Andhra Pradesh: పోలవరం.. శరవేగం | Andhra Pradesh Government working on the Polavaram project to compete | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పోలవరం.. శరవేగం

Published Mon, Sep 6 2021 2:12 AM | Last Updated on Mon, Sep 6 2021 5:36 PM

Andhra Pradesh Government working on the Polavaram project to compete - Sakshi

వాస్తవానికి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు. గత ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం పట్టుబట్టి నిర్మాణ బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు. ప్రణాళిక లోపంతో తూతూ మంత్రంగా అరకొరగా పనులు చేశారు. తదనంతరం బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత సర్కారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేస్తూ.. ఆనక అతి కష్టంతో రీయింబర్స్‌ చేసుకుంటోంది. సకాలంలో నిధులు అందకపోయినా, కరోనా కకావికలం చేసినా.. రేయింబవళ్లు పనులను పరుగులు పెట్టిస్తోంది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. 

సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృతితో పోటీ పడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం రూ.2,300 కోట్లను రీయింబర్స్‌ చేయడంలో జాప్యం జరుగుతున్నప్పటికీ.. ప్రాజెక్టు పనులు నిర్విఘ్నంగా సాగడం కోసం రాష్ట్ర ఖజానా నుంచే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన గడువు 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ వైపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే.. మరో వైపు వరదల్లోనూ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 43 మీటర్ల (42.5 మీటర్లు, 0.5 ఫ్రీ బోర్డ్‌) ఎత్తుతో అధికారులు పూర్తి చేశారు.

రివిట్‌మెంట్‌ పనులు ఈనెల 10 నాటికి పూర్తవుతాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 80 మీటర్లు మినహా 1,537 మీటర్ల పొడవున 20 మీటర్ల ఎత్తుతో పనులు చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవాహం మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగింది. వరద ఉధృతి కాస్త తగ్గాక దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేసి.. 30.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నదిలో నిల్వ ఉన్న నీటిని తోడేసి.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) పనులు చేపట్టి, 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రపంచంలోనే భారీ సామర్థ్యంతో స్పిల్‌ వే 
గోదావరిపై పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద 194.6 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోంది. సాధారణంగా నదీ ప్రవాహానికి అడ్డంగా స్పిల్‌ వే (కాంక్రీట్‌ డ్యామ్‌)ను నిర్మిస్తారు. గోదావరిలో భూ భౌగోళిక పరిస్థితుల వల్ల నదీ గర్భంలో ఇసుక తిన్నెలపై నీటిని నిల్వ చేసేలా ప్రధాన డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌)ను 2,454 మీటర్ల పొడవున నిర్మిస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్‌ ప్రకారం గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా.. నది కుడి గట్టుపై 1,118.4 మీటర్ల పొడవుతో స్పిల్‌ వేను నిర్మించేలా ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ సామర్థ్యంతో దిగువకు నీటిని విడుదల చేసే స్పిల్‌ వే ఇదే కావడం గమనార్హం. నది ఎడమ గట్టున 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్‌ కేంద్రాన్ని చేపట్టారు. కుడి కాలువ ద్వారా మూడు లక్షలు, ఎడమ కాలువ ద్వారా 4.2 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.
పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌  

రికార్డు సమయంలో స్పిల్‌ వే పూర్తి 
► పోలవరం స్పిల్‌ వేను 1,118.4 మీటర్ల పొడవుతో 55 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. దీన్ని 53 బ్లాక్‌లుగా నిర్మించాలి. వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌ వే 53 పియర్స్‌ (కాంక్రీట్‌ దిమ్మెలు)ను 55 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. స్పిల్‌ వే 54.5 మీటర్ల ఎత్తులో 192 గడ్డర్లను ఏర్పాటు చేసి వాటిపై 1118.4 మీటర్ల పొడవుతో స్పిల్‌ వే బ్రిడ్జిని పూర్తి చేశారు.
► స్పిల్‌ రివర్‌ స్లూయిజ్‌లకు పది గేట్లను బిగించారు. స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ 42 గేట్లను బిగించారు. వాటిని ఎత్తడానికి, దించడానికి వీలుగా 84 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని బిగించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జర్మనీ నుంచి మరో 14 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్ల దిగుమతిలో జాప్యం వల్ల ఆరు గేట్లను బిగించలేకపోయారు. జర్మనీ నుంచి హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లు మూడు నెలల క్రితం వచ్చాయి. వరద తగ్గాక వాటితో మిగిలిన 6 గేట్లను బిగించనున్నారు.
► స్పిల్‌ వే నుంచి విడుదల చేసిన వరద జలాలను గోదావరి సహజ మార్గంలో కలిపేందుకు 2.92 కి.మీ. పొడవున వెయ్యి మీటర్ల వెడల్పుతో స్పిల్‌ చానల్‌ తవ్వాలి. దానికి కాంక్రీట్‌ లైనింగ్‌ చేయాలి. ఆ తర్వాత 1.5 కి.మీ. పొడవున వెయ్యి మీటర్ల వెడల్పుతో ఫైలట్‌ చానల్‌ తవ్వాలి. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఫైలట్‌ చానల్‌ కూడా పూర్తి చేశారు. 
► వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో అతి భారీ స్పిల్‌ వేను పూర్తి చేశారని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
► గోదావరి సహజ ప్రవాహ మార్గాన్ని స్పిల్‌ వే వైపు మళ్లించేందుకు సింగన్నపల్లి నుంచి స్పిల్‌ వే వరకు ప్రారంభంలో 500 మీటర్ల వెడల్పు, చివరకు వచ్చే సరికి వెయ్యి మీటర్ల వెడల్పుతో 2.18 కి.మీ. పొడవున అప్రోచ్‌ చానల్‌ తవ్వాలి. ఇందుకు 154.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వాలి. ఈ ఏడాది వరద ప్రారంభమయ్యేలోగా 112.48 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర అప్రోచ్‌ చానల్‌ తవ్వి.. జూన్‌ 11న గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించారు.

జలాశయంగా రూపుదిద్దుకుంటున్న పోలవరం 
► ఈసీఆర్‌ఎఫ్‌ను 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలు (564 మీటర్ల పొడవున గ్యాప్‌–1.. 1,750 మీటర్ల పొడవున గ్యాప్‌–2.. 140 మీటర్ల పొడవున గ్యాప్‌–3) నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి వీలుగా.. దానికి 500 మీటర్ల ఎగువన 2,480 మీటర్ల పొడవుతో నదికి అడ్డంగా 43 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌.. 350 మీటర్ల దిగువన 1,617 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి.
► ఈ ఏడాది వరదలు ప్రారంభమయ్యే నాటికే 39 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. గోదావరి నది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో అప్పుడే పోలవరం జలాశయంగా రూపు మార్చుకుంది. జూన్‌ 11న సిల్ప్‌ వే మీదుగా వరదను మళ్లించాక.. గోదావరి వరదల్లోనూ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 1,617 మీటర్లకుగానూ 1,537 మీటర్ల మేర 20 మీటర్ల ఎత్తుతో పనులు చేశారు.
► వరద తగ్గాక దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి.. వాటి మధ్యన ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–2 పనులు చేపట్టనున్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ మేరకు ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు చేపట్టి.. ఇప్పటికే ఒక కొలిక్కి తెచ్చారు. ఈసీఆర్‌ఎఫ్‌ను 2022 నాటికి పూర్తి చేయనున్నారు.

వడివడిగా కాలువలు, అనుసంధాన పనులు 
► కుడి కాలువ పనులు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. జలాశయం నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానం పనులను గతేడాదే ప్రభుత్వం పూర్తి చేసింది. 
► ఎడమ కాలువలో మిగిలిన పనులను వేగవంతం చేసింది. జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానం పనులను కొలిక్కి తెచ్చింది. 
► కుడి కాలువ కింద మూడు లక్షలు, ఎడమ కాలువ కింద 4.2 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను నిర్మించడానికి సర్వే పనులను పూర్తి చేసిన అధికారులు.. నవంబర్‌కు డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి.. పనులు చేపట్టనున్నారు.

వేగంగా విద్యుత్‌ కేంద్రం పనులు 
► పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో ఈసీఆర్‌ఎఫ్‌కు ఎడమ వైపున జల విద్యుత్‌ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో యూనిట్‌లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెవాగాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 
► పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 35.52 మీటర్ల నుంచి నీటిని ప్రెజర్‌ టన్నెళ్ల ద్వారా.. దిగువన ఏర్పాటు చేసిన కెప్లాన్‌ టర్బైన్స్‌పైకి పంపిస్తారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లు వేగంగా తిరగడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.
► ఇందుకోసం 145 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో 12 ప్రెజర్‌ టన్నెళ్లను తవ్వే పనులను వేగవంతం చేశారు. ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్‌ కెప్లాన్‌ టర్భైన్లు ఏర్పాటు చేస్తారు.
► ప్రెజర్‌ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్‌ చానల్‌ తవ్వుతారు. దీని ద్వారా ప్రెజర్‌ టన్నెళ్లకు నీటిని విడుదల చేయడం ద్వారా వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లను తిరిగేలా చేసి.. విద్యుదుత్పత్తి చేస్తారు. 
► టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్‌ రేస్‌ చానల్‌ ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌కు దిగువన నదిలో కలుపుతారు. ఈ వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లను భోపాల్‌కు చెందిన బీహెచ్‌ఈఎల్‌ సంస్థ తయారు చేస్తోంది. ఈ విద్యుత్‌ కేంద్రంలో వినియోగిస్తున్న టర్బైన్లు ఆసియాలోనే అత్యంత పెద్దవి కావడం గమనార్హం.
జల విద్యుత్‌ కేంద్రం టన్నెల్స్‌ తవ్వకం పనులు 

నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేక శ్రద్ధ 
► పోలవరం ప్రాజెక్టులో ఉభయ గోదావరి జిల్లాల్లో 371 గ్రామాలు ముంపునకు గురవుతాయి. గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై టీడీపీ సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. 
► వైఎస్సార్‌సీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల పునరావాసం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తొలి దశలో 41.15 కాంటూర్‌ పరిధిలోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులు చేపట్టింది. 
► ఇందులో ఇప్పటికే 6,314 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. మిగిలిన 14,632 కుటుంబాలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ తర్వాత మిగిలిన 84,655 కుటుంబాలకు పునరావాసం కల్పించనుంది. 
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రాజుపాలెంలో పూర్తయిన పునరావాస కాలనీ  

అది టీడీపీ సర్కార్‌ నిర్వాకం 
► స్పిల్‌ వే పూర్తి చేసి, నిర్వాసితులకు పునరావాసం కల్పించాక.. ప్రదాన డ్యామ్‌ కట్టడానికి వీలుగా నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించేందుకు కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి. కానీ.. గత టీడీపీ సర్కారు కమీషన్ల దాహం, అవగాహనా రాహిత్యం, ప్రణాళిక లోపంతో వరద మళ్లించే స్పిల్‌ వేను పూర్తి చేయకుండా పునాది స్థాయిలోనే వదిలేసింది. 
► వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయకుండానే గోదావరికి అడ్డంగా 1,200 మీటర్ల పొడవున 28 నుంచి 33 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసింది. 2019, 2020లో సహజ ప్రవాహానికి కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో వరద నీటి మట్టం పెరిగి ముంపు గ్రామాల్లోకి ఎగదన్ని నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాఫర్‌ డ్యామ్‌ మీదుగా వరద ప్రవహించడం వల్ల ఈసీఆర్‌ఎఫ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ కొంతమేర దెబ్బతింది. ఇసుక పొరలు కోతకు గురయ్యాయి.
► స్పిల్‌ వేలో 53 బ్లాక్‌ల పియర్స్‌ను సగటున 22 మీటర్ల ఎత్తున చేసింది. 25.72 మీటర్ల ఎత్తు నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో స్పిల్‌ వేకు 48 గేట్లను బిగించాలి. వీటిని పరిశీలిస్తే టీడీపీ సర్కార్‌ ఐదేళ్లలో స్పిల్‌ వేను పునాది స్థాయిలోనే వదిలేసినట్లు స్పష్టమవుతోంది. కానీ.. 42, 43 పియర్స్‌ను 34 మీటర్ల ఎత్తు వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకును అడ్డుగా పెట్టి గేట్లు బిగించేసినట్లు 2018 డిసెంబర్‌ 24న అప్పటి సీఎం చంద్రబాబు డ్రామాలాడారు.
► నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించేందుకు అప్రోచ్‌ చానల్‌ తవ్వకం పనులు చేపట్టలేదు. స్పిల్‌ చానల్‌ పనుల్లో మట్టి పనులు.. కొంత మేర కాంక్రీట్‌ పనులు చేసింది. జల విద్యుత్‌ కేంద్రం పనుల్లో పునాది పనులకుగాను కొండను 18 మీటర్ల మేర మాత్రమే టీడీపీ సర్కార్‌ తవ్వింది.

ఇది నేటి ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్‌ 20న పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి, రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లు ఆదా చేశారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్‌ 14న, గత జూలై 19న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నిర్వాసితుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పునరావాస కాలనీల్లో అన్ని వసతులతో విశాలమైన ఇళ్లను నిర్మించి.. నిర్వాసితులకు అందిస్తున్నాం. పరిహారాన్ని నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. 2019 నుంచి ఇప్పటి వరకు 6,314 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాం. ఏ ఒక్క నిర్వాసితుడూ ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పిస్తున్నాం.
– ఓ.ఆనంద్, అడ్మినిస్ట్రేటర్, పోలవరం.

2022లోగా పోలవరం పూర్తి
వరదల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్నాం. రికార్డు సమయంలో స్పిల్‌ వేను పూర్తి చేశాం. ఇప్పటికే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేశాం. వరద తగ్గాక దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి.. ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి 2022లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆయకట్టుకు నీళ్లందించే పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. డిస్ట్రిబ్యూటరీలకు టెండర్లు పిలిచి.. ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తాం.
– సుధాకర్‌ బాబు, చీఫ్‌ ఇంజనీర్, పోలవరం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement