వేయించి దింపేయాలి ∙చల్లారాక గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి. తీపి మాగాయ కావలసినవి: మామిడి కాయలు – 6; బెల్లం – పావు కిలో; ఉప్పు – 150 గ్రా.; నూనె – పావు కిలో; కారం – 50 గ్రా. (రుచికి అనుగుణంగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు); ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడవాలి ∙పైతొక్క తీసేసి, మామిడికాయలను పలుచని రేకుల్లా ముక్కలు తరగాలి ∙టెంకలతో సహా కలిసి ముక్కలను ఒక పెద్ద వెడల్పాటి బేసిన్లో వేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచేయాలి ∙మరుసటి రోజు ఉదయం మళ్లీ ఒకసారి బాగా కలిపి మళ్లీ మూత ఉంచేయాలి ∙మూడు రోజులయ్యాక బాగా ఊరి ఊట వస్తుంది ∙ఊట అంతా పిండేసి, ముక్కలు ఊటను వేరు వేరు పాత్రలలో ఉంచి మంచి ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టాలి ∙మూడో రోజు ముక్కలను ఊటలో వేసి మరో రోజు ఎండబెట్టాలి ∙ఇది ప్రతి మాగాయికి బేసిక్‌గా చేయవలసిన పని ∙బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి పోపు పెట్టి మాగాయలో వేయాలి ∙మిగిలిన నూనె వేసి బాగా వేడెక్కిన తరవాత స్టౌ కట్టేయాలి ∙నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా అయ్యాక కారం, మెంతులు వేయించి చేసిన పొడి వేసి ఆ మిశ్రమం అంతా మాగాయలో వేసేయాలి ∙మందపాటి గిన్నెను స్టౌ మీద ఉంచి వేడయ్యాక, బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి కరిగిన తరవాత దింపేసి, సిద్ధం చేసి ఉంచుకున్న మాగాయలతో వేసేయాలి ∙ఘుమఘుమలాగే తీపి మాగాయ సిద్ధమైయనట్లే. చిట్టి ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 6; ఉప్పు – 100 గ్రా.; మిరప కారం – 150 గ్రా.; ఆవ పిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె – పావు కేజీ; వెల్లుల్లి రెబ్బలు – 100 గ్రా. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి ∙చిన్న చిన్న ముక్కలు తరగాలి ∙ఒక పాత్రలో ఉప్పు, మిరప కారం, ఆవ పొడి వేసి కలపాలి ∙కొద్దిగా నూనె వేసి తడిపొడిగా కలపాలి ∙వెల్లుల్లి రెబ్బలు జత చేయాలి ∙మామిడి కాయ ముక్కలు వేసి బాగా కలపాలి ∙మిగిలిన నూనె జత చేసి కలియబెట్టి, గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల తరవాత తింటే రుచిగా ఉంటుంది. నీళ్ల ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 25; ఆవ పిండి – కేజీ; మిరప కారం – కేజీ; ఉప్పు – ముప్పావు కేజీ; నూనె – 2 కేజీలు. పోపు కోసం: ఆవాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – రెండు టీ స్పూన్లు; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించి దింపేయాలి ’∙ఆవ పొడి వేసి బాగా కలపాలి ∙నీళ్లు పూర్తిగా పీలుచకున్నాక ఆవ పొడిని ఒకరోజు ఎండబెట్టాలి ∙రెండో రోజు మామిడి కాయలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ∙ఆవకాయకు అనుకూలంగా ముక్కలు చేయాలి ∙ఒక పెద్ద పాత్రలో ఆవ పొడి, ఉప్పు, కారం వేసి కలియబెట్టాలి ∙కొద్దిగా నూనె జత చేసి మరోమారు కలపాలి ∙మామిడి కాయ ముక్కలు జత చేసి అన్నీ కలిసేలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపి చల్లారాక, ఆవకాయలో వేసి బాగా కలపాలి ∙మూడు రోజుల తరవాత మరోమారు కలపాలి. పచ్చడి – పదనిసలు ►పచ్చడి పెట్టేముందు కాయల ముచికలు కోసేసి, ఒకట్రెండు గంటల పాటు నీటిలో వేసి ఉంచాలి. దానివల్ల సొన అంతా కారిపోతుంది. తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి ఆరాక కోసుకోవాలి. వాడే పాత్రలు, గరిటెలు, నిల్వ చేసే జాడీలు అన్నీ శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. ► పచ్చడి జాడీలో వేసిన తర్వాత గుడ్డ చుడతారు. ఆ గుడ్డ కచ్చితంగా శుభ్రమైనదై ఉండాలి. ►స్టీలు, రాగి, ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని భద్రపర్చకూడదు. ►ఒకవేళ చేతితో కలుపుతుంటే చేతికి తడిలేకుండా చూసుకోవాలి. గరిటెతో కలపాలి అనుకుంటే చెక్క గరిటెతో కలపడం మంచిది. అలాగే పచ్చడి జాడీలోంచి తీసుకున్న ప్రతిసారీ తడి గానీ, చల్లని గాలి గానీ తగలకుండా జాగ్రత్తపడాలి. ► పచ్చడి జాడీలో వేశాక ఊరేలోపు అప్పుడప్పుడూ చెక్ చేసుకోవాలి. నూనె సరిపోకపోతే వెంటనే నూనె వేసుకోవాలి. లేకపోతే బూజు వచ్చేస్తుంది. ►పచ్చడికి ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. మంచి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ►వీలైనంత వరకూ రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. -
పోలింగ్ కేంద్రాల్లో తెల్ల ఆవాలు చల్లాడు!
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఓ అభ్యర్థి రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక తెల్ల ఆవాలను పోలింగ్ కేంద్రాల్లో చల్లుతూ వెళ్లడం వివాదాస్పదమైంది. సాధారణంగా ఎవరిపైనైనా కోపంతో ఉన్నా, వారి నాశనాన్ని కోరుకున్నా మంత్రించిన తెల్ల ఆవాలను ప్రత్యర్థులు నివసించే ప్రాంతాలు, సంచరించే ప్రాంతాల్లో చల్లుతారని బ్రాహ్మణులు చెబుతారు. ఇలాంటి వాటిని బాగా నమ్మకున్న అధికార పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అతని తండ్రి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక భూమిక కూడా పోషించారు. ఇప్పుడు ఆయన కుమారుడితో పాటు తమ్ముడు కూడా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గురువారం నిర్వహించిన పోలింగ్‌లో ప్రత్యర్థికి భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ఆయనకు సంకేతాలు వచ్చాయి. దీంతో ముందుగానే మంత్రించి తెచ్చుకున్న తెల్ల ఆవాలను జేబులో వేసుకుని ప్రతి పోలింగ్ కేంద్రంలో చల్లుకుంటూ వెళ్లాడు. ఇది చూసి ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది విస్తుపోయారు. ఈ విషయమై అవగాహన ఉన్న ఓ పోలింగ్ అధికారి అడ్డుకుని మందలించాడు. నీవు ఎవ్వరితైనేమి ఇలాంటి పనులు చేయకూడదు. ముందు బయటకు వెళ్లు అంటూ చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు అధికార పార్టీకి చెందిన అభ్యర్థి. ఈ విషయం ఆ నోటా...ఈ నోటా పాకి బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి మూఢనమ్మకాలపై ఆధారపడుతూ పశ్చిమ ప్రాంతాన్ని మరింత వెనుకబాటుతనానికి గురిచేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పులిపిర్లా... ఇలా ట్రై చెయ్యండి!
మన వంటి మీద అక్కడక్కడ పులిపిర్లు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇవి వాటంతటవే తగ్గిపోతాయి కానీ కొంతమందిలో ఏళ్ల తరబడి ఉండి, బాధిస్తాయి. ఇవి చేతులపైన, మెడమీద, ముఖం మీద ఎక్కువగా కనిపిస్తూ, అందవికారంగా మార్చేస్తాయి. పులిపిర్ల నివారణకు అనేక రకాల చికిత్సలు ఉన్నాయి కానీ, కొన్ని చిట్కాల ద్వారా కూడా వాటిని నివారించుకోవచ్చు. ∙ముఖంపైన, మెడ మీద పులిపిరి కాయలు ఉన్నవారు దాల్చిన చెక్కను కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి, దానికి కొన్ని బొట్లు నూనె కలిపి, వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి. ∙అల్లాన్ని సన్నగా చెక్కి, సున్నంతో అద్ది పులిపిరిపై పెడుతుంటే క్రమంగా రాలిపోతాయి. ∙కాలిఫ్లవర్‌ను గ్రైండ్ చేసి రసం తీసి, ఆ రసాన్ని వీలైనన్ని సార్లు పులిపిర్లపై రాస్తుంటే మచ్చలు, గుంటలు పడకుండా రాలిపోతాయి. ∙మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే సరి, అవి ఎండి రాలిపోతాయి. ∙రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి, దానికి సున్నపు నీటి తేటను కలిపి నిల్వ చేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి దాన్ని పులిపిరిపై రాస్తూ ఉంటే అవి రాలిపోతాయి. కొందరికి కొన్ని రోజులకే మంచి ఫలితం కనిపించవచ్చు. ఇంకొందరికి ఎక్కువకాలం పట్టొచ్చు. ప్రయత్నించి చూడండి. -
మెచ్చారు...
చారు అంటే మంచి అని అర్థం. మన చారు తమిళనాట రసమైంది. ఆ రసమే ఊరూరూ తిరిగి మళ్లీ మన దగ్గరకొచ్చింది.షడ్రుచులూ పుణికిపుచ్చుకుంది... నవరసాలూరింది.అందుకే కాబోలు...ఘుమఘుమలాడే చారు వాసన తగిలితే చాలు అన్నం ఆవురావురంటుంది. అన్నట్టు ఈ చలికాలంలో ఎవరైనా అతిథి వస్తే ఏం చేయాలా అని తడుముకోవద్దు. ఇక్కడ మేమిచ్చిన రకరకాల చారుల్లో ఓ చారు కాచండి. ఆ చారుతో కడుపు కాచుకుంటూనే వాళ్లు మిమ్మల్ని మెచ్చుతారు చూడండి... కొబ్బరిపాల చారు కావలసినవి:చింతపండు రసం కోసంచింతపండు – ఒక టేబుల్ స్పూను; వేడి నీళ్లు – అర కప్పుచారు కోసంనీళ్లు – ఒకటిన్నర కప్పులు; పసుపు – పావు టీ స్పూను; చారు పొడి – ఒక టేబుల్ స్పూనుచిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; ఉప్పు – తగినంతపోపు కోసంకొబ్బరి నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; పైన చల్లడానికి కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు తయారీ:అర కప్పు వేడినీళ్లలో చింతపండును సుమారు అర గంటసేపు నానబెట్టాలి ∙చింతపండును గట్టిగా పిండి తీసేసి, రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేయాలి ∙పసుపు, చారు పొడి వేసి బాగా కలియబెట్టి స్టౌ మీద సన్నటి మంట మీద ఉంచి మరిగించాలి ∙బాగా మరిగిన తరవాత మంట ఆర్పేసి, కొబ్బరి పాలు జత చేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడి చేశాక, కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపేయాలి ∙వేయించిన పోపును కొబ్బరి పాల చారులో వేసి కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ∙చివరగా కొత్తిమీర జత చేసి అన్నంలో వడ్డించాలి. నిమ్మరసం – కొత్తిమీర చారు కావలసినవి:నిమ్మ చెక్కలు – 2; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లుపోపు కోసం ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ:కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద పెద్ద పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి దోరగా వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు, ఉప్పు, ఇంగువ, పసుపు, నిమ్మ చెక్కలు, కొత్తిమీర ముద్ద వేసి కలియబెట్టాలి ∙బాగా మరిగాక కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. పైనాపిల్ చారు కావలసినవి:కందిపప్పు – పావు కప్పు; నీళ్లు – ముప్పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనాపిల్ రసం కోసంపైనాపిల్ తురుము – ఒక కప్పు; తరిగిన టమాటా – 1; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; చారు పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత పొడి చేయడానికి కావలసినవి: నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండుమిర్చి – 3; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను, మిరియాలు – 4, వెల్లుల్లి రేకలు – 2 తయారీ:కందిపప్పును శుభ్రంగా కడిగి, ముప్పావు కప్పు నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక మెత్తగా మెదపాలి ∙జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రేకలను మిక్సీలో వేసి తిప్పాలి (మరీ మెత్తగా చేయకూడదు) ∙పైనాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి (ఒక కప్పుడు పైనాపిల్ ముక్కలు ఉండాలి) ∙సగం ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙అదే మిక్సీ జార్లో ఒక టమాటా వేసి కొద్దిగా ముక్కలుగా ఉండేలా తిప్పాలి (చేతితో గట్టిగా చిదిమినా సరిపోతుంది) ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర + మిరియాల మిశ్రమం జత చేసి బాగా కలపాలి ∙కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు కలపాలి ∙చిదిమిన టమాటా గుజ్జు జత చేసి రెండు మూడు నిమిషాలు కలపాలి ∙పైనాపిల్ గుజ్జు జత చేసి మరో రెండు నిమిషాలు బాగా కలియబెట్టాక, మెదిపిన పప్పు జత చేసి బాగా కలపాలి ∙పైనాపిల్ ముక్కలు, నీళ్లు జత చేసి మరిగించాలి ∙రెండు టీ స్పూన్ల చారు పొడి వేసి కలియబెట్టాలి ∙మంట బాగా తగ్గించి సుమారు పది నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడి అన్నంలో వడ్డించాలి ∙ఈ చారు బాగా ఆకలి పుట్టిస్తుంది. బీట్రూట్ చారు కావలసినవి:సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు – అర కప్పు; నీళ్లు – తగినన్ని పొడి చేయడానికి:జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి)బీట్రూట్ రసం కోసం...చింతపండు – ఒక టేబుల్ స్పూను; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూనుఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూనుపసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంతకొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ:కుకర్‌లో బీట్రూట్ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఉడికించాలి ∙మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండు మిర్చి వేసి కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసి తీసి పక్కన ఉంచాలి ∙అదే జార్లో ఉడికించిన నీళ్లతో కలిపిన బీట్రూట్ను నీళ్లతో మిక్సీ పట్టాలి ∙ చింతపండు జత చేసి మరోమారు మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ జత చేసి దోరగా వేగేవరకు మరోమారు కలియబెట్టాలి ∙మసాలా పొడి జతచేసి కలపాలి. బీట్రూట్ + చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి ∙రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙(ఎక్కువ మరిగించకూడదు)వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. మైసూర్ చారు కావలసినవి:చారు పొడి కోసంనెయ్యి – 2 టీ స్పూన్లు; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; పచ్చి శనగ పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు ఉడికించడానికికందిపప్పు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులుచింతపండు గుజ్జు కోసంచింతపండు – నిమ్మకాయంత; వేడి నీళ్లు – అర కప్పు (చింతపండు నానబెట్టడానికి)మరిన్ని వస్తువులుపసుపు – పావు టీ స్పూను; టమాటా – 1 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నీళ్లు – 2 కప్పులుఉప్పు – తగినంతపోపు కోసంనెయ్యి – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ:ముందుగా కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్ లో ఉంచి ఏడెనిమిది విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙కొద్దిసేపయ్యాక మూత తీసి, పప్పును మెత్తగా మెదపాలి ∙చింతపండును వేడినీళ్లలో సుమారు అర గంట సేపు నానబెట్టాక, చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి శనగ పప్పు వేసి వేయించాలి ∙ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాక ఇంగువ, కరివేపాకు వేసి పదార్థాలన్నీ దోరగా వేగేవరకు కలపాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు బాగా వేయించి, దింపేయాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి (నీళ్లు కలపకూడదు). ఒక పాత్రలో చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙తరిగిన టమాటాలు జత చేయాలి ∙పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి ∙టమాటాలు బాగా మెత్తపడ్డాక, మైసూర్ మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి, మరిగించాలి ∙స్టౌ మీద చిన్న బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి ఇంగువ వేసి దోరగా వేయించి తీసేసి, మరుగుతున్న చారులో వేసి కలియబెట్టి దింపేయాలి ∙చివరగా కొత్తిమీర వేసి కలపాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. వెల్లుల్లి చారు కావలసినవి:మిరియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి – మూడు రెబ్బలు; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)చింతపండు గుజ్జు కోసంనీళ్లు – అర కప్పు; చింతపండు – ఒక టేబుల్ స్పూనునువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూనుఆవాలు – అర టీ స్పూనుమినప్పప్పు – అర టీ స్పూనుకరివేపాకు – రెండు రెమ్మలుఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)వెల్లుల్లి రెబ్బలు – 10 (చేతితో మెదపాలి)తరిగిన టమాటా – 1పసుపు – పావు టీ స్పూనుఇంగువ – పావు టీ స్పూనునీళ్లు – రెండు కప్పులుఉప్పు – తగినంతకొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు తయారీ:చింతపండును తగినన్ని నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి ∙మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి వేసి మిక్సీ పట్టి (మరీ మెత్తగా ఉండకూడదు) పక్కన ఉంచాలి ∙10 వెల్లుల్లి రేకలను తొక్క తీయకుండా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙టమాటాలను సన్నగా తరిగి ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙కరివేపాకు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా తొక్కిన వెల్లుల్లి వరసగా వేసి వెల్లుల్లి గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి ∙టమాటా తరుగు, పసుపు, ఇంగువ జత చేసి, టమాటాలు మెత్తగా ఉడికేవరకు కలియబెట్టాలి ∙మిక్సీ పట్టిన రసం పొడి జత చేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, రెండు కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఆరు నిమిషాలు మరిగించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వేడివేడి అన్నంలో వడ్డించాలి ∙సూప్‌లా కూడా తీసుకోవచ్చు. సేకరణ: వైజయంతి పురాణపండ -
చలి కొరుకుతున్నప్పుడు ఏం తినాలి
చలికాలంలో ఏదో ఒకటి వేడిగా తినాలన్న యావ ఉంటుంది. పెనం మీద నుండి తీసి తింటే కడుపులో వెచ్చగా ఉండదు. నాలిక దాటాక చలి కొరుకుతూనే ఉంటుంది. మరి ఆవురావురని ఆవ తింటే... కాలిన కడుపుకి వెచ్చని కాపు కాస్తుంది. అందుకే ఆవురావురుమంటూ ఈ ఆవ పెట్టిన కూరలను వండండి... వేడివేడిగా తినండి... బొప్పాయి ఆవ పెట్టిన కూర కావలసినవి: బొప్పాయి తురుము – రెండు కప్పులు (బొప్పాయి కాయలను శుభ్రంగా కడిగి, సన్నగా తురుముకోవాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు (తగినన్ని నీళ్లల్లో నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూను; చిక్కటి చింతపండు పులుసు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక దాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ∙తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి మరోమారు బాగా కలపాలి ∙బొప్పాయి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙బొప్పాయి తురుము మెత్తపడేవరకు ఉడికించాలి ∙చింతపండు రసం, ఆవ ముద్ద వేసి కలియబెట్టి, చింతపండు రసం పచ్చి వాసనపోయే వరకు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. అరటి దూట ఆవపెట్టిన కూర కావలసినవి: అరటి దూట – పెద్ద ముక్క; పల్చటి మజ్జిగ – రెండు గ్లాసులు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను ; తరిగిన పచ్చిమిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవ ముద్ద – ఒక టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙ముందుగా అరటిదూటను శుభ్రం చేసి, సన్నగా ముక్కలుగా తరగాలి ∙ఈ ముక్కలను మజ్జిగలో వేయాలి, లేదంటే న ల్లబడిపోతాయి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తరిగిన అరటిదూటను మజ్జిగలో నుంచి గట్టిగా పిండి తీసి, వేగుతున్న పోపులో వేయాలి ∙పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙అరటి దూట బాగా ఉడికిన తరవాత ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది. పనస పొట్టు ఆవపెట్టిన కూర కావలసినవి: పనస పొట్టు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను (ఆవ పెట్టడం కోసం); చిక్కటి చింతపండు పులుసు – రెండు టీ స్పూన్లు పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – నాలుగు (ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – నాలుగు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙పనస పొట్టును నీళ్లలో శుభ్రంగా కడిగి నీరంతా పిండేసి తీసేయాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙ఆవాలకు నాలుగు స్పూన్ల నీళ్లు జత చేసి, పావు గంట తరవాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ ఉడికించిన పనస పొట్టును కుకర్ నుంచి బయటకు తీయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, నూనె వేసి కాగాక, పోపు దినుసులు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పనస పొట్టును గట్టిగా పిండి పోపులో వేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, ఉప్పు, పసుపు, ముందుగా నూరి పెట్టుకున్న ఆవ పొడి వేసి బాగా కలిపి, దింపేయాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొత్తిమీరతో అలంకరించాలి. క్యాబేజీ ఆవపెట్టిన కూర కావలసినవి: తరిగిన క్యాబేజీ – 2 కప్పులు; పోపు దినుసులు – ఒక టేబుల్ స్పూను; ఆవ పొడి – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, పోపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙పచ్చి మిర్చి జత చేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి ∙క్యాబేజీ తరుగు వేసి బాగా కలపాలి ∙బాగా ఉడికిన తరవాత, ఆవ పొడి వేసి కలపాలి ∙చివరగా నిమ్మ రసం జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. కంద–బచ్చలి ఆవపెట్టిన కూర కావలసినవి: కంద – పావు కేజీ; బచ్చలి కూర – 150 గ్రా.; ఉప్పు – రుచికి తగినంత; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను. ఆవాల ముద్ద కోసం: ఆవాలు – 2 టీ స్పూన్లు; బియ్యం – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙చిన్న పాత్రలో ఆవాలు, బియ్యం, ఎండుమిర్చి, తగినన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి ∙మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి ∙కందను శుభ్రం చేసి, తొక్క వేరు చేసి, కందను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ∙బచ్చలికూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో కంద ముక్కలు, తరిగిన బచ్చలి ఆకు వేసి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లోఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙చల్లారాక, ఎక్కువగా ఉన్న నీళ్లను వేరు చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, పసుపు, ఎండు మిర్చి వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙ఉడికించిన కంద, బచ్చలి మిశ్రమం వేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి చివరగా ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. అరటికాయ ఆవపెట్టిన కూర కావలసినవి: అరటి కాయలు – 4; తరిగిన పచ్చి మిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను (తగినన్ని నీళ్లలో అరగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙అరటికాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కను తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం ముద్ద వేసి మరోమారు బాగా వేయించాలి ∙ఉడికించి ఉంచుకున్న అరటి కాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా మెదపాలి ∙ఆవ ముద్ద, చింతపండు రసం వేసి బాగా కలిపి, ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. -
వంటింటి ఆరోగ్యం...
వంటింట్లో పోపుల డబ్బాలో ఉండే ఆవాలు మన కుటుంబాన్ని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. చిన్నగా అతి సూక్ష్మంగా కనిపించే ఆవాలలో ప్రకృతి ఎన్నో శక్తులు నింపింది. తాలింపులో ఆవాలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు ఆవాలలో ఉండే గుణాలు గుర్తించి వీటిని వంటల్లో వేశారు. ఆవాలు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల భేదాలతో కొద్దిగా కారపు రుచితో వగరుగా ఉంటాయి.ఈ ఆవాలను ఉపయోగించి, వ్యాధులు రాకుండా నివారించుకుంటూ, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. వజ్రాయుధంలాంటి ఆవాల గురించి కొన్ని విశేషాలు... ప్రతిరోజూ నాలుగు గ్రాముల నల్ల ఆవాలను మింగి, నీరు తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్దకం పోతుంది. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి, దానిని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.పచ్చిఆవాలను నీళ్లతో కలిపి మెత్తగా నూరి, దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి జుట్టు రాలి అప్పుడప్పుడే బట్టతల వస్తున్న చోట రాయాలి. ఇలా చేస్తే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి.జలుబు వల్ల ముక్కు నుంచి నీరు కారుతుంటే పాదాల మీద, పాదాల కింద ఆవాల తైలాన్ని రాయాలి. ఇలా చేస్తే తెల్లవారేసరికి మంచి గుణం కనిపిస్తుంది. ఆవాలపిండిని నీటితో కలిపి తాగడం వల్ల, వాంతులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ అవి వెంటనే తగ్గిపోతాయి. ఆ తరవాత నల్ల ఆవాల పిండిని తడి చేసి పొట్ట మీద రాయాలి. నల్ల ఆవాల తైలాన్ని గొంతుపై మర్దన చేస్తే గొంతు వాపు తగ్గుతుంది. ఆవాలు, పత్తి ఆకులు కలిపి మెత్తగా నూరి, తేలు కుట్టిన చోట పట్టిస్తే ఒక్క నిమిషంలో విషం విరిగిపోతుంది. కఫం, వాతం, అజీర్ణం, దురదలు, మెదడులోని దోషాలు, తలలోని చెడు నీరు, కుష్ఠు, పక్షవాతం వంటి రోగాలకు ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలను కొంచెం దోరగా వేయించి, మంచినీళ్లతో మెత్తగా నూరి ఆ ముద్దను ముక్కు దగ్గర వాసన తగిలేట్టుగా పెడితే, మరుక్షణంలోనే మూర్ఛరోగి మేల్కొంటాడు. కొంచెం దోరగా వేయించిన ఆవాలు, బెల్లం సమంగా కలిపి మెత్తగా దంచి, బఠాణీ గింజంత మాత్రలు చేసుకుని నిలవ చేసుకోవాలి. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఈ మాత్రలను మంచినీళ్లలో కలిపి పూటకి ఒక మాత్ర చొప్పున, రెండు మూడురోజులు సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు తగ్గుముఖం పడతాయి. కడుపులో నులిపురుగులు ఉన్న పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతారు. అటువంటి వారికి ఆవాలు బాగా పనిచేస్తాయి. ఆవాలను దోరగా వేయించి, దంచి, జల్లించి నిల్వ ఉంచాలి. పళ్లు కొరుకుతున్న పిల్లలకు, అర గ్రాము పొడిని అర కప్పు పెరుగుకి జతచేసి తాగిస్తే పురుగులు మలంలో నుంచి బయటకు పోతాయి. పిల్లలు పళ్లు కొరకడం మానేస్తారు.కఫాన్ని తగ్గించి వేడిని పెంచుతాయి. ఆవనూనెలో ఉప్పు కలిపిన మిశ్రమంతో చంటిపిల్లల పళ్లు తోమితే, పళ్లు గట్టిగా ఉంటాయి. -
పరిణామం చిన్నది... పని పెద్దది!
ఆవగింజ గుడ్‌ఫుడ్ పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే వాటిని ఆవాలతో పోలుస్తూ ఆవగింజంత అంటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత. ఆవాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ఆవాల్లో ఉండే ఫోటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్థాల కారణంగా అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది. ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి.ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాలలో విటమిన్ బీ–కాంప్లెక్స్ ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి సమకూరడమే కాకుండా, జీవక్రియలు సమర్థంగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలను తగ్గించి దీర్ఘకాలం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి. ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గుతాయి. రక్తనాళాల్లో పాచిలాగ పేరుకునే అథెరోస్కి›్లరోసిస్ వంటి కండిషన్లను ఆవాలు నివారిస్తాయి. ఆవాల్లోని విటమిన్–ఏ, ఐరన్, ఫ్యాటీ యాసిడ్లు జుట్టు దట్టంగా పెరగడానికి తోడ్పడతాయి. ఆవాలు రక్తపోటును సమర్థంగా తగ్గిస్తాయి. -
ఆవాల అచ్చటా ముచ్చటా...
తిండి గోల ఆవాలు లేకుండా ఆంధ్రుల మనుగడను ఊహించడం కష్టం. ఎందుకంటే, ఆంధ్రుల అభిమాన ఆవకాయ పెట్టాలంటే అవే కీలకం మరి. పాశ్చాత్య ప్రపంచంలో రోమన్లు ప్రాచీన కాలంలోనే ఆవాల వాడుకను ప్రారంభించినట్లు ఆధారాలు ఉన్నాయి. మన దేశంలో ఆవాల వాడుక క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నాటికే ఉండేదనేందుకు బుద్ధుని చరిత్రే నిదర్శనం. యూదు పురాణాల్లోను, బైబిల్‌లోను కూడా ఆవాల ప్రస్తావన ఉంది. ఆవాల ఉత్పాదనలో కెనడా అగ్రస్థానంలో ఉండగా, మన పొరుగు దేశాలైన నేపాల్, మయన్మార్లు రెండు, మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మనం ఎక్కువగా నల్లని ఆవాలనే వాడుతుంటాము. అయితే, పసుపు రంగులో ఉండే ఆవాలు కూడా చాలా ప్రాంతాల్లో వాడతారు. మన దేశంలో బెంగాలీలు ఎక్కువగా ఆవనూనెను వాడతారు. -
ఓటర్లతో ఒట్టు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఆవాలు
♦ ‘ఖేడ్’లో విచిత్ర పోకడ ♦ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న మంత్రగాళ్లు ♦ మూఢనమ్మకాల ఉచ్చులో జనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ కల్హేర్: ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆఖరి అస్త్రంగా మద్యం, డబ్బుతో ఆకట్టుకుంటారని అందరూ అనుకంటే.. విచిత్రంగా ఆవాలు, వేపాకు, మంత్రాలపై ఆశలు పెట్టుకోవడం గమనార్హం. నిజానికి ఖేడ్‌లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల నుంచి ఒట్టు పెట్టించి ఓట్లు రాబట్టారు. నియోజకవర్గంలో 168 గ్రామాలు ఉండగా దాదాపు 70 శాతం గ్రామాలు నిరక్షరాస్యత అధికంగా ఉన్న గ్రామాలే. మూఢ నమ్మకాలు ఎక్కువే. గ్రామీణ జనం గ్రామ దేవతను, క్షుద్ర శక్తులను బలంగా నమ్ముతారు. ఈ బలహీనతలను ఆసరా చేసుకున్న రాజకీయ నాయకులు.. కులాలు, తెగల వారీగా ఓటర్లను సమీకరించి చేతితో వేపాకు, పసుపు పట్టించి వారి వారి కుల దేవతల మీద ప్రమాణం చేయిస్తున్నారు. హన్మండ్ల కట్ట మీద ఒట్లు పెట్టిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే ఈ తంతు ప్రారంభమైంది. కంగ్టి, మనూరు, కల్హేర్,నారాయణఖేడ్ మండలాల్లో ఈ రకమైన క్షుద్ర ఒత్తిడి ఎక్కువగా ఉంది. తాజాగా శనివారం నాటి పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో అడుగు పెట్టిన వెంటనే ఓటర్లను కట్టడి చేసేందుకు ఓ పార్టీ నాయకులు మంత్రశక్తులు ప్రయోగించారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కల్హేర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ దుండగులు ఆవాలు చల్లారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఏ పార్టీకి ఓటు వేద్దామనుకున్నా వారికి కావాల్సిన గుర్తు మీదే ఓటు వేస్తారనేది వారి నమ్మకం. ఓటును తమకు అనుగుణంగా వేయకుంటే క్షుద్రశక్తులు దాడి చేస్తాయనే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చిన ఓ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు కోసం మంత్రాలు చేసిన ఆవాలు బూత్‌ల వద్ద పారబోశారనే విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయంశమైంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓటర్లు తమకు అనుకులంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారానికి ఆయా గ్రామాల్లోని ప్రజలు భయపడి పోతున్నారు. పోలింగ్ నాటికి ఈ వదంతులు మరెంతగా వ్యాపిస్తాయోనని జనం చర్చించుకుంటున్నారు. -
మన జీవనానికి ఆధారాలు... ఆవాలు
తిండి గోల ఆవాలు మన ఇంటి పోపుల డబ్బాలో తప్పక ఉంటాయి. తెలుగురాష్ట్రాలలో ఆవపిండి ని నిల్వపచ్చళ్లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహాయపడుతుంటాయి. అందుకే కొంచెం ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తుంటారు. గొంతునొప్పి, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపొడి, తగినంత తేనె వేసి తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. అరబకెట్ వేడి నీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. తెల్ల ఆవనూనెను శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. ఆవాలు క్రీస్తు పూర్వం నుంచే మన దగ్గర వాడుకలో ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఇండియాలో క్రీస్తు పూర్వమే ఆవాలు ఉన్నట్టు గౌతమబుద్ధుని కథనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆవాల ఉత్పత్తిలో అగ్రగామిలో ఉన్న దేశాలు కెనడా, హంగేరీ, గ్రేట్ బ్రిటన్, ఇండియా. -
ఆందెమే నయం
ప్రత్యామ్నాయ సమయాల్లో మేలైన పంట తక్కువ పెట్టుబడితో సాగు పంట కాలం 120 నుంచి 240 రోజులు త్వరలోనే సబ్సిడీపై విత్తనాల పంపిణీ యాజమాన్య పద్ధతులపై ఏడీఏ శ్రావణ్‌కుమార్ సూచనలు గజ్వేల్: ఈ ఏడాది జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించారు. వీటిలో ఒకటైన ఆముదం (ఆందెం) వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై ఈ విత్తనాలను అందజేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయి. కిలో విత్తనంపై రూ.25 రాయితీ ఇవ్వనున్నారు. తక్కువ పెట్టుబడితో ఆముదం పంటను పండించవచ్చు. దీని సాగు విశేషాలపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ రైతులకు అందించిన సలహాలు, సూచనలు... ముఖ్యమైన అంశాలు - నూనె గింజల పంటల్లో ఆముదం ఒకటి. ఈ విత్తనాల్లో 40-55శాతం చమురు కలిగి ఉంటుంది. - తక్కువ తేమ కలిగిన ప్రాంతాల్లోనూ మంచి దిగుబడులను ఇస్తుంది. - అన్ని రకాల నేలల్లో దీన్ని సాగుచేయవచ్చు. - నీరు బాగా ఇంకిపోయే నేలలు అనుకూలమైనవి. - హెక్టారుకు ఏడు కిలోల విత్తనం పడుతుంది. హైబ్రీడ్ రకాలైతే 5 కిలోలు సరిపోతాయి. - వ్యవసాయశాఖ అధికారుల సూచనల ప్రకారం మేలైన వంగడాలు వాడాలి. విత్తనశుద్ధి తప్పని సరి... - కిలో విత్తనానికి 3గ్రాములు థైరమ్ లేదా కాఫ్టాన్ లేదా 2 గ్రాముల కార్బన్‌డిజమ్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. - దీనివల్ల విత్తనం ద్వారా సంక్రమించే మొలక ఆకులు మాడటం మరియు కొరివి లేక ఎండు తెగులును నివారించవచ్చు. ఎరువుల వాడకం... - మట్టి పరీక్షల ఆధారంగా తగినంత మోతాదులో ఎరువులను వాడాలి. - విత్తనం వేసేందుకు రెండు లేక మూడు వారాల ముందు హెక్టారుకు 5 నుంచి 10 టన్నుల మేర బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. - అధిక నూనె దిగుబడి కోసం హెక్టారుకు 20కిలోల పాస్పరస్‌తో పాటు వర్షాధార పంటకు 40-60, 15-60, 15-30, కిలోల ఎన్పీకే మరియు నీటిసాగు పంటకు 80-120, 30-60, 30కిలోల ఎన్పీకే వాడాలి. - సూక్ష్మపోషకాలైన జింక్ మరియు ఇనుము తక్కువగా ఉన్న నేలల్లో 10కిలోల జింక్ సల్ఫేట్ మరియు 30కిలోల ఫై సల్ఫేట్ వాడాలి. నీటి యాజమాన్యం... పంట నీటి పారుదలకు చక్కగా స్పందిస్తుంది. సుదీర్ఘమైన పొడి వాతావరణంలో మొదటి గెల దశ లేక రెండో గెల ప్రారంభంలో ఒకసారి నీరు అందిస్తే మంచి దిగుబడి వస్తుంది. నేల స్వభావాన్ని బట్టి 10-15రోజుల వ్యవధిలో నీటి తడులను పెట్టాలి. కలుపు, అంతర కృషి పంట మొదటి దశలో కలుపు మొక్కల వల్ల ఎక్కువగా నష్టపోతుంది. కాబట్టి విత్తిన 20 రోజుల వ్యవధిలో కలుపుతీసి, 40రోజుల్లోపు రెండు లేదా మూడుసార్లు గుంటుక తోలాలి. కూలీలు దొరకని చోట్ల అలాక్లోర్ 2.5 లీ/హె గానీ ఫ్లూకోరలిన్ లేక ట్రైప్లురలిన్ 2లీ. హెక్టారుకు విత్తనం వేసిన మరుసటి రోజు నేల తడిచే విధంగా పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. -
కంది, ఆముదం ఇప్పుడూ విత్తుకోవచ్చు!
కంది, ఆముదం పంటలను మొక్కల మధ్య దూరం తగ్గించి ఆగస్టు నెలలో కూడా విత్తుకోవచ్చు. ఆగస్టు మొదటి వారం వరకు రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వేరుశనగను కూడా విత్తుకోవచ్చు.కందిలో ఎల్.ఆర్.జి-30, ఎల్.ఆర్.జి -38, ఎల్.ఆర్.జి-41, ఐ.సి.పి. ఎల్- 85063, పి.ఆర్.జి-158, పి.ఆర్.జి- 100, ఎమ్.ఆర్.జి-1004, ఐ.సి.పి.ఎల్ -84031 రకాలు ఖరీఫ్ సాగుకు అనుకూలమైనవి. కందిలో ఎకరానికి 200-400 గ్రా. రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఎండు తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి 5గ్రా., ఫైటోఫ్తోరా ఎండుతెగులు ఉంటే మెటలాక్సిల్ 2 గ్రా. చొప్పున విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. కందిలో కలుపు నివారణకు విత్తిన వెంటనే గాని, మరుసటి రోజు గాని పెండిమిథాలిన్ 1-1.5 లీ. లేదా అలాక్లోర్ 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వరిలో నేరుగా విత్తిన లేదా డ్రమ్‌సీడర్‌తో విత్తిన పొలంలో నేల ద్వారా సంక్రమించిన శిలీంధ్రాల వలన మొక్కలు కుళ్లిపోవడం లేదా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం గమనించడమైనది. నివారణకు, 2.5 గ్రా. కార్బన్‌డజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12%+ మాంకోజెబ్ 63% (సాఫ్) మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి నాట్లు వేసే రైతులు నారుమళ్లలో కార్బొప్యూరాన్ 3జి గుళికలను 200 చ. మీ. నారు మడికి (5సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు, 20, 40 రోజుల వయసు గల పంటపై మోనోక్రోటోఫాస్ 1:4 (1 భాగం మందు 4 భాగాల నీళ్లు) నిష్పత్తిలో కాండం మీద మందు పూయాలి. పత్తిలో రైజాక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకడం వలన ఆకులు ఎర్రబడటం గమనించడమైనది. దీని నివారణకు, 3 గ్రా. కాపర్- ఆక్సీ-క్లోరైడ్ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12% + మాంకోజెబ్ 63% (సాఫ్, కంపానియన్, మాస్టర్) మందును లీటరు నీటిలో కలిపి 7 - 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్టుగా చల్లాలి. మొక్కజొన్న విత్తిన 30-35 రోజులకు పైపాటుగా ఎకరానికి 20-25 కిలోల యూరియా వేసుకోవాలి.నీటి వసతి ఉంటే ఆగస్టు నెలలో టమాటా, వంగ, బెండ, తీగజాతి కూరగాయలు, చిక్కుడు, ముల్లంగి, క్యారెట్, ఉల్లి, మిరప, గోరుచిక్కుడు, ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు. టమాటా, కాలిఫ్లవర్, క్యాబేజి పంటల్లో ముదిరిన నార్లను నాటితే దిగుబడి తగ్గుతుంది.తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో నాట్లు వేసిన కూరగాయల పంటల్లో సాలు మార్చి సాలులో నీరు పెట్టాలి. తరచూ అంతర సేద్యం చేయడం ద్వారా కలుపును నివారించుకోవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
అన్ని నేలల్లోనూ ఆముదం పండించొచ్చు
ఆముదం పంట మన రాష్ట్రంలో సుమారు 2.3 లక్షల హెక్టార్లలో సాగువుతున్నది. ఖరీఫ్‌లో ఈ పంటను మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఆముదం పంటకు అడవి పందుల బెడద లేకపోవడం విశేషం. కావున పందుల బెడద ఉన్న ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కానీ, నీరు బాగా ఇంకే నేలలు అనుకూలం. జూలై 31 వరకు నేల బాగా పదునైన తరువాత విత్తుకోవాలి. ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా పండించుకోవచ్చు. అయితే, బెట్ట పరిస్థితుల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 1-2 తడులు ఇస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే సూటి రకాలైన క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల, హైబ్రిడ్ రకాలైన పీసీహెచ్-111, పీసీహెచ్-222, జీసీహెచ్-4, డీసీహెచ్-177, డీసీహెచ్-519తో పాటు ప్రైవేట్ హైబ్రిడ్లు కూడా వేసుకోవచ్చు. సాలుకు సాలుకు మధ్య 90 సెం. మీ., మొక్కకు మొక్కకు మధ్య 45 సెం. మీ. ఉండేవిధంగా 4 కిలోల సూటి రకాలను విత్తుకోవాలి.మొలకకుళ్లు తెగులు, ఆల్టర్నేరియం ఆకుమచ్చ తెగులు, కొంత వరకు వడలు తెగులును అరికట్టడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ అనే మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. వడలు తెగులు నివారణకు కిలో విత్తనానికి 3గ్రా. కార్బండజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి. కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన 24-48 గంటల్లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ లేదా అలాక్లోర్ రసాయన కలుపు మందును 5-6 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్విజలోఫాప్ పి ఇథైల్/ఫినాక్సాఫాప్ పి ఇథైల్/ప్రొపక్విజఫాప్ అనే మందును 1.5 - 2,0 మి. లీ. లేక సైహలోఫాప్ బ్యూటైల్ 1.5 మి.లీ./లీటరు నీటికి కలిపి విత్తిన 20 రోజులకు పిచికారీ చేసి గడ్డి జాతి కలుపును నివారించుకోవచ్చు. సూటి రకాలను సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం కలిగిన ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. పైపాటుగా 6 కిలోల నత్రజని విత్తిన 30-35 రోజులకు, మిగిలిన 6 కిలోల నత్రజని విత్తిన 60-65 రోజులకు వేసుకోవాలి. సంకర రకాలు సాగు చేసేటప్పుడు అదనంగా మరో 6 కిలోల నత్రజనిని వత్తిన 9-95 రోజులకు వేసుకోవాలి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి సూచనలు : 1. నాణ్యత గల విత్తనాన్ని వాడాలి. 2. తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. 3. ఎరువులను తగు మోతాదులో సరైన సమయంలో వేయాలి. 4. కీలక దశల్లో వీలైతే నీరు పెట్టాలి. 5. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. 6. సరైన సమయంలో కోయడం, నూర్చడం చాలా ముఖ్యం. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్