రసం పీల్చు పురుగు నివారిస్తే లాభదాయకమే
- వేరుశనగ, ప్రత్తిలో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
– ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రవీంద్రనాథరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: జూన్, జూలైలో ఖరీఫ్ పంటలు సాగు చేసిన ప్రాంతాల్లో ఆశించిన చీడపీడలు, పురుగులు, తెగుళ్ల నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆచార్య ఎన్‌జీరంగా వర్శిటీ అనుబంధ రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు.
+ జూన్‌లో వేసిన వేరుశనగ పంటలో రసంపీల్చు పురుగులు ఆశించడం జరిగింది. దీనికి కారణమైన తామర పురుగుల నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ + ఒక లీటర్ వేపనూనె + ఒక కిలో సబ్బు పొడి 200 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. పేనుబంక, పచ్చదోమ ఆశించిన ప్రాంతాల్లో ఎకరాకు 400 మి.లీ డైమిథోయేట్ లేదా 400 మి.లీ మిథైల్ ఓ డెమటాన్ లేదా 40 గ్రాములు థయోమిథాక్సామ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
+ ప్రత్తి పంటలో కూడా రసంపీల్చు పురుగు కనిపిస్తోంది. తొలిదశలో ఆశించిన పురుగు నివారణకు కాండం మీద పూత పద్ధతిని పాటించాలి. అలాగే 30, 45 రోజుల సమయంలో మోనోక్రోటోఫాస్ మందుతోనూ 60 రోజుల సమయంలో ఇమిడాక్లోప్రిడ్ మందుతో పిచికారీ చేసుకోవాలి. కాండం, పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లిని అదుపు చేయవచ్చు.
+ మొక్కజొన్న వేసిన ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగు ఆశించింది. ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ 36 ఎస్‌ఎల్ లేదా 60 మి.లీ కోరజన్ రేనాక్షిపైర్ 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజుల సమయంలో పిచికారీ చేసుకుంటే మేలు.
+ కందిలో ఒత్తుగా ఉన్న మొక్కలను తీసేయాలి. కొన్ని చోట్ల ముక్కు పురుగు లేదా కొమ్మ పురుగు ఆశించింది. నివారణకు ఎకరాకు 5 కిలోల మలాథియాన్ పొడి మందు చల్లుకోవాలి.
+ వేరుశనగ పంటకు సమయం ముగిసినందున వర్షం వస్తే ఆగస్టు నెలలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. అందులో భాగంగా ఎర్రనేలల్లో కంది, జొన్న, సజ్జ, అలసంద, ఉలవ, ఆముదం, పెసర, అనుములు అనువుగా ఉంటాయి. అలాగే తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, బెళుగుప్ప, విడపనకల్, కనేకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, పుట్లూరు, యాడికి తదితర నల్లరేగడి కలిగిన ప్రాంతాల్లో కంది, జొన్న, ప్రత్తి ఆగస్టు 15 వరకు వేసుకోవచ్చు. తర్వాత కొర్ర, పెసర, ఆముదం పంటలు వేసుకోవచ్చు.