సాక్షి, అమరావతి: పంట నష్ట పరిహారంపై తమ హయాంలో జారీ చేసిన జీవోనే తప్పుబడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలకు దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ జీవోను ఎవరు, ఎప్పుడు జారీ చేశారనే విషయాన్ని పట్టించుకోకుండా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. తుపానులు, వరదల సమయంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8న ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటివరకు 50 శాతం మేర పంట నష్టం వాటిల్లితేనే పరిహారం చెల్లించాలనే నిబంధన ఉండగా దీన్ని సవరించి కనీసం 33 శాతానికి మించి నష్టపోయిన రైతులకు కూడా పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా 2015 డిసెంబర్ 4న గత సర్కారు జీవో 15 జారీ చేసింది. అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతోంది.
నాలుగేళ్లలో కొన్నదాని కంటే ఏడాదిలో కొన్నదే ఎక్కువ..
2019–20లో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలను కొనుగోలు చేశామంటూ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని లోకేశ్ ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో 1,37,683 మంది రైతుల నుంచి 2,52,360 టన్నుల పంటలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.1,331 కోట్లు మాత్రమే. టీడీపీ హయాంలో నాలుగేళ్ల వ్యవధిలో కొనుగోలు చేసిన దానికంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే 3,02,808 మంది రైతుల నుంచి 8,84,882 టన్నుల పంటను కొనుగోలు చేయడం గమనార్హం. వీటి విలువ రూ.3,461 కోట్లు ఉంది. ఈ గణాంకాలే వాస్తవాలను వెల్లడిస్తున్నాయి.
పక్షం రోజుల్లో పరిహారం..
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేపట్టింది. మూడో వంతు, అంతకు మించి నష్టం జరిగిన రైతుల జాబితాలను రూపొందించి పారదర్శకంగా రైతు భరోసా కేంద్రాల్లో పొందుపరుస్తోంది. అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్లకు అప్పగించింది. తుది జాబితా తయారైన పక్షం రోజుల్లోనే పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment