సోయా.. ఆయా
♦ విత్తనోత్పత్తికి శ్రీకారం విత్తన భాండాగారంగా ‘ఖేడ్’
♦ రాష్ట్రంలోనే ప్రథమం ఇక అందుబాటులో విత్తనాలు
♦ సంబురాల్లో రైతులు
కల్హేర్: వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గం విత్తన భాండాగారంగా వెలుగొందనుంది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోయాబీన్ విత్తనోత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోయాబీన్ మూలవిత్తనం సాగు కోసం నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. కల్హేర్, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్ మండలాల్లో వెయ్యి ఎకరాల చొప్పున సోయాబీన్ ఉత్పత్తి కోసం కార్యాచరణ రూపొందించారు. సోయాబీన్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్ నుంచి మూల విత్తనాలు దిగుమతి చేసుకుని రైతులకు సరఫరా చేసేది.
ఖేడ్ ప్రాంతంలోనే విత్తనోత్పత్తి చేపట్టడంతో రైతులకు విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనోత్పత్తి కోసం 3 వేల విత్తన బస్తాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్సిడీపై సరఫరా చేస్తారు. 30 కిలోల బస్తా ధర రూ. 1,410 కాగా అదనంగా అధికారుల తనిఖీ చార్జి రూ. 140, రిజిష్ట్రేషన్ చార్జి రూ. 157.. మొత్తం రూ. 1707కు రైతులకు పంపిణీ చేస్తారు. 30 కిలోల బస్తా వాస్తవ ధర రూ.2250. సబ్సిడీపై రూ.1707కు అందజేస్తారు. కాగా ఒక రైతు నుంచి ఒక బస్తాకే రిజిస్ట్రేషన్ చార్జి వసూలు చేస్తారు. మిగతా బస్తాలకు వసూలు చేయరు. ఈ విషయాలన్నింటిపైనా ఇటీవల సీడ్స్ కార్పొరేషన్ మెదక్-రంగారెడ్డి జిల్లాల డీఎం సురేందర్‌రెడ్డి మండలంలోని మార్డిలో సోయాబీన్ విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కలిపించారు.
సాధారణ నేలలు అనుకూలం..
సోయాబీన్ విత్తనోత్పత్తి కోసం సాధారణ భూములు అనుకూలం. ఖరీఫ్‌లో తొలకరి వర్షాలు కురిస్తే.. జూన్ మొదటి వారం నుంచి నెలాఖరు వరకు సోయ సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట సాగు కాలం 95 రోజుల నుంచి 105 రోజులు. ఒక రైతు 25 ఎకరాల వరకు కూడా సోయాను సాగు చేయవచ్చు. సోయ విత్తనోత్పత్తికి సంబంధించి సీడ్స్ కార్పొరేషన్, రైతుల మధ్య రూ. 100 విలువ చేసే స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. రైతులు పండించిన సోయ విత్తనం వ్యాపారులకు కాకుండా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌కు విక్రయించేందుకే ఈ ఒప్పంద ఉద్దేశం.
పంట చేతికొచ్చాక మార్కెట్‌లో ఉన్న ధరకు 15 నుంచి 20 శాతం అధికంగా డబ్బులు చెల్లించి సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేపడుతారు. నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు చేసిన సోయాకు 75 శాతం మొదట డబ్బులు చెల్లిస్తారు. తేమ శాతన్ని పరిశీలించేందుకు సోయను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపిస్తారు. ల్యాబ్ పరీక్షలో 9 శాతం తేమ ఉంటేనే కోనుగోలు చేస్తారు. రైతులు తేమ శాతం పట్ల జాగ్రత్త పాటించాలి. విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ఉత్సహం కనబరుస్తున్నారు. సోయ విత్తనోత్పత్తితో రాష్ట్రంలో విత్తనాల కొరత తీరనుంది.