
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 27న (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండోరోజు కూడా ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడతారు. ఉ.8.30కు రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి ముఖ్యమంత్రి బయల్దేరి ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరు చేరుకుంటారు.
9.30కు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆక్కడి నుంచి మ.12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం.. తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. మ.1 గంటకు తాడేపల్లికి బయల్దేరుతారు.
వరద బాధితులకు అండగా..
మరోవైపు.. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో సాయమందించింది. వారి యోగక్షేమాల్ని తెలుసుకుని ఇంకా సాయమందించాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకుని వారిని ఓదార్చేందుకు సీఎం వైఎస్ జగన్ బుధవారం ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.