సాక్షి, అమరావతి: 2022 ఖరీఫ్ సీజన్‌లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన ఆకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్టుగా గుర్తించింది.
ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతుల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు.
వ్యవసాయ పంటల్లో 11,742 ఎకరాల్లో వరి, 5,205 ఎకరాల్లో పత్తి, 4,887 ఎకరాల్లో వేరుశనగ, 3,915 ఎకరాల్లో పెసర.. ఉద్యాన పంటల్లో 7 వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు 18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44 కోట్లు చొప్పున మొత్తంగా రూ.39.39 కోట్లు పంట నష్ట పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు రైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు.
గత మూడేళ్లలో రూ.1,795.4 కోట్లు
వరదలు, ఆకాల వర్షాలు వంటి వివిధ వైపరీత్యాల వల్ల 2019–20 సీజన్‌లో 1.47 లక్షల మందికి రూ.116.63 కోట్లు, 2020–21 సీజన్‌లో 12.15 లక్షల మందికి రూ.932.07కోట్లు, 2021–22 సీజన్‌లో 6.32 లక్షల మందికి రూ.564 కోట్లు చొప్పున గత మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.4 కోట్ల పంట నష్టపరిహారం అందించారు.
ప్రస్తుతం 2022–23లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 45,998 మంది రైతులకు ఈ నెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు చొప్పున మొత్తంగా 8.22 లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ కలిసి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ
Published Fri, Nov 25 2022 3:59 AM | Last Updated on Fri, Nov 25 2022 8:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment