కాండం, మొవ్వకుళ్లుతో జాగ్రత్త
– వేరుశనగ రైతులు అప్రమత్తంగా ఉండాలి
- కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ ఎం.జాన్‌సుధీర్
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగకు కాండంకుళ్లు, మొవ్వకుళ్లు సోకకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. రబీలో జిల్లావ్యాప్తంగా దాదాపు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన వేరుశనగ పంట వివిధ దశల్లో ఉందన్నారు. వేరుశనగకు ప్రమాదకరమైన కాండంకుళ్లు, మొవ్వకుళ్లు లాంటి వైరస్ తెగుళ్లు వ్యాపించి నష్టం కలగజేసే అవకాశం ఉన్నందున వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు.
కాండంకుళ్లు తెగులు
ఈ వైరస్ తెగులు ఆశించిన వేరుశనగ మొక్క లేత ఆకులపై తర్వాత ఆకు ఈనెలపై నల్లని మాడు పట్టిన మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు క్రమేణా తొడిమెలు, కాండంకు విస్తరిస్తాయి. కాండాన్ని ఆశించిన మచ్చలు పైకిపాకి మొవ్వను ఆశించి చంపేస్తాయి. నెలలోపు వయస్సున్న వేరుశనగ మొవ్వలకు ఆశిస్తే చనిపోతాయి. మరికొన్ని మొక్కలు గిడసబారి, వచ్చిన కాయలు కూడా నల్లగా తయారవుతాయి. ఈ తెగులు తామరపురుగులు, వైరస్ కణాలు కలిగి వున్న కలుపు మొక్కలైన మురిపిండాకు, తుత్తుర బెండ, ఉత్తరేణి, జిల్లేడు, కుక్కవామింట, వెర్రిమిరప, చెంచలి కూర, తుమ్మి, వయ్యారిభామ, గడ్డిచామంతి ద్వారా వ్యాప్తి చెందుతాయి. కలుపు మొక్కల పుప్పొడి రేణువులు గాలి లేదా తామర పురుగుల ద్వారా వేరుశనగకు ఆశిస్తాయి.
తెగులును తట్టుకునే శక్తి వేరుశనగ లేదు. పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలను పూతకు రాకమునుపే ఏరివేసి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ ఏపుగా పెరిగే సజ్జ, జొన్న, మొక్కజొన్న 8 సాళ్లు రక్షణ పంటలుగా వేసుకోవాలి. దీని వల్ల కలుపు మొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, తామర పురుగులను రక్షణ పంటలు నిలువరిస్తాయి. విత్తే సమయంలో కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేస్తే 30 రోజుల వరకు ఇలాంటి వైరస్ తెగులు వ్యాప్తి చెందవు. తద్వారా కాండంకుళ్లు తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
మొవ్వకుళ్లు తెగులు: వేరుశనగ పంటలో ఈ తెగులు ఎపుడైనా సోకుతుంది. నెల రోజుల్లోగా ఆశిస్తే పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఆకుల మీద పసుపు పచ్చని పాలిపోయిన వలయాలు (రింగ్‌స్పాట్) ఏర్పడుతాయి. మొవ్వ పాలిపోయి నల్లగా మారుతుంది. ఆకులు చిన్నవిగా మెలితిరగడం, వివిధ రంగుల మచ్చలు కలిసి పాలిపోతుంది. కణుపుల మధ్య దూరం తగ్గి, గిడసబారిపోతుంది. త్రిప్స్ అనే రసంపీల్చు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
మొవ్వకుళ్లు తెగులు నివారణకు సకాలంలో కలుపు మొక్కలు నాశనం చేసుకోవాలి. విత్తనశుద్ధి పాటించి మొక్కల సాంద్రత సరిగా ఉండేలా చేసుకోవాలి. అంతర పంటలుగా సజ్జ లేదా జొన్న వేసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే రక్షణ పంటలుగా కూడా 8 సాళ్లు సజ్జ, జొన్న వేసుకుంటే మేలు. తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తొలిదశలో 0.4 మి.లీ.ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.