ధర్నాచౌక్ వద్ద ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాల కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని బీజేపీ ఖండించింది.
సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ వద్ద ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాల కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని బీజేపీ ఖండించింది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మఫ్టీ పోలీసులు ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులపై డాడి చేయడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ఒత్తిళ్లతో ప్రజల మధ్య ప్రభుత్వం చిచ్చుపెట్టడం సిగ్గుచేటని విమర్శించింది.
ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ధర్నాచౌక్ ఎత్తివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలు, ప్రతిపక్షాలకు ఉంటుందని, దాన్ని హరించాలని చూడటం సరికాదన్నారు. లాఠీ చార్జ్ వల్ల గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించాలని సాంబమూర్తి డిమాండ్ చేశారు.