Kharif seasons
-
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ
సాక్షి, అమరావతి: 2022 ఖరీఫ్ సీజన్లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన ఆకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్టుగా గుర్తించింది. ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతుల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. వ్యవసాయ పంటల్లో 11,742 ఎకరాల్లో వరి, 5,205 ఎకరాల్లో పత్తి, 4,887 ఎకరాల్లో వేరుశనగ, 3,915 ఎకరాల్లో పెసర.. ఉద్యాన పంటల్లో 7 వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు 18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44 కోట్లు చొప్పున మొత్తంగా రూ.39.39 కోట్లు పంట నష్ట పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు రైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. గత మూడేళ్లలో రూ.1,795.4 కోట్లు వరదలు, ఆకాల వర్షాలు వంటి వివిధ వైపరీత్యాల వల్ల 2019–20 సీజన్లో 1.47 లక్షల మందికి రూ.116.63 కోట్లు, 2020–21 సీజన్లో 12.15 లక్షల మందికి రూ.932.07కోట్లు, 2021–22 సీజన్లో 6.32 లక్షల మందికి రూ.564 కోట్లు చొప్పున గత మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.4 కోట్ల పంట నష్టపరిహారం అందించారు. ప్రస్తుతం 2022–23లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 45,998 మంది రైతులకు ఈ నెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు చొప్పున మొత్తంగా 8.22 లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ కలిసి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. -
అపరాల సాగు ఉత్తమం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కురుస్తున్న తొలకరి వర్షాలకు మెట్ట ప్రాంతాల్లో అపరాలను సాగు చేయడం ఉత్తమమని మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడా) రైతులకు సలహా ఇచ్చింది. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అపరాల సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అన్ని రకాల పప్పు ధాన్యాలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. కంది వంటి పంటలకు కనీస మద్దతు ధరలను మించి బహిరంగ మార్కెట్లో ధర వస్తోందని క్రిడా శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కంది, పెసర, మినుము, ఉలవ, అలసంద, పిల్లిపెసర తదితర పంటలు సుమారు 10.57 లక్షల ఎకరాల్లో సాగవుతాయి. ఈ నేపథ్యంలో ప్రధాన అపరాల పంటలకు శాస్త్రవేత్తలు సూచిస్తున్న వంగడాలు ఇవే.. కంది: ఎల్.ఆర్.జి. 105, ఎల్.ఆర్.జి. 133–33, ఎల్.ఆర్.జి. 52, ఎల్.ఆర్.జి. 41, టి.ఆర్.జి. 59, ఐ.సి.పి.ఎల్. 85063 (లక్ష్మీ), ఐ.సి.పి. 8863 (మారుతి), ఐ.సి.పి.ఎల్. 87119 (ఆశ). మినుము: జి.బి.జి. 1, టి.బి.జి. 104, ఎల్.బి.జి. 787, ఎల్.బి.జి. 752, పి.యు. 31. పెసర: ఐ.పి.యం. 2–14, డబ్ల్యూ.జి.జి. 42, ఎల్.జి.జి. 460 విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచి లేదా అధీకృత డీలర్ల నుంచి కొనుగోలు చేయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాతే నాటుకోవాలని, అందువల్ల చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. -
ఖరీఫ్ నాటికి వైఎస్సార్ అగ్రిల్యాబ్స్
సాక్షి, అమరావతి: నకిలీల బారినపడి ఏటా వేల కోట్ల రూపాయల పెట్టుబడిని కోల్పోతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అక్రమార్కుల కారణంగా గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా అన్నదాతలు పడుతున్న వెతలకు వీటితో చెక్ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 37.42 లక్షల హెక్టార్లు, రబీలో 25.84 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 17.84 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటికోసం 1.20 లక్షల లాడ్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగుల మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్లోకి వస్తుంటాయి. వీటి నాణ్యతను పరీక్షించేందుకు స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్మించిన ల్యాబ్‌లు కేవలం 11 మాత్రమే. వాటిలో ఐదు పెస్టిసైడ్స్, మూడేసి చొప్పున ఫెర్టిలైజర్స్, సీడ్స్ టెస్టింగ్ లేబొరేటరీలు ఉన్నాయి. ఇవి ఏమూలకూ సరిపోకపోవడంతో ఏవి నాణ్యమైనవో? ఏవి నకిలీలో తెలియక అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి.. ఈ నేపథ్యంలో.. ఏపీలో ఇక ఏ ఒక్క రైతు నకిలీల బారిన పడకూడదన్న సంకల్పంతో దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని రీతిలో నియోజకవర్గానికొకటి చొప్పున వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను సీఎం వైఎస్ జగన్ సర్కారు తీసుకొస్తోంది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు సంబంధించి ప్రతీ బ్యాచ్‌ను పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చేలా వీటిని ఏర్పాటుచేస్తున్నారు. పట్టణ ప్రాంత నియోజకవర్గాలు మినహా మిగిలిన 147 చోట్ల నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లను ఏర్పాటుచేస్తుండగా, వీటికి అదనంగా 11 జిల్లా స్థాయి, ప్రాంతానికి ఒకటి చొప్పున నాలుగు రీజనల్ కోడింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. వీటి ద్వారా ఏటా జిల్లా ల్యాబ్‌లో మూడువేల విత్తన శాంపిల్స్‌ను, 2,500 ఎరువులు, పురుగుల మందుల శాంపిళ్లను పరీక్షించనున్నారు. అదే నియోజకవర్గ ల్యాబ్‌లో 500 సీడ్ శాంపిల్స్, 300 ఎరువుల శాంపిళ్లను పరీక్షించనున్నారు. ఈ విధంగా 147 లేబొరీటరీల ద్వారా ఏటా 73,500 సీడ్, 44,100 ఎరువులు, 13 జిల్లా ల్యాబ్‌ల ద్వారా 39,000 సీడ్, 32,500 శాంపిళ్ల చొప్పున ఎరువులు, పురుగుల మందులు పరీక్షించనున్నారు. రూ.10లక్షల చొప్పున అదనంగా.. ఈ ల్యాబ్‌లకు రూ.192.49 కోట్ల నాబార్డు నిధులను కేటాయించారు. వీటి నిర్మాణ బాధ్యతలను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిధులు సరిపోవని కార్పొరేషన్ చెప్పడంతో ఒక్కో ల్యాబ్‌కు రూ.10.90 లక్షలు అదనంగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అంచనా విలువ రూ.203.39 కోట్లకు చేరింది. ఈ నిధుల్లో రూ.163.39 కోట్లు భవనాలకు, రూ.40కోట్లు పరికరాలకు వెచ్చిస్తున్నారు. జపాన్, జర్మనీల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చేందుకు కృషిచేస్తున్నారు. కొనుగోలు సమయంలోనే చెక్ చేసుకోవచ్చు ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి ల్యాబ్‌ను ఆటోమేషన్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకొస్తున్నారు. ఏ ల్యాబ్‌లో ఏ బ్యాచ్ శాంపిల్స్ టెస్ట్ చేశారో ఈ టెక్నాలజీతో తెలిసిపోతుంది. రైతు షాపుకెళ్లినప్పుడు బ్యాచ్ నెంబర్ చెక్ చేసుకుంటే చాలు దానికి నాణ్యతా సర్టిఫికెట్ ఉందో లేదో.. తీసిన శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా పరిశీలించుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లలో అదనంగా గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటి కూడా కల్పిస్తున్నారు. కొన్ని రకాల మొక్కలను నాటి వాటి జెనెటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ చేయబోతున్నారు. కంపెనీలు, అమ్మకందారుల్లో జవాబుదారీ కోసమే.. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ సేవలు 2021 ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. మార్చి నెలాఖరు కల్లా 133 పూర్తికానున్నాయి. 14 ల్యాబ్స్ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కంపెనీలు, అమ్మకందారుల్లో జవాబుదారీతనం తీసుకురావడంతోపాటు రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
విత్తనాలొచ్చాయ్..
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రాయితీపై విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉంచింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయాధికారులు పంటల సాగుకు సంబంధించిన విత్తన అవసరాలు, రకాల అంచనాలను తొలుత రూపొందించారు. వాటి ఆధారంగా విత్తన ఇండెంట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు అందించా రు. ఆ సంస్థ ఆయా ఇండెంట్ల ఆధారంగా రెండు జిల్లాలకు రాయితీ విత్తనాలను కేటాయించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మం రీజినల్ కార్యాలయ విభాగం ఉన్నతాధికారులు రెండు జిల్లాలకు రాయితీ విత్తనాలను అందించే చర్యలు చేపట్టారు. వరి పండించే ప్రాంతాలకు వరి రకాల విత్తనాలు, పెసర, కంది పండించే ప్రాంతాలకు ఆయా రకాల విత్తనాలను సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచారు. అలాగే భూసారం పెంచే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రాయితీపై విక్రయించే చర్యలను కూడా విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టింది. వరి సాగుచేసే మాగాణి భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు వేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 51,809 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు విత్తనాభివృద్ధి సంస్థ 51,809 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించడానికి రంగం సిద్ధం చేసింది. రెండు జిల్లాల వ్యవసాయ శాఖలు వివిధ పంటలకు చెందిన 47,251 క్వింటాళ్ల విత్తనాలను ఇండెంట్‌గా పెట్టగా.. విత్తనాభివృద్ధి సంస్థ అంతకు మించి 4,558 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లి పెసర, పెసర, కంది, మినుము, వరి విత్తన రకాలను అందుబాటులో ఉంచింది. ‘పచ్చిరొట్ట’కు 65 శాతం రాయితీ భూసారం పెంచే పచ్చిరొట్ట విత్తనాలకు విత్తనాభివృద్ధి సంస్థ 65 శాతం రాయితీ కల్పించింది. జీలుగు కిలో ఒక్కంటికి రూ.51.50 కాగా.. రూ.33.50 రాయితీ ఇచ్చింది. వీటిని రైతులకు రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే 30 కిలోల బస్తా రూ.540 చొప్పున రైతులకు విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు. జనుములు కిలో ధర రూ.68.50 కాగా.. రూ.44.25 రాయితీగా ఇచ్చింది. ఇవి కిలో ఒక్కంటికి రైతులకు రూ.23.75లకు అందుబాటులో ఉంచారు. 40 కిలోల బస్తాను రూ.959 చొప్పున రైతులకు అందుబాటులో ఉంచారు. పిల్లి పెసర విత్తనాల కిలో ధర రూ.104 కాగా.. రూ.67.60 రాయితీ కల్పించారు. వీటిని రైతులకు రూ.36.40 చొప్పున విక్రయిస్తున్నారు. 20 కిలోల విత్తన బస్తాను రూ.728 చొప్పున విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు. పెసర, కంది విత్తనాలకు 50 శాతం.. విత్తనాభివృద్ధి సంస్థ పెసర, కంది, మినుము విత్తనాలకు 50 శాతం రాయితీ ఇస్తోంది. పెసర ఎంజీజీ–295 రకం విత్తనాల కిలో ధర రూ.98 కాగా.. విత్తనాభివృద్ధి సంస్థ రూ.49 రాయితీ ఇచ్చింది. వీటిని రూ.49 చొప్పున రైతులకు విక్రయిస్తున్నారు. 4 కిలోల బ్యాగ్ రూ.196 చొప్పున విక్రయిస్తున్నారు. కందులు ఎల్‌ఆర్‌జీ–41 రకం విత్తనం కిలో ధర రూ.81 కాగా.. రూ.40.50 రాయితీ కల్పించారు. వీటిని రైతులకు రూ.40.50, 4 కిలోల బ్యాగ్‌ను రూ.162 చొప్పున విక్రయిస్తున్నారు. మినుములు పీయూ–31 రకం విత్తనాల కిలో ధర రూ.81.50 కాగా.. రూ.40.75 రాయితీ కల్పించి రూ.40.75 చొప్పున విక్రయిస్తున్నారు. 4 కిలోల బ్యాగ్ ధర రూ.163 ఉంది. వరి కిలో ఒక్కంటికి రూ.5 నుంచి రూ.10 రాయితీ రెండు జిల్లాల్లో సాగుచేసే వరి రకం విత్తనాలకు కిలో ఒక్కంటికి రూ.5 నుంచి రూ.10 చొప్పున విత్తనాభివృద్ధి సంస్థ రాయితీ కల్పించింది. బీపీటీ–5205 రకం కిలో ఒక్కంటికి రూ.30.38 కాగా.. రూ.5 రాయితీతో రూ.25.38 చొప్పున విక్రయిస్తున్నారు. 25 కిలోల బస్తాను రూ.634 విక్రయిస్తున్నారు. ఎంటీయూ–1001 రకం కిలో ధర రూ.28.80 కాగా.. రూ.5 రాయితీ కల్పిస్తుండగా.. రూ.23.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ రకం 30 కిలోల బస్తాను రూ.714కు విక్రయిస్తున్నారు. ఆర్ఎన్ఆర్–15048 రకం కిలో ధర రూ.30.38 కాగా.. రూ.10 రాయితీ కల్పించారు. వీటిని రూ.20.38, 15 కిలోల బస్తాకు రూ.305 చొప్పున ధర నిర్ణయించారు. 96 పీఏసీఎస్‌ల ద్వారా విక్రయం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 96 పీఏసీఎస్‌ల ద్వారా విత్తనాభివృద్ధి సంస్థ రాయితీ విత్తనాలను విక్రయించే చర్యలు చేపట్టింది. ఖమ్మంలోని విత్తన గోదాముల నుంచి రెండు జిల్లాల నలుమూలలకు విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టింది. మండల వ్యవసాయాధికారి లేదా గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారి ఇచ్చిన పర్మిట్ ఆధారంగా రైతులకు రాయితీ విత్తనాలను విక్రయించాల్సి ఉంటుంది. అధికారులు రైతులకు ఉన్న భూమి.. అది ఏ పంటకు అనువైనది పరిశీలించి రాయితీ విత్తనాలకు పర్మిట్లు ఇస్తున్నారు. విత్తన కొరత లేకుండా చర్యలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విత్తన కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అవసరాన్నిబట్టి మరికొంత మేరకు అదనంగా విత్తనాలను కూడా రైతులకు అందించే చర్యలు కూడా తీసుకుంటాం. విత్తన విక్రయ ప్రక్రియ అంతా ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం. – ఏ.రాజీవ్‌కుమార్, విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం రీజినల్ మేనేజర్ -
చినుకమ్మా! ఎటుబోతివే..!!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. తాగునీటికీ కటకట సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి. పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. -
చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా.. మిషన్ ఎస్సారెస్పీ
సాక్షి, హైదరాబాద్: రానున్న ఖరీఫ్ సీజన్లో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని మళ్లించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలోగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద చేపట్టిన అన్ని రకాల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. వర్షాలు కురిసే జూన్ నాటికి ఎస్సారెస్పీ పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ఈ నెల 10 నుంచి లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ) దిగువన ఉన్న ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.కాగా, గురువారం నీటిపారుదల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిచంనున్నారు. సీఎం ఆదేశాలతో కీలక భేటీ ఎస్సారెస్పీ ఆయకట్టు పునరుజ్జీవంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఇంజనీర్లతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ఆయకట్టు పరీవాహక ఎమ్మెల్యేలకు మంగళవారం ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా జూన్, జూలై నుంచే 90 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయని.. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ కింద ఉన్న 14.40లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ అధికారు సమన్వయ భేటీ బుధవారం జలసౌధలో జరిగింది. ఈ భేటీకి మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్, సుంకే రవిశంకర్, నన్నపనేని నరేందర్, సోలిపేట రామలింగారెడ్డి, సీతక్క, ఆరూరి రమేష్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్ కుమార్, సీఈ శంకర్ తదితరులు హాజరయ్యారు. రబీ సాగునీటి విడుదల, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ పనులు, ఆయకట్టు లక్ష్యాల పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. జూన్ చివరికి 100% పనులు: ఈటల ఎస్సారెస్పీ ద్వారా 14.40లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉన్నా, గతంలో 5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ చేపట్టి ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీళ్లివ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇదే సమయంలో ‘ప్రాజెక్టులో ఇప్పటికే తవ్విన కాల్వలకు 3వేల క్యూసెక్కుల సామర్థ్యం నుండి 6వేల క్యూసెక్కుల సామర్థ్యం వరకు నీటిని వదిలి పరీక్షించాం. ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించాం. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉంది. దీంతో పాటే చెరువులు, కుంటలు నింపాలని సీఎం చెప్పారు. ఇలా చేస్తే భూగర్భజలాలు, మత్స్య సంపద పెరుగుతుంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి కేటాయించిన నిధుల్లో 100% ఖర్చు చేస్తాం. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చుకుంటాం’అని ఈటల పేర్కొన్నారు. కొన్ని చోట్ల భూసేకరణలో సమస్యలున్నాయని, వాటిపైన పూర్తి దృష్టిసారిస్తామన్నారు. ఈ ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని, ఫిబ్రవరి 10నుంచి లోయర్ మానేరు కింది పంటలకు ఒక తడి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని, కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. కొనసాగుతున్న ఎల్ఎండీ పనులు! ఎస్సారెస్పీ పరిధిలో ఎల్ఎండీ ఎగువన 145వ కిలోమీటరు వరకు పనులు కేవలం 30–40% మాత్రమే పూర్తవగా, దిగువన 146వ కిలోమీటర్‌నుంచి 284కి.మీ వరకు కాల్వల ఆధునీకరణ పనులను రూ.400 కోట్లతో చేపట్టగా, ఇక్కడ 60% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నీటి విడుదల కొనసాగుతు న్న దృష్ట్యా పనులు జూన్ నాటికి పూర్తి చేయా లని ఎమ్మెల్యేలు సూచించారు. డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.230 కోట్ల పనులను జూన్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రాజెక్టు స్టేజ్–1 కింద 9.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 6 లక్షల ఎకరాల వరకు నీరందుతోంది. స్టేజ్ –1 కింద ఉన్న 4.80 లక్షల ఎకరాల ఆయకట్టులో గరిష్టంగా నీరందించేలా చూడాలని సూచించారు. మిడ్‌మానేరు కింద 80వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. -
ముగింపు దశలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తంగా 32లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా 27 లక్షల మేర సేకరణ పూర్తయింది. మరో 5లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను ఈ నెలాఖరు వరకు ముగించాలని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. ఖరీఫ్ సాగు ఆలస్యమైన జిల్లాల్లో సేకరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ఏడాది విస్తారంగా జరిగిన పంటల సాగు దృష్ట్యా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా 3,284 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. అక్టోబర్ తొలివారం నుంచే ధాన్యం సేకరణను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3,147 కేంద్రాలను తెరిచి, శనివారం నాటికి 27లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ పూర్తి చేసింది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.4,700 కోట్ల వరకు ఉంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కామారెడ్డిలో 3.17లక్షలు, కరీంనగర్లో 2.24 లక్షలు, నల్లగొండలో 2లక్షలు, జగిత్యాలలో 2.31లక్షలు, మెదక్‌లో 1.54 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తి చేసింది. సేకరణ అధికంగా జరిగిన జిల్లాలో ఇప్పటికే వెయ్యికి పైగా కేంద్రాలను మూసివేశారు. గత ఏడాది ఇదే సమయానికి 14లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరగ్గా, ఈ ఏడాది డిసెంబర్లోనే కొనుగోళ్లు ముగింపుకు రావడం గమనార్హం. ఇక ఆలస్యంగా ఖరీఫ్సాగు జరిగిన ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లిలో నెలాఖరు వరకు సేకరణ సాగనుంది. ఈ జిల్లాల్లోనే దాదాపు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల్సి ఉంది. సేకరించిన ధాన్యంలో ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగించింది. -
సన్నరకానికి పెరిగిన ధర
మోర్తాడ్(బాల్కొండ): నిన్న మొన్నటి వరకు చిన్న బోయిన సన్న రకాల ధర క్ర మ క్రమంగా పెరుగుతుండటంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి కోత లు ఆరంభమైన సమయంలో సన్న రకం వరి ధాన్యానికి తక్కువ ధర ఉండటంతో ముందుగా పంటను విక్రయించిన రైతులు నష్టాలను చవి చూశారు. అయితే వా రం రోజుల నుంచి సన్న రకం వరి ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో ధరకు రెక్కలు తొడిగాయి. బీపీటీ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,650 నుంచి రూ.1,750 వరకు ధర పలుకుతోంది. అయితే సన్న రకాల్లో అత్యంత సన్నవిగా గుర్తింపు పొందిన జై శ్రీరాం, సూపర్ సీడ్, తెలంగాణ సోన రకాలకు మాత్రం క్వింటాలుకు రూ.2,100 నుంచి రూ.2,200 ధర పలుకుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2,100 ధర ఉండగా ఈ సారి రూ.100 ఎక్కువగా ధర పెరిగింది. ఖరీఫ్ సీజనుకు గాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. ఇందులో అధిక భాగం సన్న రకాలను సాగు చేశారు. సన్న రకాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కొత్త రకాలను రైతులు సాగు చేయడం విశేషం. సన్న రకాలకు మార్కెట్ ఆరంభంలో క్వింటాలుకు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు మాత్రమే ధర పలికింది. సన్న రకం బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్ కావడంతో ధర ఎక్కువగా పలుకడం లేదని రైతులు వాపోయారు. ఈ సీజనులో సుమారు 60 శాతం సన్న రకాలనే రైతులు సాగు చేశారు. కేవలం 40 శాతం మాత్రమే దొడ్డు రకం వరి ధాన్యం సాగు అయ్యింది. అయితే దొడ్డు రకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధర లభించింది. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ.1,750 మద్దతు ధరగా ప్రకటించింది. దొడ్డు రకాలను సాగు చేసిన రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. సన్న రకాలకు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్ రకం ధరను వర్తింప చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1,720 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. సన్న రకాలను కొనుగోలు కేంద్రాల్లో కాకుండా వ్యాపారులు, రైస్ మిల్లర్లకు విక్రయించడం వల్ల ఎక్కువ ధర పొందవచ్చని రైతులు భావించారు. వ్యాపారులు మొదట్లో ఎక్కువ ధర చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారు. ఎగుమతులకు డిమాండ్ పెరగడంతో సన్న రకాల ధర గతంలో కంటే ఎక్కువ పెరిగింది. రోజు రోజుకు సన్న రకాల ధర పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ వద్ద ధాన్యం నిలువలు తగ్గిపోయే వరకు ఇదే ధర కొనసాగితేనే ప్రయోజనం అని రైతులు పేర్కొంటున్నారు. -
విత్తనం విఫలమైనా.. రాయల్టీ దగా!
సాక్షి, హైదరాబాద్: ఆ విత్తనం విఫలమైందనీ తెలుసు.. దానికి పురుగులను తట్టుకునే శక్తి లేదనీ తెలుసు.. అసలు ఆ విత్తనంతో పంటంతా నాశనమైందనీ, రైతులు తీవ్రంగా నష్టపోయారనీ తెలుసు.. అయినా మళ్లీ అదే విత్తనం.. అడ్డగోలు రాయితీ వసూలు.. దేశవ్యాప్తంగా పత్తి రైతుల ఉసురుపోసుకుంటున్న ‘బీజీ–2’పత్తి విత్తనం వ్యవహారం ఇది.. దానిని అంటగట్టేందుకు మోన్శాంటో సంస్థ చేస్తున్న ప్రయత్నమిది. బీజీ–2 పత్తి విత్తనం విఫలమై, గులాబీరంగు పురుగు సోకడంతో గతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నాశనమైంది. అయినా వచ్చే ఖరీఫ్ సీజన్లో అదే విత్తనాన్ని రైతులకు అంటగట్టేందుకు మోన్శాంటో రంగం సిద్ధం చేసింది. రాయల్టీ కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. దేశంలో పత్తి విత్తన ధరలపై ఈ నెల 22న ఢిల్లీలో పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో బీజీ విత్తనాల ధర, రాయల్టీని ఖరారు చేయనున్నారు. అందులో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవులు వెళుతున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో బీజీ–2 విత్తన వాడకం, రాయల్టీపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయాలు సృష్టించకుండా ఎలా? మోన్శాంటో 2002లో బీటీ–1 టెక్నాలజీని ప్రవేశపెట్టింది. పత్తిని పట్టిపీడించే గులాబీరంగు పురుగును తట్టుకునేలా అభివృద్ధి చేసిన జన్యుమార్పిడి విత్తనాలను బీజీ–1గా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ 2006 నాటికి బీజీ–1 విత్తనం గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. దాంతో మోన్శాంటో మరోసారి జన్యుమార్పిడి చేసి బీజీ–2 పత్తి విత్తనాన్ని ప్రవేశపెట్టింది. 2012 నాటికి దీనికి కూడా గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత ఆ సంస్థ పత్తి విత్తనంలో ప్రమాదకరమైన హెర్బిసైడ్ టోలరెంట్ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువును ప్రవేశపెట్టి బీజీ–3 పత్తి విత్తనాన్ని రూపొందించింది. దానికితోడు పత్తి పంటలో కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసైట్ అనే పురుగు మందును తీసుకొచ్చింది. ఈ బీజీ–3, గ్లై్లఫోసైట్లతో పర్యావరణానికి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తంకావడంతో కేంద్రం వాటిని దేశంలో ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వలేదు. అయినా ఈ బీజీ–3ని రహస్యంగా రైతులకు అంటగడుతున్నారు. అయితే వచ్చే ఖరీఫ్‌లో రైతులు పత్తి వేయాలంటే అధికారికంగా ప్రస్తుతం బీజీ–2 విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఏ పత్తి విత్తనమూ రాలేదు. దాంతో ఏ విత్తనం వేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. పనిచేయని ‘విత్తు’కు రాయల్టీ కూడా.. ఇప్పటికే బీజీ–2 పత్తి విఫలమైనా.. దానికి రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మోన్శాంటో అభివృద్ధి చేసిన విత్తనాన్ని విక్రయించుకుంటున్నందుకుగాను.. ఇక్కడి కంపెనీలు ఆ సంస్థకు చెల్లించే సొమ్మే రాయల్టీ. గతేడాది బీజీ–2 విత్తన ప్యాకెట్ (450 గ్రా.) ధరను రూ.781గా నిర్ణయించారు. దానికి రాయల్టీ రూ.49 కలిపి రూ.830 గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)గా ఖరారు చేశారు. ఇలా వసూలు చేస్తున్న రాయల్టీ సొమ్ము మొత్తం మోన్శాంటోకు వెళుతుంది. అయితే బీజీ–2ను మోన్శాంటోయే అభివృద్ధి చేసినా.. ఇప్పుడది ప్రభావవంతంగా లేదు. దీంతో రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని వ్యవసాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ నెల 22న ఢిల్లీలో జరిగే సమావేశంలో ఈ ఏడాది కూడా రాయల్టీ ఉండేలా మోన్శాంటో పావులు కదుపుతోంది. రాష్ట్రానికి కోటి విత్తన ప్యాకెట్లు ప్రపంచంలో పత్తి పండించే 80 దేశాల్లో మన దేశం 32వ స్థానంలో ఉంది. దేశంలో 2.92 కోట్ల ఎకరాల్లో పత్తి పండిస్తారు. గత ఖరీఫ్‌లో ఒక్క తెలంగాణలోనే ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ఇందుకోసం దాదాపు కోటి పత్తి విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. అయితే గులాబీరంగు పురుగుసోకడంతో రాష్ట్రంలో పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. 3.2 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. తాజా అంచనాల మేరకు 2.3 కోట్ల క్వింటాళ్లే దిగుబడి వచ్చే అవకాశముందని తేలింది. బీజీ–2 పత్తి కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. రాయల్టీని రద్దు చేయాలి బీజీ–2 పత్తి గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తి కోల్పోయింది. బీజీ–3 జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తుంది. పత్తిపై మోన్శాంటో రాయల్టీని రద్దు చేయాలి. ఇప్పుడు ఏ పత్తి విత్తనమూ రైతులకు శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈసారి పత్తికి ప్రత్యామ్నాయంగా ఆహార పంటల సాగును ప్రోత్సహించాలి.. – నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు కేంద్ర నిర్ణయం మేరకే.. పత్తి విత్తనంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 15న ఖరీఫ్ ప్రాంతీయ సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.. – జగన్మోహన్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు ఈ నెల 22న ఢిల్లీలో పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశం జరుగనుంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. బీటీ–2 పత్తికి రాయల్టీ ఉండాలా, వద్దా అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు కలసి నిర్ధారిస్తారు. ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి..’’ – పార్థసారథి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి -
మారిన విధానం
భువనేశ్వర్: రాష్ట్రంలో కరువు అంచనాకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమలు జేస్తుంది. పంట కోతల ఆధారంగా కాకుండా వర్షపాతం కొరత ఆధారంగా కరువు ప్రభావాన్ని సమీక్షించి ఖరారు చేసేందుకు విభాగం నిర్ణయించినట్టు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు. ఆయన అధ్యక్షతన రాజధానిలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు పొంచి ఉన్నట్టు సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం ఆశాజనకంగా లేనందున ఈ పరిస్థితి తాండవిస్తుంది. వాతావరణ పరిస్థితుల విశ్లేషణ నేపథ్యంలో ఈ ఏడాది కరువు అనివార్యంగా భావిస్తున్నారు. కరువు కోరల నుంచి రైతు వర్గాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం కనబరుస్తుంది. ఏటా పంటల కోత ముగిసిన తర్వాత ఖరారు చేసిన నివేదిక ఆధారంగా కరువు ప్రభావిత పంట నష్టం ధ్రువీకరించడం మనుగడలో ఉంది. పంట నష్టం అనుపాతంలో పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ విధానానికి తెర దించి ఈ ఏడాది కొత్త విధానంలో రైతులకు పరిహారం చెల్లించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి ప్రకటించారు. పంటల కోత నివేదిక కోసం నిరీక్షించి కాలయాపన చేసేది లేదు. 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో కరువు పొంచి ఉన్నట్టు ఖరారు చేసేందుకు విభాగం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్లో రుతుపవనాల ప్రభావంతో వరుసగా 3 వారాల సగటు వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తక్కువ నమోదైతే ఆ ప్రాంతాన్ని కరువు సంకట ప్రాంతంగా(డ్రై స్పెల్ ఏరియా) ప్రకటిస్తామని మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు. పరిస్థితి సర్దుకుంటుంది రాష్ట్రంలో స్వల్ప వృష్టిపాతం పరిస్థితి క్రమంగా సర్దుకుంటుంది. వర్షపాతం లోటు అంచెలంచెలుగా భర్తీ అవుతుంది. ఇటీవల కురిసిన వర్షపాతం గణాంకాలు ఈ మేరకు సంకేతాలు జారీ చేస్తున్నాయి. లోగడ 103 సమితులు స్వల్ప వృష్టిపాతం కోరల్లో చిక్కుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇటీవల వర్షపాతం మెరుగుపడడంతో ఈ స్వల్ప వృష్టి ప్రభావిత సమితుల సంఖ్య 96కి తగ్గినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి.ఈ నెల 22వ తేదీ(శుక్రవారం) నాటికి 73 సమితుల్లో 19 నుంచి 39 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదు అయింది. 22 సమితుల్లో 39 నుంచి 59 శాతం వరకు సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. ఒక సమితిలో మాత్రం సాధారణం కంటే 59 శాతం తక్కువగా వర్షం కురిసి ఆందోళన కలిగిస్తుంది. అరకొరగా కలెక్టర్ల స్పందన రాష్ట్రంలో కరువు ప్రభావం అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి నివేదిక కోసం రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. పంచాయతీవారీగా వర్షపాతం నివేదికతో కరువు ప్రభావం అంచనాల్ని దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కేటా యించింది. శుక్రవారంతో ఈ గడువు ముగిసిన కలెక్టర్లు అరకొరగా స్పందించారు. విభాగం చేతికి సమగ్ర నివేదిక అందనట్లు విభాగం మంత్రి మహేశ్వర మహంతి తెలిపారు. తదుపరి సమావేశం అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈలోగా వర్షపాతం తాజా ముఖచిత్రం కూడా స్పష్టం అయితే కరువు నేపథ్యంలో పంట నష్టం ఖరారు చేసేందుకు వీలవుతుందని మంత్రి ఆశాభాం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఎఫెక్ట్! ఇటీవల ముగిసిన అసెంబ్లీ వర్షా కాలం సమావేశాలు పురస్కరించుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపట్ల విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో రైతాంగం విలవిలాడుతుంది. సకాలంలో నివేదిక దాఖలు కానందున పీడిత రైతాంగానికి సముచిత పరిహారం సకాలంలో లభించడం లేదు. ఈ పరిస్థితులు రైతు ఆత్మ హత్యల్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరి మారకుంటే వైపరీత్యం అనివార్యంగా దాడికి దిగాయి. మరో వైపు రాష్ట్ర కాంగ్రెసు వ్యవసాయ శాఖ ప్రతినిథి బృందం రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ డాక్టరు ఎస్.సి.జమీర్‌కు శుక్రవారం స్మారక ప్రతం సమర్పించింది. భారతీయ జనతా పార్టీ, అధికార పక్షం బిజూ జనతా దళ్ వర్గాల మధ్య బేదాభిప్రాయాల నడుమ రాష్ట్ర రైతాంగం నలిగిపోతుంది. పంట నష్టం పరిహారం చెల్లింపులో జాప్యం నివారించడం అనివార్యం. పంట నష్టం సంభవించిన ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా పరిగణించాలనే అభ్యర్థనతో గవర్నర్‌కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవసాయ శాఖ స్మారక ప్రతం అందజేసింది. నువాపడా, బొలంగీరు, బర్గడ్, సువర్ణపూర్, బౌధ్, ఢెంకనాల్ జిల్లాల్లో కరువు నివారించే పరిస్థితులే లేనట్టు ఈ ప్రతినిథి బృందం రాష్ట్ర గవర్నర్‌కు వివరించింది. -
లెక్క తేలింది
గత ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లలో వడగండ్లు, భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఊరట లభించింది. జిల్లాలో 22 మండలాలను ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మండలాల రైతులకు త్వరలో పరిహారం విడుదల కానుంది. * భారీ వర్షం, వడగళ్లకు దెబ్బ తిన్న మండలాలు 22 * 2013 పంట నష్టంపై ప్రభుత్వ ప్రకటన * ఏడాదిలో నాలుగు సార్లు నష్టపోయిన రైతన్న * త్వరలో రూ. 21 కోట్ల పరిహారం విడుదల సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘ముందు దగా... వెనక దగా, కుడి ఎడమల దగా దగా’... విత్తనాల కొనుగోలు మొదలుకొని దిగుబడులను అమ్ముకునే వరకు అంతటా రైతులకు అన్యాయమే. ప్రకృతి కరుణించక, ప్రభుత్వం ఆదరించక సమస్యల సుడిగుం డంలో సతమతమవుతున్న అన్నదాతకు అన్నీ కష్టాలే. పరి స్థితులు ప్రతికూలంగా మారడంతో ఈ ఖరీఫ్‌లో సాగు సగ మే కాగా, 2013 ఖరీఫ్, రబీ సీజన్లలోనూ రైతులు వడగ ళ్లు, భారీ వర్షాలతో పంటలు నష్టపోయారు. నాలుగు దఫాలుగా జరిగిన నష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. దీని ఆధారంగా జిల్లాలోని 36 మండలాలకుగాను 22 మండలాలలో రైతులు ప్రకృతి వైపరీత్యా నికి గురయ్యారని ప్రభుత్వం గురువారం ప్రకటిం చిం ది. వీరందరికీ త్వరలోనే రూ.21 కోట్ల పరిహారం విడుదల కానుంది. వణికించిన వడగళ్లు 2013లో రైతులు నాలుగు పర్యాయాలు భారీ వర్షాలు, వడగళ్ల వర్షాల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. జనవరి 25, 26 తేదీలలో కురిసిన వర్షాలు పంటలను దెబ్బ తీశాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో వరుసగా కురిసిన భారీ వర్షాలకు 580 హెక్టార్లలో మిర్చి, పొద్దు తిరుగుడు, పొగాకు పంటలు ఊడ్చుకుపోయాయి. ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వర్షం రైతులను అతలాకుతులం చేసింది. అక్టోబర్ 24, 25 తేదీలలో కురిసిన భారీ, వడగళ్ల వర్షాల కారణంగా 2,105 హెక్టార్లలో వరి, 970 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రైతులు పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాదేశం మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ వ్యవసాయ, రెవె న్యూ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా సర్వే నిర్వహిం చారు. వారు 36 మండలాలలో రూ.52 కోట్ల మేరకు రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. రాష్ట్ర విభజ న, ఎన్నికలు తదితర కారణాలతో పరిహారం మం జూరులో జాప్యం జరిగింది. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం పరిహారం విడుదల చేయనుండటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. బాధిత మండలాలు ఇవే జిల్లాలోని అన్ని మండలాలలో నష్టం జరిగిన తీరును అధికారులు తమ నివేదికలలో వివరించారు. అయితే కొన్ని మార్గదర్శక సూత్రాలను అనుసరించి 22 మం డలాలలోనే నష్టం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. 14 మండలాలు ఈ జాబితాలో చోటు చేసుకోలేదు. వడగళ్లు, భారీ వర్షాల వల్ల నష్టపోయిన మండలాలలో బాల్కొండ, బీర్కూరు, మోర్తాడ్, దోమకొండ, మాచారెడ్డి, ఆర్మూరు, భిక్కనూర్, లింగంపేట్, కామారెడ్డి, గాంధారి, వర్ని, రెంజల్, నిజామాబాద్, బాన్సువాడ, నవీపేట, కోటగిరి, సిరికొండ, నాగిరెడ్డిపేట్, నందిపేట్, బోధన్ తదితర మండలాలు ఉన్నాయి. వీటిని భవిష్యత్‌లో వడగళ్ల వర్షం వల్ల నష్టం జరిగే మండలాలుగా కూడా గుర్తిస్తారు.