Crop damage compensation
-
అంచనాల్లో కోత అన్నదాతకు వాత
దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా కుదింపుప్రాథమిక అంచనాల ప్రకారం 5.42 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం నష్టపోయిన రైతులకు ఉదారంగా సాయం అందించాల్సిన ప్రభుత్వం.. నిబంధనల సాకుతో సాయంలో భారీగా కోత విధిస్తోంది. నష్టాన్ని తక్కువగా చూపి చేతులు దులుపుకునేందుకే మొగ్గు చూపుతోంది. కళ్లెదుట కనిపిస్తున్న నష్టానికి, ఆచరణలో ప్రభుత్వ లెక్కలకు పొంతనే కుదరడం లేదు. కనుచూపు మేరలో దిగుబడి వచ్చే అవకాశమే లేదని తెలుస్తున్నా, తప్పుడు అంచనాలతో రైతులను బురిడీ కొట్టించడానికే మొగ్గు చూపుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. పరిహారం పేరుతో ప్రభుత్వం తమను గుండెకోతకు గురి చేస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు తోడు కృష్ణ, గోదావరి, నాగవళి, వంశధార నదులకు పోటెత్తిన వరద అన్నదాతల ఆశలను చిదిమేసింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బుడమేరు, ఏలేరు వాగుల ఉధృతి ఇటు ప్రజలను, అటు కొల్లేరు రైతులను నట్టేట ముంచింది. ఇటువంటి కష్ట కాలంలో ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. నిబంధనల సాకుతో అడ్డగోలుగా సాయంలో కోతలు విధించడంతో రైతులకు కడుపు కోత మిగులుతోంది. ప్రాథమికంగా 5.42 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 51 లక్షల ఎకరాల్లో ఉద్యాన, పట్టు పంటలు ముంపునకు గురవ్వగా, 3.08 లక్షల మంది రైతులకు రూ.403.93 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌సబ్సిడీ) చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. అత్యధికంగా 4.29 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురికాగా, 2.16 లక్షల మంది రైతులకు రూ.291.74 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా. వాస్తవానికి కనీవినీ ఎరుగని రీతిలో ఇంత కంటే ఎక్కువే పంట నష్టం జరిగిందన్నది సుస్పష్టం. ముంపు నీరు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రంగంలోకి దిగిన పంట నష్టం అంచనా బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు తుది అంచనాలు రూపొందించాయి. చివరకు 2.88 లక్షల ఎకరాల్లో మాత్రమే వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నాయని, ఆ మేరకు 1.86 లక్షల మంది రైతులకు రూ.278.49 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని లెక్కతేల్చాయి. వరి రైతుకు గుండె కోత రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా 10–15 రోజుల పాటు వరి పంట ముంపు నీటిలో నాని ఎందుకూ పనికి రాకుండా పోయింది. అలాంటిది తుది అంచనాలకొచ్చేసరికి 2.22 లక్షల ఎకరాల్లోనే వరి పంటకు నష్టం వాటిల్లిందని లెక్క తేల్చడం విస్మయానికి గురిచేస్తోంది. 1.43 లక్షల మంది రైతులకు రూ.222.26 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా చెల్లించాలని లెక్క తేల్చారు. వరి రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడులు కోల్పోయారు. కొంత మేర ముంపు నీరు దిగినప్పటికీ ఎకరాకు ఆరేడు బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా సరే తుది అంచనాల్లో దెబ్బ తిన్న వరి పంట విస్తీర్ణాన్ని కుదించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత 58 వేల ఎకరాల్లో దెబ్బ తిన్న పత్తి పంట తుది అంచనాలకు వచ్చేసరికి 26 వేల ఎకరాలకు కోత పడింది. తొలుత 25 వేల ఎకరాల్లో మొక్క జొన్న దెబ్బ తిన్నట్టుగా గుర్తించగా, చివరికి జరిగిన నష్టం 17 వేల ఎకరాలకు పరిమితమైంది. అపరాలతో సహా ఇతర పంటలు తొలుత 30 వేల ఎకరాలు ముంపునకు గురికాగా, తుది అంచనాలకు వచ్చే సరికి 23 వేల ఎకరాలకు పరిమితమైంది. ఆ 8 జిల్లాల్లోనూ భారీగా కోత వరదలు, వర్షాల వల్ల ప్రాథమికంగా 19 జిల్లాల్లో 18 రకాల వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నట్టుగా అంచనా వేశారు. అత్యధికంగా కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, కాకినాడ, నంద్యాల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4.97 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఈ జిల్లాల్లో ఇంతకంటే ఎక్కువగానే నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. కానీ తుది అంచనాల కొచ్చేసరికి పంటల సంఖ్య 23కు పెరిగింది. కానీ దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 2.64 లక్షల ఎకరాలకు పరిమితమవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణ, బుడమేరు వరదల ప్రభావంతో కృష్ణ, ఎనీ్టఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. అలాంటిది ఆయా జిల్లాల్లో కూడా తుది అంచనాల్లో భారీగా కోత పెట్టడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10వేలు ఇస్తామని.. వరి, పత్తి, వేరుశనగ, చెరకు (మొదటి పంట) పంటలకు ఎకరాకు రూ.10 వేలు, మొక్కజొన్న, సజ్జలు, మినుములు, పెసలు, కందులు, రాగులు, కొర్రలు, సామలు, రాగులు, నువ్వులు, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆముదం, జూట్ పంటలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి అడ్డగోలుగా కోత పెడుతూ అరకొర సాయం ఇస్తామనడం మోసం చేయడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పంట నష్ట పరిహారం ఎప్పుడిస్తరో?
సాక్షి, సిద్దిపేట : అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే కొందరికి ఈ సాయం అందగా, మరికొందరు వాటి కోసం నిరీక్షిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 52,407 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు 1,146.11 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వారికి గత పదిరోజుల కిందట చెల్లించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం చెల్లించలేదు. ● మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 51,261.08 ఎకరాల్లో 55వేల మంది రైతులు నష్టపోయారు. అందులో వరి 44,601.12 ఎకరాలు, మొక్కజొన్న 475.04, ఉద్యానవన పంటలు 6,158, సన్ ఫ్లవర్ 25.27, నువ్వులు 1.05 ఎకరాలు ఉన్నాయి. ● అత్యధికంగా మద్దూరులో 8,993, చేర్యాలలో 7,630 ఎకరాలు, సిద్దిపేట అర్బన్ 5,674, రూరల్‌లో 5,681, దుబ్బాకలో 4,968 ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. అత్యల్పంగా దౌల్తాబాద్‌లో 50.28 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. ● జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యవసాయ, ఉద్యాన వన, రెవెన్యూ శాఖలు మండల, జిల్లా స్థాయి సర్వే బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ● ప్రభుత్వానికి మే రెండో వారంలో కలెక్టర్ ఆమోదంతో వ్యవసాయ శాఖ నుంచి నివేదికను పంపించారు. ఇప్పటి వరకు మొదటి విడత పంపించిన పంట నష్టపరిహారం మాత్రమే రైతులకు అందింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ● యాసంగిలో అకాల వర్షాలకు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికై న అధికారులు స్పందించి నష్టపరిహారం త్వరగా అందించాలని కోరుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అన్నోజు కనకాచారి, మద్దూరు మండలం లద్నూరు గ్రామం. ఇతనికున్న 8 ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాడు. మార్చి ఏప్రిల్ నెలలో కురిసిన వడగళ్ల వర్షానికి పంట పూర్తిగా నేలపాలైంది. దీంతో రైతుకు కనీసం పెట్టుబడి కూడా రాలేదు. వ్యవసాయ అధికారులు పంట నష్ట వివరాలను సేకరించారు. కానీ ఇంతవరకు పరిహారం అందలేదు. వానాకాలం పెట్టుబడికైనా అందుతుందని ఆశగా రైతు ఎదురు చూస్తున్నాడు. ఇది ఒక్క కనకాచారి ఎదుర్కొంటున్న సమస్య కాదు, జిల్లాలోని అనేక మంది రైతులది ఇదే పరిస్థితి. 12 ఎకరాల్లో నష్టం యాసంగిలో 12 ఎకరాల్లో వరి సాగు చేశాను. పంట చేతికి వచ్చిన సమయంలో వడగళ్ల వాన పడి వడ్లు మొత్తం రాలిపోయాయి. ప్రభుత్వం చేస్తామన్న సాయం ఇప్పటివరకు అందలేదు. త్వరగా అందిస్తే వానాకాలం పెట్టుబడికి అయినా ఉపయోగపడుతుంది. –ఉల్లంపల్లి సాయిలు, అయినాపూర్ నష్టపరిహారం వెంటనే అందించాలి నాకున్న పొలంతో సహా 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేశాను. కోతకొచ్చే సమయంలో వడగళ్ల వాన పడి పంట పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం త్వరగా అందించి ఆదుకోవాలి. –గిరక శ్రీనివాస్, తాడూరు -
చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ ఎగ్గొట్టింది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గతంలో రుణాల్ని మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారన్నారు. కానీ రైతు భరోసా కిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.25,971 కోట్లు ఇచ్చిందన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రైతులకు సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ‘‘వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైన బాగుంటుందన్నారు. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. జులై-అక్టోబర్ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ‘‘మన ప్రభుత్వం వచ్చాకే రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి.. గతంలో రైతు భరోసా పథకం లేదు. ఒకేసారి రైతులకు రెండు రకాల సాయం అందించాం. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీని ఎగ్గొట్టింది’’ అని సీఎం అన్నారు. ‘‘పంటల బీమాను ఉచితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పంట అంచనాలు అశాస్త్రీయంగా ఉండేవి. మా ప్రభుత్వంలో ఈ-క్రాప్ విధానంలో రైతులకు సాయం అందిస్తున్నాం. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయి’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? -
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్–2022 సీజన్లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. రబీ 2020–21 సీజన్లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్–2021 సీజన్లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్–2022 సీజన్లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్ ముగియక ముందే జమ చేశారు. ఇప్పటివరకు రూ.1,795కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ.. ఇక గడిచిన మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమచేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 21.31 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.79 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేసినట్లవుతుంది. అలాగే, గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ములు చేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు అవుతుంది. గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందించారు. గతంలో అంతా గందరగోళమే.. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతన్నలు మధ్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించేవారు. కానీ, ప్రస్తుతం ఈ–క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నారు. అంతేకాక.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సోషల్ ఆడిట్ కింద రైతుభరోసా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించడమే కాదు.. అర్హత ఉండి జాబితాల్లో తమ పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. చదవండి: ఏది నిజం?: 3 అబద్ధాలు 6 అభాండాలు.. ‘ఈనాడు’ మరో విష కథనం -
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ
సాక్షి, అమరావతి: 2022 ఖరీఫ్ సీజన్లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన ఆకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్టుగా గుర్తించింది. ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతుల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. వ్యవసాయ పంటల్లో 11,742 ఎకరాల్లో వరి, 5,205 ఎకరాల్లో పత్తి, 4,887 ఎకరాల్లో వేరుశనగ, 3,915 ఎకరాల్లో పెసర.. ఉద్యాన పంటల్లో 7 వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు 18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44 కోట్లు చొప్పున మొత్తంగా రూ.39.39 కోట్లు పంట నష్ట పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు రైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. గత మూడేళ్లలో రూ.1,795.4 కోట్లు వరదలు, ఆకాల వర్షాలు వంటి వివిధ వైపరీత్యాల వల్ల 2019–20 సీజన్లో 1.47 లక్షల మందికి రూ.116.63 కోట్లు, 2020–21 సీజన్లో 12.15 లక్షల మందికి రూ.932.07కోట్లు, 2021–22 సీజన్లో 6.32 లక్షల మందికి రూ.564 కోట్లు చొప్పున గత మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.4 కోట్ల పంట నష్టపరిహారం అందించారు. ప్రస్తుతం 2022–23లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 45,998 మంది రైతులకు ఈ నెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు చొప్పున మొత్తంగా 8.22 లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ కలిసి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. -
Andhra Pradesh: పంట నష్టం.. వెంటనే పరిహారం
ఇటీవల రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు బాగా పడ్డాయి. రైతన్నలందరికీ మరోసారి భరోసా ఇస్తున్నా. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. నష్టపో యిన ప్రతి ఎకరాకూ, ప్రతి రైతుకూ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఎన్యుమ రేషన్ చేసి రబీ సీజన్ ముగియక ముందే వారికి పంట నష్ట పరిహారాన్ని చెల్లిస్తాం. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారాన్ని చెల్లించే ఒక కొత్త సంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చాం. ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తున్నాం. సోషల్ ఆడిట్ కోసం పారదర్శకంగా గ్రామంలోనే జాబితా ప్రదర్శిస్తున్నాం. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారాన్ని అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రభుత్వం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రెండున్నరేళ్లుగా రైతన్నలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ వారి మేలు కోసం పలు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆర్బీకేల ద్వారా ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలుస్తున్నామని, వారిని చేయిపట్టి నడిపించే విధంగా గతంలో ఎవరూ చేయలేదని చెప్పారు. రైతులకు అన్ని విధాలుగా తోడుగా ఉండాలని భావించి మనసా వాచా కర్మణా ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నామన్నారు. పంట నష్ట పరిహారానికి సంబంధించి అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తూ రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతుల ఖాతాల్లో రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. అనంతరం జిల్లాల్లోని రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తోందని, ఈ పరిస్థితిలో రైతన్నలు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం రోడ్డుపైకి వస్తుందని తెలిసినా గతంలో ఎవరూ వారిని చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతున్నాయి? పరిష్కారం ఏమిటి? అనే అంశాలపై గత ప్రభుత్వాలు దృష్టి సారించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. రైతులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇది కొత్త సంప్రదాయం ► తుపానులు, వరదలు, కరువులు... ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తితే అదే సీజన్ ముగిసేలోగా అంటే ఖరీఫ్‌లో నష్టం వస్తే ఖరీఫ్ ముగిసేలోగా, రబీలో రైతుకు మళ్లీ పెట్టుబడి అందేలా అడుగులు వేస్తూ, ఆలోచన చేసిన ప్రభుత్వం ఇది. ► ఇవాళ జమ చేసిన పరిహారం రూ.22 కోట్లే కదా.. అని కొందరు గిట్టని వాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ రైతు అయినా నష్టపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న భరోసా కల్పిస్తున్నాం. ► మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో పంట నష్టపరిహారం కింద దాదాపు రూ.1,071 కోట్లు రైతన్నలకు అందజేశాం. 2020 నవంబర్‌లో నివర్ తుపాను వస్తే డిసెంబర్ చివరి నాటికి 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్లు నష్ట పరిహారం కింద ఇచ్చాం. ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల ఎకరాలకు సంబంధించి 13.96 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,071 కోట్లు ఇచ్చాం. రైతు సంక్షేమమే ధ్యేయం ► రెండున్నరేళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఒక్క వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారానే రూ.18,777 కోట్లు నేరుగా అన్నదాతల చేతిలో పెట్టాం. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఉచిత పంటల బీమాగా అందించిన సొమ్ము రూ.3,788 కోట్లు ఉంటుంది. ► వ్యవసాయానికి పగటి పూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆక్వా రైతులకు రూ.1,520 కోట్ల మేర కరెంట్ సబ్సిడీ ఇచ్చాం. నాణ్యమైన ఫీడర్లు ఉంటేనే వ్యవసాయానికి 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతామని, అందుకోసం రూ.1,700 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వి.యస్ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (అగ్రికల్చర్) అంబటి కృష్ణారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్బీకేల ద్వారా అన్ని విధాలా తోడుగా ఉన్నాం ► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. వీటి ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకూ తోడుగా ఉంటున్నాం. ఇ– క్రాప్ డేటా ఆధారంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, ఇన్సూరెన్స్‌తో పాటు చివరకు పంట కొనుగోలులోనూ ఆర్బీకే కేంద్ర బిందువుగా పని చేస్తోంది. ► గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం సేకరణ కోసమే రెండున్నరేళ్లలో రూ.35 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం. పత్తి కొనుగోలు కోసం రూ.1,800 కోట్లు వెచ్చించాం. ఇతర పంటల కొనుగోలు కోసం రూ.6,430 కోట్లు వ్యయం చేశాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తెచ్చాం. ► గత ప్రభుత్వం ధాన్యం సేకరణకు సంబంధించి బకాయి పెట్టిన రూ.960 కోట్లను కూడా చెల్లించాం. ఉచిత విద్యుత్ కింద రైతుల కరెంటు బిల్లులు రూ.9 వేల కోట్ల మేర గత సర్కారు బకాయిలు పెడితే వాటిని కూడా కట్టాం. రూ.384 కోట్ల విత్తన బకాయిలు సైతం చెల్లించాం. ► ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ప్రతి నెలా సవ్యంగా జరగాలి. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలి. ఇంత త్వరగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఏదైనా ఒక మాట ఇస్తే ఎలాగైనా నిలబెట్టుకోవాలని తపించే ఏకైక నేత సీఎం జగన్. సెప్టెంబర్‌లో గులాబ్ తుపాన్‌తో పంట నష్టం జరిగితే 50 రోజుల్లోనే పరిహారం చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలో మరెక్కడా ఇలా జరగలేదు. ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వారు కూడా ఊహించి ఉండరు. దాదాపు 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ అందుతోంది. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఇది ఆసరాగా ఉంటుంది. మీరు (సీఎం జగన్) అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 13.96 లక్షల మంది రైతు కుటుంబాలకు నేరుగా రూ.1,071 కోట్ల పంట నష్ట పరిహారం అందించారు. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేసి ఏ కష్టం వచ్చినా తక్షణమే రైతాంగాన్ని ఆదుకుంటామనే భరోసానిచ్చారు. వ్యవస్థల్లో సంస్కరణలు, తక్షణమే ఆదుకోవడం లాంటి చర్యలతో మీ నాయకత్వంలో వ్యవసాయ రంగం పురోగతి సాధిస్తోంది. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 30 ఏళ్లలో ఎప్పుడూ లేదు.. ఇన్పుట్ సబ్సిడీ కింద మా కుటుంబానికి మొత్తం రూ.90 వేలు అందాయి. నాకు, చెల్లికి, అమ్మకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ప్రయోజనం చేకూరింది. 45 రోజుల్లోనే పరిహారం అందింది. 30 ఏళ్లలో ఇంత త్వరగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాన్ని చూడలేదు. 108 అంటే వైఎస్సార్ ఎలా గుర్తుకొస్తారో ఆర్బీకేలకు వెళితే మీరు గుర్తుకొస్తారు. ఆర్బీకే వద్దకు వెళ్తే గుడికి వెళ్లినట్లుగా ఉంటుంది. మీ దూరదృష్టి రైతాంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ – క్రాప్ ద్వారా దళారీల వ్యవస్ధ లేకుండా నేరుగా విక్రయిస్తున్నాం. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఇది. – వీర్రాజు చౌదరి, రైతు, పెదపూడి, అనపర్తి నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లా దేవాలయాల్లా ఆర్బీకేలు గులాబ్ తుపాన్‌తో ఎకరం భూమిలో పంట నష్టపోయా. ఇంత త్వరగా పరిహారం అందుతుందని అనుకోలేదు. ప్రతి శుక్రవారం సమావేశాలు నిర్వహించి రైతులకు సంబంధించి అన్నీ చర్చించుకుంటున్నాం. మాకు మీరు దేవుడిలాంటివారు. ఆర్బీకేలు దేవాలయాలైతే మేం భక్తులం. నాడు– నేడు ద్వారా మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. పింఛన్ కూడా ఠంచన్‌గా ఒకటో తారీఖునే ఇంటికే వస్తోంది. సున్నావడ్డీ అందింది. అందరూ మా పెద్ద కొడుకు ఇస్తున్నారని సంతోషంగా ఉన్నారు. – లక్ష్మి, మహిళా రైతు, నిమ్మలవలస, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా -
లోకేష్ కుప్పంలో స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టారు కదా.. మరి దొంగ ఓట్లు ఎలా?
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గులాబ్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. 'గులాబ్ తుఫాను బాధిత రైతులకు పరిహారం ఇచ్చాం. నివర్ తుపాను బాధితులకు కూడా అప్పుడే పరిహారం ఇచ్చేశాం. చంద్రబాబు హయాంలో రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ జగన్ రైతుల పక్షాన నిలబడతారు. అందుకే ఎప్పటికప్పుడు పరిహారాన్ని అందిస్తున్నారు. వారం పదిరోజులుగా జరుగుతున్న నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నాం. సీఎం జగన్ రైతు పక్షపాతి చంద్రబాబు హయాంలో తన పదవీకాలం పూర్తయ్యేనాటికి కూడా ఇవ్వలేదు. సకాలంలో చంద్రబాబు ఏనాడూ ఇవ్వలేదు. రైతు పక్షపాతి జగన్ ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు ఇచ్చారు. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. త్రిముఖ వ్యూహంతో మేము పనిచేస్తున్నాం. సోము వీర్రాజు ఏవేవో మాట్లాడుతున్నారు. ఇస్తామన్నదానికంటే ముందుగానే మేము రైతులకు పరిహారం ఇస్తున్నాం. కేంద్రం న్యాయం చేస్తున్నట్టు, రాష్ట్రం చేయనట్లు చెప్తే జనం నమ్మరు. కేంద్రం రైతుల పక్షాన ఉంటే ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?. చదవండి: (రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్) మరి దొంగ ఓట్లు ఎలా వేయగలరు? కుప్పం ప్రజల్లో మార్పు వచ్చింది. టీడీపీ వారు వైఎస్సార్సీపీ దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఓటరు ఐడీ లేకుండా ఓటరు పోలింగ్ బూతులోకి ఎలా వెళ్లగలరు?. చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. లోకేష్ రెండు రోజులు పర్యటించి స్ట్రాంగ్ ఏజెంట్లను పెట్టుకున్నారు కదా?. మరి ఎలా దొంగ ఓట్లు వేయగలరు?. మూడు రాజధానుల విషయమై కోర్టులకు వెళ్లి ఆపాలని చూస్తున్నారు. మూడు రాజధానులు చేయటం మీ తరం కాదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని మీరు ఎందుకు కట్టలేకపోయారు?. చంద్రబాబు అమరావతి రైతులను మోసం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. మా నిర్ణయాలను ప్రజలు అంగీకరిస్తున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే మిగతా ప్రాంతాల ప్రజలు సరైన బుద్ది చెప్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అక్కర్లేదనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. కర్నూలే రాజధాని అన్న నాయకులు ఇప్పుడు ఏమయ్యారు?' అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. -
ఆ జీవో మీదే బాబూ
సాక్షి, అమరావతి: పంట నష్ట పరిహారంపై తమ హయాంలో జారీ చేసిన జీవోనే తప్పుబడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలకు దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ జీవోను ఎవరు, ఎప్పుడు జారీ చేశారనే విషయాన్ని పట్టించుకోకుండా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తుపానులు, వరదల సమయంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8న ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటివరకు 50 శాతం మేర పంట నష్టం వాటిల్లితేనే పరిహారం చెల్లించాలనే నిబంధన ఉండగా దీన్ని సవరించి కనీసం 33 శాతానికి మించి నష్టపోయిన రైతులకు కూడా పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా 2015 డిసెంబర్ 4న గత సర్కారు జీవో 15 జారీ చేసింది. అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతోంది. నాలుగేళ్లలో కొన్నదాని కంటే ఏడాదిలో కొన్నదే ఎక్కువ.. 2019–20లో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలను కొనుగోలు చేశామంటూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని లోకేశ్ ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో 1,37,683 మంది రైతుల నుంచి 2,52,360 టన్నుల పంటలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.1,331 కోట్లు మాత్రమే. టీడీపీ హయాంలో నాలుగేళ్ల వ్యవధిలో కొనుగోలు చేసిన దానికంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 3,02,808 మంది రైతుల నుంచి 8,84,882 టన్నుల పంటను కొనుగోలు చేయడం గమనార్హం. వీటి విలువ రూ.3,461 కోట్లు ఉంది. ఈ గణాంకాలే వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. పక్షం రోజుల్లో పరిహారం.. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేపట్టింది. మూడో వంతు, అంతకు మించి నష్టం జరిగిన రైతుల జాబితాలను రూపొందించి పారదర్శకంగా రైతు భరోసా కేంద్రాల్లో పొందుపరుస్తోంది. అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్లకు అప్పగించింది. తుది జాబితా తయారైన పక్షం రోజుల్లోనే పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. -
పంటనష్టం పరిహారం అందించాలి
పాపన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలు, మంజీర వరదలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ బిజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుభాష్‌చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం పాపన్నపేట తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు బీజేపీ నాయకులు మండల కార్యాలయం ఎదుట అరగంటపాటు బైఠాయించారు. ఈసందర్భంగా సుభాష్‌చంద్రాగౌడ్ మాట్లాడుతూ రైతులు ఓ వైపు నకిలీ విత్తనాలతో నష్టపోతుంటే, మరోవైపు ప్రకృతి సహకరించక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల మెదక్ జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల పంట నష్టపోయినప్పటికీ ఇప్పటి వరకు వారికి పరిహారం అందలేదన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ సకాలంలో కాకపోవడంతో బ్యాంకు వడ్డీల భారం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల సుధాకర్, మండల నాయకులు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని ప్రజలెలా నమ్ముతారు?
పంట నష్ట పరిహారంపై నిలదీసిన బీజేపీ సాక్షి, హైదరాబాద్: పంట నష్టం కింద కేంద్ర ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన రూ.791 కోట్లను రైతులకు చెల్లించని టీఆర్ఎస్ సర్కారును తాజా పరిహారం విషయంలో ప్రజలెలా నమ్ముతారని బీజేపీ ప్రశ్నించింది. గతేడాది పరిహారాన్నే చెల్లించ కపోగా.. తాజా పంట నష్టానికి సాయమందించాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రులు నివేదిక ఇవ్వడమేమిటని నిలదీసింది. మంగళవారం పార్టీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎస్.కుమార్, ప్రకాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పంట బీమాకు సంబంధించి కేంద్రం పరిహారాన్ని విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని.. దీని వల్ల రైతులకు జరిగిన నష్టానికి సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిలో ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇటీవలి వర్షాలు, వరదల వల్ల 19,500 ఇళ్లకు నష్టం జరిగిందని, బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ ఒత్తిళ్లకు తలొగ్గారు: జిల్లాల పేర్ల మార్పు విషయంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ రాసిన లేఖకు కేసీఆర్ తలొగ్గడం తెలంగాణ ప్రజలకే అవమానకరమని బీజేపీ నాయకులు ఎన్.రామచంద్రరావు, బద్దం బాల్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి విమర్శిం చారు. అనంతగిరి, మానుకోట పేర్లు మైనారిటీలకు వ్యతిరేకమా అని ప్రశ్నించారు. -
పంట పరిహారం 50% పెంపు
పరిహారానికి అర్హత ఇకపై 33% పంట నష్టమే రైతులకు తీపికబురు అందించిన ప్రధాని న్యూఢిల్లీ: ఆదుకుంటుందనుకున్న పంట అకాలవర్షాల వల్ల నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించారు. పంట నష్టం పరిహారం 50% పెంపు అందులో ఒకటైతే.. కనీసం 33% పంట నష్టం జరిగితే చాలు పరిహారానికి అర్హత లభిస్తుందనేది రెండో శుభవార్త. ఇంతకుముందు కనీసం 50% పంట నష్టం జరిగితేనే పరిహారానికి అర్హత లభించేది. దాన్ని 33 శాతానికి తగ్గించడం వల్ల ఎక్కువ మంది రైతులకు పరిహారం లభించనుంది. కేబినెట్ మంత్రులతో బుధవారం సమీక్షాసమావేశం అనంతరం మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రబీ సీజన్లో ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లోని రైతులు.. ముఖ్యంగా గోధుమ రైతులు అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ‘ప్రధానమంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం మోదీ ప్రసంగిస్తూ.. ‘పంట నష్టం పరిహారాన్ని 50% పెంచాలని నిర్ణయించాం. గతంలో రూ. 100 పరిహారం పొందే రైతు ఇకపై రూ. 150 పొందుతాడు. రూ. 1 లక్ష పొందే రైతు రూ. 1.5 లక్షలు పరిహారంగా అందుకుంటాడు. పరిహారం పెంపు, అర్హత నిబంధన తగ్గింపు వల్ల ఖజానాపై భారీగానే భారం పడుతుంది. అయినా ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడమే ముఖ్యమని మేం భావించాం’ అని వివరించారు. ప్రకృతి విపత్తులు రైతులను నాశనం చేస్తున్నాయని, గత సంవత్సరం అనావృష్టి కారణంగా, ఈ ఏడాది అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బీమా క్లెయిమ్‌లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేయాలని బీమా కంపెనీలను.. పంట నష్టపోయిన రైతుల రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని బ్యాంకులను ఈ సందర్భంగా మోదీ ఆదేశించారు. రుణాల రీస్ట్రక్చర్‌పై ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలిచ్చామని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీడియాకు తెలిపారు. అకాల వర్షాలతో దేశవ్యాప్తంగా 1.13 కోట్ల హెక్టార్లలో నష్టం జరిగిందని కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు. 16న చెరకు రైతుల సమస్యలపై సీఎంల భేటీ చెరకు రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 15న చెరకు రైతులు, 16న చెరకు ఉత్పిత్తి చేసే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. చెరకు ఉత్పత్తి రంగంపై నియంత్రణ కోల్పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోషించాల్సిన పాత్ర పెద్దగా ఏమీలేదని, అయినప్పటికీ చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.