Seeds production
-
తెలంగాణ నేలపై అద్బుతాలు సృష్టించాలి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విత్తనాలకు సంబంధించిన బ్రాండ్ లోగోను గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వపరంగా నాణ్యమైన వితనోత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని రకాల సానుకూలంగా ఉన్న తెలంగాణ నేలపై అద్బుతాలు సృష్టించాలని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ ఉత్పత్తి చేసే విత్తనాలకు మంచి డిమాండ్ ఉందని, అంతేకాక ఇతర దేశాలకు విత్తనాల ఎగుమతిని పెంచడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు. తాను కేవలం మంత్రి మాత్రమే కాదని.. ఒక విత్తన రైతు కూడా అని సమావేశంలో చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్గ్రంలో విత్తనాల ఉత్పత్తికి అవసరమైన అన్నిరకాల సానుకూలతలు ఉన్న కారణంగానే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకెళ్లి ప్రపంచానికి రాష్ట్రం పేరు తెలిసేలా చేయాలన్నారు. క్రాప్ కాలనీలతో వ్యవసాయాన్ని బలోపేతం, అభివృద్ధి చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మొక్కజొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమలో మొక్కజొన్న వినియోగం ప్రధానమైనదని తెలిపారు. అదేవిధంగా మసాల దినుసులకు సంబంధించిన విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్‌లో పదకొండు సెంటర్లు పెట్టి ఉల్లి అమ్ముతున్నామని, రైతులకు ఉల్లి వితనోత్పత్తిని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. -
విత్తనాలొచ్చాయ్..
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రాయితీపై విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉంచింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయాధికారులు పంటల సాగుకు సంబంధించిన విత్తన అవసరాలు, రకాల అంచనాలను తొలుత రూపొందించారు. వాటి ఆధారంగా విత్తన ఇండెంట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు అందించా రు. ఆ సంస్థ ఆయా ఇండెంట్ల ఆధారంగా రెండు జిల్లాలకు రాయితీ విత్తనాలను కేటాయించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మం రీజినల్ కార్యాలయ విభాగం ఉన్నతాధికారులు రెండు జిల్లాలకు రాయితీ విత్తనాలను అందించే చర్యలు చేపట్టారు. వరి పండించే ప్రాంతాలకు వరి రకాల విత్తనాలు, పెసర, కంది పండించే ప్రాంతాలకు ఆయా రకాల విత్తనాలను సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచారు. అలాగే భూసారం పెంచే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రాయితీపై విక్రయించే చర్యలను కూడా విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టింది. వరి సాగుచేసే మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు వేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 51,809 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు విత్తనాభివృద్ధి సంస్థ 51,809 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించడానికి రంగం సిద్ధం చేసింది. రెండు జిల్లాల వ్యవసాయ శాఖలు వివిధ పంటలకు చెందిన 47,251 క్వింటాళ్ల విత్తనాలను ఇండెంట్‌గా పెట్టగా.. విత్తనాభివృద్ధి సంస్థ అంతకు మించి 4,558 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసర, పెసర, కంది, మినుము, వరి విత్తన రకాలను అందుబాటులో ఉంచింది. ‘పచ్చిరొట్ట’కు 65 శాతం రాయితీ భూసారం పెంచే పచ్చిరొట్ట విత్తనాలకు విత్తనాభివృద్ధి సంస్థ 65 శాతం రాయితీ కల్పించింది. జీలుగు కిలో ఒక్కంటికి రూ.51.50 కాగా.. రూ.33.50 రాయితీ ఇచ్చింది. వీటిని రైతులకు రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే 30 కిలోల బస్తా రూ.540 చొప్పున రైతులకు విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు. జనుములు కిలో ధర రూ.68.50 కాగా.. రూ.44.25 రాయితీగా ఇచ్చింది. ఇవి కిలో ఒక్కంటికి రైతులకు రూ.23.75లకు అందుబాటులో ఉంచారు. 40 కిలోల బస్తాను రూ.959 చొప్పున రైతులకు అందుబాటులో ఉంచారు. పిల్లి పెసర విత్తనాల కిలో ధర రూ.104 కాగా.. రూ.67.60 రాయితీ కల్పించారు. వీటిని రైతులకు రూ.36.40 చొప్పున విక్రయిస్తున్నారు. 20 కిలోల విత్తన బస్తాను రూ.728 చొప్పున విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు. పెసర, కంది విత్తనాలకు 50 శాతం.. విత్తనాభివృద్ధి సంస్థ పెసర, కంది, మినుము విత్తనాలకు 50 శాతం రాయితీ ఇస్తోంది. పెసర ఎంజీజీ–295 రకం విత్తనాల కిలో ధర రూ.98 కాగా.. విత్తనాభివృద్ధి సంస్థ రూ.49 రాయితీ ఇచ్చింది. వీటిని రూ.49 చొప్పున రైతులకు విక్రయిస్తున్నారు. 4 కిలోల బ్యాగ్ రూ.196 చొప్పున విక్రయిస్తున్నారు. కందులు ఎల్‌ఆర్‌జీ–41 రకం విత్తనం కిలో ధర రూ.81 కాగా.. రూ.40.50 రాయితీ కల్పించారు. వీటిని రైతులకు రూ.40.50, 4 కిలోల బ్యాగ్‌ను రూ.162 చొప్పున విక్రయిస్తున్నారు. మినుములు పీయూ–31 రకం విత్తనాల కిలో ధర రూ.81.50 కాగా.. రూ.40.75 రాయితీ కల్పించి రూ.40.75 చొప్పున విక్రయిస్తున్నారు. 4 కిలోల బ్యాగ్ ధర రూ.163 ఉంది. వరి కిలో ఒక్కంటికి రూ.5 నుంచి రూ.10 రాయితీ రెండు జిల్లాల్లో సాగుచేసే వరి రకం విత్తనాలకు కిలో ఒక్కంటికి రూ.5 నుంచి రూ.10 చొప్పున విత్తనాభివృద్ధి సంస్థ రాయితీ కల్పించింది. బీపీటీ–5205 రకం కిలో ఒక్కంటికి రూ.30.38 కాగా.. రూ.5 రాయితీతో రూ.25.38 చొప్పున విక్రయిస్తున్నారు. 25 కిలోల బస్తాను రూ.634 విక్రయిస్తున్నారు. ఎంటీయూ–1001 రకం కిలో ధర రూ.28.80 కాగా.. రూ.5 రాయితీ కల్పిస్తుండగా.. రూ.23.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ రకం 30 కిలోల బస్తాను రూ.714కు విక్రయిస్తున్నారు. ఆర్ఎన్ఆర్–15048 రకం కిలో ధర రూ.30.38 కాగా.. రూ.10 రాయితీ కల్పించారు. వీటిని రూ.20.38, 15 కిలోల బస్తాకు రూ.305 చొప్పున ధర నిర్ణయించారు. 96 పీఏసీఎస్‌ల ద్వారా విక్రయం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 96 పీఏసీఎస్‌ల ద్వారా విత్తనాభివృద్ధి సంస్థ రాయితీ విత్తనాలను విక్రయించే చర్యలు చేపట్టింది. ఖమ్మంలోని విత్తన గోదాముల నుంచి రెండు జిల్లాల నలుమూలలకు విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టింది. మండల వ్యవసాయాధికారి లేదా గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారి ఇచ్చిన పర్మిట్ ఆధారంగా రైతులకు రాయితీ విత్తనాలను విక్రయించాల్సి ఉంటుంది. అధికారులు రైతులకు ఉన్న భూమి.. అది ఏ పంటకు అనువైనది పరిశీలించి రాయితీ విత్తనాలకు పర్మిట్లు ఇస్తున్నారు. విత్తన కొరత లేకుండా చర్యలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విత్తన కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అవసరాన్నిబట్టి మరికొంత మేరకు అదనంగా విత్తనాలను కూడా రైతులకు అందించే చర్యలు కూడా తీసుకుంటాం. విత్తన విక్రయ ప్రక్రియ అంతా ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం. – ఏ.రాజీవ్‌కుమార్, విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం రీజినల్ మేనేజర్ -
తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో భారీ దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్ ఆసియా రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్–సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్(పర్స్) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్ ఫెస్టివల్లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దం పడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్థాన్ ఆల్వర్ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలను సైతం రైతులు కొనుగోలు చేయవచ్చన్నారు. దేశీయ విత్తనోత్సవంతోపాటు దేశీ ఆహారోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని రోహిణీ రెడ్డి తెలిపారు. వివరాలకు.. 99859 47003, 98496 15634. -
సోయా.. ఆయా
♦ విత్తనోత్పత్తికి శ్రీకారం విత్తన భాండాగారంగా ‘ఖేడ్’ ♦ రాష్ట్రంలోనే ప్రథమం ఇక అందుబాటులో విత్తనాలు ♦ సంబురాల్లో రైతులు కల్హేర్: వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గం విత్తన భాండాగారంగా వెలుగొందనుంది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోయాబీన్ విత్తనోత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోయాబీన్ మూలవిత్తనం సాగు కోసం నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. కల్హేర్, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్ మండలాల్లో వెయ్యి ఎకరాల చొప్పున సోయాబీన్ ఉత్పత్తి కోసం కార్యాచరణ రూపొందించారు. సోయాబీన్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్ నుంచి మూల విత్తనాలు దిగుమతి చేసుకుని రైతులకు సరఫరా చేసేది. ఖేడ్ ప్రాంతంలోనే విత్తనోత్పత్తి చేపట్టడంతో రైతులకు విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనోత్పత్తి కోసం 3 వేల విత్తన బస్తాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్సిడీపై సరఫరా చేస్తారు. 30 కిలోల బస్తా ధర రూ. 1,410 కాగా అదనంగా అధికారుల తనిఖీ చార్జి రూ. 140, రిజిష్ట్రేషన్ చార్జి రూ. 157.. మొత్తం రూ. 1707కు రైతులకు పంపిణీ చేస్తారు. 30 కిలోల బస్తా వాస్తవ ధర రూ.2250. సబ్సిడీపై రూ.1707కు అందజేస్తారు. కాగా ఒక రైతు నుంచి ఒక బస్తాకే రిజిస్ట్రేషన్ చార్జి వసూలు చేస్తారు. మిగతా బస్తాలకు వసూలు చేయరు. ఈ విషయాలన్నింటిపైనా ఇటీవల సీడ్స్ కార్పొరేషన్ మెదక్-రంగారెడ్డి జిల్లాల డీఎం సురేందర్‌రెడ్డి మండలంలోని మార్డిలో సోయాబీన్ విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కలిపించారు. సాధారణ నేలలు అనుకూలం.. సోయాబీన్ విత్తనోత్పత్తి కోసం సాధారణ భూములు అనుకూలం. ఖరీఫ్‌లో తొలకరి వర్షాలు కురిస్తే.. జూన్ మొదటి వారం నుంచి నెలాఖరు వరకు సోయ సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట సాగు కాలం 95 రోజుల నుంచి 105 రోజులు. ఒక రైతు 25 ఎకరాల వరకు కూడా సోయాను సాగు చేయవచ్చు. సోయ విత్తనోత్పత్తికి సంబంధించి సీడ్స్ కార్పొరేషన్, రైతుల మధ్య రూ. 100 విలువ చేసే స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. రైతులు పండించిన సోయ విత్తనం వ్యాపారులకు కాకుండా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌కు విక్రయించేందుకే ఈ ఒప్పంద ఉద్దేశం. పంట చేతికొచ్చాక మార్కెట్లో ఉన్న ధరకు 15 నుంచి 20 శాతం అధికంగా డబ్బులు చెల్లించి సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేపడుతారు. నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు చేసిన సోయాకు 75 శాతం మొదట డబ్బులు చెల్లిస్తారు. తేమ శాతన్ని పరిశీలించేందుకు సోయను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపిస్తారు. ల్యాబ్ పరీక్షలో 9 శాతం తేమ ఉంటేనే కోనుగోలు చేస్తారు. రైతులు తేమ శాతం పట్ల జాగ్రత్త పాటించాలి. విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ఉత్సహం కనబరుస్తున్నారు. సోయ విత్తనోత్పత్తితో రాష్ట్రంలో విత్తనాల కొరత తీరనుంది. -
సమస్యల క్షేత్రం
* పరిశోధనలకు దూరంగా సామర్లకోట వ్యవసాయ క్షేత్రం * అధికారులూ లేరు.. సిబ్బంది కరువు * శిథిలస్థితిలో క్వార్టర్లు * రైతులకు చేరని సేవలు సామర్లకోట : సామర్లకోట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఒకప్పుడు రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తన పరిశోధనలతో ప్రత్యేక స్థానం నిలుపుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిశోధనలు లేవు సరికదా భవనాలు శిథిలమైపోయి.. క్వార్టర్లు పాడైపోయి.. సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే నిరుపయోగంగా మారింది. సాంకేతికతకు దూరం అయింది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించి.. 1902లో గోదావరి, ఏలేరు కాలువ ముఖ్య కూడలి ప్రదేశంలో 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు. సిబ్బంది క్వార్టర్లు కోసమే సుమారు 10 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 30 ఎకరాల్లో వివిధ పంటలు పండించి రైతులల్లో అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలో 40 ఏళ్ల క్రితం సన్న బియ్యం పరిశోధనలో భాగంగా ఎస్ఎల్ఓ (సామర్లకోట) అక్కుళ్లు వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు. అప్పట్లో ఎస్ఎల్ఓ అక్కుళ్లుకు రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది. అయితే ఆ తరువాత నుంచి ఇక్కడ పరిశోధన లు కరువయ్యాయి. శాస్త్రవేత్తలు, అధికారులు దృష్టి పెట్టడం మానేశారు. దీంతో ఈ కేంద్రం రైతులకు విత్తనాలు ఉత్పత్తి చేయడానికే పరిమితం అయింది. అప్పట్లో ఇక్కడ ఏడీఏతో పాటు ముగ్గురు వ్యవసాయ అధికారులు, ఇద్దరు వ్యవసాయ విస్తరణాధికారులు, ఇతర సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ఇన్చార్జి ఏడీఏతో పాటు ఒక వ్యవసాయాధికారి మాత్రమే పని చేస్తున్నారు. కేంద్రంలో పంటలను పర్యవేక్షించేందుకు సిబ్బంది ఉండేలా నిర్మించిన క్వార్టర్లు శిథిలమయ్యాయి. వీటిల్లో ఎవరూ ఉండడం లేదు. క్వార్టర్లలో తుప్పలు పెరిగిపోయి పాములకు నిలయంగా మారాయి. సాంకేతికకూ దూరం గతంలో వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చిన సాంకేతిక పద్ధతులను అవలంబించి వాటి ఫలితాలను రైతులకు వివరించేవారు. 2008లో వరినాట్ల యంత్రాలు, వరి కోత యంత్రాలు తీసుకువచ్చి రైతులకు ఆర్భాటంగా పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం సాంకేతిక పద్ధతుల గురించి అధికారులు పట్టించుకోవడం మానేశారు. వెదజల్లు పద్ధతి, డ్రమ్ము సీడర్లు ద్వారా వరి విత్తనాలు వేసి ఖర్చు తగ్గించుకోవడం, అధిక దిగుబడులు సాధించడం తదితర వాటి గురించి అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ కేంద్రంలో మాత్రం వ్యవసాయ కూలీలతో వరినాట్లు వేయిస్తున్నారు. అలాగే కేంద్రంలో వర్మి కంపోస్టు తయారీ కేంద్రాన్ని ప్రారంభించి వదిలేశారు. వర్మి కంపోస్టు తయారు చేసుకునే రైతులకు వానపాములు అందజేసే నిమిత్తం వానపాముల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి పట్టించుకోవడం మానేశారు. భూముల ఆక్రమణ వ్యవసాయ క్షేత్రానికి చెందిన 30 ఎకరాల భూమిలో కొంత మేర ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆక్రమణలు జరినట్టు రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రంపై ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థకావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పథంలో పెట్టాలని కోరుతున్నారు.