రబీ వేరుశనగలో సస్యరక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : రబీ వేరుశనగకు ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. పంట విత్తుకునేందుకు సమయం ముగిసిందన్నారు. సాగుచేసినవారు నీటి నిర్వహణ, కలుపు నివారణ, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే పంట దిగుబడులు లభిస్తాయన్నారు. ప్రస్తుతం వేరుశనగకు రసంపీల్చు పురుగులు, పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సస్యరక్షణ చర్యలు
+తామర పురుగుల నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ + ఒక లీటర్ వేపనూనె+ ఒక కిలో సబ్బుపొడి 200 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. పేనుబంక, పచ్చదోమ నివారణకు ఎకరాకు 400 మిల్లిలీటర్ల డైమిథోయేట్ లేదా 400 మిల్లిలీటర్ల మీథైల్ డెమటాన్ లేదా 60 మిల్లిలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
+ యూరియా ఎక్కువగా వాడినా, నీటి తడులు ఎక్కువగా ఇచ్చినా పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలుగజేస్తుంది. నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉనికి, ఉధృతిని అంచనా వేయాలి. వీటి వల్ల రెక్కల పురుగులను ఆకర్షించవచ్చు. అలాగే ఎకరా వేరుశనగ పొలంలో 30 నుంచి 40 వరకు ఆముదం మొక్కలు ఎర పంటగా వేసుకోవాలి. గ్రుడ్లు చిన్నవిగా ఉన్నపుడు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. పూర్తీగా నివారించడానికి ఎకరాకు 400 మిల్లిలీటర్ల క్వినాల్‌ఫాస్ లేదా ఒక లీటర్ వేపనూనె 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను 200 గ్రాములు థయోడికార్బ్ లేదా 200 మిల్లిలీటర్ల నొవాల్యురాన్ మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.