భువనేశ్వర్: రాష్ట్రంలో కరువు అంచనాకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమలు జేస్తుంది. పంట కోతల ఆధారంగా కాకుండా వర్షపాతం కొరత ఆధారంగా కరువు ప్రభావాన్ని సమీక్షించి ఖరారు చేసేందుకు విభాగం నిర్ణయించినట్టు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు. ఆయన అధ్యక్షతన రాజధానిలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు పొంచి ఉన్నట్టు సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం ఆశాజనకంగా లేనందున ఈ పరిస్థితి తాండవిస్తుంది. వాతావరణ పరిస్థితుల విశ్లేషణ నేపథ్యంలో ఈ ఏడాది కరువు అనివార్యంగా భావిస్తున్నారు. కరువు కోరల నుంచి రైతు వర్గాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం కనబరుస్తుంది. ఏటా పంటల కోత ముగిసిన తర్వాత ఖరారు చేసిన నివేదిక ఆధారంగా కరువు ప్రభావిత పంట నష్టం ధ్రువీకరించడం మనుగడలో ఉంది.
పంట నష్టం అనుపాతంలో పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ విధానానికి తెర దించి ఈ ఏడాది కొత్త విధానంలో రైతులకు పరిహారం చెల్లించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి ప్రకటించారు. పంటల కోత నివేదిక కోసం నిరీక్షించి కాలయాపన చేసేది లేదు. 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో కరువు పొంచి ఉన్నట్టు ఖరారు చేసేందుకు విభాగం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్‌లో రుతుపవనాల ప్రభావంతో వరుసగా 3 వారాల సగటు వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తక్కువ నమోదైతే ఆ ప్రాంతాన్ని కరువు సంకట ప్రాంతంగా(డ్రై స్పెల్ ఏరియా) ప్రకటిస్తామని మంత్రి మహేశ్వర మహంతి ప్రకటించారు.
పరిస్థితి సర్దుకుంటుంది
రాష్ట్రంలో స్వల్ప వృష్టిపాతం పరిస్థితి క్రమంగా సర్దుకుంటుంది. వర్షపాతం లోటు అంచెలంచెలుగా భర్తీ అవుతుంది. ఇటీవల కురిసిన వర్షపాతం గణాంకాలు ఈ మేరకు సంకేతాలు జారీ చేస్తున్నాయి. లోగడ 103 సమితులు స్వల్ప వృష్టిపాతం కోరల్లో చిక్కుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇటీవల వర్షపాతం మెరుగుపడడంతో ఈ స్వల్ప వృష్టి ప్రభావిత సమితుల సంఖ్య 96కి తగ్గినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి.ఈ నెల 22వ తేదీ(శుక్రవారం) నాటికి 73 సమితుల్లో 19 నుంచి 39 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదు అయింది. 22 సమితుల్లో 39 నుంచి 59 శాతం వరకు సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. ఒక సమితిలో మాత్రం సాధారణం కంటే 59 శాతం తక్కువగా వర్షం కురిసి ఆందోళన కలిగిస్తుంది.
అరకొరగా కలెక్టర్ల స్పందన
రాష్ట్రంలో కరువు ప్రభావం అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి నివేదిక కోసం రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. పంచాయతీవారీగా వర్షపాతం నివేదికతో కరువు ప్రభావం అంచనాల్ని దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కేటా యించింది. శుక్రవారంతో ఈ గడువు ముగిసిన కలెక్టర్లు అరకొరగా స్పందించారు. విభాగం చేతికి సమగ్ర నివేదిక అందనట్లు విభాగం మంత్రి మహేశ్వర మహంతి తెలిపారు. తదుపరి సమావేశం అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈలోగా వర్షపాతం తాజా ముఖచిత్రం కూడా స్పష్టం అయితే కరువు నేపథ్యంలో పంట నష్టం ఖరారు చేసేందుకు వీలవుతుందని మంత్రి ఆశాభాం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల ఎఫెక్ట్!
ఇటీవల ముగిసిన అసెంబ్లీ వర్షా కాలం సమావేశాలు పురస్కరించుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపట్ల విరుచుకుపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో రైతాంగం విలవిలాడుతుంది. సకాలంలో నివేదిక దాఖలు కానందున పీడిత రైతాంగానికి సముచిత పరిహారం సకాలంలో లభించడం లేదు. ఈ పరిస్థితులు రైతు ఆత్మ హత్యల్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరి మారకుంటే వైపరీత్యం అనివార్యంగా దాడికి దిగాయి. మరో వైపు రాష్ట్ర కాంగ్రెసు వ్యవసాయ శాఖ ప్రతినిథి బృందం రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ డాక్టరు ఎస్.సి.జమీర్‌కు శుక్రవారం స్మారక ప్రతం సమర్పించింది. భారతీయ జనతా పార్టీ, అధికార పక్షం బిజూ జనతా దళ్ వర్గాల మధ్య బేదాభిప్రాయాల నడుమ రాష్ట్ర రైతాంగం నలిగిపోతుంది. పంట నష్టం పరిహారం చెల్లింపులో జాప్యం నివారించడం అనివార్యం. పంట నష్టం సంభవించిన ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా పరిగణించాలనే అభ్యర్థనతో గవర్నర్‌కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవసాయ శాఖ స్మారక ప్రతం అందజేసింది. నువాపడా, బొలంగీరు, బర్‌గడ్, సువర్ణపూర్, బౌధ్, ఢెంకనాల్ జిల్లాల్లో కరువు నివారించే పరిస్థితులే లేనట్టు ఈ ప్రతినిథి బృందం రాష్ట్ర గవర్నర్‌కు వివరించింది.
మారిన విధానం
Published Sat, Sep 23 2017 3:39 AM | Last Updated on Sat, Sep 23 2017 3:39 AM
Advertisement