వేరుశనగ అన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు
గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తున్నది.వరి, పత్తి పంటల తర్వాత తెలుగు నాట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశనగ. అన్ని ప్రాంతాల్లోనూ జూలై నెలలో వేరుశనగ విత్తుకోవచ్చు.కదిరి-5,6,9, అనంత, నారాయణి, వేమన, జేసీజీ-88, అభయ, ధరణి లాంటి రకాలు తక్కువ వర్షపాత ప్రాంతాల్లోను, గ్రీష్మ, రోహిణి, కాళహస్తి, టీజీ-26, టీఏజీ-24 లాంటి రకాలు ఎక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగుకు అనువైనవి.
విత్తనాన్ని గొర్రుతోకానీ, ట్రాక్టరుతో నడిచే విత్తు యంత్రంతో కానీ సాలుకు, సాలుకు మధ్య 30 సెం.మీ, మొక్కకు, మొక్కకు మధ్య 10 సెం.మీ. ఉండేటట్లుగా, 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి.ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువు, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 18 కిలోల యూరియా, మొత్తం ఎరువులను విత్తే సమయంలో ఆఖరి దుక్కిలో వేయాలి.భూమి, విత్తనం ద్వారా వ్యాప్తిచెందే శిలీంధ్రాల నివారణకు, వైరస్ తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటగా కిలో విత్తనానికి, ఒక గ్రా. టిబ్యుకొనజోల్ లేక 3 గ్రా. మాంకోజెబ్ లేక 2 గ్రా. కార్బండిజమ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును కూడా విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6.5 మి.లీ.ల క్లోరోఫైరిఫాస్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసే ప్రాంతాల్లో రైజోబియం కల్చర్‌ను పట్టించాలి.
కలుపు నివారణకు విత్తిన వెంటనే కానీ లేదా 2-3 రోజుల లోపల పెండిమిథాలిన్ 1.3-1.6 లీ. లేదా 1.25-1.5 లీ. బ్యూటాక్లోర్ 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 21 రోజుల తర్వాత మొలచిన కలుపు నివారణకు ఇమాజితఫిర్ 300 మి.లీ. లేదా క్విజలోఫాప్ ఇథైల్ 400 మి.లీ. ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.
ఊడలు దిగే సమయంలో అంటే 45 రోజుల సమయంలో రెండోసారి కలుపు తీసి, ఎకరానికి 200 కిలోల జిప్సం వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత వేరుశనగలో అంతర సేద్యం చేయరాదు.వేరుశనగను కంది, ఆముదం, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా వేసుకోవాలి.సజ్జ, జొన్న పంటలను అంతర పంటలుగానే కాకుండా.. పొలం చుట్టూ నాలుగు వరుసలు వేసుకుంటే తామర పురుగులను నిరోధించి తద్వారా పంటను వైరస్ తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్