danda rajireddy
-
అధిక వర్షాలు.. రైతులకు సూచనలు
ఇటీవల వివిధ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడ్డాయి. పొలాల్లో నిలిచిన నీటిని తీసివేసి రైతులు కొన్ని మెలకువలు పాటించాలి. కొత్తగా వరి సాగు వద్దు: రైతులు ఇప్పుడు కొత్తగా వరి సాగు చేపట్టకూడదు. స్వల్పకాలిక రకాలను కూడా సాగు చేయవద్దు. తెలంగాణలో ఇప్పడు వరి సాగు ప్రారంభిస్తే పూత సమయంలో చలి పెరిగి తాలు గింజలు ఏర్పడతాయి. కావున ఇతర పంటలే వేసుకోవాలి. సాగులో ఉన్న వరికి బ్యాక్టీరియా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. నత్రజని ఎరువుల వాడకాన్ని కొన్నాళ్లు వాయిదా వేయాలి.వరి మొక్కలు ముంపునకు గురై చనిపోతే పక్క కుదుళ్లలో ఉన్న కుచ్చుల నుండి అదనపు మొక్కలను తీసి నాటాలి.అగ్గి తెగులును బీపీటీ-5204 తట్టుకోలేదు. లీటరు నీటికి 0.6 గ్రా. ట్రైసైక్లజోల్ కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు లీటరు నీటికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. కలిపి చల్లాలి. మొక్కజొన్న: మొక్కజొన్న పొలంలో నిల్చిన నీటిని తీసివేసి ఎకరాకు 25 కిలోల నత్రజని, 10 కిలోల పొటాషియం వేయాలి.ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ముందస్తు చర్యగా మాంకోబెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి: రెండో దఫా ఎరువులుగా ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.భూమిలోకి గాలి ప్రసరణకు అంతర సేద్యం చేయాలి.టొబాకో స్ట్రీక్ వైరస్‌ను వ్యాప్తి చేసే తామర పురుగుల నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.నీటి ముంపున్న పొలాల్లో లీటరు నీటికి మల్టి-కె(13-0-45) 10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పచ్చదోమ నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. మరియు ప్లాంటామైసిన్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.ఆకుమచ్చ తెగులు నివారణకు 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాప్టాన్ పొడి మందును 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. సోయాబీన్: పొటాషియం నైట్రేట్(1 శాతం)ను మొక్కలు నిలువెల్లా తడిచేలా పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. పొగాకు లద్దె పురుగు కనిపిస్తే నొవాల్యురాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా: నీటి ముంపు వల్ల వేరు కుళ్లు తెగులు వస్తే 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను ఒక లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా పోయాలి. డా॥ దండ రాజిరెడ్డి, వ్యవసాయ విస్తరణ సంచాలకులు ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -
భాస్వరం ఎరువులను పైపాటుగా వేయకూడదు!
వరి పంట ప్రస్తుతం పిలకలు పెట్టే దశ నుంచి అంకురమేర్పడే దశలో ఉంది. ఈ కాలంలో నీరు, ఎరువుల యాజమాన్యం ముఖ్యమైనవి.నాటిన వారం రోజుల నుంచి పిలకలు పెట్టడం పూర్తిగా ముగిసే వరకు 2 సెం.మీ. మించకుండా పొలంలో నీరు నిలబెట్టాలి. ఈ దశలో నీరు పొలంలో ఎక్కువగా ఉంటే పిలకల సంఖ్య తగ్గి దిగుబడులు తగ్గుతాయి. సారవంతమైన భూముల్లో, అత్యధిక పిలకలు తయారైన దశలో పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 2-3 రోజులు ఆరగట్టాలి. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటారు. దీని వలన వరిపైరు వేర్లు ప్రాణ వాయువును పీల్చుకొని ఆరోగ్యవంతంగా ఉంటాయి. సిఫారసు చేసిన నత్రజనిలో 3వ వంతు పిలకల దశలో పైపాటుగా వేయాలి. పొలంలో నీటిని తీసివేసి బురద పదునులో మాత్రమే నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే నత్రజని నష్టం తగ్గి పైరుకు బాగా ఉపయోగపడుతుంది. 2 రోజుల తర్వాత మళ్లీ నీరు పెట్టాలి. భాస్వరం/భాస్వరం కలిసిన కాంప్లెక్స్ ఎరువును పైపాటుగా వేయొద్దు. డిసెంబర్-జనవరిల్లో నాటిన చెరకు మొక్క తోట, కార్శి తోటలకు జడ చుట్లు వేసుకోవాలి. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగులో ఉన్న వర్షాధారపు చెర కు సాగులో, జూలైలో నాటిన చెరకు తోటలకు రెండో దఫా నత్రజని (ఎకరానికి 35 కిలోల యూరియా) భూసార పరీక్షాధారంగా వాడుకోవాలి.లోతట్టు ప్రాంతాల్లో, అధిక నత్రజని వాడకమున్న చెరకు తోటలకు దూదేకుల పురుగు, పొలుసు పురుగు, తెల్ల ఈగ ఆశించడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి చెరకు తోటలను పర్యవేక్షించి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎల్లో లీఫ్ వ్యాధి చెరకుకు సోకుతోంది. ఇది సోకిన తోట నుంచి తెచ్చిన విత్తనం వాడకూడదు. కార్శి కూడా చేయకపోవడం శ్రేయస్కరం. మిరప నారుమళ్ల పెంపకానికి సరైన అదును ఇదే. 6 వారాల వయస్సు గల మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారు ముదిరినట్లైతే తలలు తుంచి నాటుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
ముంచుకొస్తున్న పశుగ్రాసాల కొరత!
ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గమనిస్తే పశుగ్రాసాల కొరత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య పంటలు పండించే ప్రతి రైతు కొంత భూమిని పశుగ్రాసాల సాగుకు ఉపయోగించాలి.కొద్దిపాటి నీటి వసతి ఉన్న రైతాంగం సంవత్సరం పొడవునా ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల సాగును చేపట్టవచ్చు. పశుగ్రాసాల సాగును ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోగల పంటల్లో పశుగ్రాసపు జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద(బొబ్బర్లు), పిల్లి పెసర, జనుము, ఉలవ, లూసర్న్ వంటి పంటలు ముఖ్యమైనవి.సజ్జలో ఎన్డీబీఎఫ్-1, 2 రకాలు 50 రోజుల్లో ఒకేసారి కోతకు వస్తాయి. ఏపీఎఫ్బీ-2, జైంట్ బాజ్రా, రాజ్బాజ్రా రకాలు నాలుగు కోతులుగా మొదటికోత 50 రోజులతో మొదలై తరువాత ప్రతి 30 రోజులకు ఒక కోతగా పశుగ్రాసాల దిగుబడిని పొందవచ్చు. పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్, జె-1006, విజయా కాంపోజిట్, జవహర్ కాంపోజిట్ రకాలు 85 రోజులకు ఒకే కోతలో అధిక దిగుబడిని పొందవచ్చు. పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద(బొబ్బర్లు)లో రష్యన్ జైంట్, బుందేల్ లోబియా- 1,2, ఇసి 4216, యూపీసీ 5286, 5287, కేబీసీ-2 మొదలైన రకాలు 55 నుంచి 60 రోజులకు ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని పొందవచ్చు. లూసర్న్ పంటలో ఆనంద్-1,2, 3 వంటి వార్షిక రకాలు ఒకే కోతలో 60-70 రోజుల్లో దిగుబడిని పొందవచ్చు. పూర్తి వర్షాధారంగా ఆలస్యమైన పరిస్థితుల్లో కూడా తక్కువ కాల వ్యవధిలో అంటే 45 రోజులకే ఒకటే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని పొందడానికి ఉలవ సాగు చేసుకోవచ్చు. పండ్ల తోటలు సాగు చేసే రైతాంగం మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో పప్పుజాతి పశుగ్రాసాలైన స్టైలో హమాటా, లూసర్న్, అలసంద, ఉలవ, పిల్లి పెసర, జనుము వంటి పంటలను సాగు చేయడం వల్ల పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. దీంతోపాటు, భూమిలో నత్రజని స్థిరీకరించబడి భూసారాన్ని పెంపొందించుకోవడమే కాకుండా నేలలో నీటి సంరక్షణ కూడా జరుగుతుంది. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
ఈ వారం వ్యవసాయ సూచనలు
సూక్ష్మధాతు లోపాలను సవరించడమెలా? ఆశ్లేష కార్తె (ఆగస్టు 16 వరకు) మఘ కార్తె (ఆగస్టు 17 నుంచి) పంటల దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో చీడపీడలతోపాటు సూక్ష్మధాతు లోపాలు కూడా ప్రధానమైనవి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని చాలా భూముల్లో సూక్ష్మధాతు లోపాలున్నట్లు నిర్ధారణైంది. వివిధ పంటల ఎదుగుదల దశ, కొత్త చిగుర్ల దశల్లో జింకు, ఇనుపధాతు లోపాలు ఎక్కువగా పంటలను నష్టపరుస్తున్నాయి. నాణ్యమైన దిగుబడుల కోసం ధాతు లోపాలను ముందుగానే సవరించుకోవాలి. వరిలో నారుమడులు, పొలాల్లో జింకు, ఇనుపధాతు లోపాలను గుర్తించాం. జింకు ధాతువు లోపాన్ని సవరించడానికి లీటరు నీటిలో 2 గ్రా. జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుప ధాతులోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 20 గ్రా. అన్నభేది, 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పొలంలో నాట్లు వేయడానికి ముందుగానే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మెగ్నీషియం లోపంతో పత్తి ఆకులు ఎర్రబడుతుంటాయి. దీని నివారణకు 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ను పైరు వేసిన 45, 75 రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిన్న కాయలు రాలిపోతాయి. మొక్కలు గిడసబారతాయి. కాయపైన పగుళ్లు ఏర్పడతాయి. నివారణకు 60, 90 రోజుల వయసులో లీటరు నీటికి 1.5 గ్రా. బోరాక్స్‌ను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. చీనీ, నిమ్మ పంటల్లో కొత్త చిగురు వస్తున్న సమయంలో సూక్ష్మధాతు లోపాలను గమనిస్తే ముందు జాగ్రత్తగా పల్లాకు వ్యాధి నివారణకు లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 5 గ్రా. + మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. + ఫై సల్ఫేట్ 2 గ్రా.+ మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా.+ బొరాక్స్ 1 గ్రా. + సున్నం 6 గ్రా. + యూరియా 10 గ్రా. కలిపిన మిశ్రమాన్ని సంవత్సరానికి 4సార్లు పిచికారీ చేయాలి. విప్పారిన లేత ఆకుల మీద, పిందెలు బఠాణి పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. మామిడి, జామ, సపోటా, బత్తాయి, ద్రాక్ష తోటల్లో జింకు లోపం నివారణకు చెట్టుకు 100-200 గ్రా. జింకు సల్ఫేట్‌ను చెట్ల పాదుల్లో వేసి మట్టితో కలపాలి. పంటలపైన లోపం ఉంటే 0.2 శాతం జింకు సల్ఫేట్ పిచికారీ చేయాలి. అరటిలో పొటాష్ లోపం వల్ల ఆకు మొత్తం పండిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు మొక్కకు 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను నలభై రోజుల వ్యవధితో 4 దఫాలు వేసుకోవాలి. లోపం కనిపించినట్టైతే ఆకులపై 5 గ్రా. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ ధాతులోపం వలన ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా ఉండి, ఆకులు బిరుసుగా, పెళుసుగాను ఉంటాయి. దీని నివారణకు 0.1 శాతం బొరాక్స్ మందును ఆకులపై 10 రోజుల తేడాతో రెండుసార్లు పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు : ఆంధ్రప్రదేశ్ : 1100, 1800 425 4440 తెలంగాణ : 1100, 1800 425 1110 కిసాన్ కాల్ సెంటర్ :1551 -
కంది, ఆముదం ఇప్పుడూ విత్తుకోవచ్చు!
కంది, ఆముదం పంటలను మొక్కల మధ్య దూరం తగ్గించి ఆగస్టు నెలలో కూడా విత్తుకోవచ్చు. ఆగస్టు మొదటి వారం వరకు రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వేరుశనగను కూడా విత్తుకోవచ్చు.కందిలో ఎల్.ఆర్.జి-30, ఎల్.ఆర్.జి -38, ఎల్.ఆర్.జి-41, ఐ.సి.పి. ఎల్- 85063, పి.ఆర్.జి-158, పి.ఆర్.జి- 100, ఎమ్.ఆర్.జి-1004, ఐ.సి.పి.ఎల్ -84031 రకాలు ఖరీఫ్ సాగుకు అనుకూలమైనవి. కందిలో ఎకరానికి 200-400 గ్రా. రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఎండు తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి 5గ్రా., ఫైటోఫ్తోరా ఎండుతెగులు ఉంటే మెటలాక్సిల్ 2 గ్రా. చొప్పున విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. కందిలో కలుపు నివారణకు విత్తిన వెంటనే గాని, మరుసటి రోజు గాని పెండిమిథాలిన్ 1-1.5 లీ. లేదా అలాక్లోర్ 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వరిలో నేరుగా విత్తిన లేదా డ్రమ్‌సీడర్‌తో విత్తిన పొలంలో నేల ద్వారా సంక్రమించిన శిలీంధ్రాల వలన మొక్కలు కుళ్లిపోవడం లేదా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం గమనించడమైనది. నివారణకు, 2.5 గ్రా. కార్బన్‌డజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12%+ మాంకోజెబ్ 63% (సాఫ్) మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి నాట్లు వేసే రైతులు నారుమళ్లలో కార్బొప్యూరాన్ 3జి గుళికలను 200 చ. మీ. నారు మడికి (5సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు, 20, 40 రోజుల వయసు గల పంటపై మోనోక్రోటోఫాస్ 1:4 (1 భాగం మందు 4 భాగాల నీళ్లు) నిష్పత్తిలో కాండం మీద మందు పూయాలి. పత్తిలో రైజాక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకడం వలన ఆకులు ఎర్రబడటం గమనించడమైనది. దీని నివారణకు, 3 గ్రా. కాపర్- ఆక్సీ-క్లోరైడ్ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12% + మాంకోజెబ్ 63% (సాఫ్, కంపానియన్, మాస్టర్) మందును లీటరు నీటిలో కలిపి 7 - 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్టుగా చల్లాలి. మొక్కజొన్న విత్తిన 30-35 రోజులకు పైపాటుగా ఎకరానికి 20-25 కిలోల యూరియా వేసుకోవాలి.నీటి వసతి ఉంటే ఆగస్టు నెలలో టమాటా, వంగ, బెండ, తీగజాతి కూరగాయలు, చిక్కుడు, ముల్లంగి, క్యారెట్, ఉల్లి, మిరప, గోరుచిక్కుడు, ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు. టమాటా, కాలిఫ్లవర్, క్యాబేజి పంటల్లో ముదిరిన నార్లను నాటితే దిగుబడి తగ్గుతుంది.తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో నాట్లు వేసిన కూరగాయల పంటల్లో సాలు మార్చి సాలులో నీరు పెట్టాలి. తరచూ అంతర సేద్యం చేయడం ద్వారా కలుపును నివారించుకోవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
వేరుశనగ అన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు
గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తున్నది.వరి, పత్తి పంటల తర్వాత తెలుగు నాట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశనగ. అన్ని ప్రాంతాల్లోనూ జూలై నెలలో వేరుశనగ విత్తుకోవచ్చు.కదిరి-5,6,9, అనంత, నారాయణి, వేమన, జేసీజీ-88, అభయ, ధరణి లాంటి రకాలు తక్కువ వర్షపాత ప్రాంతాల్లోను, గ్రీష్మ, రోహిణి, కాళహస్తి, టీజీ-26, టీఏజీ-24 లాంటి రకాలు ఎక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగుకు అనువైనవి. విత్తనాన్ని గొర్రుతోకానీ, ట్రాక్టరుతో నడిచే విత్తు యంత్రంతో కానీ సాలుకు, సాలుకు మధ్య 30 సెం.మీ, మొక్కకు, మొక్కకు మధ్య 10 సెం.మీ. ఉండేటట్లుగా, 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి.ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువు, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 18 కిలోల యూరియా, మొత్తం ఎరువులను విత్తే సమయంలో ఆఖరి దుక్కిలో వేయాలి.భూమి, విత్తనం ద్వారా వ్యాప్తిచెందే శిలీంధ్రాల నివారణకు, వైరస్ తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటగా కిలో విత్తనానికి, ఒక గ్రా. టిబ్యుకొనజోల్ లేక 3 గ్రా. మాంకోజెబ్ లేక 2 గ్రా. కార్బండిజమ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును కూడా విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6.5 మి.లీ.ల క్లోరోఫైరిఫాస్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసే ప్రాంతాల్లో రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే కానీ లేదా 2-3 రోజుల లోపల పెండిమిథాలిన్ 1.3-1.6 లీ. లేదా 1.25-1.5 లీ. బ్యూటాక్లోర్ 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 21 రోజుల తర్వాత మొలచిన కలుపు నివారణకు ఇమాజితఫిర్ 300 మి.లీ. లేదా క్విజలోఫాప్ ఇథైల్ 400 మి.లీ. ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో అంటే 45 రోజుల సమయంలో రెండోసారి కలుపు తీసి, ఎకరానికి 200 కిలోల జిప్సం వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత వేరుశనగలో అంతర సేద్యం చేయరాదు.వేరుశనగను కంది, ఆముదం, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా వేసుకోవాలి.సజ్జ, జొన్న పంటలను అంతర పంటలుగానే కాకుండా.. పొలం చుట్టూ నాలుగు వరుసలు వేసుకుంటే తామర పురుగులను నిరోధించి తద్వారా పంటను వైరస్ తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
ఈ వారం వ్యవసాయ సూచనలు
ఖరీఫ్ గడువు: తెలంగాణలో 10, ఏపీలో 15 వరకు! భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డెరైక్టర్ జనరల్ డా. ఎస్. అయ్యప్పన్, ప్రొ. ఎమ్మెస్ స్వామినాథన్, వ్యవసాయ విశ్వవి ద్యాలయ ఉపకులపతి డా. ఎ. పద్మరాజు, ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇటీవల హైదరాబాద్‌లో సమావే శమై దేశంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సమీక్షించారు. అదను, పదను చూసుకొని విత్తుకోవడం, పశుగ్రాసాల కొరత నివారణ చర్యలు, తక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు. ఈ సూచనలతో పోస్టర్లను ముద్రించి వ్యవసాయ శాఖ ద్వారా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి రైతులకు మేలు చేకూర్చడానికి కృషి జరుగుతున్నది. తెలంగాణలో జూలై 10వ తేదీ వరకు, జూలై 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఖరీఫ్ పంటలను విత్తుకోవచ్చు. నేల బాగా పదునైన తర్వాతే విత్తుకోవాలి. అరకొర పదునుతో విత్తుకోకూడదు. పెసర పంటను జూలై 30వ తేదీ తర్వాత విత్తుకోకూడదు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, బెండ, కంది, తీగజాతి కూరగాయలు, చిక్కుడు తదితర పంటలను విత్తుకోవచ్చు. వంగ, టమాట, మిరప వంటి కూరగాయ పంటల ను ఎత్తయిన మడులపై పెంచుకో వాలి. అలసంద, జొన్న, మొక్క జొన్న, సజ్జ వంటి పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవాలి. ప్రస్తుతం వేసుకోదగిన అంతర పంటలు: వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి అంతర పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. పత్తి- సోయాబీన్, పత్తి-అపరాలు, జొన్న-సజ్జ, కంది-సోయాబీన్, మొక్కజొన్న-కంది, వేరుశనగ-కంది, వేరుశనగ-ఆముదం, ఆముదం -పెసలు, ఆముదం-అలసంద, ఆముదం-వేరుశనగ, ఆముదం- మినుములు, ఆముదం-కంది, పసుపు-ఆముదం, పసుపు- మొక్కజొన్న మొదలైన పంటలను కలిపి సాగు చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మిశ్రమ వ్యవసాయం చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది. పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, పెరటి కోళ్లు, కుందేళ్ల పెంపకం కూడా చేపట్టవచ్చు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, పట్టు పురుగుల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పశు సంపదకు బీమా రక్షణ పాడి పసువు ధర జాతిని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 45 వేల వరకు పలుకుతోంది. స్థానిక, విదేశీ, సంకరజాతి పశువులకు బీమా చేయొచ్చు. 2-10 ఏళ్ల ఆవులకు, 3-10 ఏళ్ల గేదెలకు బీమా చేయొచ్చు. వీటి ఖరీదులో 5% మేరకు బీమా ప్రీమియం ఉంటుంది. బీమా చేసిన పశువుకు చెవిపోగు వేస్తారు. చెవిపోగు ఊడిపోతే ఏజెంట్‌కు చెప్పి వెంటనే వేయించుకోవాలి. బీమా ఉన్న పశువు మరణిస్తే ఏజెంట్‌కు చెప్పి, కళేబరాన్ని ఫోటో తీయించాలి. పశువుల వైద్యునితో పోస్టుమార్టం చేయించి, ఆ నివేదికతోపాటు చెవిపోగును అధికారులకు ఇచ్చి పరిహారం పొందాలి. సబ్సిడీపై కొన్న పశువు చనిపోతే పాల సహకార సంఘం అధ్యక్షుడితో సంతకం చేయించి బ్యాంకు ద్వారా బీమా పరిహారాన్ని పొందాలి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా చేపల రైతులు పాటించాల్సిన అదనపు జాగ్రత్తలు వానాకాలం అయినప్పటికీ తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. ఫలితంగా మార్కెట్ సైజుకు పెంచే చేపల చెరువుల్లో నీటి లోతు దాదాపు సగానికి (6 అడుగుల నుంచి 3 అడుగులకు) తగ్గిపోయింది. అంటే.. చేపలకు సాధారణంగా లభించే నివాస స్థలం సగానికి తగ్గి.. చెరువుల్లో చేపల సాంద్రత రెట్టింపవుతుందన్నమాట. ఇటువంటప్పుడు చెరువు నీటిలోని మొత్తం ఆక్సిజన్ పరిమాణం కూడా అంతేస్థాయిలో తగ్గిపోయింది. పైగా తీవ్ర వేడిమి వల్ల నీటికి ఆక్సిజన్‌ను పట్టి ఉంచే సామర్థ్యం తగ్గిపోతుంది. సేంద్రియ పదార్థం కుళ్లడం వల్ల ఏర్పడే కాలుష్యం సాంద్రత కూడా పెరుగుతుంది. చేపలు, ముఖ్యంగా రోహు చేపల పెరుగుదల తగ్గిపోవచ్చు. కాబట్టి రోజువారీ వాడే మేత పరిమాణాన్ని తగ్గించి వాడాలి. తెల్లవారుజామున, ఉదయం పూటల్లో ఆక్సిజన్ లోటుతో చేపలు చెరువు పై భాగానికి వస్తుంటాయి. చెరువులోకి మళ్లీ నీరు తగినంత తోడుకునే వరకు రైతులు మేత, ఎయిరేషన్ విషయంలో అదనపు జాగ్రత్తలు పాటించాలి. మార్కెట్ సైజుకు వచ్చిన చేపలను పట్టేయడం మంచిది. - డా. రావి రామకృష్ణ (98480 90576) సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు రొయ్య అనాలోచితంగా గుల్లకొట్టదు! రొయ్యల్లో పెరుగుదల మోల్టింగ్(నిర్మోచనం) అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. దీన్నే గుల్లకొట్టడం అంటారు. రొయ్య తన శరీర పరిమాణం పెంచుకోవాలనుకున్నప్పుడు, గాయాలైనప్పుడు, ప్రత్యుత్పత్తి సమయంలోనూ సహజంగానే గుల్లకొడుతుంది. ఆడరొయ్య గుల్లకొట్టిన సమయంలోనే కలయిక జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి లేనప్పుడు.. రైతులు రసాయనాల వాడకం ద్వారా బలవంతంగా గుల్లకొట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. గుల్లకొట్టడం అనే జీవ ప్రక్రియ రొయ్యకు పునర్జన్మ వంటిది. అటువంటి సంక్లిష్ట ప్రక్రియను రొయ్య అనాలోచితంగా చేసే సమస్యే లేదు. చెరువు యాజమాన్య ప్రక్రియ సక్రమంగా ఉంటే రొయ్యల పెరుగుదల ఆగే సమస్యే లేదు. - ప్రొఫెసర్ పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
అన్ని నేలల్లోనూ ఆముదం పండించొచ్చు
ఆముదం పంట మన రాష్ట్రంలో సుమారు 2.3 లక్షల హెక్టార్లలో సాగువుతున్నది. ఖరీఫ్‌లో ఈ పంటను మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. ఆముదం పంటకు అడవి పందుల బెడద లేకపోవడం విశేషం. కావున పందుల బెడద ఉన్న ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కానీ, నీరు బాగా ఇంకే నేలలు అనుకూలం. జూలై 31 వరకు నేల బాగా పదునైన తరువాత విత్తుకోవాలి. ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా పండించుకోవచ్చు. అయితే, బెట్ట పరిస్థితుల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 1-2 తడులు ఇస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే సూటి రకాలైన క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల, హైబ్రిడ్ రకాలైన పీసీహెచ్-111, పీసీహెచ్-222, జీసీహెచ్-4, డీసీహెచ్-177, డీసీహెచ్-519తో పాటు ప్రైవేట్ హైబ్రిడ్లు కూడా వేసుకోవచ్చు. సాలుకు సాలుకు మధ్య 90 సెం. మీ., మొక్కకు మొక్కకు మధ్య 45 సెం. మీ. ఉండేవిధంగా 4 కిలోల సూటి రకాలను విత్తుకోవాలి.మొలకకుళ్లు తెగులు, ఆల్టర్నేరియం ఆకుమచ్చ తెగులు, కొంత వరకు వడలు తెగులును అరికట్టడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ అనే మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. వడలు తెగులు నివారణకు కిలో విత్తనానికి 3గ్రా. కార్బండజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేయాలి. కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన 24-48 గంటల్లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ లేదా అలాక్లోర్ రసాయన కలుపు మందును 5-6 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్విజలోఫాప్ పి ఇథైల్/ఫినాక్సాఫాప్ పి ఇథైల్/ప్రొపక్విజఫాప్ అనే మందును 1.5 - 2,0 మి. లీ. లేక సైహలోఫాప్ బ్యూటైల్ 1.5 మి.లీ./లీటరు నీటికి కలిపి విత్తిన 20 రోజులకు పిచికారీ చేసి గడ్డి జాతి కలుపును నివారించుకోవచ్చు. సూటి రకాలను సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం కలిగిన ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. పైపాటుగా 6 కిలోల నత్రజని విత్తిన 30-35 రోజులకు, మిగిలిన 6 కిలోల నత్రజని విత్తిన 60-65 రోజులకు వేసుకోవాలి. సంకర రకాలు సాగు చేసేటప్పుడు అదనంగా మరో 6 కిలోల నత్రజనిని వత్తిన 9-95 రోజులకు వేసుకోవాలి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి సూచనలు : 1. నాణ్యత గల విత్తనాన్ని వాడాలి. 2. తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. 3. ఎరువులను తగు మోతాదులో సరైన సమయంలో వేయాలి. 4. కీలక దశల్లో వీలైతే నీరు పెట్టాలి. 5. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. 6. సరైన సమయంలో కోయడం, నూర్చడం చాలా ముఖ్యం. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
తేలిక నేలల్లో వర్షాధారంగా పత్తి, సోయా వద్దు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిస్థాయి రుతుపవనాలు రాష్ర్ట్రంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి.రుతుపవనాలు ప్రవేశించే ముందు ప్రస్తుతం కురుస్తున్న స్వల్ప వర్షాలను ఉపయోగించి వర్షాధార పంటలను విత్తుకోకూడదు.వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సేకరించుకోవాలి. వర్షాధారపు పంటలైన పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, సోయాచిక్కుడు తదితర పంటలను నేల పూర్తిగా తడిసిన తర్వాత అంటే.. వారం వ్యవధిలో 50-75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత లేదా 15 సెం. మీ. లోతు నేల తడిసిన తర్వాతనే విత్తుకోవాలి. పత్తి, సోయాచిక్కుడు పంటలను తేలిక నేలల్లో వర్షాధార పంటగా సాగు చేయకూడదు. సోయాబీన్: ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జూన్ 15 నుంచి జూలై 15 వరకు సోయాబీన్ విత్తుకోవడానికి చాలా అనుకూలం.జె. ఎస్-335, జె.ఎస్-9305, బాసర, బీమ్ రకాలు సాగు చేసుకోవడాని కి అనువైనవి. ఎకరానికి 25-30 కిలోల విత్తనం అవసరమవుతుంద సోయాబీన్ విత్తనం తగిన మొలక శాతం ఉండడానికి గత ఖరీఫ్ లేదా రబీలో పండించిన విత్తనాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి.విత్తన నిల్వ, రవాణా సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. బస్తాలను ఎత్తుకునేటప్పుడు, దించుకునేటప్పుడు విత్తనంపై ఎటువంటి ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి. రవాణా, నిల్వ సమయంలో బస్తాపైన బస్తా పెడితే అడుగు బస్తాలోని విత్తనం మొలక శాతం దెబ్బతింటుంది. కొత్తగా సోయాబీన్ సాగు చేసే రైతులు తప్పనిసరిగా ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం జపానికం కల్చరును కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవడం ద్వారా గాలిలోని నత్రజనిని భూమి స్థిరీకరించడమే కాకుండా దిగుబడి పెంచుకోవచ్చు.నల్లరేగడి భూముల్లో 45్ఠ5 సెం.మీ. దూరంలో చదరపు మీటరుకు 40 మొక్కల చొప్పున ఎకరాకు 1.6 లక్షల మొక్కలు ఉండేలా విత్తుకోవాలి.ఎకరాకు 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి. పైపాటుగా ఎకరానికి 20 కిలోల నత్రజనిని విత్తిన 30 రోజులకు అదనంగా వేయాలి. విత్తే ముందు ఫ్లుక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి లేదా విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పెండిమిథాలిన్ 30% 1.4 లీ. పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
మొక్కజొన్న సాగు.. కొన్ని మెలకువలు
ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, నీటి వసతి కింద కూడా పండించుకోవచ్చు. ఈ పంటను విత్తనాల కోసం, కండెల కోసం, పాప్ కార్న్ కోసం, కూరగాయగా బేబీ కార్న్ రూపంలోనూ పండించుకోవచ్చు.విత్తనం కోసం పండించడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రీసెర్చ్ హైబ్రిడ్స్తోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన డీహెచ్ఎం 117, డీహెచ్ఎం 119, డీహెచ్ఎం 121 రకాలు సాగుకు అనుకూలం.వర్షాధారం పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. విత్తనం, భూమిలోని శిలీంద్రం నుంచి తొలిదశ మొక్కలను కాపాడటం కోసం 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా మాంకోజెబ్లలో ఏదైనా ఒక మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఎకరాకు 8 కిలోల సంకర రకాల విత్తనాన్ని బోదెలపైన 1/3 వంతు ఎత్తులో విత్తితే వర్షం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. బోదెకు, బోదెకు మధ్య దూరం 60 సెం. మీ., మొక్క కు, మొక్కకు మధ్య 20 సెం. మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.పంట విత్తిన తరువాత రెండు, మూడు రోజుల లోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు అదుపు చేయవచ్చు.సంకర రకాలలో మంచి దిగుబడి కోసం ఎకరానికి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. 1/3 వ వంతు నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, సగభాగం పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. మిగిలిన 1/3 వ వంతు నత్రజనిని 30-35 రోజులకు, మరో 1/3వ వంతు 50-55 రోజుల మధ్య వేయాలి. మిగతా 1/2వ వంతు పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
ఈ వారం వ్యవసాయ సూచనలు
నువ్వుల సాగుకు తరుణం ఇదే నువ్వు పంట స్థిరమైన ధర పలుకుతూ రైతులకు ప్రస్తుతం రెండు సంవత్సరా లుగా మంచి ఆదాయ వనరుగా ఉన్నది. ఈ పంటను విత్తుకోవడానికి కోస్తా ప్రాంతాల్లో మే ఆఖరి వరకు, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మే-జూన్ నెలలు అనుకూలమైనవి. గోధుమ రంగులో ఉండే గౌరి, మాధవి, యలమంచిలి-11, యలమంచిలి-66, చందన రకాలు 70-80 రోజుల్లో కోతకు వస్తాయి. ఖరీఫ్ ఆలస్యమైనప్పుడు తెల్ల నువ్వు రకాలైన రాజేశ్వరి, శ్వేతతిల్, హిమ వంటి రకాలు విత్తుకోవడం ద్వారా మంచి దిగుబడితో పాటు అధిక ధర పొందవచ్చు. ఎకరానికి సరిపడే రెండున్నర కిలోల విత్తనానికి ఏడున్నర గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ లేదా మాంకోజెబ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం. మీ., మొక్కల మధ్య 15 సెం. మీ. దూరం ఉండేలా మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసలలో విత్తుకోవాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ అవసరం. నత్రజనిలో సగభాగం, భాస్వరం, పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. వర్షాకాలంలో వచ్చే కలుపు నివారణకు విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ కలుపు మందును లేదా విత్తిన తర్వాత 24 గంటలలోపు పెండిమిథాలిన్ 30 శాతం లేదా అల్లాకోర్ 50 శాతం 1 లీటరు/ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పశువుల్లో ఎద గుర్తింపు పద్ధతులు పాడి పశువు ఎదకొచ్చినప్పుడు గుర్తించలేకపోతే రైతు 21 రోజుల పాడి కాలం కోల్పోయినట్టే. మూగ ఎదలను గుర్తించే పద్ధతులను తెలుసుకోవడం అవసరం. పాడి పశువును రోజుకు 3 పూటలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. 80% ఉదయం పూటే ఎదకు వస్తుంటాయి. పశువులు ఈనిన 45-60 రోజుల మధ్యలో వైద్యుడితో పరీక్ష చేయించి ఎదకు వచ్చే తేదీని ముందే తెలుసుకొని, ఎదను గుర్తించడం లాభదాయకం. పెద్ద డెయిరీల్లో అయితే ‘టీజర్’ ఆబోతులు లేదా దున్నపోతులను ఉపయోగించి ఎదను పసిగడతారు. పశువు తోకపైన పెయింట్/ రంగు పూసి ఉంచితే ఎద గురించి తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఎదకొచ్చిన పశువులను జాతి కుక్కల సాయంతో పసిగడుతుంటారు. పెద్ద వ్యాపార సంస్థలు ఎద పశువులను గుర్తించడానికి ప్రత్యేకించి ఒకరిని నియమించాలి. పాలలో ప్రోజెస్టరాన్ హార్మోను ఎక్కువ ఉంటే పశువు ఎదకొచ్చినట్లు గుర్తించాలి. హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చిన 2 -7 రోజుల్లో పశువులు ఎదకొస్తాయి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధనా కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా చేపలకు మొప్పల పరీక్ష ముఖ్యం తెల్లచేపల మొప్పల పరీక్షల ద్వారా చాలా వ్యాధులు, అసాధారణ పరిస్థితులు తెలుస్తాయి. మొప్పల కింది నుంచి చివరి వరకు కణజాలం చనిపోయి తెలుపు /పసుపు గాయం చారలుగా కనిపిస్తుంటే అది తాటాకు తెగులు(బాక్టీరియా వ్యాధి)గా గుర్తించాలి. మొప్పల్లో బియ్యపు గింజల మాదిరిగా కనిపిస్తూ ఉంటే అది ఏకకణ జీవి వ్యాధిగా గుర్తించాలి. మొప్పలు ముద్దగా, కలిసిపోయి ఎక్కువ జిగురు స్రవిస్తూ ఉంటే.. అది మొప్ప పురుగు వ్యాధి కావచ్చు(దీన్ని మైక్రోస్కోపుతో పరీక్షించి నిర్ధారించాలి). రోహు మొప్పల్లో కణాలు పెరిగిపోవడం తదితర కారణాల వల్ల తరచూ చివరలు తెల్లబడుతూ ఉంటాయి. రక్త హీనత వల్ల కూడా మొప్పలు పాలిపోతాయి. కాబట్టి, రైతులు చేపల మొప్పలను గమనిస్తూ అదనపు సలహాల కోసం నిపుణులను సంప్రదించాలి. - డా. రావి రామకృష్ణ (98480 90576), సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు విటమిన్-సి లోపంతో నీలి మొప్పలు! వేసవిలో కొన్ని ప్రాంతాల్లో వెనామీ రొయ్యల మొప్పలు లేత నీలి రంగులో, మరికొన్ని ప్రాంతాల్లో ఇటుక రాయి రంగులో కనిపిస్తాయి. మొప్పలు లేత నీలి రంగులో కనిపించడానికి విటమిన్ సీ లోపం కారణం. కిలో మేతకు 5 గ్రాముల చొప్పున సీ విటమిన్‌ను కలిపి, ఆ మేతను రోజుకు రెండు పూటలు 5 రోజుల పాటు వాడాలి. మొప్పలు ఇటుకరాయి రంగులోకి మారడానికి ఐరన్ అధికపాళ్లలో ఉన్న బోరు నీటిని వాడటమే కారణం. దీని నివారణకు నిపుణులను సంప్రదించాలి. వర్షాలు పడే సమయంలో చెరువులోకి వర్షం నీరు అధికంగా చేరుతూ ఉంటే.. ఉప్పదనం వ్యత్యాసాల వల్ల కలిగే వత్తిడితో రొయ్యలకు నష్టం జరగొచ్చు. చెరువులోకి వచ్చే వర్షపు నీరు వచ్చింది వచ్చినట్లుగా బయటకు పోయేలా స్లూయిజ్ గేటు అమరిక చేసుకుంటే ఈ సమస్య రాదు. సీజన్‌తో నిమిత్తం లేకుండా సంవత్సరం పొడవునా సీడ్ ఉత్పత్తి, స్టాకింగ్ వల్ల రోగకారక క్రిముల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. - ప్రొ. పి. హరిబాబు (98495 95355), మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
సాగుబడి
ఈ వారం వ్యవసాయ సూచనలు ధాన్యం నిల్వలో మెలకువలు మన రాష్ట్రంలో పండించే ఆహార ధాన్యాల లో 12-16 మిలియన్ టన్నుల ధాన్యాన్ని పంట కోసిన తర్వాత నష్టపోతున్నాం.వరి ధాన్యాన్ని నిల్వ చేసే ముందు గింజలో తేమ శాతం 14% ఉండే విధంగా చూసుకోవాలి. వేరుశనగ గింజల్లో తేమ 7% కన్నా తక్కువ ఉండేలా ఆరబెట్టాలి. నిల్వ ఉన్న పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపరాదు.గోదాముల్లో గతేడాది పంట తాలూకు మిగిలిన ధాన్యాన్ని తీసివేసి శుభ్రపరచుకోవాలి. ఒక లీటరు మలాథియాన్ మందును 100 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని గోదామంతా తడిచేలా పిచికారీ చేయాలి.పాత సంచులను వాడేటప్పుడు పాత ధాన్యం, క్రిమికీటకాలు లేకుండా వాటిని శుభ్రపరచి ఎండబెట్టాలి. వీలైనంత వరకు కొత్త సంచుల్లో ధాన్యం నిల్వ చేయాలి.ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడలకు తగలకుండా, తేమలేని పొడి ప్రదేశంలో చెక్క బల్లల మీద నిల్వ చేయాలి. 100 కిలోల ధాన్యానికి, 2 కిలోల వేపగింజల పొడిని కలిపితే బియ్యపు చిలక తదితర పురుగులు ఆశించవు.గోదాములలోనికి తేమ చొరబడకుండా జాగ్రత్త వహించాలి.గోదాము నేలలు, గోడలు, పైకప్పులపై బీటలు లేకుండా చూడాలి.అపరాలను జనపనార సంచుల్లో గాని లేక పాలిథిన్ అమర్చిన గోనె సంచుల్లో గాని, నైలాన్ సంచుల్లో గాని నిలువ చేయాలి.గోదాముల్లో ఎలుక బోనులను ఉంచాలి. సంచుల్లోని గింజ వేడెక్కుతున్నదా, రంగు మారుతున్నదా, ముక్కవాసన వస్తున్నదా, బూజు పడుతున్నదా, అనే వివరాలను ప్రతి 15 రోజులకోసారి పరిశీలించి తగు చర్యలు చేపట్టాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్