వేరుశనగ విత్తుకు జూలై మంచి సమయం
– సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు
– కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ జాన్‌సుధీర్
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ పంట విత్తుకునేందుకు జూలై నెలంతా మంచి సమయమని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప తెలిపారు. ముందస్తుగా వేసుకోవడం వల్ల ఆగస్టులో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పంట దిగుబడులు తగ్గిపోతాయన్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
నేలలు, విత్తన రకాలు : ఇసుకతో కూడిన గరప నేలలు, ఎర్ర నేలలు, చల్కా నేలలు అనుకూలం. ఎక్కువ బంకమన్ను ఉన్న నల్లరేగడి భూముల్లో వేయకపోవడం మేలు. కే–6 రకంతో పాటు అవకాశం ఉంటే కొత్త రకాలైన కే–9, కదిరి అమరావతి, కదిరి హరితాంధ్ర, ధరణి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. కే–9 రకం బెట్టను తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు తెగులును తట్టుకుంటుంది. రసంపీల్చు దోమ, తామర పురుగులు, నులిపురుగులు, ఎర్రనల్లిని అధిగమిస్తుంది. అత్యధిక నూనె శాతం, అత్యధిక గింజ వస్తుంది. కదిరి అమరావతి, హరిత్రాంధ్ర రకాలు బెట ఆకుమచ్చ, రసంపీల్చు దోమ, తామర పురుగులను తట్టుకుంటాయి. ధరణి రకం 35 రోజుల వరకు బెట్టను తట్టుకుంటుంది. మొక్కలు మధ్యస్తంగా ఉంటాయి. నేల నుంచి వ్యాప్తి చెందే తెగుళ్లు నివారించుకోవచ్చు.
విత్తన శుద్ధి : కాండంకుళ్లు వైరస్ తెగులు, మొవ్వకుళ్లు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో ఒక కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అలాగే ఒక గ్రాము టిబుకొనజోల్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే నెలలోపు వచ్చే వేరుకుళ్లు తెగులును నివారించుకోవచ్చు. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి అరబెట్టిన తర్వాత ట్రైకోడెర్మావిరిడీ శిలీంద్రనాశినితో శుద్ధి చేసుకుని విత్తుకోవాలి. పంట విత్తడానికి ట్రాక్టరుతో నడిచే ఆటోమేటిక్ వేరుశనగ గొర్రు లేదా ఎద్దులతో నడిచే ఆటోమేటిక్ విత్తన గొర్రును వాడాలి. ఈ గొర్రు ఉపయోగించడం వల్ల 10 కిలోల విత్తన ఆదాతో పాటు కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు.
ఎరువులు : భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోలు సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 33 కిలోలు పొటాష్ ఎరువులు వేయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 200 కిలోలు జిప్సం వేసుకుంటే నాణ్యత, దిగుబడులు పెరుగుతాయి. విత్తుకున్న 48 గంటల్లోగా ఎకరాకు ఒక లీటర్ అలాక్లోర్ (50 శాతం), లేదా 1.3 నుంచి 1.6 లీటర్లు పెండీమిథాలీన్ (30 శాతం) లేదా 1.25 నుంచి 1.50 లీటర్ బుటాక్లోర్ (50 శాతం) ఏదో ఒకటి 200 లీటర్ల నీటికి కలిపి పొలంలో పిచికారి చేసుకోవాలి. 20 రోజుల సమయంలో కూలీల సమస్య ఉంటే కలుపు మొక్కలు రెండు మూడు ఆకుల దశలో ఉన్నపుడు ఎకరాకు 300 మి.లీ ఇమాజితఫిర్ (10 శాతం) లేదా 300 మి.లీ క్విజలోఫాప్ ఇథైల్ (5 శాతం) 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. విత్తుకున్న 45 రోజుల తర్వాత పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.