కంది, ఆముదం ఇప్పుడూ విత్తుకోవచ్చు!
కంది, ఆముదం పంటలను మొక్కల మధ్య దూరం తగ్గించి ఆగస్టు నెలలో కూడా విత్తుకోవచ్చు. ఆగస్టు మొదటి వారం వరకు రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వేరుశనగను కూడా విత్తుకోవచ్చు.కందిలో ఎల్.ఆర్.జి-30, ఎల్.ఆర్.జి -38, ఎల్.ఆర్.జి-41, ఐ.సి.పి. ఎల్- 85063, పి.ఆర్.జి-158, పి.ఆర్.జి- 100, ఎమ్.ఆర్.జి-1004, ఐ.సి.పి.ఎల్ -84031 రకాలు ఖరీఫ్ సాగుకు అనుకూలమైనవి. కందిలో ఎకరానికి 200-400 గ్రా. రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఎండు తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి 5గ్రా., ఫైటోఫ్తోరా ఎండుతెగులు ఉంటే మెటలాక్సిల్ 2 గ్రా. చొప్పున విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. కందిలో కలుపు నివారణకు విత్తిన వెంటనే గాని, మరుసటి రోజు గాని పెండిమిథాలిన్ 1-1.5 లీ. లేదా అలాక్లోర్ 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
వరిలో నేరుగా విత్తిన లేదా డ్రమ్‌సీడర్‌తో విత్తిన పొలంలో నేల ద్వారా సంక్రమించిన శిలీంధ్రాల వలన మొక్కలు కుళ్లిపోవడం లేదా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం గమనించడమైనది. నివారణకు, 2.5 గ్రా. కార్బన్‌డజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12%+ మాంకోజెబ్ 63% (సాఫ్) మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి నాట్లు వేసే రైతులు నారుమళ్లలో కార్బొప్యూరాన్ 3జి గుళికలను 200 చ. మీ. నారు మడికి (5సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి.
పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు, 20, 40 రోజుల వయసు గల పంటపై మోనోక్రోటోఫాస్ 1:4 (1 భాగం మందు 4 భాగాల నీళ్లు) నిష్పత్తిలో కాండం మీద మందు పూయాలి. పత్తిలో రైజాక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకడం వలన ఆకులు ఎర్రబడటం గమనించడమైనది. దీని నివారణకు, 3 గ్రా. కాపర్- ఆక్సీ-క్లోరైడ్ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12% + మాంకోజెబ్ 63% (సాఫ్, కంపానియన్, మాస్టర్) మందును లీటరు నీటిలో కలిపి 7 - 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్టుగా చల్లాలి.
మొక్కజొన్న విత్తిన 30-35 రోజులకు పైపాటుగా ఎకరానికి 20-25 కిలోల యూరియా వేసుకోవాలి.నీటి వసతి ఉంటే ఆగస్టు నెలలో టమాటా, వంగ, బెండ, తీగజాతి కూరగాయలు, చిక్కుడు, ముల్లంగి, క్యారెట్, ఉల్లి, మిరప, గోరుచిక్కుడు, ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు. టమాటా, కాలిఫ్లవర్, క్యాబేజి పంటల్లో ముదిరిన నార్లను నాటితే దిగుబడి తగ్గుతుంది.తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో నాట్లు వేసిన కూరగాయల పంటల్లో సాలు మార్చి సాలులో నీరు పెట్టాలి. తరచూ అంతర సేద్యం చేయడం ద్వారా కలుపును నివారించుకోవచ్చు.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్