Soybean
-
డిసెంబర్ నుంచి ఎన్ఎస్ఈ వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీ ఎన్ఎస్ఈ వచ్చే నెల నుంచి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబర్ ఒకటిన ముడి సోయాబీన్ ఆయిల్ కాంట్రాక్టుతో తమ తొలి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టును ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. సోయాబీన్ ఆయిల్ ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమల సంస్థలు .. ధరలను హెడ్జ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. లాట్ పరిమాణం 10 మెట్రిక్ టన్నులుగాను, కాంట్రాక్టు సెటిల్మెంట్ నెలవారీగాను ఉంటుందని తెలిపింది. దేశీ కమోడిటీ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇలాంటి సాధనాలు ఉపయోగపడగలవని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే తెలిపారు. -
సోయాబీన్ కొనుగోలుకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన పంటలో ఒకటిగా ఉన్న సోయాబీన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. తెలంగాణలో సోయాబీన్ పంట ఎక్కువగా ఉత్పత్తి అయిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి కేంద్ర సంస్థలతో పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి టి.హరీశ్‌రావు ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం లేఖ రాశారు. ‘తెలంగాణలో 1.64 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగు చేస్తున్నారని, అనుకూల పరిస్థితులతో సగటు దిగుబడి పెరిగి, హెక్టారుకు 11.33 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. 2017–18 ఖరీఫ్ మార్కెట్ సీజనులో సోయాబీన్ కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ.3050 ఉన్నప్పటికీ ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2300 నుంచి రూ.2800 మాత్రమే పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఖరారు చేసిన ఎంఎస్పీకి కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’అని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు. -
సీఎం దత్తత గ్రామాల్లో పచ్చని పంటలు
‘పచ్చ’వల్లి.. - సమష్టి కృషితో ఽసోయా, మొక్కజొన్న సాగు - అనుకూలించిన వర్షాలు - అధికారుల సూచనలతో సస్యరక్షణ - ఏపుగా పెరిగిన పంటలు - ఆనందంలో రైతులు జగదేవ్‌పూర్:సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. నిన్నమొన్నటి వరకు సాగు దండగా అని భావించిన ఇక్కడి రైతులు ఇప్పుడు పండుగేనంటున్నారు. గత ఏడాది వరకు రైతులు తమ ఇష్టానుసారంగానే పంటలు సాగు చేసేవారు. చినుకు పడితే చాలు విత్తన పనులు ప్రారంభించే వారు. ఏటా ఒకే రకమైన పంటలు వేసేవారు. ఓవైపు ప్రకృతి సహకరించక దిగుబడులు రాకపోవడం.. మరో వైపు మార్కెట్లో మద్దతు ధర లభించకపోవడంతో సతమతమయ్యేవారు. పంట పండితే పండగ, లేకుంటే దండగ అనే వారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాగు దండగా అని భావించిన వారే ఇప్పుడు ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అధునిక సాంకేతిక పద్ధతులతో పంటలను సమష్టిగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, సోయాబీన్ పంటలు సాగవుతున్నాయి. పంటలకు అనుకూలంగా వానలు కురువడంతో సీఎం దత్తత గ్రామాలకు పచ్చని కళ వచ్చింది. రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆశాజనకంగానే పంటలు... సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో సాగు చేసిన మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కళకళలాడుతున్నాయి. బిందు సేద్యం కాకుండా వర్షధార పంటలుగానే సాగు చేసిన ప్రస్తుతం ఆ పంటలు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 2,800 ఎకరాల సాగు భూమి ఉండగా, రెండు వందల ఎకరాలకు ఒక జోన్‌గా విభజించారు. మొత్తం 14 జోన్లు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలో 9, నర్సన్నపేటలో 5 జోన్లలో మొక్కజొన్న, సోయాబీన్ సాగు చేశారు. ఎర్రవల్లిలోని 1వ, 5వ జోన్లలో, నర్సన్నపేటలో 6,7వ జోన్లలో సోయాబీన్ వేయగా మిగిలిన జోన్లలో మొత్తం మొక్కజొన్న సాగు చేశారు. తమ భూముల్లో వర్షాధార పంటలు సాగు చేసిన రైతులంతా సమష్టిగా వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ పంట మెలకువలను పాటిస్తున్నారు. శాస్త్రవేత్తల సూచనలు... ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ఏరువాక కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి, నెటాఫిమ్ అగ్రనమిస్టులు నిత్యం పంటలను పరిశీలిస్తూ రైతులకు పలు సూచనలు ఇవ్వడంతో పంటలు ఏపుగా పెరిగాయి. వర్షాలు కూడా కురవడం అనుకూలించింది. ఎప్పటికప్పుడు రైతులు కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. దీంతో పంటల్లో కలుపు మొక్క కనిపించడం లేదు. ఈ రెండు గ్రామాల్లో ఖరీఫ్‌కు ముందు భూమి లేని నిరుపేదలకు 42 ట్రాక్టర్లు అందించారు. దీంతో వ్యవసాయం పనుల్లో ఇబ్బందులు లేకుండా పోయాయి. విత్తనోత్పత్తిగా సోయాబీన్... సీఎం దత్తత గ్రామాల్లో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ సోయాబీన్ పంటను విత్తనోత్పత్తిగా చేపడుతుంది. రైతులు పండించిన సోయాబీన్‌ను స్వయంగా తెలంగాణ విత్తన సంస్థ వారే కొనుగోలు చేయనున్నారు. సీడ్స్ కార్పొరేషన్ ప్రతినిధులు పంటలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వరంగల్ ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వారంలో రెండుమూడు సార్లు పంటలను పరిశీలిస్తూ పలు సలహాలిస్తున్నారు. మొక్కజొన్న పంట మాత్రం ఈ సారి విత్తనోత్పత్తి లేదు. రెండు గ్రామాల్లో సాగవుతున్న మొక్కజొన్న పంట ఎక్కడ అమ్ముకోవాలన్నా ఇబ్బంది రాకుండా ముందస్తుగానే కావేరి విత్తన సంస్థతో బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. సమష్టి విధానం ఇదే మొదటిసారి అయినందున పండిన మొక్కజొన్న సాధారణ ధాన్యంగానే విక్రయిస్తారు. రబీ నుంచి బిందుసేద్యం ద్వారా పండించే పంటను విత్తనోత్పత్తిగా తీసుకుంటారు. ఆధునిక సాగు... సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించాలన్న సంకల్పంతో ఈ రెండు గ్రామాల్లో సాగునీటి వనరుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలని రైతుకు వందశాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందించారు. రెండు వందల ఎకరాలకొకటి చొప్పున సంపు నిర్మాణం చేపడుతున్నారు. సంపు ద్వారా పంటలకు సాగునీరు అందిస్తారు. పంటలకు ఏకకాలంలో నీరు, ఎరువులు అందించేలా పంటల మధ్యలో నెటాఫిమ్ వారు సైనెట్ వాల్ సిస్టమ్‌ను బిగించారు. దీనివల్ల ఎరువులు, నీరు ఆటోమెటిక్‌గా పంటలకు చేరుకుంటాయి. ఎకరానికి రూ.15 వేల బ్యాంకు రుణం... సీఎం దత్తత గ్రామంలో నాలుగు నెలల క్రితం ఏపీజీవీబీ బ్యాంకును ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ బ్యాంకును ప్రారంభించి ప్రభుత్వం తరుపున అప్పుడే రూ.5 కోట్లను డిపాజిట్ చేశారు. రెండు గ్రామాల రైతులు బ్యాంకులో ఖాతాలు తెరుచుకున్నారు. కొంత మంది రైతులు డిపాజిట్లు కూడా చేశారు. ఈ బ్యాంకు వారు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రుణం అందించారు. వ్యవసాసాయ అధికారులు దగ్గరుండి విత్తనాలు, ఎరువులు మందులు అందజేశారు. మందులు ఇలా... మొక్కజొన్న ఎకరానికి 8 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక్ సంచి, యూరియా మూడు బస్తాలు, పొటాషియం ఒక బస్తా, గడ్డి మందు లీటర్, సోయాబీన్ పంటకైతే ఎకరానికి 30 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక సంచి, యూరియా సంచి, పొటాషియం బస్తా, గడ్డి మందు లీటర్ చొప్పున పంపిణీ చేశారు. పంటలు బాగున్నాయి... నాకున్న మూడు ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్ సాగు చేసిన. ప్రస్తుతం చేనులు చాలా బాగున్నాయి. ఎకరంలో మొక్కజొన్న, రెండు ఎకరాల్లో సోయాబీన్ పంట చూస్తుంటే గత ఏడాది చేసిన అప్పులు తీరుతాయనిపిస్తుంది. ఎడ్లతో కాకుండా ట్రాక్టర్‌తో విత్తనం వేసిన. మంచిగా మొలిసింది. ఎరువులు, విత్తనాలు, మందులు అధికారులిచ్చారు. మొత్తం రూ.6వేల ఖర్చు వచ్చింది. - లక్ష్మి, రైతు, నర్సన్నపేట పత్తిని మరిచిపోయా... నాకున్న పదిహేను ఎకరాల్లో అధికారుల సూచనల మేరకు మొక్కజొన్న సాగు చేసిన. వర్షాలు అనుకూలించడంతో చేను బాగానే ఉంది. గత ఏడాది పదిహేను ఎకరాల్లో పత్తి పెట్టిన. వర్షాభావంతో పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని మా వ్యవసాయాన్నే మారుస్తుండు. పంటలపై అధికారులు అవగాహన కల్పించిండ్రు. బ్యాంకు రుణం కూడా ఇస్తున్నరు. పెట్టుబడికి ఎలాంటి తిప్పలు లేదు. - కనకయ్య యాదవ్, రైతు, నర్సన్నపేట -
పచ్చని పంటలతో కళకళ
జగదేవ్‌పూర్:సీఎం కేసీఆర్ దత్తత గ్రామలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో వివిధ పంటలు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు విస్తారంగా సాగవుతున్నాయి. రెండు గ్రామాల్లో సమష్టి వ్యవసాయంలో భాగంగా ఎర్రనేలల్లో మొక్కజొన్న, నల్ల భూముల్లో సోయాబీన్ పంటలను సాగు చేశారు. 2,800 ఎకరాలను 14 జోన్లుగా విభజించి ఒక్క జోన్ పరిధిలో 200 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీన్ విత్తనాలను ట్రాక్టర్ల ద్వారా విత్తారు. ప్రస్తుతం మొలకలెత్తిన పంటలతో రెండు గ్రామాలు కళకళలాడుతున్నాయి. రైతులు తమ భూముల్లో దంతె, గొర్రు, గడ్డి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎటు చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. -
సగానికే పరిమితమైన సోయా సాగు
12.39 లక్షల ఎకరాల లక్ష్యంలో 6.86 లక్షల ఎకరాల్లోనే సాగు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పిలుపునిచ్చిన విధంగా ఈ సారి రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్ సాగు వైపు వెళ్లాలని చేసిన సూచనలను రైతులు పట్టించుకోలేదు. పత్తి సాగు విస్తీర్ణం ఈసారి 26.28 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు 25.49 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అంటే ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు స్పందించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ ఖరీఫ్‌లో 12.39 లక్షల ఎకరాల్లో సోయాను పండించాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. కానీ తాజా నివేదిక ప్రకారం సోయా సాగు విస్తీర్ణం 6.86 లక్షల ఎకరాలకే పరిమితమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ లక్ష్యంలో సోయా సాగు సుమారు సగానికే పరిమితమైంది. మరోవైపు ఈ ఏడాది 17.46 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలను సాగు చేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం 11.78 లక్షల ఎకరాల్లోనే పప్పుధాన్యాల సాగు జరిగిందని నివేదిక తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.35 ల క్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 2.59 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మొత్తంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 59.40 లక్షల (55%) ఎకరాల్లోనే సాగయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా 85% పంటలు సాగయ్యా యి. అత్యంత తక్కువగా కరీంనగర్ జిల్లాలో 34% విస్తీర్ణంలోనే పంటలు వేశారు. మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం... రాష్ట్రంలో ఈ సీజన్లో 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా... మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 52 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది. -
సోయా.. ఆయా
♦ విత్తనోత్పత్తికి శ్రీకారం విత్తన భాండాగారంగా ‘ఖేడ్’ ♦ రాష్ట్రంలోనే ప్రథమం ఇక అందుబాటులో విత్తనాలు ♦ సంబురాల్లో రైతులు కల్హేర్: వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గం విత్తన భాండాగారంగా వెలుగొందనుంది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోయాబీన్ విత్తనోత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోయాబీన్ మూలవిత్తనం సాగు కోసం నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. కల్హేర్, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్ మండలాల్లో వెయ్యి ఎకరాల చొప్పున సోయాబీన్ ఉత్పత్తి కోసం కార్యాచరణ రూపొందించారు. సోయాబీన్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్ నుంచి మూల విత్తనాలు దిగుమతి చేసుకుని రైతులకు సరఫరా చేసేది. ఖేడ్ ప్రాంతంలోనే విత్తనోత్పత్తి చేపట్టడంతో రైతులకు విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనోత్పత్తి కోసం 3 వేల విత్తన బస్తాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్సిడీపై సరఫరా చేస్తారు. 30 కిలోల బస్తా ధర రూ. 1,410 కాగా అదనంగా అధికారుల తనిఖీ చార్జి రూ. 140, రిజిష్ట్రేషన్ చార్జి రూ. 157.. మొత్తం రూ. 1707కు రైతులకు పంపిణీ చేస్తారు. 30 కిలోల బస్తా వాస్తవ ధర రూ.2250. సబ్సిడీపై రూ.1707కు అందజేస్తారు. కాగా ఒక రైతు నుంచి ఒక బస్తాకే రిజిస్ట్రేషన్ చార్జి వసూలు చేస్తారు. మిగతా బస్తాలకు వసూలు చేయరు. ఈ విషయాలన్నింటిపైనా ఇటీవల సీడ్స్ కార్పొరేషన్ మెదక్-రంగారెడ్డి జిల్లాల డీఎం సురేందర్‌రెడ్డి మండలంలోని మార్డిలో సోయాబీన్ విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కలిపించారు. సాధారణ నేలలు అనుకూలం.. సోయాబీన్ విత్తనోత్పత్తి కోసం సాధారణ భూములు అనుకూలం. ఖరీఫ్‌లో తొలకరి వర్షాలు కురిస్తే.. జూన్ మొదటి వారం నుంచి నెలాఖరు వరకు సోయ సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట సాగు కాలం 95 రోజుల నుంచి 105 రోజులు. ఒక రైతు 25 ఎకరాల వరకు కూడా సోయాను సాగు చేయవచ్చు. సోయ విత్తనోత్పత్తికి సంబంధించి సీడ్స్ కార్పొరేషన్, రైతుల మధ్య రూ. 100 విలువ చేసే స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. రైతులు పండించిన సోయ విత్తనం వ్యాపారులకు కాకుండా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌కు విక్రయించేందుకే ఈ ఒప్పంద ఉద్దేశం. పంట చేతికొచ్చాక మార్కెట్లో ఉన్న ధరకు 15 నుంచి 20 శాతం అధికంగా డబ్బులు చెల్లించి సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేపడుతారు. నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు చేసిన సోయాకు 75 శాతం మొదట డబ్బులు చెల్లిస్తారు. తేమ శాతన్ని పరిశీలించేందుకు సోయను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపిస్తారు. ల్యాబ్ పరీక్షలో 9 శాతం తేమ ఉంటేనే కోనుగోలు చేస్తారు. రైతులు తేమ శాతం పట్ల జాగ్రత్త పాటించాలి. విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ఉత్సహం కనబరుస్తున్నారు. సోయ విత్తనోత్పత్తితో రాష్ట్రంలో విత్తనాల కొరత తీరనుంది. -
పత్తి తగ్గించండి.. సోయాబీన్ పెంచండి
♦ జేడీఏలకు వ్యవసాయ శాఖ ♦ కార్యదర్శి పార్థసారథి పిలుపు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్‌లో పత్తిని తగ్గించి సోయాబీన్, కంది వంటి పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితులెదురైతే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై మంగళవారం జిల్లా వ్యవసా, రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. గుజరాత్, మహా రాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో గతేడాది పత్తిని గులాబీ రంగు పురుగు నాశనం చేయడంతో రైతులు పెద్దఎత్తున నష్టపోయారన్నారు. బీటీ-2 పత్తి విత్తనం పురుగును నశింపజేసే శక్తిని కోల్పోయిందన్నారు. కేంద్రం కొత్త బీమా అందుబాటులోకి తెచ్చిందని.. రైతులందరికీ వచ్చే జూలై 31 తుది గడువని వెల్లడించారు. విత్తన నమూనాలను పరీక్ష చేసి రైతులకు ఇవ్వాలని.. లేకుంటే నకిలీ విత్తనాలు మార్కెట్లో విజృంభించే ప్రమాదముందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కంటే నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ పంట లు తీవ్రంగా నష్టపోయాయన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే మూడు స్థాయిల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ సోయాబీన్, అంతర పంటగా కందిని ప్రోత్సహించాలన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది ఏఈవోలు అందుబాటులోకి రానున్నారన్నారు. శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి ైవె పరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్ రాజిరెడ్డి మాట్లాడుతూ 60-70 మిల్లీమీటర్ల వరకు వర్షాలు పడ్డాక... రుతుపవనాలను ప్రకటించాక రైతులు విత్తనాలు వేయాలని సూచించారు. -
రైతు నెత్తిన ‘సోయా’ టోపీ
♦ విత్తనాల సేకరణలో అడ్డగోలు విధానం ♦ మార్కెట్ ధర రూ.3 వేలుంటే..కంపెనీల నుంచి రూ.6,600కు కొనుగోలు ♦ కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టేందుకే అని విమర్శలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయశాఖ సోయాబీన్ విత్తన కుంభకోణానికి తెరలేపింది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పండించాలని పెద్దఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం.. విత్తనాలను మాత్రం అధిక ధరలకు కొనేందుకు సిద్ధమైంది. వివిధ కంపెనీల నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి వాటికి కోట్లు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది 6.35 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగైతే ఈసారి 11.5 లక్షల ఎకరాల్లో సాగును పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 4 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని అంచనా వేసింది. ఆ విత్తనాలను సేకరించే బాధ్యత వివిధ కంపెనీలకు అప్పగించింది. మధ్యప్రదేశ్ నుంచి వాటిని సేకరించే పనిలో కంపెనీలున్నాయి. ప్రభుత్వం క్వింటాల్ సోయాబీన్ విత్తన ధరను రూ.6,600 ఖరారు చేసింది. అందులో 33.33 శాతం సబ్సిడీని భరించి రైతులకు రూ.4,400 ధరకు అందజేస్తామని ఇటీవల ఉత్తర్వులిచ్చింది. కానీ ఈ ఏడాది సోయాబీన్ ధర మార్కెట్లో గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.3 వేలకు మించి ధర పలకడంలేదని స్వయంగా మార్కెటింగ్ శాఖే పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల కోసం ఏకంగా రెండింతల ధరను ఎలా ఖరారు చేశారో అంతుబట్టడం లేదు. ఒక్కో క్వింటాలుకు రైతుపై రూ.800 భారం ప్రస్తుత ధరను లెక్కలోకి తీసుకోకుండా గతేడాది ధరను అధికారులు ఎలా ఖరారు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో ధర ప్రకారమే రైతులు కొనుగోలు చేస్తే వారికి రూ.3 వేలకే దొరుకుతుంది. ఒకవేళ దాన్ని ప్రాసెస్ చేసినా రూ.3,600కు మించి ధర ఉండదంటున్నారు. అలాంటిది రైతులకు క్వింటాలుకు రూ.4,400కు కట్టబెట్టబోతున్నారన్న మాట. ఈ లెక్కన రైతులపై ఒక్కో క్వింటాలుకు ఏకంగా రూ.800 భారం పడనుంది. ఇలా కంపెనీల నుంచి అధికంగా కొనుగోలు చేయడం వల్ల రైతులపై రూ.32 కోట్లు, ప్రభుత్వంపై రూ.88 కోట్లు అదనపు భారం పడనుంది. ఈ తతంగంలో ప్రైవేటు కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం గతేడాది ధర ప్రకారమే సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ధర తగ్గినా ఎక్కువ ధరతో కంపెనీల నుంచి సోయాబీన్ విత్తనాలు ఎందుకు కొంటున్నారని ప్రశ్నించగా ఆయన సరైన సమాధానమివ్వలేదు. -
నాణ్యత పాటిస్తే మద్దతు!
వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.1,400, సాధారణ రకం రూ.1,360, పత్తి (పొడవు పింజ రకం) రూ.4,050, పత్తి (మధ్యరకం) రూ.3,750, మొక్కజొన్న రూ.1,310, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.2,560, సోయాబీన్ (నలుపు) రూ.2,500, కందులు రూ.4,350, మినుములు రూ.4,350, పెసలు రూ.4,600, వేరుశనగ కాయ రూ.4,000, పొద్దుతిరుగుడు రూ.3,750, సజ్జలు రూ.1,250, జొన్నలు (హైబ్రిడ్) రూ.1,530, జొన్నలు (మలదండి) రూ.1,550, రాగులు రూ.1,550, నువ్వులు రూ.4,600 మద్దతు ధర ప్రకటించిందన్నారు. వడ్లు ఆరబోసి తేవాలి వరి పంట కోసిన తర్వాత మట్టి పెళ్లలు, రాళ్లు, చెత్త, తాలు రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం, తక్కువ రకాల మిశ్రమం, తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్‌కు తరలించే ధాన్యాన్ని బాగా ఆరబోసి తేమ శాతం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ధాన్యం ఎండిన తర్వాత 17 శాతం కన్నా ఎక్కువ తేమ లేకుండా చూసుకుని విక్రయానికి తరలించాలి. మక్కలను బాగా ఎండనివ్వాలి మొక్కజొన్న ధాన్యంలో వ్యర్థ పదార్థాలు, ఇతర తిండి గింజలు, దెబ్బతిన్న, రంగు మారిన గింజలు, పరిపక్వం కానీ నాసిరకం, పుచ్చిపోయిన గింజలు లేకుండా ఉండాలి. మొక్కజొన్న కంకులను ఒలిచేందుకు మిషన్లను వాడటం వల్ల జొన్నలు పాడవకుండా వస్తాయి. బూజుపట్టిన, రంగుమారిన కంకులను మంచి కంకుల్లో కలవకుండా చూడాలి. కంకులను ఒలిచిన తర్వాత రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. తెగుళ్లు సోకిన, రంగు మారిన ముడుచుకుపోయిన గింజలను సాధ్యమైనంత వరకు ఏరేయాలి. రాళ్లు, మట్టిపెడ్డలు, చెత్తాచెదారం వంటి వ్యర్థాలు లేకుండా చూడాలి. పత్తిలో చెత్త ఉండొద్దు పత్తిమొక్క సహజమైన రంగు మారకూడదు. పత్తిలో అపరిపక్వమైన కాయలను వేరు చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మలు, రెమ్మలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి. తేమ ఎక్కువగా ఉండటం వల్ల పత్తి రంగు మారి పోగుల నాణ్యత తగ్గుతుంది. బాగా ఆరి, శుభ్రం చేసిన పత్తినే మార్కెట్‌కు తరలించాలి. పత్తిలో 8 శాతం మాత్రమే తేమ ఉండాలి. 12 శాతంకంటే ఎక్కువ ఉంటే బాగా ఎండబెట్టిన తర్వాత మార్కెట్‌కు తీసుకెళ్లాలి. -
అధిక వర్షాలు.. రైతులకు సూచనలు
ఇటీవల వివిధ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడ్డాయి. పొలాల్లో నిలిచిన నీటిని తీసివేసి రైతులు కొన్ని మెలకువలు పాటించాలి. కొత్తగా వరి సాగు వద్దు: రైతులు ఇప్పుడు కొత్తగా వరి సాగు చేపట్టకూడదు. స్వల్పకాలిక రకాలను కూడా సాగు చేయవద్దు. తెలంగాణలో ఇప్పడు వరి సాగు ప్రారంభిస్తే పూత సమయంలో చలి పెరిగి తాలు గింజలు ఏర్పడతాయి. కావున ఇతర పంటలే వేసుకోవాలి. సాగులో ఉన్న వరికి బ్యాక్టీరియా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. నత్రజని ఎరువుల వాడకాన్ని కొన్నాళ్లు వాయిదా వేయాలి.వరి మొక్కలు ముంపునకు గురై చనిపోతే పక్క కుదుళ్లలో ఉన్న కుచ్చుల నుండి అదనపు మొక్కలను తీసి నాటాలి.అగ్గి తెగులును బీపీటీ-5204 తట్టుకోలేదు. లీటరు నీటికి 0.6 గ్రా. ట్రైసైక్లజోల్ కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు లీటరు నీటికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా. కలిపి చల్లాలి. మొక్కజొన్న: మొక్కజొన్న పొలంలో నిల్చిన నీటిని తీసివేసి ఎకరాకు 25 కిలోల నత్రజని, 10 కిలోల పొటాషియం వేయాలి.ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ముందస్తు చర్యగా మాంకోబెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి: రెండో దఫా ఎరువులుగా ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.భూమిలోకి గాలి ప్రసరణకు అంతర సేద్యం చేయాలి.టొబాకో స్ట్రీక్ వైరస్‌ను వ్యాప్తి చేసే తామర పురుగుల నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.నీటి ముంపున్న పొలాల్లో లీటరు నీటికి మల్టి-కె(13-0-45) 10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పచ్చదోమ నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. మరియు ప్లాంటామైసిన్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.ఆకుమచ్చ తెగులు నివారణకు 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాప్టాన్ పొడి మందును 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. సోయాబీన్: పొటాషియం నైట్రేట్(1 శాతం)ను మొక్కలు నిలువెల్లా తడిచేలా పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. పొగాకు లద్దె పురుగు కనిపిస్తే నొవాల్యురాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా: నీటి ముంపు వల్ల వేరు కుళ్లు తెగులు వస్తే 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను ఒక లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా పోయాలి. డా॥ దండ రాజిరెడ్డి, వ్యవసాయ విస్తరణ సంచాలకులు ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -
జలమయం
సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్ అగ్రికల్చర్ : బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో వేమనపల్లి మండలంలో సుమారు 700 ఎకరాల్లో పత్తి పంట నీట మునగగా, 50 ఎకరాల్లో సోయాబీన్ నీటిపాలైంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణాహిత నిండుగా ప్రవహిస్తోంది. నీటి ఉధృతి పెరుగుతుండటంతో పంటలు నీట మునిగాయి. నీల్వాయి ఉప్పొంగడంతో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. ముల్కలపేట నుంచి రాచర్లకు వెళ్లే ప్రధాన రహదారి, వంతెన నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. వేమనపల్లి నుంచి సుంపుటంకు వెళ్లే ప్రధాన రహదారి మత్తడివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. వేమనపల్లి మండలంలో శనివారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచింది. బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి సగం వరకు వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. తాండూర్ మండలం చౌటపల్లి, తాండూర్, కొత్తపల్లి గ్రామాలలో సుమారు 80 ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగింది. నెన్నెల మండలంలోని కొత్తూర్‌లో ఏడు ఇళ్లు భారీ వర్షానికి కూలిపోయాయి. మెట్‌పల్లిలోని చెరువుకు భారీ వర్షం వల్ల గండి పడింది. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, చింతగూడ, గుర్వాపూర్ వాగులు భారీ వర్షం వల్ల ఉప్పొంగాయి. శ్రీరాంపూర్, గోలేటి, కైరిగూడ, డోర్లి ఓపెన్‌కాస్ట్‌లో భారీగా వరద నీరు చేరుకోవడంతో దాదపు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘతం కలిగింది. సూమారుగా రూ.3.50 కోట్ల నష్టం వాటిల్లింది. తిర్యాణి మండలం ఇర్కపల్లి సర్పంచ్గూడ గ్రామానికి చెందిన మడావి హన్మంతరావు(35) ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వాగుదాటుతూ వరద ఉదృతికి వాగులో కొట్టుకు పోయాడు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సర్వం జలమయం అయ్యాయి. జైనథ్, నిరాల వద్ద రహదారిపై నుంచి వరదనీరు ఉప్పొంగడంతో అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచాయి. జైనథ్, బేల మండలాలతోపాటు మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి. బేల మండలం డోప్టాల మణియార్‌పూర్, గూడ, సాంగిడి, బెదోడ గ్రామాల్లో చేలల్లోకి నీరు చేరింది. ఆదిలాబాద్ మండలంలో అనుకుంట వాగు ఉప్పొంగడంతో సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చేలలో భారీగా నీళ్లు చేరాయి. బేల మండలంలో వాగులు పొంగి ప్రవహించడంతో మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ పట్టణంలో గల ఆదర్శనగర్, సంఘంబస్తీ, సంజీవయ్యకాలనీల్లో పలువురి ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగజ్‌నగర్ మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెద్దవాగు వద్ద సోమవారం నిర్వహించబోయే గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లు నీటికి కొట్టుకుపోయాయి. దహెగాం మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వేల ఎకరాల్లో పత్తి, సోయాబిన్ పంటలు నీటమునిగాయి. బ్రాహ్మణ్చిచ్యాలలో ఉపాధిహామీ పథకం క్రింద నిర్మించిన రెండు కుంటలు తెగిపోయాయి. ఐనం రోడ్డుపై పెద్ద చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు స్తంభించాయి. చెట్టుదాటికి ఫీడర్ పాడవగా 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. బెజ్జూర్ మండలంలోని నాగుల్వాయి, కుశ్నపల్లి కుకుడ, అగర్‌గూడ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటి ప్రభావంతో సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోడ్పల్లి, బెజ్జూర్, బారెగూడ రహదారులు కోతకు గురయ్యాయి. భైంసా నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో భారీ వర్షంతో పత్తి, సోయా పంటల్లో నీరు నిలిచింది. భైంసాలో 72.4 మిల్లిమీటర్లు, కుంటాలలో 76.4, కుభీర్‌లో 71.3 మిల్లిమీటర్లు, లోకేశ్వరం 87.2 మిల్లిమీటర్లు నమోదైంది. చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 48 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో చెన్నూర్ మండలంలోని సుద్దాల, కత్తరశాల, నారాయణపూర్, సంకారం గ్రామాల వాగులు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చెన్నూర్‌లోని బతుకమ్మ వాగు ఉప్పొంగడంతో వంతెన ముందు నిర్మించిన సపోర్ట్ రోడ్డు కోతకు గురైంది. ఈ రోడ్డు తెగిపోయినట్లయితే కోటపల్లి, వేమనపల్లి రెండు మండలాలకు రాకపోకలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జైపూర్ మండలంలో మిట్టపల్లి వాగు ఉప్పొంగడంతో వంతెన కోతకు గురైంది. మందమర్రి పట్టణంలో రెండు ఇల్లు కూలాయి. వరి పంట నీట మునిగింది. మండలంలోని తుర్కపల్లి, మామిడిగట్టు, అదిల్‌పేట్ లో లేవల్ కాజ్‌వేలు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు ప్రజలుకు రవాణా సౌకర్యం స్తంంభించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోటపల్లి మండలం పంగిడి సోమారం, తున్తుంగ వాగులు ఉప్పొంగాయి. దీంతో 4 గ్రామాలకు రాక పోకలు నిలిచాయి. అధిక వర్షాలతో పంటలకు తెగుళ్లు ప్రస్తుతం పంటలు పత్తి, సోయాబీన్ పూత దశలో ఉన్నయి. ఈ భారీ వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదం ఉందని ఏరువాక కోర్డి నేటర్ శాస్త్రవేత్త రాజశేఖర్ తెలిపారు. వర్షాలతో పంటలకు తెగుళ్లు అశించే అవకాశం ఉంది. పూతలో నీరు నిల్వడం వలన పూత మురిగిపోయి రాలి పోయే అవకాశం ఉంది. పంట చేనులో నీరు నిల్వ ఉండ కుండా చూడాలి. మరో రెండు రోజులు వర్షం కోన సాగితే ఎండ, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. అయిన తక్కువనే.. జిల్లా సాధారణ వర్షపాతం ఆదివారం వరకు 889.2 మిల్లీమీటర్లు కాగా 606.9 మిల్లీమీటర్లు కురిసింది. 32 శాతం లోటు వర్షపాతంగా ఉంది. గతేడాది 1,245.8 మిల్లీమీటర్లు కురిసింది. 28 శాతం అధికంగా నమోదు అయ్యింది. శనివారం రాత్రి నుంచి అదివారం ఉదయం వరకు 106.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
విస్తరిస్తున్న సోయా
న్యాల్కల్: పప్పు ధాన్యాల సాగులో ప్రత్యేకమైనది సోయాబీన్. నల్లరేగడి భూముల్లో ఈ పంట మంచి దిగుబడులు ఇస్తుంది. ఇతర పప్పు ధాన్యాల పంటలతో పోలిస్తే ఎంతో లాభదాయకమైనది. మంచి పోషకాలున్న జె.ఎస్.335 రకం పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా సోయాబీన్ పంట సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. ఈ ఏడాది 6,232 హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు రాబట్టవచ్చని బసంత్‌పూర్-మామిడ్గి ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్, సెల్: 9849535756 వివరించారు. ఎకరం పంట సాగు చేయడానికి రూ.15,000నుంచి రూ.20,000 వరకు ఖర్చు వస్తుందన్నారు. 14 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి తీయవచ్చని తెలిపారు. దీని ధర క్వింటాలుకు రూ.3,5000 నుంచి 4,000 వరకు పలుకుతుందని తెలిపారు. సోయా సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలు... నీటి యాజమాన్య పద్ధతులు సోయా వర్షాధార పంట. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నియోజకవర్గంలోని రైతులు సాగు చేసిన పంటలకు నీటి అవసరం లేదు. పూత దశలో ఉన్న పంటకు సరిపడా వర్షం కురిసింది. కాయ దశలోకి వచ్చిన తర్వాత వర్షం పడితే నీటి తడులు అవసరం లేదు. కలుపు నివారణ... సమస్యాత్మకమైన గడ్డిని నివారించేందుకు 200 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్ల ఇమేజారియా మందును కలిపి గడ్డి జాతి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పంటకు సోకే తెగుళ్లు... దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కాండం తినే పురుగు, కాండం తొలిచే పురుగు దాసరి పురుగు ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉండే ఈ పురుగులు ఆకులపై గుడ్లు పెడతాయి. ఇవి లద్దె పురుగులుగా మారి ఆకులకు రంధ్రాలు చేసి తింటూ పంటను నష్టపరుస్తాయి. నివారణ... మొదటి దశ లార్వాను గుర్తించి 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధిత మందులు వాడాలి ఎకరా పొలంలో 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి పంటపై స్ప్రే చేయాలి. పొగాకు లద్దె పురుగు ఇవి ఆకులపై కుప్పలు కుప్పలుగా గుడ్లు పెడతాయి. పొదిగిన పిల్ల పురుగులు పచ్చని ఆకులను తింటాయి. లేత ఆకులను తిగనడంతో పాటు పువ్వులు, కాయలకు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి. తెలుపు బూడిద రంగుల్లో ఉండే ఈ పురుగులు రాత్రి వేళ్లలో పంటలను తింటూ పగటి వేళ్లలో మొక్కల మొదళ్ల వద్ద ఉంటాయి. నివారణ... ఆకులపై గుడ్లు కనిపించిన వెంటనే వాటిని నాశనం చేయాలి. లార్వాలు ఉన్న ఆకులను తొలగించి దూరంగా పారేయాలి. పురుగులు తినే పక్షులను ఆకర్షించేందుకు పొలంలో టీ ఆకారంలో కర్రలు ఏర్పాటు చేసుకోవాలి. తొలి, మలి దశలో చేనుల్లో వేప నూనె పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 2.5 క్లోరోఫైరిపాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రొటోఫాస్ లేదా1 గ్రాము ఎసిపేట్ మందును స్ప్రే చేయాలి. కాండం తొలిచే పురుగు ఈ పురుగుకు సంబంధించిన తల్లి ఈగలు నలుపు రంగులో మెరుస్తూ ఆకుల మీద గుడ్లను పెడతాయి. పొదిగిన లార్వాలు ఆకు కాడల ద్వారా కాండంలోకి ప్రవేశించి కాండం లోపలి పదార్థాల నుంచి వేర్ల వరకు తినేస్తాయి. ఈ పురుగుల వలన 25శాతం వరకు పంట నష్టం కలుగుతుంది. నివారణ... రక్షణ కొరకు తొలి దశలో 10 గ్రాము ఫోరేట్ లేదా 3గ్రాముల కార్బోఫ్యురాన్ గుళికలను పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటిలో 1.6మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 1.5గ్రాముల ఎసిఫేట్ లేదా 2మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగు ఈ పురుగు కాండం మీద అర్ధ చంద్రాకారంలో రంధ్ర చేసి లోపలకు వెళ్తుంది. ఆడ పెంకు పురుగు కాండం మీద చుట్టూ రంధ్రాలు చేస్తుంది. ఫలితంగా చిగురు భాగానికి పోషకాలు అందక మొక్క ఎండిపోతుంది. రంధ్రాల్లో పెట్టిన గుడ్లు పొదగబడి లార్వాగా మారుతుంది. ఈ లార్వా కాండాన్ని తొలిచి తినుకుంటూ మొక్కలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. నివారణ... చిగురులు ఎండిపోతున్న మొక్కలను పొలంలోంచి పీకేయాలి. ఇలా చేయడం వల్ల పురుగు ఉధృతిని కొంత వరకు అరికట్టవచ్చు. లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ లేదా 1.6మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 2.0మి.లీ ట్రైజోఫౠస్ మందును కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. -
వరి నారు ముదిరింది..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వరి నారు ముదిరిపోయింది.. సోయాబీన్ రబీలో వేసుకోవచ్చా.. ఎరువులు అందడం లేదు.. పత్తికి బీమా సౌకర్యం ఉందా.. యంత్రాలు ఎప్పుడు వస్తాయి అంటూ రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు(జేడీఏ) రోజ్‌లీల, శాస్త్రవేత్తలు సమాధానాలు ఇచ్చారు. గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 30 మందికి పైగా ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు, చీడపీడల నివారణ, గడువు దాటిన వరి నారు నాట్లు వేసుకునే అవకాశం ఉందా.. ఉంటే ఆశించిన దిగుబడి వస్తుందా..? ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అని అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలో ఎరువులు వేసుకుంటే లాభం ఉంటుందా అని అడిగిన ప్రశ్నలకు జేడీఏ, శాస్త్రవేత్తలు, ఏరువాక కో ఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు రమేష్, అలీ అహ్మద్ పాల్గొన్నారు. ప్రశ్న : పసుపు పంటలో ముడత పడుతుంది(కొమ్ముకుంది) ఏ మందులు వేసుకోవాలి. - రైతు భూమేష్ , లక్ష్మణచాంద, నిర్మల్ జవాబు : రెండు గ్రాములు ప్లాంటోమెసిన్ 10 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ప్ర : వరి నారు అలికి 45 రోజులు అవుతుంది. నాట్లు వేసుకునే అవకాశం ఉందా..? ఉంటే ఆశించిన దిగుబడి వస్తుందా..? ఏ ఎరువులు వేసుకోవాలి. - రైతు లక్ష్మణ్, ఖానాపూర్ జ : వరి నారు కొసలు కత్తిరించి ఒకటి రెండు మొలకలు నాటుకునే బదులు ఐదారు మొలకలు నాటుకోవాలి. అధికంగా ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా యూరియా, పొటాష్ ఎకరాకు 30 నుంచి 40 కిలోల వరకు వేసుకోవాలి. గడువు దాటినా వరి నారు ఎక్కువ మోతాదులో, ఎరువులు ఎక్కువగా వేసుకుంటేనే దిగుబడి వస్తుంది. ప్ర : పత్తి పంట బీమా చేసుకునే అవకాశం ఉందా..? ఉంటే ఎప్పటి లోగా చెల్లించాలి. యూరియా ఎరువులు అందడం లేదు. వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నరు. - యం. నరేందర్, గ్రామం : బన్సవల్పల్లి, మం : దిలావర్పూర్ జ : పత్తికి నేరుగా బీమా చెల్లించే గడువు దాటిపోయింది. బ్యాంకులో కొత్త రుణం పొందే సమయంలోనే వారు బీమా ప్రీమియం మినహాయించుకుని మిగితా మొత్తం చెల్లిస్తారు. బ్యాంకు ద్వారా చెల్లించే గడువు సెప్టెంబర్ 30వరకు ఉంది. యూరియా లోడు ఈ రోజు మండలానికి పంపించాం. యూరియా కొరత లేదు. డీలర్ గానీ సొసైటీ వారు అధికంగా డబ్బులు తీసుకుంటనే వెంటనే సమాచారం అందించాలి. వారిపై చర్యలు తీసుకుంటాం. యూరియా బ్యాగుకు రూ.284 కంటే ఎక్కువగా చెల్లించొద్దు. డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవాలి. ప్ర : వరి నారు అలికి 60 రోజులు అవుతుంది. నాట్లు వేసుకోవచ్చా. - రైతు గంగయ్య, తాండుర్ జ : వరి నారు 25 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో నాట్లు వేసుకుంటనే మంచి దిగుబడి వస్తుంది. చీడపీడలు ఎక్కువగా ఆశించవు. 60 రోజుల నారు చాలా వరకు ముదిరిపోయింది. నాట్లు వేసుకోకపోవడం మేలు. ప్ర : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు యూరియా వేసుకున్న. రాత్రి వర్షం కురిసింది. పంటకు మేలు అవుతుందా.. ఎరువు వృథాగా పోతుందా..? మళ్లీ ఎరువు వేసుకోవాలా..? - రైతు హన్మండ్ల వేణు, క్రిష్ణాపూర్ జ : వర్షం కురిసిన వెంటనే ఎరువులు వేసుకోరాదు. వేసుకున్న కొద్ది గంటలకు వర్షం పడింది కాబట్టి ఎక్కువగా వృథా కాదు. పది శాతం నుంచి 20 శాతం మాత్రం పోతుంది. వర్షం పడి నీరు పారుతున్న సమయంలో ఎరువులు వేసుకోరాదు. కొద్దిగా బురద, భూమిలో తేమ ఉంటే సరిపోతుంది. ప్ర : సోయాబీన్, పత్తి పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉందా.. గడువు ఎప్పటి వరకు ఉంది ? - రైతు శ్రీనివాస్, గ్రామం : రాయిపూర్, మం : లోకేశ్వరం జ : సోయాబీన్ పంటకు నేరుగా బీమా ప్రీమియం చెల్లింపు మూడు రోజులు మాత్రమే ఉంది. పత్తికి బ్యాంకు రుణం పొందే వారికి మాత్రమే అవకాశం ఉంది. రుణం పొందే సమయంలోనే వచ్చే నెల 30వరకు ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉంది. ప్ర : సోయా పంటలో ఆకులకు రంధ్రాలు పడుతున్నాయి. చిన్న పురుగు కనిపిస్తుంది. - మారుతి, కుభీర్ జ : క్లోరికొపాస్ 2ఎంఎల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయండి. ప్ర : సోయా పంట 35 రోజుల్లోనే పూతకు వచ్చింది. పూత రాలిపొతుంది. - సంతోష్కూమార్, కుంటాల జ : క్లొరికల్ లేదా రిమాన్ 1 మిల్లీలీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్ర : మందు పిచికారీ డబ్బ పక్క రైతుది. అతను కలుపు నివారణ మందు పిచికారీ చేసి నాకు ఇచ్చిండు. అదే డబ్బాలో పత్తికి పురుగుల నివారణ మందు పిచికారీ చేశాను. ఆకులు ముడుత పడుతున్నాయి. - రవి, బజార్హత్నూర్ జ : మల్టీకే స్ప్రే చేయండి. పిచికారీ చేసిన రెండు రోజుల్లోపు అయితే చక్కెర, యూరియా కలిపి కరిగించి పిచికారీ చేయాలి. ప్ర : పత్తికి పిండి నల్లి ఉంది. - దీపక్, కుచ్లాపూర్ జ : కొమ్మలు చుంచి దూరంగా పడేయండి. లేదా ప్రొఫెనోపాస్ 3మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోండి. ప్ర : వ్యవసాయ యంత్రాలు ఎప్పుడు వస్తాయి. రాయితీ ఎంత వరకు ఉంటుంది. - శ్రీకాంత్‌రెడ్డి, మామడ జ : వ్యవసాయ యంత్రాల కంపెనీలతో ధర నిర్ణయం కాలేదు. యంత్రాలకు సంబంధించిన రాయితీ, దరఖాస్తు విధానంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. రెండు రోజుల్లో కమిషనర్ సమావేశం అనంతరం విషయాలు తెలుస్తాయి. వివరాలు రాగానే ఏవోల ద్వారా తెలుపుతాం.