చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా.. మిషన్‌ ఎస్సారెస్పీ  | To end up in the end of the mission | Sakshi
Sakshi News home page

చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా.. మిషన్‌ ఎస్సారెస్పీ 

Published Thu, Feb 7 2019 2:23 AM | Last Updated on Thu, Feb 7 2019 2:23 AM

To end up in the end of the mission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని మళ్లించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. ఆలోగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద చేపట్టిన అన్ని రకాల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. వర్షాలు కురిసే జూన్‌ నాటికి ఎస్సారెస్పీ పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. ఈ నెల 10 నుంచి లోయర్‌ మానేర్‌ డ్యామ్‌ (ఎల్‌ఎండీ) దిగువన ఉన్న ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.కాగా, గురువారం నీటిపారుదల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిచంనున్నారు. 

సీఎం ఆదేశాలతో కీలక భేటీ 
ఎస్సారెస్పీ ఆయకట్టు పునరుజ్జీవంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఇంజనీర్లతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ఆయకట్టు పరీవాహక ఎమ్మెల్యేలకు మంగళవారం ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా జూన్, జూలై నుంచే 90 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయని.. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ కింద ఉన్న 14.40లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ అధికారు సమన్వయ భేటీ బుధవారం జలసౌధలో జరిగింది. ఈ భేటీకి మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌ రెడ్డి, ఎంపీ వినోద్‌ కుమార్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్, సుంకే రవిశంకర్, నన్నపనేని నరేందర్, సోలిపేట రామలింగారెడ్డి, సీతక్క, ఆరూరి రమేష్, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌ కుమార్, సీఈ శంకర్‌ తదితరులు హాజరయ్యారు. రబీ సాగునీటి విడుదల, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ పనులు, ఆయకట్టు లక్ష్యాల పురోగతిపై ఈ భేటీలో చర్చించారు.  

జూన్‌ చివరికి 100% పనులు: ఈటల 
ఎస్సారెస్పీ ద్వారా 14.40లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉన్నా, గతంలో 5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ చేపట్టి ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీళ్లివ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇదే సమయంలో ‘ప్రాజెక్టులో ఇప్పటికే తవ్విన కాల్వలకు 3వేల క్యూసెక్కుల సామర్థ్యం నుండి 6వేల క్యూసెక్కుల సామర్థ్యం వరకు నీటిని వదిలి పరీక్షించాం. ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించాం. డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్స్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉంది. దీంతో పాటే చెరువులు, కుంటలు నింపాలని సీఎం చెప్పారు. ఇలా చేస్తే భూగర్భజలాలు, మత్స్య సంపద పెరుగుతుంది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి కేటాయించిన నిధుల్లో 100% ఖర్చు చేస్తాం. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చుకుంటాం’అని ఈటల పేర్కొన్నారు. కొన్ని చోట్ల భూసేకరణలో సమస్యలున్నాయని, వాటిపైన పూర్తి దృష్టిసారిస్తామన్నారు. ఈ ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని, ఫిబ్రవరి 10నుంచి లోయర్‌ మానేరు కింది పంటలకు ఒక తడి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని, కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు.  

కొనసాగుతున్న ఎల్‌ఎండీ పనులు! 
ఎస్సారెస్పీ పరిధిలో ఎల్‌ఎండీ ఎగువన 145వ కిలోమీటరు వరకు పనులు కేవలం 30–40% మాత్రమే పూర్తవగా, దిగువన 146వ కిలోమీటర్‌నుంచి 284కి.మీ వరకు కాల్వల ఆధునీకరణ పనులను రూ.400 కోట్లతో చేపట్టగా, ఇక్కడ 60% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నీటి విడుదల కొనసాగుతు న్న దృష్ట్యా పనులు జూన్‌ నాటికి పూర్తి చేయా లని ఎమ్మెల్యేలు సూచించారు. డిస్ట్రిబ్యూటరీ పనులను రూ.230 కోట్ల పనులను జూన్‌ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చూడాలని ఆదేశించారు. ప్రాజెక్టు స్టేజ్‌–1 కింద 9.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 6 లక్షల ఎకరాల వరకు నీరందుతోంది.  స్టేజ్‌ –1 కింద ఉన్న 4.80 లక్షల ఎకరాల ఆయకట్టులో గరిష్టంగా నీరందించేలా చూడాలని సూచించారు.   మిడ్‌మానేరు కింద 80వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement