వడగళ్ల వర్షానికి దెబ్బ తిన్న పైరు (ఫైల్)
సాక్షి, సిద్దిపేట : అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే కొందరికి ఈ సాయం అందగా, మరికొందరు వాటి కోసం నిరీక్షిస్తున్నారు.
● జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 52,407 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు 1,146.11 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, వారికి గత పదిరోజుల కిందట చెల్లించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం చెల్లించలేదు.
● మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 51,261.08 ఎకరాల్లో 55వేల మంది రైతులు నష్టపోయారు. అందులో వరి 44,601.12 ఎకరాలు, మొక్కజొన్న 475.04, ఉద్యానవన పంటలు 6,158, సన్ ఫ్లవర్ 25.27, నువ్వులు 1.05 ఎకరాలు ఉన్నాయి.
● అత్యధికంగా మద్దూరులో 8,993, చేర్యాలలో 7,630 ఎకరాలు, సిద్దిపేట అర్బన్ 5,674, రూరల్‌లో 5,681, దుబ్బాకలో 4,968 ఎకరాల్లో పంటలు పాడయ్యాయి. అత్యల్పంగా దౌల్తాబాద్‌లో 50.28 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి.
● జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యవసాయ, ఉద్యాన వన, రెవెన్యూ శాఖలు మండల, జిల్లా స్థాయి సర్వే బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు.
● ప్రభుత్వానికి మే రెండో వారంలో కలెక్టర్ ఆమోదంతో వ్యవసాయ శాఖ నుంచి నివేదికను పంపించారు. ఇప్పటి వరకు మొదటి విడత పంపించిన పంట నష్టపరిహారం మాత్రమే రైతులకు అందింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.
● యాసంగిలో అకాల వర్షాలకు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికై న అధికారులు స్పందించి నష్టపరిహారం త్వరగా అందించాలని కోరుతున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అన్నోజు కనకాచారి, మద్దూరు మండలం లద్నూరు గ్రామం. ఇతనికున్న 8 ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాడు. మార్చి ఏప్రిల్ నెలలో కురిసిన వడగళ్ల వర్షానికి పంట పూర్తిగా నేలపాలైంది. దీంతో రైతుకు కనీసం పెట్టుబడి కూడా రాలేదు. వ్యవసాయ అధికారులు పంట నష్ట వివరాలను సేకరించారు. కానీ ఇంతవరకు పరిహారం అందలేదు. వానాకాలం పెట్టుబడికైనా అందుతుందని ఆశగా రైతు ఎదురు చూస్తున్నాడు. ఇది ఒక్క కనకాచారి ఎదుర్కొంటున్న సమస్య కాదు, జిల్లాలోని అనేక మంది రైతులది ఇదే పరిస్థితి.
12 ఎకరాల్లో నష్టం
యాసంగిలో 12 ఎకరాల్లో వరి సాగు చేశాను. పంట చేతికి వచ్చిన సమయంలో వడగళ్ల వాన పడి వడ్లు మొత్తం రాలిపోయాయి. ప్రభుత్వం చేస్తామన్న సాయం ఇప్పటివరకు అందలేదు. త్వరగా అందిస్తే వానాకాలం పెట్టుబడికి అయినా ఉపయోగపడుతుంది.
–ఉల్లంపల్లి సాయిలు, అయినాపూర్
నష్టపరిహారం వెంటనే అందించాలి
నాకున్న పొలంతో సహా 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేశాను. కోతకొచ్చే సమయంలో వడగళ్ల వాన పడి పంట పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం త్వరగా అందించి ఆదుకోవాలి.
–గిరక శ్రీనివాస్, తాడూరు
Comments
Please login to add a commentAdd a comment