ప్రభుత్వాన్ని ప్రజలెలా నమ్ముతారు?
పంట నష్ట పరిహారంపై నిలదీసిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: పంట నష్టం కింద కేంద్ర ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన రూ.791 కోట్లను రైతులకు చెల్లించని టీఆర్‌ఎస్ సర్కారును తాజా పరిహారం విషయంలో ప్రజలెలా నమ్ముతారని బీజేపీ ప్రశ్నించింది. గతేడాది పరిహారాన్నే చెల్లించ కపోగా.. తాజా పంట నష్టానికి సాయమందించాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రులు నివేదిక ఇవ్వడమేమిటని నిలదీసింది. మంగళవారం పార్టీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎస్.కుమార్, ప్రకాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..
పంట బీమాకు సంబంధించి కేంద్రం పరిహారాన్ని విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని.. దీని వల్ల రైతులకు జరిగిన నష్టానికి సీఎం కేసీఆర్, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిలో ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇటీవలి వర్షాలు, వరదల వల్ల 19,500 ఇళ్లకు నష్టం జరిగిందని, బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మజ్లిస్ ఒత్తిళ్లకు తలొగ్గారు: జిల్లాల పేర్ల మార్పు విషయంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ రాసిన లేఖకు కేసీఆర్ తలొగ్గడం తెలంగాణ ప్రజలకే అవమానకరమని బీజేపీ నాయకులు ఎన్.రామచంద్రరావు, బద్దం బాల్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి విమర్శిం చారు. అనంతగిరి, మానుకోట పేర్లు మైనారిటీలకు వ్యతిరేకమా అని ప్రశ్నించారు.