‘ఆ మాట వింటేనే సర్కారు భయపడుతోంది’
హైదరాబాద్: నిరసన అనే పదం వింటేనే తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కోసం ఈ నెల 22వ తేదీన జంతర్ మంతర్ వద్ద తెలిపే నిరసనకు దేశ వ్యాప్త మద్దతు కూడగట్టాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో పాలన చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మఖ్దూమ్ భవన్‌లో శనివారం ధర్నా పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ‘ పౌరహక్కులు- నిర్భంధం’ అనే అంశంపై సెమినార్ జరిగింది. సమాజ హితవు కోరుకునే వారిలో మేధావులు ముందు ఉంటారని ఆయన అన్నారు. అలాంటివారిని గౌరవించు కోవడం బాధ్యతని, దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణలో పాలనా నడుస్తోందని తమ్మినేని విమర్శించారు.
చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పాలన సాగుతుందని విమర్శించారు. ధర్నా చౌక్ విషయంలో ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు. కేసీఆర్ సామ్రాజ్యవాద ఏజెంట్ మాదిరిగా పనిచేస్తున్నారని విరసం నాయకుడు వరవరరావు ఆరోపించారు. ప్రజల హక్కులు హరిస్తున్నారని, ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశారన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించిన క్యాంపు కార్యాలయం దగ్గరకు ప్రజలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చౌక్‌గా జంతర్ మంతర్ కొనసాగుతోంది కానీ, ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఫాసిస్టు పద్దతిలో సీఎం కేసీఆర్ రద్దు చేశారని దుయ్యబట్టారు.
ఎన్ని విధాలుగా నిరసన తెలిపినా ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేయటం వల్ల సమస్యలు సమసి పోతాయి అనుకోవడం సరికాదని,ధర్నా చౌక్‌గా ప్రగతిభవన్ ఎప్పుడో అయిపోయిందన్నారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిదీ అని, జాతీయ స్థాయిలో మద్దతు కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెలదామన్నారు. సెక్రెటరియేట్ తరలింపు రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే జరుగుతోందని, దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోదండదాం కోరారు. 22న ఢిల్లీలో జరిగే నిరసనకు అన్ని సంఘాల మద్దతు కూడగట్టి జాతీయ స్థాయిలో ధర్నా చౌక్ అవశ్యకతని చాటి చెబుతామన్నారు. ఈ సెమినార్‌లో పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి, కో-కన్వీనర్ విశ్వేశ్వరరావు, వరవరరావు, జేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష పార్టీల నేతలు, పౌరహక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.