సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన పంటలో ఒకటిగా ఉన్న సోయాబీన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు కోరారు. తెలంగాణలో సోయాబీన్ పంట ఎక్కువగా ఉత్పత్తి అయిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి కేంద్ర సంస్థలతో పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి టి.హరీశ్‌రావు ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం లేఖ రాశారు.
‘తెలంగాణలో 1.64 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగు చేస్తున్నారని, అనుకూల పరిస్థితులతో సగటు దిగుబడి పెరిగి, హెక్టారుకు 11.33 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. 2017–18 ఖరీఫ్ మార్కెట్ సీజనులో సోయాబీన్ కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) రూ.3050 ఉన్నప్పటికీ ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2300 నుంచి రూ.2800 మాత్రమే పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఖరారు చేసిన ఎంఎస్‌పీకి కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’అని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment