ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రాయితీపై విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉంచింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయాధికారులు పంటల సాగుకు సంబంధించిన విత్తన అవసరాలు, రకాల అంచనాలను తొలుత రూపొందించారు. వాటి ఆధారంగా విత్తన ఇండెంట్‌లను రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు అందించా రు. ఆ సంస్థ ఆయా ఇండెంట్‌ల ఆధారంగా రెండు జిల్లాలకు రాయితీ విత్తనాలను కేటాయించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మం రీజినల్ కార్యాలయ విభాగం ఉన్నతాధికారులు రెండు జిల్లాలకు రాయితీ విత్తనాలను అందించే చర్యలు చేపట్టారు. వరి పండించే ప్రాంతాలకు వరి రకాల విత్తనాలు, పెసర, కంది పండించే ప్రాంతాలకు ఆయా రకాల విత్తనాలను సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచారు. అలాగే భూసారం పెంచే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రాయితీపై విక్రయించే చర్యలను కూడా విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టింది. వరి సాగుచేసే మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు వేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
51,809 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు విత్తనాభివృద్ధి సంస్థ 51,809 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించడానికి రంగం సిద్ధం చేసింది. రెండు జిల్లాల వ్యవసాయ శాఖలు వివిధ పంటలకు చెందిన 47,251 క్వింటాళ్ల విత్తనాలను ఇండెంట్‌గా పెట్టగా.. విత్తనాభివృద్ధి సంస్థ అంతకు మించి 4,558 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసర, పెసర, కంది, మినుము, వరి విత్తన రకాలను అందుబాటులో ఉంచింది.
‘పచ్చిరొట్ట’కు 65 శాతం రాయితీ
భూసారం పెంచే పచ్చిరొట్ట విత్తనాలకు విత్తనాభివృద్ధి సంస్థ 65 శాతం రాయితీ కల్పించింది. జీలుగు కిలో ఒక్కంటికి రూ.51.50 కాగా.. రూ.33.50 రాయితీ ఇచ్చింది. వీటిని రైతులకు రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే 30 కిలోల బస్తా రూ.540 చొప్పున రైతులకు విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు. జనుములు కిలో ధర రూ.68.50 కాగా.. రూ.44.25 రాయితీగా ఇచ్చింది. ఇవి కిలో ఒక్కంటికి రైతులకు రూ.23.75లకు అందుబాటులో ఉంచారు. 40 కిలోల బస్తాను రూ.959 చొప్పున రైతులకు అందుబాటులో ఉంచారు. పిల్లి పెసర విత్తనాల కిలో ధర రూ.104 కాగా.. రూ.67.60 రాయితీ కల్పించారు. వీటిని రైతులకు రూ.36.40 చొప్పున విక్రయిస్తున్నారు. 20 కిలోల విత్తన బస్తాను రూ.728 చొప్పున విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు.
పెసర, కంది విత్తనాలకు 50 శాతం..
విత్తనాభివృద్ధి సంస్థ పెసర, కంది, మినుము విత్తనాలకు 50 శాతం రాయితీ ఇస్తోంది. పెసర ఎంజీజీ–295 రకం విత్తనాల కిలో ధర రూ.98 కాగా.. విత్తనాభివృద్ధి సంస్థ రూ.49 రాయితీ ఇచ్చింది. వీటిని రూ.49 చొప్పున రైతులకు విక్రయిస్తున్నారు. 4 కిలోల బ్యాగ్ రూ.196 చొప్పున విక్రయిస్తున్నారు. కందులు ఎల్‌ఆర్‌జీ–41 రకం విత్తనం కిలో ధర రూ.81 కాగా.. రూ.40.50 రాయితీ కల్పించారు. వీటిని రైతులకు రూ.40.50, 4 కిలోల బ్యాగ్‌ను రూ.162 చొప్పున విక్రయిస్తున్నారు. మినుములు పీయూ–31 రకం విత్తనాల కిలో ధర రూ.81.50 కాగా.. రూ.40.75 రాయితీ కల్పించి రూ.40.75 చొప్పున విక్రయిస్తున్నారు. 4 కిలోల బ్యాగ్ ధర రూ.163 ఉంది.
వరి కిలో ఒక్కంటికి రూ.5 నుంచి రూ.10 రాయితీ
రెండు జిల్లాల్లో సాగుచేసే వరి రకం విత్తనాలకు కిలో ఒక్కంటికి రూ.5 నుంచి రూ.10 చొప్పున విత్తనాభివృద్ధి సంస్థ రాయితీ కల్పించింది. బీపీటీ–5205 రకం కిలో ఒక్కంటికి రూ.30.38 కాగా.. రూ.5 రాయితీతో రూ.25.38 చొప్పున విక్రయిస్తున్నారు. 25 కిలోల బస్తాను రూ.634 విక్రయిస్తున్నారు. ఎంటీయూ–1001 రకం కిలో ధర రూ.28.80 కాగా.. రూ.5 రాయితీ కల్పిస్తుండగా.. రూ.23.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ రకం 30 కిలోల బస్తాను రూ.714కు విక్రయిస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్–15048 రకం కిలో ధర రూ.30.38 కాగా.. రూ.10 రాయితీ కల్పించారు. వీటిని రూ.20.38, 15 కిలోల బస్తాకు రూ.305 చొప్పున ధర నిర్ణయించారు.
96 పీఏసీఎస్‌ల ద్వారా విక్రయం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 96 పీఏసీఎస్‌ల ద్వారా విత్తనాభివృద్ధి సంస్థ రాయితీ విత్తనాలను విక్రయించే చర్యలు చేపట్టింది. ఖమ్మంలోని విత్తన గోదాముల నుంచి రెండు జిల్లాల నలుమూలలకు విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టింది. మండల వ్యవసాయాధికారి లేదా గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారి ఇచ్చిన పర్మిట్ ఆధారంగా రైతులకు రాయితీ విత్తనాలను విక్రయించాల్సి ఉంటుంది. అధికారులు రైతులకు ఉన్న భూమి.. అది ఏ పంటకు అనువైనది పరిశీలించి రాయితీ విత్తనాలకు పర్మిట్లు ఇస్తున్నారు.
విత్తన కొరత లేకుండా చర్యలు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విత్తన కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అవసరాన్నిబట్టి మరికొంత మేరకు అదనంగా విత్తనాలను కూడా రైతులకు అందించే చర్యలు కూడా తీసుకుంటాం. విత్తన విక్రయ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. – ఏ.రాజీవ్‌కుమార్, విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం రీజినల్ మేనేజర్
విత్తనాలొచ్చాయ్..
Published Thu, Jun 20 2019 7:07 AM | Last Updated on Thu, Jun 20 2019 7:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment