అధిక వర్షాలు.. రైతులకు సూచనలు
ఇటీవల వివిధ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడ్డాయి. పొలాల్లో నిలిచిన నీటిని తీసివేసి రైతులు కొన్ని మెలకువలు పాటించాలి.
కొత్తగా వరి సాగు వద్దు: రైతులు ఇప్పుడు కొత్తగా వరి సాగు చేపట్టకూడదు. స్వల్పకాలిక రకాలను కూడా సాగు చేయవద్దు. తెలంగాణలో ఇప్పడు వరి సాగు ప్రారంభిస్తే పూత సమయంలో చలి పెరిగి తాలు గింజలు ఏర్పడతాయి. కావున ఇతర పంటలే వేసుకోవాలి.
సాగులో ఉన్న వరికి బ్యాక్టీరియా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. నత్రజని ఎరువుల వాడకాన్ని కొన్నాళ్లు వాయిదా వేయాలి.వరి మొక్కలు ముంపునకు గురై చనిపోతే పక్క కుదుళ్లలో ఉన్న కుచ్చుల నుండి అదనపు మొక్కలను తీసి నాటాలి.అగ్గి తెగులును బీపీటీ-5204 తట్టుకోలేదు. లీటరు నీటికి 0.6 గ్రా. ట్రైసైక్లజోల్ కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు లీటరు నీటికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. కలిపి చల్లాలి. మొక్కజొన్న: మొక్కజొన్న పొలంలో నిల్చిన నీటిని తీసివేసి ఎకరాకు 25 కిలోల నత్రజని, 10 కిలోల పొటాషియం వేయాలి.ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ముందస్తు చర్యగా మాంకోబెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పత్తి: రెండో దఫా ఎరువులుగా ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.భూమిలోకి గాలి ప్రసరణకు అంతర సేద్యం చేయాలి.టొబాకో స్ట్రీక్ వైరస్‌ను వ్యాప్తి చేసే తామర పురుగుల నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.నీటి ముంపున్న పొలాల్లో లీటరు నీటికి మల్టి-కె(13-0-45) 10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పచ్చదోమ నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. మరియు ప్లాంటామైసిన్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.ఆకుమచ్చ తెగులు నివారణకు 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాప్టాన్ పొడి మందును 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి.
సోయాబీన్: పొటాషియం నైట్రేట్(1 శాతం)ను మొక్కలు నిలువెల్లా తడిచేలా పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. పొగాకు లద్దె పురుగు కనిపిస్తే నొవాల్యురాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
టమాటా: నీటి ముంపు వల్ల వేరు కుళ్లు తెగులు వస్తే 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను ఒక లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా పోయాలి.
డా॥ దండ రాజిరెడ్డి, వ్యవసాయ విస్తరణ సంచాలకులు ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్