Andhra Pradesh: పంట నష్టం.. వెంటనే పరిహారం | CM YS Jagan Comments At Crop damage compensation program | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పంట నష్టం.. వెంటనే పరిహారం

Published Wed, Nov 17 2021 2:33 AM | Last Updated on Wed, Nov 17 2021 1:38 PM

CM YS Jagan Comments At Crop damage compensation program - Sakshi

గులాబ్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు సంబంధించిన పరిహారం చెక్కుతో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు, రైతులు

ఇటీవల రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు బాగా పడ్డాయి. రైతన్నలందరికీ మరోసారి భరోసా ఇస్తున్నా. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. నష్టపో యిన ప్రతి ఎకరాకూ, ప్రతి రైతుకూ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఎన్యుమ రేషన్‌ చేసి రబీ సీజన్‌ ముగియక ముందే వారికి పంట నష్ట పరిహారాన్ని చెల్లిస్తాం. 

ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారాన్ని చెల్లించే ఒక కొత్త సంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చాం. ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తున్నాం. సోషల్‌ ఆడిట్‌ కోసం పారదర్శకంగా గ్రామంలోనే జాబితా ప్రదర్శిస్తున్నాం. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారాన్ని అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రభుత్వం.   – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: రెండున్నరేళ్లుగా రైతన్నలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ వారి మేలు కోసం పలు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆర్బీకేల ద్వారా ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలుస్తున్నామని, వారిని చేయిపట్టి నడిపించే విధంగా గతంలో ఎవరూ చేయలేదని చెప్పారు. రైతులకు అన్ని విధాలుగా తోడుగా ఉండాలని భావించి మనసా వాచా కర్మణా ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నామన్నారు. పంట నష్ట పరిహారానికి సంబంధించి అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తూ రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో గులాబ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతుల ఖాతాల్లో రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని (ఇన్‌పుట్‌ సబ్సిడీ) మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. అనంతరం జిల్లాల్లోని రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తోందని, ఈ పరిస్థితిలో రైతన్నలు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రోడ్డుపైకి వస్తుందని తెలిసినా గతంలో ఎవరూ వారిని చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతున్నాయి? పరిష్కారం ఏమిటి? అనే అంశాలపై గత ప్రభుత్వాలు దృష్టి సారించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
రైతులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఇది కొత్త సంప్రదాయం
► తుపానులు, వరదలు, కరువులు... ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తితే అదే సీజన్‌ ముగిసేలోగా అంటే ఖరీఫ్‌లో నష్టం వస్తే ఖరీఫ్‌ ముగిసేలోగా, రబీలో రైతుకు మళ్లీ పెట్టుబడి అందేలా అడుగులు వేస్తూ, ఆలోచన చేసిన ప్రభుత్వం ఇది.  
► ఇవాళ జమ చేసిన పరిహారం రూ.22 కోట్లే కదా.. అని కొందరు గిట్టని వాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ రైతు అయినా నష్టపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న భరోసా కల్పిస్తున్నాం. 
► మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో పంట నష్టపరిహారం కింద దాదాపు రూ.1,071 కోట్లు రైతన్నలకు అందజేశాం. 2020 నవంబర్‌లో నివర్‌ తుపాను వస్తే డిసెంబర్‌ చివరి నాటికి 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్లు నష్ట పరిహారం కింద ఇచ్చాం. ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల ఎకరాలకు సంబంధించి 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,071 కోట్లు ఇచ్చాం.

రైతు సంక్షేమమే ధ్యేయం 
► రెండున్నరేళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారానే రూ.18,777 కోట్లు నేరుగా అన్నదాతల చేతిలో పెట్టాం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాగా అందించిన సొమ్ము రూ.3,788 కోట్లు ఉంటుంది.
► వ్యవసాయానికి పగటి పూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆక్వా రైతులకు రూ.1,520 కోట్ల మేర కరెంట్‌ సబ్సిడీ ఇచ్చాం. నాణ్యమైన ఫీడర్లు ఉంటేనే వ్యవసాయానికి 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంట్‌ ఇవ్వగలుగుతామని, అందుకోసం రూ.1,700 కోట్లకు పైగా ఖర్చు చేశాం.
► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వి.యస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (అగ్రికల్చర్‌) అంబటి కృష్ణారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఆర్బీకేల ద్వారా అన్ని విధాలా తోడుగా ఉన్నాం
► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. వీటి ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకూ తోడుగా ఉంటున్నాం. ఇ– క్రాప్‌ డేటా ఆధారంగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ, ఇన్సూరెన్స్‌తో పాటు చివరకు పంట కొనుగోలులోనూ ఆర్బీకే కేంద్ర బిందువుగా పని చేస్తోంది.
► గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం సేకరణ కోసమే రెండున్నరేళ్లలో రూ.35 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. పత్తి కొనుగోలు కోసం రూ.1,800 కోట్లు వెచ్చించాం. ఇతర పంటల కొనుగోలు కోసం రూ.6,430 కోట్లు వ్యయం చేశాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తెచ్చాం. 
► గత ప్రభుత్వం ధాన్యం సేకరణకు సంబంధించి బకాయి పెట్టిన రూ.960 కోట్లను కూడా చెల్లించాం. ఉచిత విద్యుత్‌ కింద రైతుల కరెంటు బిల్లులు రూ.9 వేల కోట్ల మేర గత సర్కారు బకాయిలు పెడితే వాటిని కూడా కట్టాం. రూ.384 కోట్ల విత్తన బకాయిలు సైతం చెల్లించాం.
► ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ప్రతి నెలా సవ్యంగా జరగాలి. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలి.

ఇంత త్వరగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
ఏదైనా ఒక మాట ఇస్తే ఎలాగైనా నిలబెట్టుకోవాలని తపించే ఏకైక నేత సీఎం జగన్‌. సెప్టెంబర్‌లో గులాబ్‌ తుపాన్‌తో పంట నష్టం జరిగితే 50 రోజుల్లోనే పరిహారం చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. దేశంలో మరెక్కడా ఇలా జరగలేదు. ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వారు కూడా ఊహించి ఉండరు. దాదాపు 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ అందుతోంది. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఇది ఆసరాగా ఉంటుంది. మీరు (సీఎం జగన్‌) అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 13.96 లక్షల మంది రైతు కుటుంబాలకు నేరుగా రూ.1,071 కోట్ల పంట నష్ట పరిహారం అందించారు. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేసి ఏ కష్టం వచ్చినా తక్షణమే రైతాంగాన్ని ఆదుకుంటామనే భరోసానిచ్చారు. వ్యవస్థల్లో సంస్కరణలు, తక్షణమే ఆదుకోవడం లాంటి చర్యలతో మీ నాయకత్వంలో వ్యవసాయ రంగం పురోగతి సాధిస్తోంది.   
 – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

30 ఏళ్లలో ఎప్పుడూ లేదు..
ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద మా కుటుంబానికి మొత్తం రూ.90 వేలు అందాయి. నాకు, చెల్లికి, అమ్మకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ప్రయోజనం చేకూరింది. 45 రోజుల్లోనే పరిహారం అందింది. 30 ఏళ్లలో ఇంత త్వరగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాన్ని చూడలేదు. 108 అంటే వైఎస్సార్‌ ఎలా గుర్తుకొస్తారో ఆర్బీకేలకు వెళితే మీరు గుర్తుకొస్తారు. ఆర్బీకే వద్దకు వెళ్తే గుడికి వెళ్లినట్లుగా ఉంటుంది. మీ దూరదృష్టి రైతాంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ – క్రాప్‌ ద్వారా దళారీల వ్యవస్ధ లేకుండా నేరుగా విక్రయిస్తున్నాం. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఇది. 
    – వీర్రాజు చౌదరి, రైతు, పెదపూడి, అనపర్తి నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లా

దేవాలయాల్లా ఆర్బీకేలు
గులాబ్‌ తుపాన్‌తో ఎకరం భూమిలో పంట నష్టపోయా. ఇంత త్వరగా పరిహారం అందుతుందని అనుకోలేదు. ప్రతి శుక్రవారం సమావేశాలు నిర్వహించి రైతులకు సంబంధించి అన్నీ చర్చించుకుంటున్నాం. మాకు మీరు దేవుడిలాంటివారు. ఆర్బీకేలు దేవాలయాలైతే మేం భక్తులం. నాడు– నేడు ద్వారా మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. పింఛన్‌ కూడా ఠంచన్‌గా ఒకటో తారీఖునే ఇంటికే వస్తోంది. సున్నావడ్డీ అందింది. అందరూ మా పెద్ద కొడుకు ఇస్తున్నారని సంతోషంగా ఉన్నారు.  
    – లక్ష్మి, మహిళా రైతు, నిమ్మలవలస, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement