పంట పరిహారం 50% పెంపు
పరిహారానికి అర్హత ఇకపై 33% పంట నష్టమే
రైతులకు తీపికబురు అందించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆదుకుంటుందనుకున్న పంట అకాలవర్షాల వల్ల నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించారు. పంట నష్టం పరిహారం 50% పెంపు అందులో ఒకటైతే.. కనీసం 33% పంట నష్టం జరిగితే చాలు పరిహారానికి అర్హత లభిస్తుందనేది రెండో శుభవార్త. ఇంతకుముందు కనీసం 50% పంట నష్టం జరిగితేనే పరిహారానికి అర్హత లభించేది. దాన్ని 33 శాతానికి తగ్గించడం వల్ల ఎక్కువ మంది రైతులకు పరిహారం లభించనుంది. కేబినెట్ మంత్రులతో బుధవారం సమీక్షాసమావేశం అనంతరం మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రబీ సీజన్‌లో ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లోని రైతులు.. ముఖ్యంగా గోధుమ రైతులు అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయారు.
‘ప్రధానమంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం మోదీ ప్రసంగిస్తూ.. ‘పంట నష్టం పరిహారాన్ని 50% పెంచాలని నిర్ణయించాం. గతంలో రూ. 100 పరిహారం పొందే రైతు ఇకపై రూ. 150 పొందుతాడు. రూ. 1 లక్ష పొందే రైతు రూ. 1.5 లక్షలు పరిహారంగా అందుకుంటాడు. పరిహారం పెంపు, అర్హత నిబంధన తగ్గింపు వల్ల ఖజానాపై భారీగానే భారం పడుతుంది. అయినా ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవడమే ముఖ్యమని మేం భావించాం’ అని వివరించారు. ప్రకృతి విపత్తులు రైతులను నాశనం చేస్తున్నాయని, గత సంవత్సరం అనావృష్టి కారణంగా, ఈ ఏడాది అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బీమా క్లెయిమ్‌లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేయాలని బీమా కంపెనీలను.. పంట నష్టపోయిన రైతుల రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని బ్యాంకులను ఈ సందర్భంగా మోదీ ఆదేశించారు. రుణాల రీస్ట్రక్చర్‌పై ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలిచ్చామని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీడియాకు తెలిపారు. అకాల వర్షాలతో దేశవ్యాప్తంగా 1.13 కోట్ల హెక్టార్లలో నష్టం జరిగిందని కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు.
16న చెరకు రైతుల సమస్యలపై సీఎంల భేటీ
చెరకు రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 15న చెరకు రైతులు, 16న చెరకు ఉత్పిత్తి చేసే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. చెరకు ఉత్పత్తి రంగంపై నియంత్రణ కోల్పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోషించాల్సిన పాత్ర పెద్దగా ఏమీలేదని, అయినప్పటికీ చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.