ధర్నాచౌక్ తరలింపు సమంజసం కాదు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను మరో చోటికి తరలించడం ఎంత మాత్రం సమంజసం కాదని బీజేపీ స్పష్టం చేసింది. ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది. శనివారం పార్టీ నాయకులు వి.దినేశ్‌రెడ్డి (మాజీ డీజీపీ), పేరాల శేఖరరావు, బద్ధం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ప్రభుత్వం ధర్నాచౌక్‌ను లేకుండా చేసి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోవాలని హితవు పలికారు. ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టవచ్చని గతంలో కోర్టులు కూడా చెప్పాయని గుర్తుచేశారు.
ఉద్యమపార్టీగా ఉంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. ధర్నాచౌక్ వల్ల ఇప్పటి వరకు ఎవరికైనా ఇబ్బందులు కలిగిన సందర్భాలున్నాయా అని ప్రశ్నించారు. ధర్నాచౌక్ విషయంలో గతంలో తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదికను అందజేశామని దినేశ్‌రెడ్డి గుర్తుచేశారు.